షోరూమ్ లు రైతు బజార్లు! టూ వీలర్స్ కూరగాయల్లా కొనేశారు!
posted on Mar 31, 2017 @ 6:00PM
మార్చ్ 31… ఈ డేట్ చెప్పగానే ఆర్దిక లావాదేవీలు పెద్ద ఎత్తున చేసే వారికైతే ఇయర్ ఎండింగ్ గుర్తుకు వస్తుంది! కాని, సామాన్యులకి? ఇప్పుడైతే జియో ఫ్రీ ఆఫరే మదిలో మెదులుతోంది! ఏప్రెల్ ఒకటి నుంచీ డబ్బులు కడితేనే జియో! లేదంటే నో డేటా! కాని, ఇయర్ ఎండింగ్, జియో ఆఫర్ గురించే కాదు దేశంలో మరో విషయం కూడా కలకలం రేపుతోంది! అదే టూ వీలర్ వెహికల్స్ పై భారీ డిస్కౌంట్ లు!
సాధారణంగా దీపావళి, దంతేరస్ లాంటి పండగలు వస్తే జనం వాహనాల షో రూంలకి క్యూలు కడతారు. కాని, ఈసారి విచిత్రంగా ఊగాది మర్నాటి నుంచీ హోండా, బజాజ్ లాంటి షో రూంలకి పరుగులు పెట్టారు! ఏ పండగా లేకున్నా కంపెనీలు వేలకు వేలు డిస్కౌంటులు ప్రకటించాయి. ఇదే అదునుగా జనం కూడా పండగ కాని రోజుల్లోనే పండగ చేసేసుకుంటున్నారు! ఇంతకీ ఈ సడన్ డిస్కౌంట్ ఆఫర్ల గోలేంటి? మీకు తెలుసుగా…
ఆటోమొబైల్ కంపెనీలకు సుప్రీమ్ కోర్ట్ పెద్ద షాక్ ఇచ్చింది. వేల కోట్లు విలువ చేసే బీఎస్ III కేటగిరీకి చెందిన వాహనాలు ఏప్రెల్ ఒకటి తరువాత అమ్మకూడదని తీర్పునిచ్చింది. కారణం కాలుష్యమే! బీఎస్ త్రీ దశకు చెందిన టూ వీలర్స్, త్రీ వీలర్స్, ఫోర్ వీలర్ అండ్ కమర్షియల్ వెహికల్స్ రోడ్లపైకి రావటానికి వీలులేదని తెగేసి చెప్పింది. అందుకే, గత రెండు రోజుల్లో సాధ్యమైనన్ని పాత వాహనాల్ని జనానికి అంటగట్టేద్దామని డిసైడ్ అయ్యాయి కంపెనీలు. ముఖ్యంగా, పెద్ద ఎత్తున బీఎస్ త్రీ టూ వీలర్స్ తయారు చేసి పెట్టిన హోండా లాంటి కంపెనీలు పది నుంచి 22వేల దాకా డిస్కౌంట్ ప్రకటించి మరీ తమ వాహనాలు అమ్మేశాయి!
యాభై, అరవై వేలకు పైనే ధర పలికే ద్విచక్ర వాహనాల్ని కూడా మన వాళ్లు ఒక రేంజ్లో కొనేశారు మంత్ అండ్ ఇయర్ ఎండింగ్ లో! అసలు వాహనాల షోరూంలు రైతు బజార్ల మాదిరిగా మారిపోయాయి. కూరగాయలు కొన్నంత ఈజీగా కొనుగోలు చేసేశారు బళ్లని! వేలకు వేలు తక్కువగా వస్తుంటే ఎవరు మాత్రం టెంప్ట్ అవ్వరు చెప్పండి? కాని, దురదృష్టవశాత్తూ చాలా మంది విషయం తెలిసి షో రూంకి వెళ్లే సరికే నో స్టాక్ బోర్డ్ లు కనిపించాయట! రేషన్ షాపుకి వెళ్లి నిరాశగా తిరిగొచ్చిన పేదోళ్ల లాగా ముఖాలు పెట్టుకున్నారు టూ వీలర్ బయ్యర్స్!
ద్విచక్ర వాహనాలు వేల సంఖ్యలో అమ్ముకున్న కంపెనీలకు పెద్ద బళ్ల విషయంలో మాత్రం నష్టం తప్పేలా లేదు. కార్లు, త్రిచక్ర వాహనాలు, లారీలు, డీఎంల వంటి కమర్షియల్ వెహికల్స్ ఈ రెండు రోజుల్లో పెద్దగా అమ్ముకోలేకపోయాయి! వాట్ని రేపట్నుంచీ ఎట్టి పరిస్థితుల్లో అమ్మటానికి వీలు లేదు. ఇక వాట్ని బీఎస్ ఫోర్ టైపు కిందకి అప్ గ్రేడ్ చేయటమో, లేదంటే బీఎస్ త్రీ వాహనాల్ని అమ్మనిచ్చే ఇతర దేశాల మార్కెట్లకి ఎగుమతి చేయటమో చేయాలి! అంటే… లాభాల్లో కొంత కోతేనన్నమాట!
బీఎస్ త్రీ రకం వాహనాలు కాలుష్యం పెంచుతాయని సుప్రీమ్ వాట్ని బ్యాన్ చేస్తే… వీలైనన్ని ఎక్కువ కాలుష్య కారకలైన వాహనాల్ని రెండు రోజుల్లో రోడ్లపైకి తెచ్చేశాయి కంపెనీలు! జనం కూడా కాలుష్యం సంగతి తుంగలో తొక్కి డిస్కౌంట్ ఆఫర్ల కోసం ఎగబడ్డారు! మనుషులకి ఇలాంటి నిజాయితీ వుండబట్టే రోజు రోజుకి కాలుష్యం పెరిగిపోతోంది! మనషి మనస్సులో … బయట కూడాను!