కుల సమీకరణలకే పెద్దపీట వేసిన చంద్రబాబు
posted on Apr 3, 2017 @ 4:18PM
మిషన్ 2019 టార్గెట్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు తన టీమ్‌ను ఎంపిక చేసుకున్నారు. ముఖ్యంగా కులం, ప్రాంతం... ఇలా అనేక సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్నారు. కాపు సామాజిక వర్గంతో సమానంగా రెడ్లకు పెద్దపీట వేశారు. ఇక కమ్మ సామాజిక వర్గం నుంచి ఐదుగురు మంత్రులుగా ఉన్నారు. అయితే అత్యధికంగా 8మంది బీసీలకు కేబినెట్‌లో చోటు దక్కింది.
సీఎం చంద్రబాబు మినహా కమ్మ సామాజిక వర్గం నుంచి నారా లోకేష్, దేవినేని ఉమా, పరిటాల సునీత, ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్ ఉన్నారు. ఇక బలమైన బలమైన కాపు సామాజికవర్గానికి కాస్త సంఖ్య తగ్గించినట్లు కనిపించినా, చినరాజప్ప, గంటా శ్రీనివాస్, నారాయణ, మాణిక్యాలరావులు కేబినెట్‌లో కొనసాగుతున్నారు.
అలాగే రెడ్డి ఓటర్లను కూడా ఆకర్షించేందుకు బాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అందులో భాగంగానే నలుగురికి కేబినెట్‌లో చోటు దక్కింది. ఇందులో పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు... ఆదినారాయణ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డి, భూమా అఖిలప్రియారెడ్డికి బెర్తులు దక్కాయి. అదేవిధంగా 8మంది బీసీలకు మంత్రి పదవులు కట్టబెట్టారు చంద్రబాబు. ఇక వైశ్య, వెలమ సామాజిక వర్గాలకు చెందిన శిద్దా రాఘవరావు, సుజయకృష్ణ రంగారావులు మంత్రులుగా ఉన్నారు. అయితే గత మంత్రివర్గంలోనూ... ప్రస్తుత మంత్రివర్గంలోనూ మైనార్టీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చోటు దక్కలేదు.
గత ఎన్నికల్లో రెడ్డి, ఎస్సీ, మైనార్టీ, క్రిస్టియన్స్.... వైసీపీకి అండగా నిలిచారనే అంచనాలు ఉండటంతో, ఆ వర్గాలను తమవైపు తిప్పుకునేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు.