హెరిటేజ్‌ ని టార్గెట్ చేసిన కోదండరాం

      హెరిటేజ్‌తో తమ పాల వ్యాపారుల పొట్టకొట్టారని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పరోక్షంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పైన మండిపడ్డారు. నగరంలో 10 శాతం ఉన్న వారే హైదరాబాద్ తమది అంటే, 90 శాతం ఉన్న తాము ఏమనాలని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడితే గుప్పెడు మంది దోపిడీదార్లకే నష్టమని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రతీ బస్తీ బంజారా హిల్స్ కావాలని ఆకాంక్షించారు. కేవలం సినిమాలు, మీడియానే కాకుండా వ్యవస్థలన్నీ సీమాంధ్రుల చేతుల్లోనే ఉన్నాయన్నారు. చివరకు పాఠ్యపుస్తకాన్ని కూడా ఎవరు రాయాలో సీమాంధ్రులే నిర్ణయిస్తారన్నారు. అన్ని రంగాలలో సీమాంధ్రులే ఉంటే తెలంగాణ ప్రాంత సమస్యలు ఎలా అర్థమవుతాయి, ఎలా తీరుతాయని ప్రశ్నించారు.

టార్గెట్ సీయం కిరణ్ కుమార్ రెడ్డి

  ఇటీవల హైదరాబాదులో జరిగిన ఏపీఎన్జీవోల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ తెరాసపై ఏవిధంగా ప్రభావం చూపిందో అదేవిధంగా వైకాపాపై కూడా బాగా ప్రభావం చూపింది. దాదాపు నాలుగున్నర లక్షల మంది ఉద్యోగులు అంతకు మూడు రెట్లు ఉండే వారి కుటుంబాలకు ప్రాతినిధ్యం వహించిన ఈ సభలో ఒక్కరు కూడా వైకాపా చేస్తున్న సమైక్యాంధ్ర పోరాటాన్ని మెచ్చుకోలేదు, కనీసం గుర్తించను కూడా లేదు. పైగా ఈ రధ యాత్రలు, పాదయాత్రల భాగోతాలు కట్టిబెట్టి ప్రజల అభీష్టానికి అనుగుణంగా వ్యవహరించమని హెచ్చరికలు కూడా జారీ చేసారు.   ఇక అదే సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మాత్రం సమైక్యాంధ్ర రధసారధిగా గుర్తించి పొగడ్తలు కురిపించారు. ఇది సహజంగానే వైకాపాకు జీర్ణం కావడం చాలా కష్టం. సమైక్యాంధ్ర కోసం అందరి కంటే ముందుగా రాజీనామాలు చేసి, ఆ తరువాత తెలంగాణాను త్యాగం చేసి, ఆమరణ దీక్షలు, బస్సుయాత్రలు చేస్తుంటే, దానిని ఏపీఎన్జీవోల సభ మెచ్చుకొనకపోగా, తీవ్రంగా తప్పుపట్టడం సహించలేకపోయింది. దాదాపు ఏడాదిగా ఎండనకా వాననకా రోడ్లపై తిరిగి కష్టపడినప్పటికీ తమకి దక్కని ఫలితం, ఏసీ గదిలో కూర్చొని కేవలం రెండంటే రెండే రెండు మీడియా సమావేశాలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆ ఖ్యాతిని అమాంతం స్వంతం చేసుకోవడం వైకాపాకు బాధ కలిగించడం సహజమే.   ఇక, ఏపీఎన్జీవోల దన్నుతో ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగినట్లయితే, తాము ఇంతకాలంగా పడుతున్న శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని వైకాపా భయపడుతోంది. సీమాంధ్రలో పట్టు సాధించడానికి తెలంగాణాను బలిపెట్టడం వలన ఇప్పుడు అక్కడ కాలుమోపలేని పరిస్థితి. కానీ తెదేపా మాత్రం ఇప్పటికీ తెలంగాణాను చేజారకుండా జాగ్రత్త పడుటం చూసి, ఈ విషయంలో తొందర పడ్డామా? అని ఆలోచనలో పడింది. కానీ ఇప్పటికే అక్కడ జరుగవలసిన నష్టం జరిగిపోయింది.   సీమాంధ్రపై ఆధిపత్యం సంపాదించేందుకు తెదేపాతో పోటీ పడుతుంటే, ఇప్పుడు అకస్మాత్తుగా సమైక్యాంధ్ర హీరోగా ముద్రతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా రేసులో ప్రవేశిస్తే సీమాంధ్ర కూడా చేయి జారితే, అప్పుడు తమ పరిస్థితి ఏమిటనేది వైకాపా ఆందోళన చెందుతోంది. బహుశః అందుకే షర్మిల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పై తన దాడి తీవ్ర తరం చేసారని భావించవచ్చును.

సోనియమ్మ ఆజ్ఞ లేనిదే...

  శివుడాజ్ఞ లేనిదే చీమయినా కదలదని నాటి మాట. సోనియమ్మా ఆదేశం లేనిదే మన్మోహనయినా కదలరనేది నేటి మాట. సోనియమ్మ విదేశాలకు వెళ్ళవలసి రావడంతో, దేశంలో, రాష్ట్రంలో పూర్తి స్థాయి ప్రభుత్వాలు ఉన్నపటికీ, రాష్ట్రంలో నానాటికి దిగజారుతున్నపరిస్థితులనూ ‘నిశితంగా గమనించడం’ తప్ప మరేమీ చేయలేకపోతున్నాయి.   అసలు ప్రధాన మంత్రి అయితే రాష్ట్ర విభజన విషయంలో తనకు ఎటువంటి సంబంధమూ లేదనే రీతిలో వ్యవహరించడం చాల విచిత్రమయితే, రాష్ట్రంలో అదుపుతప్పుతున్న పరిస్థితులను కళ్ళారా చూస్తూ కూడా, కేంద్ర హోంమంత్రి షిండే రాష్ట్రం చాల బేషుగ్గా ఉందని శలవీయడం, ‘తెలంగాణా నోట్’ పై ఆమోద ముద్ర వేయించుకోవడానికి సోనియమ్మ రాక కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పుకోవడం గమనిస్తే, ప్రభుత్వాన్నిసోనియమ్మ ఏవిధంగా రిమోట్ కంట్రోల్ చేస్తున్నారో అర్ధం అవుతుంది. ఆమె రాక కోసం ఇంత కాలం కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వము చకోరపక్షుల్లా ఎదురు చూసారు.   ఇక, కిరణ్ కుమార్ రెడ్డి కొద్దో గొప్పో రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ మాట్లాడినప్పటికీ, ఆయన కూడా రాష్ట్ర పరిస్థితులను చక్క దిద్దే ప్రయత్నం చేయడం లేదు. బహుశః ఆయనకు సోనియా గాంధీ అనుమతి లేకపోవడం వలననే నీరో చక్రవర్తి పాత్ర బహు చక్కగా పోషిస్తున్నారేమో మరి తెలియదు. ఇప్పుడు సోనియమ్మ డిల్లీకి తిరివచ్చారు గనుక ఇప్పటికయినా ఆమె అనుమతితో ప్రభుత్వాలు పనిచేయడం మొదలుపెడితే వారిని ఎన్నుకొన్నప్రజలు వారికి కృతజ్ఞతలు అర్పించుకొంటారు.

అజ్ఞానాంధకారంలో భారత ప్రజానీకం

    ..... సాయి లక్ష్మీ మద్దాల     నేడు దేశాన్ని ఎన్నో సమస్యలు తీవ్రంగా పట్టి పీడిస్తున్నాయి. వాటిలో ప్రధానమైనది దేశ భద్రత. దేశ భద్రతను గాలికి వొదిలేసి ఆహార భద్రత అనే సంక్షేమ పధకం  ద్వారా తమ అధికారానికి భద్రత కల్పించుకునే ప్రయత్నంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఒకపక్క నుండి పాకిస్తాన్ స్వయంగా దేశంలోనే చొరబడి దేశ ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తుంటే,ప్రజల ప్రాణాలకు ఎలాంటి భద్రత కల్పిస్తారో భరోసా ఇవ్వలేని నాయకులు నేడు దేశాన్ని ఏలుతున్నారు. మరో ప్రక్కనుండి చైనా రోజుకు కొంత భూభాగాన్ని ఆక్రమించుకుంటూ ముందుకొస్తున్నా ఎటువంటి ధిక్కార చర్యలు చేపడుతున్నారో చెప్పలేరు. పైగా భూసేకరణ బిల్లు ద్వారా దేశ ప్రజలకు ఏదో ఒరగదోస్తామని మాత్రం ప్రగల్భాలు పలుకుతున్నారు.     ఇవన్ని దేశ సరిహద్దు సమస్యలు. కానీ  నేడు దేశాన్ని పట్టి పీడిస్తున్న మరో పెద్ద సమస్య ఆర్ధిక సంక్షోభం. దీనికి ఎవరు భాద్యులు?పనికి మాలిన ప్రజాకర్షక పదకాలన్ని ప్రవేసపెట్టి,ముందుచూపు లేని ఆర్ధిక నిర్ణయాల పర్యవసానమే నేటి ఆర్ధిక సంక్షోభానికి ముఖ్య కారణం. 2014 ఎన్నికలలో తిరిగి అధికారాన్ని దక్కించు కోవటమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న యు.పి. ఎ సర్కారుకు దేశ ప్రగతి పట్టటం లేదు. ఫలితంగానే 45లక్షల కోట్లు ప్రపంచ దేశాలకు రుణపడేలా భారత దేశాన్ని ఉంచింది. ఈ చర్యల తాలూకు పర్యవసానాన్ని దేశ ప్రజలు భరిస్తున్నారు. ఏది కొందామన్న,తిందామన్న అందుబాటులో లేని ధరలు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి,తగురీతిలో భవిష్యత్తులో ఆర్ధిక కార్యాచరణ చేపట్టగలమని చెప్పే ధైర్యం అటు అధికార పక్షానికి లేదు. ఆ అధికార పక్షం నైజాన్ని ఎండగట్టి ప్రజలకు భరోసా ఇవ్వగలిగిన సత్తా ఇటు దేశ ప్రధాన ప్రతిపక్ష మైన బి.జె. పి  కి లేదు. మరి దేశం ఎలా బాగుపడేది?                     ప్రజలందరికి అందుబాటులో నాణ్యమైన విద్య,వైద్యం మౌలిక సదుపాయాలు ఉంచగలిగే పరిపాలన సామర్ధ్యం నేటి నేతలలో కొరవడిన ఫలితంగానే ఈనాడు ప్రజల మధ్య పనికిమాలిన విద్వేషాలసృష్టికి అంకురార్పణ జరుగుతోంది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజల మధ్యకు కొత్త సమస్యలను తెచ్చిపెడుతున్నారు. దానిలో భాగంగానే ఆహారభద్రత పేరుతో 1,80,000కోట్ల భారాన్ని ప్రజల మీద మోపుతున్నారు. రాష్ట్రాల విభజనను తెరమీదికి తెస్తున్నారు. ప్రజలంతా ఆర్దికభారంతో,ప్రాంతీయ విద్వేషాలతో తన్నుకు చస్తుంటే సందట్లో సడేమియా లాగ తమ పదవికి అధికారానికి ఏ డోకా లేదని వారు మాత్రం వికటాట్టహాసం చేస్తున్నారంటే యావత్ భారత ప్రజానీకం అజ్ఞానాంధకారంలో ఉన్నారనే కదా!

జగన్ బెయిల్ డీల్..!!

      వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌ మోహన్ రెడ్డి బెయిలుకు తెరవెనుక రంగం సిద్ధమవుతోందనే అనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమవుతున్నాయి. మంగళవారం జగన్ కేసులో సిబిఐ చార్జ్ షీట్ దాఖలు చేయడం...మరుసటి రోజు జగన్ బెయిల్ కోసం పిటిషన్ వేయడంతో ఒక్కసారిగా జగన్ మళ్ళీ వార్తల్లోకెక్కారు.     తాజాగా జగన్ బెయిల్ పై కాంగ్రెస్‌తో 'డీల్' కుదిరిందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ అధినాయకత్వంతో విజయమ్మ, భారతిలు చేసిన లాబియింగ్ అనంతర పరిణామాలే.... జగన్ బయటకు వస్తారనే ప్రచారం రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది.     ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీకి ఎదురవుతున్న సవాళ్ళు...కాంగ్రెస్ తో వార్ ఫలితాలు నేర్పిన పాటాలు ఆయన్నీ ఒక పక్క ఉక్కిరిబిక్కిరి చేస్తూంటే మరోవైపు సిబిఐని కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకార చర్యలకు ప్రయోగిస్తోందంటూ వైకాపా అధికార ప్రతినిధులు, జగన్ కుటుంబ సభ్యులు ఊరూవాడ ప్రచారం చేస్తున్నారు..అయినా ఫలితం లేకపోవటంతో...చివరికి రాజకీయ లక్ష్యం ఎలా వున్నా, కేసులా నుంచి బయటపడితే చాలు అనే స్థితికి జగన్& పార్టీ వచ్చాయి. మారిన వైకాపా వైఖరిని గమనించి కాంగ్రెస్ అధిష్టానం కూడా భవిష్యత్తు రాజకీయ అవసరాల కోసం లౌక్యాన్ని ప్రదర్శిస్తోంది.     అయితే మొన్నటిదాకా జగన్‌కు సీబీఐ కేసుల్లో బెయిల్ వచ్చినట్లయితే, వెంటనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగుతుందని... జగన్‌ను అరెస్టు చేసి ఢిల్లీకి తరలిస్తుందని భావించేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడంలేదని చెప్పవచ్చు. జగన్ ఆస్తులను స్తంభింపచేస్తూ వచ్చిన ఈడీ ఇప్పుడు చప్పుడు చేయడం లేదు. మొత్తం మీద జగన్ 15 నెలలు గడపిన జైలు జీవితం ముగింపుకు వచ్చినట్లే నని అంటున్నారు విశ్లేషకులు.

త్వరలో మరో కోర్ కమిటీ సమావేశం

  రాష్ట్ర విభజన చేసి ఒక గొప్ప సమస్యను పరిష్కరించిన ఘనత, దానితో బాటే ఎన్నికలలో రాజకీయ లబ్దిపొందాలని ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుని ప్రకటించింది. అయితే అది ఊహించని విధంగా సమైక్యాంధ్ర ఉద్యమం మొదలయ్యి, అది నానాటికి ఉద్రుతమవుతోందే తప్పతగ్గే సూచనలు కనబడటం లేదు. అయితే కధ ఇంతవరకు వచ్చిన తరువాత అటు కేంద్రం, ఇటు సమైక్యాంధ్ర ఉద్యమాలు చేస్తున్న ప్రజలు, ఉద్యోగులు, రాజకీయ పార్టీలు కూడా వెనక్కి తగ్గే అవకాశం లేదు. అయినప్పటికీ ఇంత కాలం సోనియా గాంధీ విదేశాలకి వెళ్ళిన కారణంగా కాంగ్రెస్ అధిష్టానం ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎటువంటి చొరవ చూపకుండా ప్రేక్షక పాత్ర వహిస్తోంది. పైగా హోంమంత్రి షిండే సోనియా గాంధీ రాగానే ‘తెలంగాణా నోట్’పై తదుపరి చర్యలు మొదలవుతాయని చెప్పడం సీమాంధ్ర ప్రజలకు పుండు మీద కారం చల్లినట్లు మండిపడ్డారు. తత్ఫలితంగా ఉద్యమాలు మరింత తీవ్ర తరం చేసారు. చివరికి నిన్న రాత్రి నుండి విద్యుత్ ఉద్యోగులు కూడా సమ్మెకి దిగారు.   నిన్న సోనియా గాంధీ స్వదేశం తిరిగి రావడంతో ఈ రోజు సాయంత్రం లేదా రేపు కోర్ కమిటీ అత్యవసర సమావేశం అయ్యే అవకాశం ఉంది. ముందుగా రాష్ట్రంలో పరిస్థితులను సమీక్షించి, దానిని బట్టి రాష్ట్ర విభజన ప్రక్రియను ముందుకు తీసుకు వెళ్ళాలా లేక తాత్కాలికంగా కొంచెం స్పీడు తగ్గించాలా? అనేది నిర్ణయించుకోవచ్చును. ముందుగా రాష్ట్రంలో పరిస్థితులు అదుపులో తీసుకువచ్చేందుకు తగిన చర్యలు చేప్పట్టి, ఆ తరువాత తెలంగాణా నోట్ పై ముందుకు సాగే అవకాశం ఉంది.

జగన్ బెయిలు పిటిషను విచారణ వాయిదా

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిన్నసీబీఐ కోర్టులో పెట్టుకొన్నబెయిల్ పిటిషన్ పై కౌంటర్ వేయడానికి 5రోజులు గడువు కావాలని సిబిఐ న్యాయవాది కోరడంతో, ఈ కేసు విచారణ ఈ నెల 18కి వాయిదా పడింది. ఇక జగన్మోహన్ రెడ్డి సరిగ్గా బెయిలు పిటిషను వేసే సమయానికి ఇంతవరకు అతని కేసులు చూస్తున్న సీబీఐ ఎస్.పి.వెంకటేష్ కేరళకు బదిలీ కావడం అతని స్థానంలోకి చంద్రశేఖర్ అనే కొత్త అధికారి రావడం విశేషం. అయితే జగన్ అక్రమాస్తుల కేసులో ఆఖరి చార్జ్ షీట్ కూడా వేసిన తరువాతనే ప్రస్తుత ఎస్.పి.వెంకటేష్ బదిలీపై వెళ్లబోతున్నట్లు సమాచారం.   ఇక మొన్నతాజాగా సీబీఐ దాఖలు చేసిన రెండు చార్జ్ షీట్లలో మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, భారీ నీటి పారుదల శాఖా మంత్రి పొన్నాల పేర్లు లేకపోవడంతో తెదేపా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర విభజన తరువాత మారబోయే రాజకీయ సమీకరణాలకు ఇది కాంగ్రెస్ చేస్తున్న సన్నాహమని తెదేపా భావిస్తోంది. విజయమ్మ డిల్లీ యాత్ర తరువాతనే ఈ మార్పులు మొదలవడాన్నిఅందుకు కారణంగా పేర్కొంటోంది.   తెదేపా వాదనలు నిజమయితే త్వరలో జగన్మోహన్ రెడ్డి బెయిలుపై విడుదల కావడం ఖాయమని చెప్పవచ్చును. ఏది ఏమయినప్పటికీ మరో ఐదు రోజులలో ఏ సంగతీ తెలిసిపోయే అవకాశం ఉంది. తెదేపా చేస్తున్నఈ తీవ్ర ఆరోపణల నేపద్యంలో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి బెయిలు రాకుండా సీబీఐ అడ్డుపడినా పడవచ్చును.

సమ్మె కొనసాగిస్తాం

  ఈ నెల 16న సీమాంద్ర ఉద్యోగుల సమ్మెకు సంభందించి కోర్టు తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో, ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు తన కార్యాచరణ ప్రకటించారు. కోర్టు తీర్పు ఎలా ఉన్న సమ్మె విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. కేసులకు నిర్భందాలకు భయపడే ప్రసక్తే లేదని తేల్చారు. హైకోర్టుతో వచ్చిన తీర్పు తమకు వ్యతిరేఖంగా ఉంటే ఆ తీర్పును సుప్రిం కోర్టుతో సవాల్‌ చేస్తామన్నారు. ఏపీఎన్జీవో సంఘం నేతలతో కలిసి బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. 16 కోర్టు ఇచ్చే తీర్పు తమకు వ్యతిరేఖంగా వచ్చే అవకాశాలే ఎక్కువన్నారు. హైకోర్టు వద్ద న్యాయవాదులు మధ్య జరిగిన గొడవను ఆయన ఖండించారు. శాంతియుతంగా చేపట్టిన సీమాంద్ర న్యాయవాదుల మానవహారాన్ని తెలంగాణవాదులు అడ్డుకోవడాన్ని ఆయన ఖండిచారు.

మాది సమైఖ్యవాదమే : విజయమ్మ

  తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వెంటనే ఆపేయాలని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షులు వైయస్‌ విజయమ్మ కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండేకు లేఖ రాశారు. సిపియం మినహా అన్ని పార్టీలు విభజనకు అనుకూలంగా ఉన్నాయన్న షిండే వ్యాఖ్యలను ఆమె ఖండిచారు. సిపియంతో పాటు మజ్లిస్‌, వైయస్‌ఆర్‌సిపిలు కూడా విభజనకు వ్యతిరేఖమన్నారు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన అఖిలపక్షంతో పాటు, ప్రదానికి రాసిన లేఖలో కూడా తాము సమైఖ్య గళమే వినిపించామన్నారు విజయమ్మ. విభజన నిర్ణయం వల్ల సీమాంద్ర ప్రాంతం తగలబడుతుందని కేంద్ర చొరవ తీసుకొని పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు. ఏకాభిప్రాయం కుదరక కుండా విభజనపై ముందుకెలా వెళ్తారని ప్రశ్నించిన ఆమె, రాష్ట్రం కలిసున్నపుడే కర్నాటక, మహారాష్ట్రలతో నీటి సమస్యలు ఉన్నాయని విభజన తరువాత సమస్యలు మరింత తీవ్రమవుతాయన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర ఆదాయంలో 50 శాతం హైదరాబాద్ నుంచే లభిస్తున్నదని, విడిపోతే ఉద్యోగాల కోసం సీమాంధ్రులు ఎక్కడికి వెళ్ళాలని ఆమె ప్రశ్నించారు.

ప్రభుత్వానికి షాక్కిచ్చిన సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు

  బుధవారం అర్ధరాత్రి నుండి సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు సమైక్యాంధ్ర కోరుతూ నిరవధిక సమ్మెకు సిద్దం అవడంతో, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విద్యుత్ ఉద్యోగుల సంఘాల నేతలతో కొద్ది సేపటి క్రితం జరిపిన చర్చలు సఫలమయినందున విద్యుత్ ఉద్యోగులు తమ సమ్మెను ఈ నెల 16 వరకు వాయిదా వేసుకొన్నట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. కానీ, విద్యుత్ ఉద్యోగులు మాత్రం ముఖ్యమంత్రి కోరిక మేరకు తమ నిరవధిక సమ్మెను వాయిదా వేసుకొన్నామని, కానీ నేటి అర్ధ రాత్రి నుండి 72గంటల సమ్మె చేయబోతున్నట్లు కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. అయితే ఈ సమ్మె నుండి అత్యవసర సేవలను మినహాయిస్తున్నామని తెలిపారు. కానీ కేంద్రం పార్లమెంటులో తెలంగాణా బిల్లును ప్రవేశపెట్టిన మరుక్షణం నుండే తాము నిరవధిక సమ్మెకు దిగుతామని విద్యుత్ ఉద్యోగుల సంఘాల నేతలు స్పష్టం చేసారు.   సమ్మె వాయిదా పడిందని ఊపిరి పీల్చుకొన్న ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతల ఈ ప్రకటనతో ఉలిక్కిపడ్డారు. ఎటువంటి అత్యవసర పరిస్థితి ఏర్పడినా ఉద్యోగులు అందుబాటులో ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఇప్పటికే విద్యుత్ ఉద్యోగులందరూ తమ అధికారిక మొబైల్ ఫోన్లను, సిం కార్డులను తమ ఉన్నతాదికారులకు వాపసు చేసారు.   ఇంతవరకు అన్నిప్రభుత్వ సంస్థల ఉద్యోగులు చేసినప్పుడు ఏర్పడే ఇబ్బందులను ప్రజలు ఎలాగో ఎదుర్కొంటున్నపటికీ, ఈ రోజు నుండి మొదలయ్యే విద్యుత్ ఉద్యోగుల 72గంటల సమ్మెతో రాష్ట్రం మొత్తం స్తంభించిపోయే ప్రమాదం ఉంది. రాష్ట్రమంతటా ఒకదానికొకటి అనుసంధానమయి ఉండే విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలలో ఏ చిన్నలోపం ఏర్పడినా వాటిని సరిదిద్దేందుకు ఉద్యోగులు అందుబాటులో లేకపోతే మొత్తం గ్రిడ్ కుప్పకూలే ప్రమాదం ఉంటుందని విద్యుత్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.   మరి ఈ విపత్కర పరిస్థితులను విద్యుత్ ఉన్నతాధికారులు అధిగమించడం నిజంగా ఒక అగ్నిపరీక్షేనని చెప్పవచ్చును. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విద్యుత్ ఉద్యోగుల సంఘాల నేతలతో మళ్ళీ రేపు మరోమారు చర్చలు జరిపి, వారి చేత వెంటనే సమ్మె విరమింపజేస్తే తప్ప యావత్ రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో పడక తప్పదు.

హరీష్ రూటే వేరు..!

      రాష్ట్ర విభజన ప్రకటన తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోతుండటం.. సీమాంధ్రలో ఉద్యమం ఎగసిపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర విభజనపై అందరిలోనూ పునరాలోచన మొదలవడం తెలంగాణ నేతల్ని అసహనానికి గురిచేస్తున్నట్లుంది. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా చేసేందుకు కూడా ఒప్పుకోమని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం వ్యాఖ్యానిస్తే .....తెరాస నేత హరీష్ రావు సీమాంధ్ర ప్రాంత ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేశారు. ఉద్యమం విషయంలో సీమాంధ్రుల్లో అనుమానాలు రేకెత్తించి.. ఆందోళనలు విరమింపజేయాలనే ఉద్దేశం ఆయన వ్యాఖ్యల్లో కనిపించింది.     సమ్మె పేరిట పెత్తందారుల కొమ్ముకాస్తున్నారని ఆరోపించిన హరీష్.. పేద ప్రజలు ప్రయాణించే ఆర్టీసీని బంద్ చేసి ట్రావెల్స్ లో అధిక ధరలు వసూలు చేస్తున్నారన్నారు. సీమాంధ్ర పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసేందుకే సీమాంధ్ర ఉద్యమమన్నారు. సీమాంధ్రలో ఉన్న నిరుపేదల కడుపుకొట్టి సమ్మె పేరుతో దోచుకుంటున్నారన్నారు. సీమాంధ్రలో సమ్మె పేరిట గిరిజనులకు వైద్యం అందించే పీహెచ్‌సీలు బంద్ చేశారు తప్ప కార్పొరేట్ వైద్యం ఆగిందా చెప్పాలన్నారు. మొత్తంగా హరీష్ వ్యాఖ్యలు చూస్తే సీమాంధ్ర ప్రజల్లో ఉద్యమం పట్ల సందేహాలు రేకెత్తించాలన్న ఉద్దేశం కనిపిస్తోంది. సామాన్యులకు మద్దతుగా మాట్లాడితే వారు తెలంగాణకు అనుకూలంగా మారిపోతారని హరీష్ అనుకోవడం భ్రమే.

ఢిల్లీ గ్యాంగ్ రేప్: శిక్షపై తీర్పు వాయిదా

      ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసుపై తీర్పు శుక్రవారానికి వాయిదా పడింది. ఈ కేసులో దోషులకు శిక్ష ఖరారుపై సాకేత్ కోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. అనంతరం న్యాయవాది శిక్షపై తీర్పును శుక్రవార౦ మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా వేశారు. దోషులపై ఏ విధమైన జాలి చూపవద్దని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దోషులకు గరిష్ట స్థాయి శిక్ష వేయాలని, వారికి మరణశిక్ష విధించడమే సరైందని అన్నారు. దోషులను కోర్టుకు బుధవారం ఉదయంతీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా దోషులుగా తేలినవారిలో ఒకతను తాను నిర్దోషినని గట్టిగా అరిచాడు. రెండు సార్లు అతను గట్టిగా అరిచి ఆ మాట అన్నాడు. దోషులకు మరణశిక్ష పడుతుందని ఆశిస్తున్నట్లు, తమకు భారత న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని నిర్భయ తండ్రి అన్నారు.

జగన్, చంద్రబాబు విభజనకే మొగ్గు

      వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ లు రాష్ట్ర విభజనకే మొగ్గుచూపుతున్నాయని రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి శైలజానాథ్ అన్నారు. అఖిలపక్షంలో తెలంగాణకు అనుకూలమని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సమన్యాయం అని, సమైక్యం అని నాటకాలు ఆడుతోంది. సమన్యాయం అంటే విభజించమనే అర్ధం కదా ? సమైక్యాంధ్ర కోసం తాను విభజన వైఖరిని వెనక్కి తీసుకున్నానని చంద్రబాబు అనడం లేదని ఆయన అన్నారు. రాష్ట్రం రావణకాష్టంలా మండుతుంటే ఇప్పుడు అధికారం ఇవ్వండి ఆరునెలల్లో రాష్ట్రాన్ని మారుస్తానంటూ చంద్రబాబు నాయుడు అంటున్నారని రాష్ట్ర మంత్రి శైలజానాథ్ విమర్శించారు. హైదరాబాద్‌లో ఎపి ఎన్జీవోల సభను చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావుకు వణుకు పుట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నేతలుగా తాము విభజనను ఒప్పుకోవడం లేదని, దీని మీద ఎటువంటి ప్రత్యామ్నాయాలు కోరుకోవడం లేదని, ప్రతిపక్ష పార్టీలు కూడా ఇదే అభిప్రాయం చెప్పాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. అసేంబ్లీలో తెలంగాణ తీర్మానం వచ్చినప్పుడు దానిని ఓడిస్తామని, ప్రతిపక్షాలు తమ రాజీనామాల ఆమోదం కోరుతుండడం అనుమానాలకు తావిస్తుందని ఆయన అన్నారు.

జగన్ కేసులో శ్రీనివాసన్ గుగ్లీలు

  భారత క్రికెటర్లు మైదానంలో ఆడితే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు శ్రీనివాసన్ తన ఆఫీసులో కూర్చొనే ఆట నడిపిస్తాడని, కొద్ది నెలల క్రితం ఆయన అల్లుడు గురునాథ్ మెయప్పన్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయినప్పుడు జనాలకి తెలిసింది. ఏమయినప్పటికీ, ఆయన అల్లుడి గిల్లుడికి శ్రీనివాసన్ పదవికి గోవిందా గోవిందా అనుకోవలసి వచ్చింది. అయితే కేవలం ‘ఇండియాలో మాత్రమే ఏదయినా సాధ్యం’ అనే సూత్రం ప్రకారం, స్పాట్ ఫిక్సింగ్ కధ కంచికి, అందులో అరెస్టయిన క్రికెటర్స్ బెయిలుపై ఇంటికి చేరుకోగలిగారు.   షరా మామూలుగానే మన జనాలు ఆ టాపిక్ గురించి ఎప్పుడో మరిచిపోయి ఏనాడో మరో లేటెస్ట్ టాపిక్ కి జంప్ అయిపోయారు. బహుశః జనాల నాడిని సీబీఐ అర్ధం చేసుకొన్నట్లు మరొకరు అర్ధం చేసుకోలేరేమో! అందుకేనేమో శ్రీనివాసన్ పేరుని మళ్ళీ జగన్ అక్రమాస్తుల కేసులో నిన్నసీబీఐ కోర్టులో దాఖలు చేసిన చార్జ్ షీటులో జోడించి కేసుకి మంచి ఊపు, ట్విస్ట్ ఇచ్చింది.   బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న శ్రీనివాసన్, ఇండియా సిమెంట్స్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టరుగా కూడా. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయన కంపెనీకి సున్నపు గనులు, వాటిని త్రవ్వుకోవడానికి అనుమతులు, కంపెనీకి అవసరమయిన నీటిని విరివిగా వాడుకొనేందుకు అనుమతులు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఆయన కంపెనీ, జగన్మోహన్ రెడ్డికి చెందిన జగతీ పబ్లికేషన్స్ మరియు భారతి సిమెంట్స్ కంపెనీలలో రూ.140కోట్లు (అక్షరాలా నూట నలబై కోట్లు మాత్రమే) పెట్టుబడులు పెట్టడాన్నితప్పుబడుతూ, జగన్ అక్రమాస్తుల కేసులో సదరు శ్రీనివాసన్ గారిని 3వ ముద్దాయిగా పేర్కొంటూ సీబీఐ నిన్న చార్జ్ షీట్ దాఖలు చేసింది.   ఆయనని సీబీఐ గత ఏడాది రెండు సార్లు ఇదే విషయమై విచారించినప్పటికీ, బీసీసీఐకి ఆయన అల్లుడు పెట్టిన స్పాట్ ముందు ఇవేవీ జనాల కళ్ళకి ఆనలేదు. ఇప్పుడు వేరే కధలేవీ నడవడం లేదు గనుక, మరో కొత్త టాపిక్ వచ్చి పడేవరకు జనాలు దీనిపై కొంచెం ఆసక్తి చూపించే ప్రమాదం ఉంది.

సమైక్యమా, పార్టీయా? కిరణ్ కుమార్ రెడ్డి ప్రాధాన్యం దేనికి

  తన సమైక్యవాదనలతో ఇంతవరకు రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ అధిష్టానాన్నిఎదిరిస్తున్నఏకైక మొనగాడుగా సీమాంధ్రలో పేరు సంపాదించుకొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని నిన్నఆయన క్యాబినెట్ లోని తెలంగాణా మంత్రులు కలిసి, ఆయన పక్షపాత వైఖరికి పద్దతికి నిరసన తెలియజేసినప్పుడు, ఇదివరకు తెలంగాణా ఉద్యమాలు జోరుగా జరుగుతున్నసమయంలో యావత్ రాష్ట్రానికి మంత్రులుగా వ్యవహరించవలసిన వారు ఏవిధంగా తెలంగాణా తరపున పోరాడారో గుర్తు చేసి చురకలు వేసారు. అదేవిధంగా నేడు సీమాంధ్ర ప్రజల అభీష్టం మేరకు పోరాడుతున్న అక్కడి మంత్రులను తప్పు పట్టలేమని అన్నారు. అయితే, తాను వ్యక్తిగతంగా సమైక్యవాదినయినప్పటికీ, తానూ ఎవరికీ వెనుక నుండి సహాయపడటం లేదని, తన సమైక్యవాదానికి అర్ధం తాను సీమాంధ్రలో జరుగుతున్నఉద్యమాలను వెనుక నుండి నడిపిస్తున్నానని భావించడం తప్పని, యావత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న తనకు రాష్ట్ర ప్రజలందరూ కూడా సమానమేనని ఆయన బదులిచ్చారు.   అంతే గాక ఈ రోజు ఇరుప్రాంతల నేతల మధ్య సమన్వయం సాధించేందుకు, ఈరోజు సాయంత్రం ఆయన ఒక విందు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇక మీడియాలో వస్తున్న వార్తలు నిజమనుకొంటే, తెదేపా, వైకాపాల దాడితో నోరెత్తలేకపోతున్నతన పార్టీని కాపాడుకొనేందుకు ఆయన త్వరలో సీమాంధ్రలో పర్యటించనున్నారు. రెండు ప్రాంతాలలో పార్టీ ప్రయోజనాలను కాపాడాలని ఆయన స్వయంగా ప్రయత్నించడమే కాకుండా, అదే విషయాన్నిఇరు ప్రాంతాల నేతలకు ఆయన చెప్పబోతున్నారు.   ఇదే నిజమయితే, ఇంతకాలంగా ఆయన రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ పదవికి, పార్టీకి రాజీనామా చేసి సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు పెట్టబోయే సరికొత్త రాజకీయ పార్టీకి సారధ్యం వహిస్తారనే మీడియాలో వస్తున్నవార్తలు కూడా కేవలం పుకార్లుగానే భావించవచ్చును. కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా, భాద్యతాయుతమయిన పదవిలో ఉన్నకారణంగా ఆయన సరయిన విధంగానే వ్యవహరిస్తున్నట్లు భావించవచ్చును.   కానీ, పార్టీని రక్షించుకోవడం కోసం ఆయన తన సమైక్యవాదాన్ని పక్కన పెడితే, ఇంతకాలంగా ఆయన చేస్తున్న సమైక్యవాదం అంతా భూటకమేనా? అనే ప్రశ్న తలెత్తుతుంది. ఏమయినప్పటికీ, కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి కత్తి మీద సాము వంటిదేనని చెప్పక తప్పదు.

కాంగ్రెస్ పై మోడీ సెటైర్లు

      బీజీపీ పార్టీ ఎన్నికల ప్రచార సారథి, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సభలో ఆయన కాంగ్రెస్ పార్టీ అవినీతిపై...ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పైనా విరుచుకు పడ్డారు. కాంగ్రెస్ పార్టీకి అవీనితి దినచర్యగా మారిపోయిందని అన్నారు. మన దేశంలో అవీనితిని తరిమేయాలంటే కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి తరిమేయలన్నారు.   ఇప్పటి కాంగ్రెస్ కేవలం ఒక కుటుంబానికే పరిమితమని, దేశంలోని చిన్నారుల కోసం ఆ పార్టీ కొత్త ఎబిసిడి పుస్తకాన్ని రాసిందన్నారు. 'ఎబిసిడి'లను కొత్తగా విపులీకరించారు...ఎ అంటే ఆదర్శ్ అక్రమాలు, బి అంటే బోఫోర్స్ కుంభకోణం, సి అంటే బొగ్గు, కామన్వెల్త్ కుంభకోణాలు, డి అంటే అల్లుడి కుంభకోణం అని మోడీ ఎద్దేవా చేశారు.   దేశం కోసం సరైన నిర్ణయాలు తీసుకోలేని, ఎటువంటి బాధ్యత లేని ప్రభుత్వం పదేళ్లుగా అధికారంలో కొనసాగుతోందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వ వైఫల్యం కారణంగా రూపాయి ఆస్పత్రిలో చేరిందని, ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందన్నారు.

పొన్నాల, సబితలకు రిలీఫ్

      వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో మంత్రి పొన్నాల లక్ష్మయ్య, సబిత కు ఊరట లభించింది. దాల్మియా సిమెంట్స్ వ్యవహారంలో సబితపై అభియోగాలు నమోదైనప్పటికీ.. పెన్నా కేసులో మాత్రం ఆమెకు ఊరట లభించింది. వైఎస్ హయాంలో ఇండియా సిమెంట్స్‌కు అడ్డగోలుగా జలదానం చేసిన అంశానికి సంబంధించి... పొన్నాలను సీబీఐ ప్రశ్నించినప్పటికీ, నిందితుడిగా చేర్చకుండా పక్కన పెట్టింది. జగన్ అక్రమాస్తుల కేసులో మంగళవారం మూడు చార్జిషీట్లు దాఖలు చేసింది.     ఇండియా సిమెంట్స్, పెన్నా సిమెంట్స్, భారతీ సిమెంట్స్‌లకు సంబంధించి జరిగిన అవకతవకలపై మూడు వేర్వేరు చార్జిషీట్లను సీల్డు కవర్లలో సీబీఐ ప్రత్యేక కోర్టుకు అందించారు. ఎప్పట్లాగానే మూడు కేసుల్లోనూ మొదటి నిందితుడిగా జగన్ పేరును, రెండో నిందితుడిగా విజయ సాయిరెడ్డి పేరును చేర్చారు. ఇండియా సిమెంట్స్ పెట్టుబడులకు సంబంధించి.. బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌పై సీబీఐ అభియోగాలు మోపింది. జగన్‌ను మినహాయిస్తే.. మూడు చార్జిషీట్లలో ఆయనొక్కడే బిగ్‌షాట్ కావడం గమనార్హం. ఇండియా సిమెంట్స్ కేసులో ఐఏఎస్‌లు శామ్యూల్, ఆదిత్యనాథ్ దాస్‌లను సీబీఐ నిందితులుగా చేర్చింది. వీరిపై ఇదే కేసులో గతంలోనూ అభియోగాలు నమోదయ్యాయి.

ముజఫర్‌నగర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత

  ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌ నగర్ లో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. గత 5 రోజులుగా అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు వర్గాలను అదుపు చేసేందుకు  కేంద్ర బలగాలు తీవ్రంగా కృషి చేస్తున్నాఅల్లర్లు అదుపు చేయడం మాత్రం వారి వల్ల కావటం లేదు. ఇప్పటికే ఈ ఘటనలో దాదాపు 45 మందికి పైగా మరిణించారు.      కేంద్ర బలగాలు , సీఆర్ఫీఎఫ్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సహా సైన్యం రంగంలోకి దిగింది.  ముజఫర్ నగర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కవాతు నిర్వహించింది. ముందు జాగ్రత్తగా చర్యగా ముజఫర్‌నగర్‌ జిల్లాలోని అన్ని ఆయుధాల లైసెన్స్‌లను ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. ఇప్పటికే 300 మందిని అదుపులోకి తీసుకున్న ప్రభుత్వం మరికొంత మంది అరెస్ట్‌కు రంగం సిధ్దం చేసింది.       యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్  అల్లర్లపై ప్రత్యేకం సమావేశం అయ్యారు. వెంటనే పరిస్ధితిని సాదారణ స్థితికి తీసుకురావటంతొ పాటు నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామి ఇచ్చారు. కేంద్ర హోంశాఖ  సైతం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.