త్వరలో జగన్మోహన్ రెడ్డికి బెయిలు
posted on Sep 6, 2013 @ 2:22PM
జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులపై సీబీఐ విచారణ పూర్తి చేసేందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన నాలుగు నెలల గడువు ఈనెలతో ముగియబోతోంది గనుక అతను మళ్ళీ బెయిలుకు దరఖాస్తు చేసుకోవచ్చును. ఇప్పటికే జగన్ కేసుల్లో ఐదు అభియోగ పత్రాలను, అనుబంధ పత్రాలను కోర్టులో వేసిన సీబీఐ, తన విచారణను పూర్తిచేసి నేడో రేపో ఆఖరి అభియోగపత్రం కూడా వేయనుంది. దాని తరువాత కోర్టులో విచారణ మొదలవుతుంది.
రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డిల మధ్య తెరవెనుక ఎన్నికల పొత్తులకు ఒప్పందం ఏదయినా జరిగి ఉంటే, ఆయన బెయిలుకు దరఖాస్తు చేసుకొన్నపుడు, సీబీఐ ఇదివరకులా గట్టిగా ప్రతిఘటించకుండా ఆయన బెయిలుకు మార్గం సుగమం చేసే అవకాశం ఉంది.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుండి అనేక మంది శాసన సభ్యులు, యంపీలు, యం.యల్సీలు, మంత్రులు, ఇతర నేతలు వైకాపాలోకి దూకేయగా, మరికొందరు దూకేందుకు సిద్దంగా ఉన్నారు. ఒకవేళ ఇరు పార్టీల మధ్య పొత్తులపై రహస్య ఒప్పందం జరిగినప్పటికీ, ఆ సంగతిని బెయిలుకి ముందే ప్రకటిస్తే అది అనుమానాలకు వీలు కల్పిస్తుంది గనుక, రెండు పార్టీలు కొంత కాలం శత్రువుల వలే ప్రవర్తిస్తూ ఒకటిరెండు నెలల తరువాత ఆ విషయం చల్లగా ప్రకటించవచ్చును.
కానీ, గోడ దూకలనుకొంటున్న కాంగ్రెస్ నేతలు ఈ విషయం గ్రహించకపోతే వైకాపాలోకి వారి వలసలు కొనసాగవచ్చును. సీమంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమాలలో దూసుకుపోతున్న వైకాపా వల్ల ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నతేదేపాకు జగన్మోహన్ రెడ్డి మరో సరికొత్త సవాలుగా మారుతారు. ఒకవేళ కాంగ్రెస్, వైకాపాలు ఎన్నికలకోసం రహస్య ఒప్పందాలు చేసుకొని ఉంటే, తేదేపాకు అది మరో అగ్నిపరీక్షగా మారుతుంది. బహుశః ఈనెలాఖరులోగా జగన్మోహన్ రెడ్డి బెయిలు వ్యవహారం తేలిపోవచ్చును.
తాజా వార్త: జగన్మోహన్ రెడ్డికి ఈ నెల 20వ తేదీ వరకు కోర్టు రిమాండ్ పొడిగించింది.