ఆ రెండు కుటుంబాలను... ఆ రెండు రాష్ట్రాల ఓటర్లు... ఓట్లతో కుళ్ల బొడిచారు!
యూపీలో బీజేపి అద్బుత విజయం సాధించింది.కాని, అదే బీజేపి పంజాబ్ లో పల్టీ కొట్టింది! ఎందుకని? పంజాబ్ ఓటమి కేవలం బీజేపీదే కాదు. నిజానికి బీజేపి కన్నా ఆ ఓటమి ఎక్కువగా అకాళీ దళ్ పార్టీది! అక్కడ కూటమిలో ప్రధాన పార్టీ శిరోమణి అకాళీ దళే! బీజేపి కూటమిలో ఎప్పుడూ అనుచర పార్టీనే! అందుకే, పంజాబ్ లో ఓటర్ల వ్యతిరేకత అకాళీ దళ్ తో పాటూ బీజేపి కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది!
పంజాబ్ లో ఎస్ఏడీ, యూపీలో ఎస్పీ రెండూ ఘోర పరాజయం మూట గట్టుకోవటం వెనుక దాదాపు ఒకే రకమైన కారణాలు వున్నాయి! అదే కుటుంబ పాలన! ఉత్తర్ ప్రదేశ్ లో యాదవుల కుటుంబం రాష్ట్రాన్ని తమ స్వంత జాగీర్ గా వాడేసుకుంది. అఖిలేష్ , ఆయన తండ్రి, అతడి భార్య, అతగాడి తమ్ముడు, ఆయనగారి భార్య, ఆఖరుకు... ములాయం వారి రెండో భార్య కూడా ఇల్లు వదిలి రాజకీయాల్లోకి వచ్చేశారు. ఇలా ఫ్యామిలీ ఫ్యామిలి అంతా ఉత్తర్ ప్రదేశ్ ను ఉప్మా బాక్స్ షేర్ చేసుకున్నట్టు షేర్ చేసుకోవటమే ముప్పు తెచ్చి పెట్టింది. అఖిలేష్ కు, ఆయన బాబాయికి జరిగిన మల్ల యుద్ధం కూడా జనానికి తిక్క రేగేలా చేసింది!
పంజాబ్ లో బాదల్ కుటుంబానిది మరింత దారుణమైన పాలన! అక్కడ ప్రతీ అయిదేళ్లకు ఒకసారి అధికార పార్టీ మారుతుంది. అయినా జనం దయతలచి 2012లో రెండో సారి వరుసగా అకాళీకి అవకాశం ఇచ్చారు. కాని, ఆ పార్టీని నడుపుతున్న బాదల్ కుటుంబ సభ్యులు గత అయిదేళ్లలో అరాచకం చూపించారు. పాకిస్తాన్ తో సరిహధ్దు కలిగిన కీలక రాష్ట్రంలో డ్రగ్స్ దందా అధికారికంగా తామే వెలగబెట్టారు! ఒక ప్రభుత్వంలోని వారు మత్తు పదార్థాలు అమ్ముకోటం కంటే హీనమైన పని మరొకటి వుంటుందా? ఇక ల్యాండ్ గ్రాబింగ్లు, కిడ్నాప్ ల వంటి వాటికైతే లెక్కేలేదు! అందుకే, బాదల్, ఆయన కొడుకు, ఆయనగారి భార్య... ఇలా అందర్నీ ఓటుతో కొట్టారు పంజాబీలు! మళ్లీ అకాళీదళ్ తేరుకోటం పదేళ్ల వరకూ కష్టమే! పైగా కొంత మేర ఆప్ కూడా ఆక్రమించేసింది!