రాష్ట్ర విభజనతో తెదేపాలో కూడా విభజన
posted on Sep 6, 2013 @ 10:51PM
రాష్ట్ర విభజన యొక్క తీవ్ర పరిణామాలు అన్నిటికంటే తెలుగుదేశంపైనే చాలా ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. వైకాపా తెలంగాణాను వదులుకొని సమైక్య నినాదం ఎత్తుకోవడంతో తెదేపాకు మరిన్నిసమస్యలు ఎదురయ్యాయి. వైకాపా సమైక్యనాదంతో సీమాంద్రాలో దూసుకుపోతుంటే, విభజనకు అంగీకరిస్తూ లేఖ ఇచ్చినపటికీ, పార్టీని కాపాడుకోవడానికి చంద్రబాబు తప్పని పరిస్థితుల్లో సమైక్య రేసులో పాల్గొనవలసి వస్తోంది.
అందువల్ల పార్టీకి తెలంగాణాలో తీరని నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ ఏమీ చేయలేని అసహాయత. తమ పార్టీకి ఆ రెండు పార్టీలు ఇటువంటి పరిస్థితి కల్పించినందుకే చంద్రబాబు కాంగ్రెస్, వైకాపాలపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. సింహ గర్జనలు, భూస్థాపితాలు అంటూ మాట్లాడుతున్నారు.
ఆ పార్టీకి చెందిన తెలంగాణానేతలు పార్టీ పరిస్థితిని అర్ధం చేసుకొని ఇంత కాలం సంయనం పాటించినప్పటికీ తప్పని పరిస్థితుల్లో నోరు విప్పవలసి వచ్చింది. తెదేపా తెలంగాణా ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ రేపు ఎపీఎన్జీవోలు తలపెట్టిన సభను వ్యతిరేఖిస్తున్నామని, అదేవిధంగా తెలంగాణా రాజకీయ జేఏసీ పిలుపునిచ్చిన 24గంటల హైదరాబాద్ బంద్ కు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని ప్రకటించారు.
తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా లేఖనిచ్చిన సంగతిని మరచి, సమైక్యాంధ్ర కోసం గర్జిస్తు, నేడో రేపో, ఆయన కూడా పూర్తి సమైక్యవాదిగా మారితే తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన వారిలో పెరుగుతోంది. అందువల్ల ఇప్పటికయినా తాము మౌనం వీడకపోతే, రేపు తెలంగాణా లో కాలుకూడా పెట్టలేని పరిస్థితి ఎదురవుతుందనే భయం వారిలో మొదలయింది. అందువల్లే రేపటి బంద్ కు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.
ఇక ఊహించినట్లుగానే, ఆ పార్టీకి చెందిన సీమాంధ్ర నేతలు అందుకు విరుద్దంగా మాట్లాడారు. పార్టీలో చంద్రబాబుది ఒకదారి, సీమాంధ్ర నేతలది మరొక దారి, తెలంగాణా నేతలది ఇంకొక దారి అన్నట్లు తయారయింది. మరి ఈ పరిస్థితులను చంద్రబాబు చక్కదిద్దుకొని ఆయన చెపుతున్నట్లు కాంగ్రెస్-వైకాపా-తెరాసాలు ఆడుతున్న ఈ రాజకీయ చదరంగంలో నెగ్గుకొస్తారో లేక ఆటలో కూర్చొనక ముందే ఓటమి అంగీకరించి తప్పుకొంటారో త్వరలోనే తేలిపోతుంది.