భారతంపై భారతీయుడి కామెంట్స్ తప్పా... ఒప్పా!
భారత దేశం ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ వుండేవారికి భావప్రకటనా స్వాతంత్ర్యం వుంటుంది. దీనిపై ఎవరికీ సందేహం లేదు. కాని, మనకున్న ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ ని ఎలా వాడుకోవాలి? దీనిపైనే అసలు సమస్యంతా ఆధారపడి వుంది! మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు తమ భావప్రకటన ఎలా చేయాలి? ఇందులో ఎలాంటి క్లారిటీ లేదు. అందుకే, రంగులు మార్చే రాజకీయ నేతలు మొదలు రంగులు వేసుకునే సినిమా వాళ్ల వరకూ అందరూ రోజుకో వివాదాస్పద వ్యాఖ్య చేస్తుంటారు. జనం గగ్గోలు పెడుతుంటారు. కొన్నాళ్లకి అంత కూల్ అయిపోతుంది. మళ్లీ మరో గొడవ మొదలవుతుంది!
కమల్ హసన్ మన దేశానికి ఖచ్చితంగా గర్వకారణమే.కాని ఆయన పుట్టక ముందు నుంచే గర్వకారణం మహాభారతం! గత 5వేల సంవత్సరాలుగా మహాభారతం భారతీయ జీవన విధానంలోఅంతర్భాగం. అటువంటి ప్రపంచపు అతి పెద్ద ఇతిహాసాన్ని అపహాస్యం చేశాడు కమల్! ధర్మరాజు ద్రౌపతి పావులా పెట్టి జూదం ఆడి తప్పు చేశాడనీ... అలాంటి గ్రంథాన్ని భారత ప్రభుత్వం గౌరవిస్తోందని ఆయన ఒక ఇంటర్వ్యూలో అన్నాడట. ఇంకేముంది తమిళ హిందూ సంస్థలు అగ్గి మీద గుగ్గిలం అయ్యాయి! భగ్గున మండాయి!
అసలు మహాభారతాన్ని విమర్శించి కమల్ సాధించదలుచుకున్నది ఏమిటి? అందులో జూదం వున్నందు వల్ల ఇప్పుడు సమాజం ఏమైనా ప్రభావితం అవుతోందా? ఆయన చెప్పినట్టే ఒక స్త్రీని జూదంలో పెట్టి ఆడటం తప్పు అనుకుందాం! అయినా కూడా లక్ష శ్లోకాల మహాభారతంలో ఇంకేం మంచే లేదా? ఎక్కడో ఒకటి అరా తప్పుల్ని పట్టుకుని వారసత్వ సంపద లాంటి మహాభారతాన్ని వదిలేద్దామా? ఎవరో అతివాద వామపక్ష భావజాలం వున్న వాళ్లు నోరు పారేసుకుంటే ఫర్వాలేదు. అన్ని వర్గాల ప్రేక్షకుల టికెట్ల డబ్బులతో సెలబ్రిటీ అయిన కమల్ ఈ విధంగా మాట్లాడటం సబబేనా? ఇంతా చేసి ఆయన చేసిన విమర్శ ఏమైనా సమాజాన్ని ఉద్ధరిస్తుందా? మహాభారతం సమస్యలకి కారణమైతే బైబిల్ , ఖురాన్ ల సంగతేంటి? వాట్ని కమల్ తన భావ ప్రకటనలో భాగంగా ఇలాగే విమర్శిస్తాడా? విమర్శిస్తే కూడా మళ్లీ ఆయనకు రక్షణనిచ్చి కాపాడాల్సింది .. మహాభారతాన్ని గౌరవిస్తోందని ఆయన విమర్శించిన సో కాల్డ్ భారత ప్రభుత్వమే!
హిందూ సమాజం ఐక్యంగా వుండదు. కులాల వారీగా, ప్రాంతాల వారీగా, భాషల వారీగా విడిపోయి, విభజింపబడి వుంటుంది. దాని వల్ల హిందూత్వంపై , హిందూ వారసత్వంపై , హిందూ సమాజంపై ఏ ఆరోపణలు, ఏ విమర్శలు చేసినా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. ఏవో కొన్ని ప్రతి విమర్శలు తప్ప దాడులు జరిగేటంత భయం లేదు. బెంగా లేదు. అందుకే, కమల్ మహాభారతాన్ని టార్గెట్ చేస్తాడు. వర్మ గణఫతిని, శివుడ్ని టార్గెట్ చేస్తాడు. ఎంఎఫ్ హుస్సేన్ అయితే ఏకంగా దేవీదేవతల బొమ్మలు నగ్నంగా గీస్తాడు. అలాంటి వాళ్లని అందర్నీ స్వేచ్ఛావాదులు, అభ్యుదయవాదులు వెనకేసుకొస్తుంటారు. కాని, పురాణాలు, ఇతిహాసాలు, మనుస్మృతులు దాటుకుని చాలా దూరం వచ్చిన హిందూ సమాజంపై అనవసరంగా ఇలా విషం గక్కటం ఎంత వరకూ సమంజసమో కమల్ లాంటి వారే ఆలోచించాలి! మహాభారతం పై చేసినట్టే ఆయన అంబేద్కర్ మీదో, జీసస్ మీదో, మదర్ థెరిసా మీదో కామెంట్స్ చేస్తే రియాక్షన్ ఎలా వుంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకుని కమల్ ఇక మీదట వ్యాఖ్యానాలు చేస్తే బావుంటుంది. కాలుష్యం గురించో, అవినీతి గురించో, ఉగ్రవాదం గురించో నాలుగు మంచి మాటలు చెబితే ఆయన స్థాయికి తగ్గట్టుగా వుంటుంది!