చంద్రబాబు సీమాంధ్ర వైపు మరలుతున్నారా
ఎట్టకేలకు చంద్రబాబు తమ పార్టీ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన సంగతిని నిన్నతన ఆత్మగౌరవ సభలో ప్రస్తావించారు. అదే సమయంలో ఆయన మరికొన్ని ఆసక్తికరమయిన అంశాలు కూడా ప్రస్తావించారు.
తమ పార్టీ మొదట సమైక్యాంధ్రనే కోరుకొందని, అయితే తెలంగాణా ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని, “వారి సమస్యలను పరిష్కరించాలని” కోరుతూ కేంద్రానికి లేఖ ఇచ్చామని, అయితే దానర్ధం తెలంగాణ ప్రజలకు న్యాయం చేయమంటే, సీమాంధ్ర ప్రజలకు అన్యాయం చేయమని కాదని అన్నారు. ఇరు పక్షాల వారితో చర్చించి, ఇద్దరికీ న్యాయం చేయాలని అన్నారు. అంటే, ఇరుపక్షాలకి ఆమోదయోగ్యంగా చేస్తే విభజనకు తమకు అభ్యంతరం లేదని ఆయన చెపుతున్నట్లు భావించవలసి ఉంటుంది.
కానీ, మళ్ళీ అంతలోనే ఆయన ‘తెలుగుదేశం పార్టీ సీమాంధ్రుల ప్రతినిధిగా ఉంటుందని, వారికి అన్యాయం జరిగితే తిరగబడతానని’ కేంద్రాన్ని హెచ్చరించడం చూస్తే ఆయన సీమాంధ్ర తరపున వఖల్తా తీసుకొని మాట్లాడుతున్నట్లు కనిపిస్తారు.
ఆయన చెప్పిన మాటలను బట్టి తెదేపా సమైక్యాంధ్ర కొరుకొంటోందని, కానీ తెలంగాణా ఉద్యమాల కారణంగా తెలంగాణాకు అనుకూలంగా లేఖ ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. తమ పార్టీ ఇచ్చిన లేఖలో కేవలం “వారి సమస్యలను పరిష్కరించమని కేంద్రాన్నికోరినట్లు” ఆయన చెప్పడం గమనిస్తే, తాము “వారి సమస్యలను పరిష్కరించమని కోరామే తప్ప ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు చేయమని ఎన్నడూ కోరలేదని అందువల్ల రాష్ట్ర విభజనకు తమ పార్టీ కారణం కానే కాదని ఆయన తన లేఖకు సరికొత్త అర్ధం చెపుతున్నారు.
ఆయన తన వాదనను సమర్దించుకొంటూ 1999లో రాజశేఖర్ రెడ్డే స్వయంగా తెలంగాణా కోసం శాసనసభ్యులను డిల్లీకి పంపారని చెప్పడం చూస్తే, రాష్ట్ర విభజన విషయంలో లేఖ ఇచ్చిన కారణంగా తెదేపాను సీమాంద్రా ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని చూస్తున్న వైకాపా పైకే ఆ నేరాన్ని(?) నేట్టివేయాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు అర్ధమవుతోంది.
కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లు ఈవిధంగా ఆయన వ్యవహరిస్తున్న తీరు వలన ముందుగా తెదేపాయే నష్టపోతుంది. ఆయన తమ పార్టీ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుని కోరుకొంటోందో, లేక వ్యతిరేఖిస్తోందో ఇప్పటికీ స్పష్టంగా చెప్పకపోవడం వలన రెండు ప్రాంతాలలో ప్రజలు కూడా ఆయనను అనుమానించే అవకాశం ఉంది. ఇదే విషయంలో వైకాపా నాయకత్వం చాలా దైర్యంగా తెలంగాణాను వదులుకొని విభజనను వ్యతిరేఖిస్తూ సమైక్య ఉద్యమాలు మొదలుపెట్టగానే ఆ పార్టీ పరిస్థితిలో ఒక్కసారిగా గణనీయమయిన మార్పు వచ్చింది. అయితే, తెలంగాణాలో బలంగా లేని కారణంగా వైకాపా ఆనిర్ణయం తీసుకొనగలిగింది. కానీ మూడు దశాబ్దాలుగా తెలంగాణాతో బలమయిన అనుబంధం పెనవేసుకొన్న తెదేపా కూడా దైర్యంగా అటువంటి నిర్ణయం తీసుకోవడం కష్టం.
కానీ ఆయన 'తమ పార్టీ సీమాంధ్రుల ప్రతినిధిగా ఉంటుందని', వారికి అన్యాయం జరిగితే తిరగబడతానని హెచ్చరించడం చూస్తే ఆయన మళ్ళీ సమైక్యాంధ్ర వైపు మరలుతున్నట్లు కనబడుతోంది. బహుశః తెదేపా కూడా తెలంగాణాను వదులుకోవడానికి మానసికంగా సిద్దపడుతోందనుకోవచ్చును.
తెలంగాణా ప్రాంతంలో పార్టీకి బలమయిన క్యాడర్ ఉన్నపటికీ, మారిన రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్-తెరాసా చేతులు కలిపితే అక్కడ నెగ్గుకు రాలేమని, కనీసం సీమాంధ్ర ప్రాంతంలోనయినా పూర్తి ఆధిఖ్యత సంపాదించగలిగితే మంచిదనే ఆలోచనతో ఆయన రెండు ప్రాంతాలలో విజయావకాశాలను బేరీజు వేసుకొని, తమకు పూర్తి పట్టు, మద్దతు ఉన్నసీమాంధ్ర ప్రాంతం వైపు మొగ్గు చూపుతున్నట్లు అర్ధమవుతోంది.
మూడు దశాబ్దాలుగా ఎంతో శ్రమపడి తెలంగాణాలో నిర్మించుకొన్న పార్టీని చంద్రబాబు అంత తేలికగా వదులుకోకపోవచ్చును. అయితే, ఆయన ప్రస్తుతం ఆత్మగౌరవ యాత్ర సందర్భంగా చేస్తున్న ప్రసంగాలు మాత్రం ఆయన తెలంగాణా ను వదులుకొనే అవకాశాలే ఎక్కువ అని సూచిస్తున్నాయి.