చిన్నదాని పెద్ద మాటలు వినండి
ఈ రోజు నంద్యాలలో తన సమైక్య శంఖారావం యాత్రను చేస్తున్నవైకాపా నాయకురాలు షర్మిల తను వయసులో చిన్నదానినయినా దయచేసి తన మాట వినండి అంటూ ప్రజలను కోరారు. సమైక్య ఉద్యమం చేయాలా వద్దా? అనే సంగతి మీకు మీరే తెల్చుకోండని ఆమె అన్నారు. చంద్రబాబు పుటుక వలన తెలుగుతల్లి అవమానంతో తల దించుకొనే పరిస్థితి ఏర్పడిందని తీవ్ర విమర్శలు చేశారు. తను వయసులో చిన్నదానిని అని చెప్పుకొంటూనే, మరో వైపు తన వయసుకు మించి ఇటువంటి అనుచితమయిన మాటలు మాట్లాడటం వలన తరిగేది ఆమె గౌరవమే. రేపు తెదేపా నేతలు కూడా ఆమెకు ఇదే స్థాయిలో జవాబు చెపితే అది ఆమెకు గౌరవం కాబోదు.
అసలు తన యాత్ర ఉద్దేశ్యం ఏమిటి? తను మాట్లాడుతున్నది ఏమిటి? అనే ఆలోచనలేకుండా ఇటువంటి పొంతన లేని మాటలు మాట్లాడటం వలన తాత్కాలికంగా ప్రజలను ఆకట్టుకోవచ్చునేమో కానీ, దానిద్వారా ప్రజల నుండి ఓట్లను రాబట్టుకోలేరు. సమైక్యాంద్రా కోసం మొదలుపెట్టిన యాత్రలో దాని గురించే చర్చిస్తే ప్రజలు కూడా హర్షిస్తారు. ఇంత వరకు రాష్ట్ర విభజన జరిగితే వచ్చే నష్టాల గురించే ఆమె కధకధలుగా వర్ణిస్తున్నారు. దాని వలన ప్రజలను మరింత రెచ్చగొట్టడం తప్ప వేరేమి ప్రయోజనం లేదు. తద్వారా రాష్ట్రంలో అశాంతికి ఆజ్యం పోస్తూ తన పార్టీని బలపరచుకొనే ప్రయత్నం చేయడం క్షమార్హం కాదు.
తన యాత్రల వలన రాష్ట్ర విభజన ఆగదనే సంగతి ఆమెకు బాగానే తెలుసు. రాష్ట్ర విభజన అనివార్యమని తెలిసి కూడా ఆమె ఇంకా సమైక్య రాగం ఆలపించడం కేవలం రాజకీయ లబ్ది కోసమే. ఇతరులకు దైర్యం లేదు, పిరికి వారని నిత్యం ఆడిపోసుకొనే ఆమె, దైర్యంగా రాష్ట్ర విభజన అనివార్యమని ప్రజలకి తెలియజేసి, సీమంధ్ర ప్రాంతానికి న్యాయం జరగడానికి పార్టీ తరపున తగిన ప్రతిపాదనలు, సలహాలు ప్రకటించి, విభజన తరువాత ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి తమ పార్టీ చేపట్టనున్న పధకాలు, ప్రణాళికల గురించి వివరించగలిగితే ఆమె నాయకత్వ లక్షణాలను ప్రజలు కూడా హర్షించేవారు.
అసలయిన నాయకుడు ప్రజల ముందుండి నడిపిస్తే, అవకాశవాద నాయకులు ప్రజల వెనుకనడుస్తారు. సీమాంధ్ర ప్రజలు సమైక్యం అంటున్నారు గనుక, తను కూడా అదే పల్లవి అందుకోవడం అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టడమే.
చంద్రబాబుకి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఆయన కూడా ఇటీవల కాలంలో కాంగ్రెస్, వైకాపా నేతలపై తన స్థాయికి తగని విధంగా అనుచితమయిన వ్యాక్యాలు చేస్తున్నారు. తెలంగాణా ఏర్పాటుకి అంగీకరిస్తూ లేఖ ఇచ్చిన ఆయన అదే మాటను నిర్భయంగా ప్రజలకు చెప్పి, విభజన అనంతరం రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ధి చేసుకోవచ్చునో చెపుతూ ప్రజలను యధార్ధ పరిస్థితులు గుర్తించేలా చేసి ముందుకు నడిపించి ఉంటే, ఆయన నాయకత్వ లక్షణాలు ప్రజలకు మరో మారు తెలిసి ఉండేవి. దాని వలన తెలంగాణాప్రజలలో, తన పార్టీకి చెందిన తెలంగాణా నేతలలో కూడా ఆయన పట్ల మరింత నమ్మకం, గౌరవం, సదాభిప్రాయం కలిగి అక్కడ కూడా పార్టీ బలపడే అవకాశం ఉంది.
ఈ రోజు సమైక్యవాదం గురించి మాట్లాడి, విభజన జరిగిపోయిన తరువాత, నూతన రాష్ట్ర అభివృద్ధి గురించి సామాన్య పౌరులు కూడా మాట్లాడగలరని వారు గ్రహించాలి. కానీ, నిజమయిన ప్రజా నాయకులు మాత్రం దాని గురించి ఇప్పుడే దైర్యంగా మాట్లాడ వలసి ఉంటుంది. చంద్రబాబు, షర్మిల ఇద్దరిలో ఆ నాయకత్వ లక్షణాలు ఎవరు ప్రదర్శించితే వారికే ప్రజలు పట్టం కడతారు.