యువతి పై ప్రియుడు యాసిడ్ దాడి

      అనంతపురం జిల్లాలో ఓ యువతిపై యాసిడ్ దాడి జరిగింది. డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్ధినిపై నగర శివారులో జాతీయ రహదారిపై ఇద్దరూ దుండగులు యాసిడ్ తో దాడి చేశారు. యువతీ జాతీయ రహదారిపై కళాశాల బస్సు దిగి వెళ్ళుతుండగా ఇద్దరూ యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి ఈఘాతుకానికి పాల్పడ్డారు. తన స్వగ్రామానికి చెందిన రాఘవ అనే వ్యక్తి మరో యువకుడితో కలిసి ఈ దాడికి పాల్పడ్డారంటూ బాధితురాలు పోలీసులకు తెలిపారు. రాఘవ తనని వేదిస్తున్నాడని రెండు నెలల క్రితం ముదిగుబ్బ పోలీసుస్టేషన్లో పిర్యాదు చేసింది. బాధితురాలు ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.

శివప్రసాద్ పై సందీప్ దీక్షిత్ దాదాగిరి

      సీమాంధ్ర టీడీపీ ఎంపీలపై కాంగ్రెస్ ఎంపీ సందీప్ దీక్షిత్ సభలో నోరుపారేసుకున్నారు. టీడీపీ ఎంపీలు ఇందిరాగాంధీ మాస్క్ పెట్టుకుంటే చంపేస్తానని, ఢిల్లీలో లేకుండా చేస్తామని ఆయన హెచ్చరించారు. ఎంపీ సందీప్ దీక్షిత్‌కు టి.కాంగ్రెస్ ఎంపీలు వత్తాసు పలికారు. దీనిపై టీడీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో నిరసన తెలిపే హక్కు అందరికి ఉందని, కాని టిడిపి ఎమ్.పి ఎన్.శివప్రసాద్ పై ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు, ఎమ్.పి సందీప్ దీక్షిత్ గూండా గిరి చేశారని టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు మండిపడ్డారు. తెలుగుజాతి గౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఆయన అన్నారు.ఎంపీ నామా నాగేశ్వర్‌రావు ఎంపీ సందీప్‌పై స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.

మంత్రులు గంటా, ఎరాసు రాజీనామా

      రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఎరాసు ప్రతాపరెడ్డిలు తమ పదవులను రాజీనామా చేశారు. తెలంగాణ ప్రకటన వచ్చినప్పుడే తాము రాజీనామాలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చామని, నెల రోజులు పూర్తయినా రాజీనామాలు ఆమోదించకపోవడంతో ముఖ్యమంత్రిని, గవర్నర్ ను కలిసినట్లు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డిలు తెలిపారు. గవర్నర్ కు ప్రత్యేకంగా మళ్లీ రాజీనామాలు ఇచ్చారు.   ముఖ్యమంత్రి తమను తొందరపడవద్దని చెప్పారని, ఢిల్లీ వెళ్లి వచ్చాక నిర్ణయం అందరం కలిసి తీసుకుందామని అన్నారని తెలిపారు. ఇక గవర్నర్ తాను ముఖ్యమంత్రి సూచనమేరకే నిర్ణయం తీసుకుంటామని చెప్పారని, అయితే మరో రెండు రోజుల పాటు ఆగడానికి ఇబ్బంది లేదని, అప్పటికి ఆమోదించకుంటే తాము మళ్లీ గవర్నర్ ను కలిసి ఆమోదం కోసం పట్టుబడతామని, ఒక ప్రాంతానికి మంత్రులుగా పనిచేయలేమని అన్నారు. కాగా మరో ఇద్దరు మంత్రులు విశ్వరూప్, కాసు కృష్ణారెడ్డిలు కూడా రాజీనామా చేస్తారని భావించినా, వారు రాలేదు

లోక్ సభలో 9మంది ఎంపీల సస్పెండ్

      లోక్ సభ నుండి సీమాంధ్ర ఎంపీలను మరో సారి సస్పెండ్ చేశారు. ఇంతకుముందు 12 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. సస్పెన్షన్ గడువు ముగియడంతో లోక్ సభకు హాజరయిన ఎంపీలు ఈ రోజు మళ్లీ సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. సభ నిర్వహణకు అడ్డంకులు సృష్టిస్తుండడంతో ఈ రోజు 9 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీలు ఆరుగురు, టీడీపీ ఎంపీలు ముగ్గురు సస్పెండ్ అయ్యారు. సస్పెండయిన వారిలో కాంగ్రెస్ ఎమ్.పిలు అనంత వెంకట్రామిరెడ్డి,సాయిప్రతాప్, లగడపాటి రాజగపాల్, బాపిరాజు, మాగుంట శ్రీనివాసులురెడ్డి, టిడిపి ఎమ్.పిలు నిమ్మల కిష్టప్ప, మోదుగుల వేణుగోపాలరెడ్డి, నిమ్మల కిష్టప్ప, కొనకళ్ల నారాయణలు ఉన్నారు. రాష్ట్రాన్ని విడదీయ వద్దని, ఆంధ్రప్రదేశ్ ను సమైక్యంగా ఉంచాలని వారు డిమాండ్ చేశారు. సస్పెన్షన్ అనంతరం సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.

ఏపీ ఎన్జీవోలు రాజకీయ మద్దతు తీసుకోక తప్పు చేసారా

  సమైక్యాంధ్ర కోరుతూ ఏపీ ఎన్జీవోలు మొదలుపెట్టిన నిరవధిక సమ్మె మూడు వారాలుపైగా గడిచినప్పటికీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కానీ కాంగ్రెస్ అధిష్టానంలో గానీ ఎటువంటి చలనము లేదు. కాంగ్రెస్ అధిష్టానం వారిని సమ్మె విరమించి, అంటోనీ కమిటీకో లేక కొత్తగా ఏర్పరచబోయే మరో ప్రభుత్వ కమిటీకో తమ సమస్యలను నివేదించుకోమని ఉచిత సలహా ఇచ్చింది తప్ప వారి సమ్మెను, అభ్యర్ధనలను పట్టించుకోలేదు. పైగా, ప్రధాన మంత్రితో సహా అందరూ కూడా తెలంగాణా ఏర్పాటుపై ఇక వెనకడుగు వేయబోమని కుండలు బ్రద్దలు కొడుతున్నారు.   దీనితో హతాశులయిన ఏపీ ఎన్జీవో నేతలు ప్రతిపక్ష నేతలను, ఇతర రాజకీయ నేతలను కూడా మద్దతు కోసం కలిసినా ప్రయోజనం లేకపోయింది. వారు సీమంధ్రకు చెందిన చిరంజీవి, పళ్ళంరాజు, శీలం, కావూరి, పనబాక, పురందేశ్వరి తదితర కేంద్రమంత్రులను రాజీనామాలు చేసి ఉద్యమాలలోకి రాకపోతే వచ్చే ఎన్నికలలో గట్టిగా బుద్ధి చెపుతామని హెచ్చరించినప్పటికీ, వారు త్వరలో తమ నిర్ణయం చెపుతామని నచ్చజెప్పి సాగనంపారు.   ఇక రాష్ట్రంలో ముఖ్యమంత్రి, సీమంధ్ర మంత్రులు కూడా రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నారనే విషయం ఏపీ ఎన్జీవోలకు తెలిసి ఉన్నపటికీ, వారు చేతలుడిగి కూర్చోవడంతో వారిని దూరం పెట్టారు. ఇక తమ మద్దతుకోసం వస్తున్నశాసనసభ్యులను రాజకీయ నాయకులను కూడా నిలదీస్తూ ఏపీ ఎన్జీవోలు వారిని దూరంగా తరిమేశారు. ఇక ప్రతిపక్ష పార్టీలయిన తెదేపా, వైకాపాల మద్దతు తీసుకోకుండా ఏపీ ఎన్జీవోలు తమ సమ్మెతో సమైక్యాంధ్ర సాధించాలని భావించారు.   ఈవిధంగా అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలనదరినీ దూరంపెట్టడం వలన వారి సమ్మెకు అవసరమయిన రాజకీయ మద్దతు కరువవడంతో, వారి మాట వినేవారే లేకుండాపోయారు. ముల్లును ముల్లుతోనే తీయలన్నట్లు, రాజకీయనాయకులను రాజకీయ నాయకుల సహాయంతోనే డ్డీ కొనాలనే జ్ఞానోదయం ఏపీ ఎన్జీవోలకు చాలా ఆలస్యంగా జరిగింది.   బహుశః అందువల్లేనేమో ఈ నెల 7న హైదరాబాదులో తాము తలపెట్టిన భారీ బహిరంగ సభకు సమైక్యాంధ్ర కోరుతున్న నేతలందరూ పార్టీలకతీతంగా వస్తే ఆహ్వానిస్తామని వారు ప్రకటించారు. రాష్ట్ర విభజనకు మద్దతు ఇస్తునందున తెదేపా ఈ సభలో పాల్గోనలేకపోవచ్చును. కానీ, సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్న సీమంధ్ర కాంగ్రెస్, వైకాపాలు ఈసువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకొనే ప్రయత్నం చేయవచ్చును. కానీ అసలు సభకు పోలీసుల నుండి అనుమతి లభిస్తుందా? లభించినా తెలంగాణా నేతలు తలపెడుతున్న పోటీ సభలతో సభ జరుగుతుందా? అనే అనుమానాలున్నాయి.   ఏమయినప్పటికీ, రాజకీయ మద్దతు లేకుండా ఏపీ ఎన్జీవోలు చేసిన నెలరోజుల సమ్మె వ్యర్ధం అయిపోయే అవకాశాలే ఎక్కువ. ఈ నెల జీతాలు అందక ఉద్యోగులు నిరాశ చెందుతూ, సమ్మె ఎంత త్వరగా ముగిస్తే అంత మేలనే ఆలోచన మొదలవుతున్న ఈ తరుణంలో, ఏపీ ఎన్జీవోనేతలు ఇంత ఆలస్యంగా రాజకీయ నాయకులను, పార్టీలను సమ్మెకు మద్దతు కోరడం వలన ప్రయోజనం ఉండకపోవచ్చును.   ఒకసారి ఏపీ ఎన్జీవోలు సమ్మె విరమించుకోవడం మొదలుపెడితే రాజకీయ పార్టీలు కూడా ఉద్యమాలు నిలిపివేసి ఎన్నికల సన్నాహాలలో పడిపోతాయి. బహుశః అంతిమంగా ఇదే జరుగుతుందేమో?

హరికృష్ణ యాత్రకు పుల్ స్టాప్..!

      రాష్ట్ర విభజనను నిరసిస్తూ తెలుగువారంతా కలిసి ఉండాలని, తెలుగు జాతి ఒక్కటేనని డిమాండ్ చేస్తూ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన నందమూరి హరికృష్ణ త్వరలోనే చైతన్య యాత్ర చేపట్టనున్నారని వార్తలు వచ్చాయి. మొదట హిందూపురం నుండి అని తరువాత ఆయన తన సొంత ఊరు కృష్ణా జిల్లా నిమ్మకూరు నుండి యాత్ర మొదలు పెట్టనున్నారని అన్నారు. అయితే ప్రస్తుతం ఆయన యాత్ర ఏమీ లేదని తెలుస్తోంది.   సమైక్యవాదనతో తెలుగుదేశం పార్టీ నేతగా, ఎన్టీఆర్ కుమారుడిగా సీమాంధ్రలోని తెలుగు తమ్ముళ్లు తన రాజీనామాతో తన వెనక వస్తారని, బావ చంద్రబాబు విభజన గురించి పెద్దగా మాట్లాడనందున సమైక్యవాదనతో తను హీరో అయిపోతానని హరికృష్ణ అనుకున్నా తెలుగుతమ్ముళ్లు ఎవరూ హరికృష్ణ వైపు వచ్చేందుకు సిద్దపడలేదట. కనీసం ఆయనకు నైతిక మద్దతు కూడా తెలిపిన వారు ఎవరూ లేకపోవడంతో సీతయ్య కంగు తిన్నాడట. దీంతో తన యాత్రకు హరికృష్ణ పుల్ స్టాప్ పెట్టాడట.

ఎన్నిసార్లు శీలపరీక్ష చేసుకోవాలి?

      తాను, తన కొడుకు ఎన్నిసార్లు శీలపరీక్ష చేసుకోవాలని టిడిపి నాయకుడు హరికృష్ణ ప్రశ్నించారు. నాడు ఎన్టీఆర్ బాలయ్య పెళ్లికి రాకపోవడాన్ని ఏమంటారని, తాను తెలుగు జాతి కోసం పోరాడుతున్నందునే బాలకృష్ణ కూతురు పెళ్లికి రాలేదని చెప్పారు. బంధుత్వం కంటే తెలుగు జాతి ముఖ్యమనే విషయాన్ని గుర్తించాలన్నారు. హరికృష్ణ తన సోదరి పురందేశ్వరి డైరెక్షన్లో టిడిపికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని టిడిపి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. పీఏసీ చైర్మన్ పదివి కోసం టిడిపిని బ్లాకు మెయిల్ చేసిన వారే తనను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.         ఈ రోజు హరికృష్ణ పుట్టిన రోజు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. తెలుగు జాతి ముక్కలు అవుతుంటే తాను పుట్టిన రోజు వేడుకలను జరుపుకోలేనన్నారు. తెరాసతో పొత్తు ముప్పు అని తాను అప్పుడే చెప్పానన్నారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే హైదరాబాదు పరిసరాల్లో 20, సీమాంధ్రలో 40 సీట్లు ఓడుతామని ముందే చెప్పానన్నారు. తాను ఆనాటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదన్నారు.  

సోనియా అమెరికా పర్యటన

  యుపిఎ అధ్యక్షురాలు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాందీ అమెరికా పర్యటనకు వెళుతున్నారు గత కొద్ది రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న ఆమె వైధ్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళుతున్నారు. 2011 ఆగస్టులో అమెరికాలో సోనియాకు శస్త్ర చికిత్స జరిగిన అందుకు సంభందించిన వివరాలను వెల్లడించలేదు. ప్రస్థుత పర్యటన నేపధ్యంలో కూడా వివరాలను వెల్లడించడానికి అధికారులు నిరాకరించారు. ఆగస్టు 26 న ఆహార భద్రత బిల్లు సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె అర్ధాంతరంగా సభనుంచి వెల్లిపోయారు. అప్పటినుంచి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె పరీక్షల కోసం అమెరికా వెళుతున్నారు. గత ఆరునెలల వ్యవధిలో అమెరికా వెళ్లటం ఇది రెండో సారి.

టిడిపిలో చేరనున్న గంటా..?

  చిరంజీవి ముఖ్య అనుచరుడిగా ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చిన నాయకుడు గంటా శ్రీనివాస్‌రావు. చిరంజీవి అండదండలతో కాంగ్రెస్‌లో మంత్రి పదవిని కూడా సాదించిన గంట ప్రస్థుతం సమైక్య వాదానికి బలంగా మద్దతు పలుకుతున్నారు.అయితే గత కొద్ది రోజులుగా మారుతున్న రాజకీయ సమీకరణాలు సమైక్య ఉద్యమ నేపధ్యంలో గంటా శ్రీనివాస్‌ రావు పార్టీని వీడుతున్నారన్న వాదన బలంగా వినిపిస్తుంది. ఇప్పటికే టిడిపి పార్టీతో టచ్‌లో ఉన్న ఆయన ముందుగా తన మంత్రి పదవి తరువాత కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్‌ పార్టీకి కూడా రాజీనామ చేయనున్నారు. అందులో భాగంగానే తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా సోమవారం గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించనున్నారు గంట. సీమాంద్రలో సమైక్య ఉద్యమం ఉదృతంగా జరగుతున్న హైకమాండ్‌ దానిపై స్పందిచక పోగా తెలంగాణ ఏర్పాటు దిశగా అడుగులు వేయడం సరికాదంటున్నారు. విభజన జరిగితే సీమాంద్రల్లో పార్టీ ఉనికి కోల్పోతుందని భావించిన మరికొంత మంది మంత్రులు కూడా గంటా బాటలోనే రానున్నారు.

ప్రతి గంటకు ఓ మహిళ బలి

  మనదేశంలో ప్రతి గంటకు ఓ మహిళ బలవుతుందని ఎస్‌ సీ ఆర్‌ బి తేల్చింది. దేశం వ్యాప్తంగా అమ్మాయిలపై ఓ వైపు అఘాయిత్యాలు పెరుగుతుండగా, మరోవైపు వరకట్న వేదింపులకు కూడా మహిళలు బలైపోతున్నారు. 2007 నుంచి 2011 మధ్య ఇలాంటి కారణాలతో మరణించిన మహిళ సంఖ్య ఘననీయంగా పెరిగింది. ఒక్క 2012లోనే దేశ వ్యాప్తంగా 8233 మంది మహిళలు వరకట్న వేధింపులకు బలైయ్యారు. అంటే దాదాపుగా ప్రతి గంటకు ఓ మహిళ ఈ కారణంతో మరణిస్తుంది. అయితే వరకట్న సమస్యతో జరిగే మరణాలు కేవలం పేద,మధ్య తరగతి కుటుంబాలకే పరిమితం కాలేదు. సంపన్న కుటుంబాలలో కూడా ఇలా వేదింపులు కనిపిస్తున్నాయి. వరకట్న నిషేధ చట్టం, 1961 ప్రకారం.. కట్నం అడగడం, ఇవ్వడం, అంగీకరించడం నేరం. అయినా ఈ దురాచారం మన సాంఘిక వ్యవస్థలో విడదీయలేనంతగా పాతుకుపోయింది.

సిరియాపై బాంబులు సిరియా సంక్షేమం కోసమేనట

  నిత్యం ఏదో ఒక దేశంతో యుద్ధం చేయకపోతే అమెరికాకు ఊపిరాడనట్లుటుంది. టీవీ సీరియల్స్ లాగ ఒకటి ముగియకముందే మరొకటి మొదలుపెడుతూ తను తయారు చేసుకొన్న అత్యాధునిక ఆయుధాలను పరీక్షించుకొనేందుకు దేశాలను, అందుకు అవసరమయిన కారణాలను వెతుకొంటుంది అమెరికా. ఇరాక్ రసాయన ఆయుధాలు తయారు చేస్తోందని సాకు చూపి, ఆదేశాన్ని సర్వనాశనం చేసిన తరువాత అమెరికా దృష్టి ఆఫ్ఘానిస్తాన్ పై పడింది. ఇరాక్ తరువాత అక్కడ కూడా బహు చక్కగా శాంతి స్థాపన చేసేసి చేతులు దులుపుకొన్న అమెరికా దృష్టి ఇప్పుడు సిరియాపై పడింది.   ఆదేశంలో ప్రజాస్వామ్యం కోరుతూ జరుగుతున్న ఉద్యమాలను అణచివేసేందుకు అక్కడి బషార్-అల్-అస్సాద్ ప్రభుత్వం రసాయన ఆయుధాలు ప్రయోగించడంతో 426 మంది పసిపిల్లలతో సహా మొత్తం 1429 మంది ప్రజలు చనిపోయారు. దానితో ప్రజలు తమ ఉద్యమాలను మరింత తీవ్రతరం చేసారు. అమెరికా యుద్ధం మొదలుపెట్టడానికి ఈ మాత్రం సాకు చాలు గనుక అమెరికా అధ్యక్షడు బారక్ ఒబామా సిరియాపై పరిమిత దాడి చేయడానికి సిద్దంకమ్మని ఆదేశాలు జారీ చేయడంతో, అత్యాధునిక ఆయుధాలను మోసుకొని అమెరికా నావికా దళం సిరియా తీరం చట్టూ మోహరించింది.   ప్రపంచ దేశాలు అమెరికా ఆలోచనను ఎంతగా ఖండిస్తున్నపటికీ అమెరికా యుద్దానికే తయారవుతోంది. బుష్ ప్రభుత్వం అమెరికా దేశ ప్రజల మీద అనవసరమయిన యుద్దాలు చాలా రుద్దారని, తను యుద్దాలను వ్యతిరేఖిస్తున్నానని చెప్పి ఎన్నికలలో గెలిచిన బరాక్ ఒబామా కూడా ఇప్పుడు యుద్ధం చేయకుండా ఉండలేకపోతున్నాడు.   ఆయన కను సైగ చేయగానే అమెరికా నావికా దళం 1429 మంది ప్రజలను చంపినందుకు శిక్షగా సిరియా మీద సరికొత్త రకాల బాంబుల వర్షం కురిపించి, కొన్ని వందలో వేలమందిని చంపి అక్కడ కూడా శాంతి నెలకొల్పుతుంది.   ఇంతవరకు సిరియా ప్రజలు కేవలం తమ ప్రభుత్వాన్నే ద్వేషిస్తున్నారు. కానీ, వారిప్పుడు అమెరికాను అంతకంటే ఎక్కువగా ద్వేషించడం మొదలుపెట్టారు. తాము అమితంగా ద్వేషిస్తున్నబషార్-అల్-అస్సాద్ ప్రభుత్వంపై అమెరికా చేయబోతున్నదాడిని తమ దేశంపై దాడిగా భావించడం సహజమే. అయితే వారి అభిమతంతో, అభిప్రాయాలతో అమెరికాకు పనిలేదు. అమెరికాకు కావలసిన సాకు దొరికింది ఇక యుద్ధం మొదలుపెట్టక తప్పదు.   కానీ అడుసు తొక్క నేల? కాలు కడుగ నేల? అని సామెత చెప్పినట్లు సిరియాపై యుద్దానికి కాలుదువ్వడంతో తన దేశంలో నివసిస్తున్నసిరియా ప్రజలను చూసి అమెరికా అప్పుడే ఉలికులికి పడుతోంది. అందుకే అమెరికా తన దేశంలో ఉన్న సిరియా దేశస్థులపై అప్పుడే నిఘా మొదలుపెట్టింది.   ఇక నేడోరేపో ఆకాశం నుండి కురిసే బాంబుల వర్షంలో ప్రాణాలు అర్పించేందుకు సిరియా ప్రజలు సిద్దంగా ఉండక తప్పదు. అమెరికా చేపడుతున్న ప్రపంచ శాంతి కోసం దాని కన్నుపడిన ఏ దేశానికయినా ఆమాత్రం మూల్యం చెల్లించుకోక తప్పదు, ఆ మాత్రం త్యాగాలు చేయక తప్పదు. మొన్నఇరాక్, నిన్న ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేడు సిరియా, రేపు మరెవరి వంతో?

ముగ్గురు యాత్రికులు మూడు గమ్యాలు

  చంద్రబాబు, హరికృష్ణ, షర్మిల ముగ్గురు మూడు వేర్వేరు ప్రాంతాల నుండి వేర్వేరు ఆలోచనలతో, వ్యూహాలతో బస్సుయాత్రలు మొదలుపెట్టబోతున్నారు.   ఈరోజు చంద్రబాబు అత్యంత ప్రతికూల పరిస్థితుల మధ్య ‘ఆత్మగౌరవ యాత్ర’ పేరిట గుంటూరు నుండి బస్సు యాత్రను ప్రారంభిస్తున్నారు. తెదేపా ఇచ్చిన లేఖ వలననే నేడు రాష్ట్ర విభజన జరుగుతోందనే కాంగ్రెస్ వైకాపాలు చేస్తున్నప్రచారం అడ్డుకొని, ఆ రెండు పార్టీలు మరియు తెరాసయే తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్నిఈ దుస్థితికి తెచ్చాయని ప్రజలకు వివరించేందుకు ఆయన ఈ యాత్ర చేపడుతున్నారు. కానీ, సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న లగడపాటి వంటి వారికే ప్రజల మధ్య భంగపాటు ఎదురవుతున్న ఈ తరుణంలో, విభజనకు అంగీకరిస్తూ లేఖ ఇచ్చిన చంద్రబాబు సమైక్య రాష్ట్రం కోరుతున్న ప్రజలతో ఏవిధంగా నెగ్గుకొస్తారో చూడాల్సిందే. ఆయన రాష్ట్ర విభజనపై తన పార్టీ స్పందన, ఆశిస్తున్న పరిష్కారం గురించి ప్రజలకు వివరించి పార్టీని రక్షించుకోవాలని బయలుదేరుతున్నారు.   రేపటి నుండి షర్మిల చేపడుతున్న‘సమైక్య శంకారవం’ యాత్ర చంద్రబాబు స్వంత జిల్లా చిత్తూరులో తిరుపతి ప్రారంభించడం వ్యూహాత్మకమే. ఆమె సమన్యాయం లేదా సమైక్య రాష్ట్రం అనే నినాదంతో యాత్ర చేపడుతున్నారు. ఆమె ఈ విభజనకు కాంగ్రెస్ మరియు తెదేపాలే ప్రధాన కారణమని గట్టిగా ప్రజల మనస్సులో నాటి, తద్వారా కేవలం తమ పార్టీ మాత్రమే సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న ఖ్యాతిని పొందేందుకు ప్రయత్నిస్తారు. కాంగ్రెస్, తెదేపాలు ఓట్లు, సీట్లు రాజకీయాల కోసమే రాష్ట్రాన్ని విభజించాయని ఆరోపిస్తున్న వైకాపా, ఆ ఓట్లు సీట్ల కోసమే ఈ యాత్ర చేపడుతోంది.   సీమంధ్రలో పట్టు సాధించేందుకు రాజీనామాలు, నిరాహార దీక్షలు, బహిరంగ సభలు, డిల్లీ పర్యటనలు, బహిరంగ లేఖాస్త్రాలు ప్రయోగించిన తరువాత వైకాపా ఇప్పుడు తాజాగా బస్సు యాత్రలనే మరో సరికొత్త ఐడియాతో ప్రజల ముందుకు వస్తోంది. నిన్న మొన్నటివరకు తాము తెలంగాణకు వ్యతిరేఖం కాదని చెపుతూ వచ్చిన వైకాపా, ఇప్పుడు సీమంధ్రలో బలంగా ఉన్న తెదేపాను దెబ్బ తీయడానికి తెదేపా తెలంగాణకు అనుకూల పార్టీ, రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చిన పార్టీ అని ప్రచారం చేస్తూ సీమంద్రలో పైచేయి సాధించేదుకు ప్రయత్నిస్తోంది. అక్కడ తెలంగాణా ప్రజలను, తన పార్టీ నేతలను కూడా వంచించిన వైకాపా, నీతినిజాయితీలకు తానే మారుపేరన్నట్లు నిస్సిగ్గుగా చెప్పుకొంటూ, ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తోంది.   ఇక హరికృష్ణ తన రాజ్యసభ సభ్యత్వం పూర్తయ్యేందుకు కేవలం మరో నాలుగయిదు నెలల కాలం మాత్రమే మిగిలి ఉన్నందున, రానున్న ఎన్నికలను, సీమంధ్రలో జోరుగా సాగుతున్న ఉద్యమాలను, చంద్రబాబుతో తన కున్నబేదాభిప్రాయలను అన్నిటిని దృష్టిలో పెట్టుకొని, ఒకే దెబ్బకు మూడు పిట్టలు కొట్టాలనే దురాశతో సమైక్యాంధ్ర కోసం అంటూ తన పదవికి రాజీనామా చేసి రేపటి నుండి చైతన్యయాత్ర చేపడుతున్నారు.   ఆయన తన యాత్ర సమైక్యాంధ్ర కోసమని చెప్పుతున్నపటికీ, తనను, తన కుమారుడు జూ.యన్టీఆర్ ని పార్టీలో పక్కన బెట్టి, చంద్రబాబు తన కుమారుడు లోకేష్ ని తన వారసుడిగా ముందుకు తీసుకు వస్తున్నారనే అక్కసుతో, వారిని ఇబ్బందిపెట్టాలనే ఆలోచనతోనే ఈ యాత్ర చేపడుతున్నారు. హరికృష్ణ ఇన్నేళ్ళుగా ఎటువంటి పార్టీ కార్యక్రమాలలో పాల్గొనకపోయినప్పటికీ, కేవలం నందమూరి వంశానికి చెందిఉండటమే తన ఏకైక అర్హతగా భావిస్తూ పార్టీలో పదవులు ఆశించి భంగపడ్డారు. అందుకే ఇప్పుడు పార్టీని ఇబ్బంది పెట్టేందుకు బస్సు యాత్ర చేపడుతున్నారు.

ఆశారాం బాపు అరెస్ట్‌

  లైంగిక దాడి ఆరోప‌ణలు ఎదుర్కొంటున్నా ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపును పోలీసులు అరెస్ట్ చేవారు. ఇండోర్‌లోని త‌న ఆశ్రమంలో ఉన్న ఆయ‌న‌ను శ‌నివారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ఆయ‌న్ను ఢిల్లీ త‌రలించేదుకు జోధ్‌పూర్ పోలీసుల ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అరెస్ట్‌కు ముందు ఆశారాం ఆశ్రయం ముందు హైడ్రామా న‌డిచింది. జోద్‌పూర్‌కు చెందిన 16 ఏళ్ల బాలిక పై ఆశారాం లైంగిక దాడికి దిగిన‌ట్టు ఢిల్లీ పోలీసుల‌కు ఫిర్యాదు అంద‌టంతో పోలీసులు ఇన్వెస్టిగేష‌న్ చేప‌ట్టారు. ఆ బాలిక‌కు వైధ్య ప‌రీక్షలు నిర్వహించిన వైధ్యులు లైంగిక దాడి జ‌రిగింద‌ని నిర్ధారించ‌డంతో ఆమె ఫిర్యాదు మేర‌కు ఆశారాం పై కేసు న‌మోదు చేసి అరెస్ట్‌కు రంగం సిద్దం చేశారు. ఆయ‌న అరెస్ట్ కు వ‌చ్చిన పోలీసుల‌తో ఆశారాం ఇండోర్లో చికిత్స పొందుతున్నారంటూ ఆయ‌న కుమారుడు నారాయ‌ణ్ ప్రేమ్ సాయి చెప్పారు. అరెస్ట్  త‌రువాత ఆయ‌న‌కు వైధ్య ప‌రీక్షలు చేయించిన పోలీసులు ఎలాంటి అనారోగ్యం లేద‌ని తేల్చారు. ఈస‌మ‌యంలో ఆశ్రామానికి వెళ్లిన మీడియా ప్రతినిధుల‌పై కూడా ఆశ్రమం నిర్వహాకులు దాడికి దిగారు.

ఆజాద్‌కు హోం శాఖ బాధ్యత‌లు..?

  దేశంలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు  శ‌ర‌వేగంగా మారుతున్న నేప‌ధ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా కేంద్ర హోం శాఖ మంత్రి మార్చే ఆలోచ‌న‌లో ఉన్నారు.  ప్రస్థుతం హోం మంత్రిగా బాధ్యత‌లు నిర్వహిస్తున్న సుశీల్‌కుమార్ షిండే స్థానంలో మ‌రొక‌రికి బాధ్యత‌లు అప్పగించే ఆలోచ‌న‌లో ఉన్నారు. ఇటీవ‌లే ముంబై బ్రిచ్ క్యాండీ ఆసుపత్రిలో ఆప‌రేష‌న్ చేయించుకున్న షిండే ఆరోగ్యకార‌ణాల రీత్యా మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించ‌నున్నారు. ఇప్పటికే చికిత్స జ‌రిగినా షిండే ఆరోగ్యం పూర్తిగా కోలుకోక‌పోవ‌డంతో విధుల‌కు పూర్తిగా హాజ‌న‌రు కాలేకపోతున్నారు. దీంతో ప్రస్థుతం ఉన్న పరిస్థితుల్లో ఆయ‌న హోం శాఖ‌ను నిర్వహించ‌గ‌ల‌రా అని అధిష్టానం ఆందోళ‌న‌లో ఉంది. దీంతో పార్లమెంట్ స‌మావేశాలు పూర్తి కాగానే హోం శాఖ‌ను గులాంన‌భీ ఆజాద్‌కు అప్పజెప్పనున్నారు. ఆరోగ్య స‌మ‌స్యల‌తో పాటు తెలంగాణ విష‌యంపై కూడా నోట్ రెడీ చేసే బాధ్యత కూడా షిండే పైనే ఉండ‌టంతో ఆయ‌న‌ను హోం శాఖ నుండి త‌ప్పించి బాధ్యత‌లు లేని శాఖ‌ను అప్పగించే యోచ‌న‌లో ఉంది అధిష్టానం.

మా ఆవిడకి రాజకీయాలొద్దు: బ్రదర్ అనిల్

    బ్రదర్ అనిల్ తన ఒంటికి రాజకీయాలు సరిపడవని, కలుషితమయిన ప్రస్తుత రాజకీయాలలోకి రావాలని తానెప్పుడు కోరుకోవట్లేదని అన్నారు. ఇక, రాజకీయాలు పడవంటూనే, రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ స్పష్టమయిన వివరణ ఇవ్వాలని, ఉభయ ప్రాంత ప్రజలకి సమన్యాయం చేయాలని ఆయన కోరారు. ఇక వైయస్స్ కుటుంబ సభ్యులపై రాజకీయ కక్ష సాధింపులు కొనసాగుతున్నాయని, జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా జైలులో నిర్భందించడమే అందుకు ఉదాహరణ అని ఆయన అన్నారు. స్వర్గీయ వైయస్సార్ చేసిన సేవలు, మంచి పనుల వలన ఆయన కుటుంబ సభ్యులను దేవుడు తప్పక కాపాడుతాడని ఆయన విశ్వాసం వ్యక్తం చేసారు.   ఇక, పనిలోపనిగా అయన మరొక సంచలన ప్రకటన కూడా చేసారు. తన భార్య షర్మిల రాజకీయాలలో కలకాలం కొనసాగదని తెలిపారు. గత ఏడాదిగా ఆమె సుదీర్గ పాదయాత్ర చేసి, మళ్ళీ ఇప్పుడు బస్సు యాత్రకు సిద్దపడుతున్న తరుణంలో ఆయన ఈవిధమయిన ప్రకటన చేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి ఆయన ఈ ప్రకటనకు షర్మిల ఆమోదం ఉందా లేదా? అనేది తెలియదు.   ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి వచ్చే నెలలో బెయిలు దొరకకపోయినట్లయితే, అప్పుడు షర్మిలే పార్టీని నడిపించవలసి ఉంటుంది. మరి అటువంటప్పుడు ఆమె భర్త అనిల్ ఆమె రాజకీయాలలో కొనసాగదని ప్రకటించడం చాలా ఆశ్చర్యకరం. ఆమె రాజకీయాలలో కొనసాగడం అతనికి ఇష్టం లేక ఈవిధంగా అన్నారా? లేక పార్టీపై పట్టు కోసం కుటుంబం సభ్యుల మధ్య అంతఃకలహాలున్నట్లు వచ్చిన వార్తలు నిజమేనని ఆయన తన ప్రకటనతో దృవీకరిస్తున్నారా?   త్వరలో షర్మిల పార్టీలో కీలక భాద్యతలు నిర్వహించే అవకాశముందని అందరూ భావిస్తున్న తరుణంలో ఆమె అట్టే ఎక్కువ కాలం రాజకీయాలలో కొనసాగదని ఆమె భర్త ప్రకటించడం చాలా ఆశ్చర్యకరమే.

నిర్భయ కేసులో తోలి తీర్పు

  డిల్లీలో గత ఏడాది డిశంబర్ 16న జరిగిన నిర్భయ ఉదంతంపై గత 8నెలలుగా కొనసాగుతున్న కోర్టు కేసుల్లో మొట్ట మొదటి తీర్పు ఈ రోజు వెలువడింది. ఈ కేసులో అందరి కంటే వయసులో చిన్నవాడు కానీ అందరికంటే తీవ్ర నేరానికి పాల్పడిన బాలనేరస్తుడికి ఈ రోజు బాలనేరస్థుల (జువైనల్) బోర్డు మూడేళ్ళ జైలు శిక్ష విదిస్తూ తీర్పు చెప్పింది. బాల నేరస్తుల చట్టం క్రింద అత్యధికంగా విధించగల శిక్షను విదిస్తున్నట్లు ప్రధాన మేజిస్ట్రేట్ గీతాంజలి గోయల్ తెలిపారు. ఈ నేరానికి పాల్పడిన మిగిలిన వారిపై నేటికీ ఇంకా ఫాస్ట్ ట్రాక్ కోర్టులోకేసులు నడుస్తున్నాయి.   ఈ కేసులు మొదలయిన్నపుడు, అన్ని ఆధారాలు ఉన్న కారణంగా ఈ కేసులు కేవలం రెండు లేదా మూడు నెలలో విచారణ పూర్తిచేసి నేరస్తులకి శిక్ష పడటం ఖాయమని అన్నారు. కానీ, 8 నెలలు గడిచినా ఇంతవరకు ఒక్క కేసు కూడా కొలిక్కి రాలేదు.   వారిలో రామ్ సింగ్ అనే నేరస్తుడు తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకొని మరణించగా, మరొకరిపై తోటి ఖైదీలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ నేరానికి పాల్పడిన మిగిలిన ఐదుగురు ఖైదీలు తాము ఎటువంటి నేరం చేయలేదని వాదిస్తున్నారు. వారిలో ఒక ఖైదీ ఎయిర్ ఫోర్సులో క్లర్కు ఉద్యోగానికి పరీక్షలకు సిద్దం అవుతున్నాడు కూడా. అందుకోసం కోర్టు అతనికి బలమయిన ఆహారం, పాలు, పుస్తకాలు, అతనికి జైలులో రోజూ ట్యూషన్ చెప్పేందుకు ఒక ఉపాద్యాయుడిని కూడా మంజూరు చేసింది. బహుశః ఇటువంటి అవకాశం కేవలం భారతదేశంలోనే ఉంటుందేమో.

మ‌రోసారి పేలిన పెట్రో బాంబ్‌

కేంద్ర మ‌రోసారి సామాన్యుడికి వాత పెట్టింది. ఇప్పటికే నిత్యవ‌స‌ర వ‌స్తువుల‌తో పాటు అన్నింటి రేట్లు చుక్కలు తాకుతున్న త‌రుణంలో ఇప్పుడు మ‌రో బాంబ్ పేల్చింది. కేంద్ర ప్రభుత్వం శనివారం మరోమారు పెట్రోల్ రేటు పెంచింది.  లీటర్ పెట్రోల్ ధర రూ. 2.35 పైసలతో పాటు, లీటరు డీజిల్ ధర 50 పైసలు పెంచారు. ఈ ధ‌ర‌లు శ‌నివారం అర్ధరాత్రి నుంచే అమలులోకి రానున్నాయి. దీంతో వాహ‌దారుల‌పై పెనుభారం ప‌డ‌నుంది. పెట్రోల్ ధ‌ర పెంచేందుకు ఆయిల్ కంపెనీల‌కు అనుమ‌తినిచ్చిన ద‌గ్గర నుంచి పెట్రోలియం సంస్థలు విచ్చల‌విడిగా రేట్లు పెంచేస్తున్నాయి. దీనికి తోడు అంత‌ర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధ‌న పెర‌గ‌టంతో పాటు, రూపాయి విలువ భారీగా ప‌త‌నం అవుతుండటంతో పెట్రోల్ రేటు పెంచ‌క త‌ప్పడం లేదంటున్నాయి కంపెనీలు.

టి పై లేఖను వెనక్కి తీసుకోం: మురళీ మోహన్

      తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకునే ప్రసక్తి లేదు.ఎప్పుడో ఆరేళ్ల క్రితం ఇచ్చిన లేఖ గురించి ఇప్పుడు మాట్లాడటం అనవసరం. మా లేఖ ఇవ్వడం తప్పు అయితే అప్పుడే మాట్లాడాల్సింది. ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు. లేఖ ఇచ్చిన ఆరేళ్ల తరువాత ఇప్పుడు అభ్యంతరాలు తీసుకురావడం అర్ధంలేని వాదన అని తెలుగుదేశం పార్టీ నేత, సినీ నటుడు మురళీ మోహన్ తప్పుపట్టారు.   తమకు తెలంగాణ మీద ప్రేమగానీ, సీమాంధ్ర మీద ద్వేషం గానీ లేదని, రెండు ప్రాంతాలకు న్యాయం జరగాలి అన్నదే మా ముఖ్య ఉద్దేశమని, ఉద్యోగాలు, నీళ్లు, హైదరాబాద్ నగరం విషయంలో ఇద్దరికీ సరయిన న్యాయం జరగాలి అన్నదే మా ఆరాటం. మా పార్టీని దెబ్బతీసే కుట్రలో భాగంగా విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు బస్సుయాత్ర జరిగి తీరుతుంది. ఎట్టి పరిస్థితుల్లో యాత్ర విషయంలో వెనక్కి వెళ్లం అని స్పష్టం చేశారు.

జగన్ దీక్ష భగ్నం

      వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిరవధిక దీక్ష చేస్తున్న నేపథ్యంలో దీక్ష విరమింపజేయాలని జైళ్ల శాఖ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీక్ష విరమణకు ఒప్పుకోకుంటే బలవంతంగా అయినా ఫ్లూయిడ్స్ ఎక్కించాలని సూచించింది. జగన్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నా ఆయన వైద్యానికి సహకరించడం లేదని నిమ్స్ వైద్యులు వెల్లడించిన నేపథ్యంలో జైళ్ల శాఖ ఆదేశాలిచ్చింది.     జగన్ ఆరోగ్యం మెరుగుపడాలంటె బలవంతంగా అయినా గ్లూకోజ్ ఎక్కించక తప్పదని నిమ్స్ వైద్యులు నగేష్ తెలిపారు. ఇప్పుడు ఒక్కసారి ఆయనకు ఫ్లూయిడ్స్ ఎక్కించడం మొదలు పెడితే నాలుగు రోజుల పాటు సాగుతుందని, ఆ తరువాత ఎన్ని రోజులు అలా అనేది చెప్పలేమని తెలిపారు. జగన్ దీక్ష నేటికి ఏడో రోజుకు చేరింది. ఆయన నిలబడితే బీపీ పడిపోతుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ తో పాటు కిడ్నీ పారామీటర్స్ కూడా తగ్గిపోయాయని డాక్టర్ శేషగిరి ఆధ్వర్యంలో చేసిన వైద్య పరీక్షల వివరాలను బులెటిన్ లో వెల్లడించారు.