రేపు రాష్ట్రాన్నితాకనున్నతుఫాన్
posted on Sep 5, 2013 @ 9:52PM
సెప్టెంబర్ 6, 7 తేదీలలో అంటే రేపు ఎల్లుండి రాష్ట్రం కొన్ని అవాంచనీయ సంఘటనలు చూడబోతోంది. రేపు రామ్ చరణ్ తేజ్, ప్రియాంకా చోప్రా నటించిన తుఫాన్, జంజీర్ సినిమాలు హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసుల రక్షణలో ప్రదర్శనకు సిద్దం అవుతుంటే, వాటిని అడ్డుకొని తీరుతామని సమైక్యాంధ్ర ఉద్యమకారులు ఈ రోజుకూడా గట్టి హెచ్చరికలు జారీచేసారు. అదేవిధంగా తెలంగాణాలో ఈ సినిమాల ప్రదర్శనకు ఒప్పుకోమని తెలంగాణావాదులు కూడా తీవ్ర హెచ్చరికలు జారీచేస్తున్నారు.
ఈ రోజు అనంతపురం మరియు నెల్లూరు జిల్లాలలో సమైక్యవాదులు సినిమా పోస్టర్లను చించి తగులబెట్టారు. అనంతపురంలో సినిమా హాళ్ళ యజమానులు సమైక్య వాదుల హెచ్చరికలకు భయపడి సినిమా ప్రదర్శనకు వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం కోర్టు ఆదేశాల మేరకు ఈ సినిమాలు ప్రదర్శింపబడే అన్ని సినిమా హళ్ళ వద్ద రక్షణ కల్పించేందుకు సిద్దపడుతున్నారు.
ఇక, సెప్టెంబర్ 7న అంటే శనివారం నాడు హైదరాబాదు, యల్బీ స్టేడియంలో ఏపీ యన్జీవోలు తలపెడుతున్న సభను అడ్డుకొనేందుకు టీ-యన్జీవోలు, టీ-జేఏసీ, ఓయు విద్యార్ధి జేఏసీ, తెరాస కార్యకర్తలు రేపు, ఎల్లుండి హైదరాబాద్ బంద్ పిలుపునిచ్చారు. అంతే కాకుండా నగర దిగ్బంధనం చేసి, వారిని ఎక్కడికక్కడ అడ్డుకొంటామని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు.
ఇరువర్గాలు పట్టు వీడకపోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరువర్గాలకు చెందిన ప్రజలు వేలాదిగా రోడ్లమీదకు వచ్చినట్లయితే వారిమధ్య ఘర్షణలు చెలరేగితే నగరంలో ఎంత మంది పోలీసులను, పారా మిలటరీ దళాలను దింపినప్పటికీ పరిస్థితులు అదుపు చేయడం కష్టమే. ఇదే అదనుగా వారి మధ్య అసాంఘిక శక్తులు చొరబడితే అల్లర్లు నగరమంతా వ్యాపించి అల్లకల్లోలమయ్యే ప్రమాదం ఉంది. గనుక ఇరువర్గాల నేతలు ఇప్పటికయినా విజ్ఞత చూపి పరిస్థితిని అర్ధం చేసుకొని తమ తమ కార్యక్రమాలు రద్దు చేసుకోవడం మేలు.