రాష్ట్ర విభజనతో ఎవరికి లాభం

  తెలంగాణా రాష్ట్ర ఏర్పడటంతోనే కేసీఆర్ తన వద్దనున్న మంత్రదండం తిప్పిఅక్కడి ప్రజల సమస్యలన్నిటినీ, ఆ ప్రాంతం వెనకబాటుతనాన్ని చిటికలో మాయం చేసి పడేస్తానని ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతునారు.   ఆయన, తెరాస పార్టీ నేతలు నిజంగా తెలంగాణా ప్రజల సంక్షేమం కోరేవారయి ఉంటే తమకున్న రాజకీయ పరపతితో ఫ్లోరోసిస్ వ్యాధులతో సతమవుతున్న నల్గొండ ప్రజల కష్టాలను తీర్చగలిగేవారు. అర్ధాకలితో మాడుతూ పత్తి పొలాలలోపనిచేస్తూ తమ బాల్యం బుగ్గిపాలు చేసుకొంటున్నమహబూబ్ నగర్ జిల్లా బాలలను ఆదుకొనేవారు. రెక్కాడితే తప్ప డొక్కాడని బీడీ కార్మికుల జీవితాలకు వెలుగు చూపగలిగేవారు. సిరిసిల్లా నేతన్నల కష్టాలను తీర్చగలిగేవారు. ఉన్నఇల్లు, చివరికి భార్య మెడలో పుస్తెలు కూడా అమ్ముకొని, అప్పులు చేసి పొట్ట చేతితో పట్టుకొని గల్ఫ్ దేశాలకు పోయి నానా కష్టాలు పడుతున్నకరీంనగర్ జిల్లా ప్రజలకు ఉపాధి చూపగలిగేవారు. కానీ, తెరాస అటువంటి గొప్ప ఆలోచనలు ఏనాడు చేయలేదు. చేసి ఉంటే ఇన్ని సమస్యలు ఉండేవి కావు. సమస్యలు లేకపోతే ప్రజలు దాని మాటలు వినేవారు కారు.   అందుకే వాటిని అలాగే గాలికొదిలి తెలంగాణా ప్రజలను ఉద్దరించేందుకు కేసీఆర్ తనకు తానే స్వయంగా కిరీటం పెట్టుకొని, మంచి వాక్పటిమ గల తన కుటుంబ సభ్యులనే సైనికులుగా చేసుకొని ఉద్యమాలు మొదలుపెట్టి వందలాది యువకుల జీవితాలను బలి తీసుకొని, ఇంతవరకు ఏ కాంగ్రెస్ పార్టీని నోటికి వచ్చినట్లు తిట్టారో ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీతో కలిసి అధికారం పంచుకొనేందుకు ఆఖరి ఆట మొదలుపెట్టారు.    స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా సీమాంధ్ర నేతలు, వ్యాపారులు తెలంగాణా ప్రజలని దోపిడీ చేసారని వాదిస్తున్నతెరాస ఇప్పుడు చేస్తున్నపనేమిటి? మరి ఇంత కాలంగా తెలంగాణా నుండి ఎన్నికవుతున్న కాంగ్రెస్, తెదేపా, తెరాస, బీజేపీ శాసనసభ్యులు, యంపీలు, మంత్రులు, కేంద్ర మంత్రులు తెలంగాణకు ఇంత అన్యాయం జరుగోతోందని తెలిసి మరి ఎందుకు అడ్డుకోలేదు? తెలంగాణా ప్రజల సమస్యలను ఇన్నేళ్ళలో ఎందుకు తీర్చలేకపోయారు?వారిని తెలంగాణా ప్రజల సంక్షేమం కోసం, ఆ ప్రాంత అభివృద్ధి పాటుపడకుండా ఎవరు అడ్డుకొన్నారు? అడ్డుకొని ఉంటే ఆనాడే వారు ఎందుకు గొంతెత్తలేదు?ఎందుకు పోరాడలేదు?   ఈ ప్రశ్నలన్నీ వట్టి అమాయక ప్రశ్నలుగా కొట్టిపారేయవచ్చును. కానీ, కాంగ్రెస్, తెరాస నేతలలో, ఇంకా చెప్పాలంటే తెలంగాణా నేతలలో తమ ప్రజల, తమ ప్రాంతం పట్ల చిత్తశుద్ది లేకపోవడం వలనే నేడు ఈ దుస్థితి ఏర్పడింది తప్ప వేరేవరి దోపిడీ కారణంగా మాత్రం కాదు.   ఇన్నేళ్ళలో అక్కడి రాజకీయ నేతలు, ఉద్యమ నేతలు పది తరాలకు సరిపడేంత ఆస్తులు సంపాదించుకొని, త్వరలో అధికారం కూడా దక్కించుకోబోతుంటే, వారి వెనుక నడచిన ప్రజల పరిస్థితి మాత్రం ఎక్కడ గొంగళి అక్కడే అన్నట్లుంది, ఉంటుంది కూడా. ప్రజల త్యాగాల ఫలితంగా ఏర్పడే కొత్త రాష్ట్రంలో అధికారం దక్కించుకొనేందుకు అర్రులు చాస్తున్నఈ రాజకీయ నేతలు రేపు తెలంగాణా రాష్ట్రం ఏర్పడగానే ఒక్కసారిగా మారిపోతారని అనుకొంటే అంతకంటే వెర్రి ఆలోచన మరొకటి ఉండదు.   ఇన్నేళ్ళుగా దేశంలో, వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వాలు వెలగబెడుతున్నకాంగ్రెస్ పార్టీ పాలనలో అక్కడి ప్రజల పరిస్థితి ఎలా ఉందో, రేపు ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలు ఏర్పడిన తరువాత కూడా అలాగే ఉంటుంది. రాష్ట్ర విభజన జరగగానే ఏ అద్భుతాలు జరిగిపోవు. కేవలం రాజకీయ సమీకరణాలు మారుతాయి, సదరు నేతల వ్యాపారాలు మరింత విస్తరిస్తాయి. తద్వారా వారు మరిన్ని ఆస్తులు కూడబెట్టుకొంటారు. కానీ ఇరుప్రాంతల ప్రజల పరిస్థితి మాత్రం ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లు ఉంటుంది. పైగా కొత్తగా మరికొన్ని సమస్యలు కూడా ఎదుర్కోకతప్పదు.

స్పాట్ ఫిక్సింగ్ క్రికెట‌ర్లపై వేటు

  స్పాట్ ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న భార‌త్ క్రికెటర్లపై బిసిసిఐ కొర‌డా జులిపించింది. ఐపియ‌ల్ మ్యాచ్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి అరెస్ట్ అయిన శ్రీశాంత్, అంకిత్ చ‌వాన్‌, అజిత్ చండిలా.అమిత్ సింగ్‌ల‌పై బిసిసిఐ నిషేదం విధించింది. అయితే తాము ఫిక్సింగ్‌కు పాల్పడ‌టంతో పాటు ఇత‌ర‌ల‌ను ప్రొత్సహించ‌టం అస‌భ్యంగా ప్రవ‌ర్తించ‌టం లాంటి ఆరోప‌ణ‌లు ఎదుర్కొటున్న శ్రీశాంత్‌, అంకిత్ చ‌వాన్‌ల‌పై జీవిత‌కాల నిషేదం విధించిన బిసిసిఐ, అమిత్ సింగ్‌ను ఐదేళ్ల పాటు అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి నిషేదించింది. అలాగే మ‌రో క్రికెట‌ర్ సిద్దార్ధ త్రివేదిపై ఏడాది నిషేదం విధించింది. బిసిసిఐకి చెందిన క్రమ‌శిక్షణ క‌మిటీతో పాటు ఇత‌ర క‌మిటీలు ఈ మేర‌కు శుక్రవారం నిర్ణయం తీసుకున్నాయి.

మ‌ళ్లీ పేలిన పెట్రోబాంబ్‌

  కేంద్ర తీసుకున్న నిర్ణయం మ‌రోసారి సామ‌న్యుడి వెన్ను విరిచింది. పెట్రోలు ధ‌ర‌ను నిర్ణయించుకునే అధికారం ఆయిల్ కంపెనీల‌కే అప్పగించిన ప్రభుత్వం ధ‌ర‌లు నియంత్రించ‌క‌పోవ‌డంతో ఆయిల్ కంపెనీలు ఇష్టారాజ్యంగా ధ‌ర‌ల‌ను పెంచేస్తున్నాయి. ధ‌ర‌ను పెంచి 15 రోజుల కూడా గ‌డ‌వక ముందే ఇప్పుడు మ‌రోసారి పెట్రో బాంబును పేల్చాయి ఆయ‌ల్ కంపెనీస్‌. లీటర్ పెట్రోల్ ధరను రు.1.63 పెంచుతూ దేశీయ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఓసీ) నిర్ణయం తీసుకుంది. దీనికి వ్యాట్ అద‌నంగా ప‌డ‌టంతో 2 రూపాయ‌ల‌కు పైగా పెట్రోలు రేటు పెరిగే అవ‌కాశం ఉంది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లొ రూపాయి విలువ హెచ్చు త‌గ్గుల‌తో పాటు క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు పెర‌గ‌టంతో పెట్రో రేటు పెంచ‌క త‌ప్పడం లేదంటున్నాయి ఆయిల్ కంపెనీలు. దీంతో భార‌త్‌లోని ప్రదాన న‌గ‌రాల్లో ఇప్పటికే 8 రూపాయ‌ల‌కు పైగా ఉన్న లీట‌ర్ పెట్రోలు ధ‌ర ఈ అర్ధరాత్రి నుంచి మ‌రో రెండు రూపాయ‌లు పెర‌నుంది.

మోడీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించిన బీజేపీ

  కొద్ది సేపటి క్రితం డిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని పార్టీ ప్రధాని అభ్యర్ధి గా ప్రకటించింది. ఇంతకాలంగా నరేంద్ర మోడీని తమ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించడానికి వెనకాడుతున్నబీజేపీని, “తనకు ప్రధాని పదవిపై ఆశలేదని, 2017 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగానే కొనసాగాలనుకొంటున్నాననే ఒక చిన్న ప్రకటనతో, కేవలం పది రోజుల్లోనే పార్టీచేత ప్రధాని మంత్రి అభ్యర్ధిగా ప్రకటింపజేసుకోవడం ఆయన రాజకీయ చతురతకి ఒక చిన్న నిదర్శనం అయితే, ప్రధాని పదవిపై ఆశలేదని చెప్పడం ద్వారానే ఆయన ప్రధాని అభ్యర్ధిగా ఎంపిక అవడం మరో విశేషం.   ఇక గత ఆరేడు నెలలుగా పార్టీలో తన అభ్యర్దిత్వంపై జరుగుతున్న వాదోపవాదాలకు ఆయనే స్వయంగా చొరవ తీసుకొని ఒక చిన్న ఉపాయంతో ఇంత తేలికగా తెర దించడం కూడా చెప్పుకోవలసిన విశేషమే. అలాగని, ఈ ప్రకటనతో పార్టీలో అద్వానీ వంటి తన వ్యతిరేఖులు చేతులు కట్టుకొని చూస్తూ కూర్చోరని ఆయనకీ తెలుసు. అయితే ప్రధాని పదవి ఆశిస్తున్న వ్యక్తి ఆ మాత్రం పరీక్షలు తట్టుకొని నిలిచి తన నాయకత్వ లక్షణాలను, పోరాట పటిమను కూడా చాటుకోవడానికి ఇటువంటి పరీక్షలు కూడా చాలా అవసరమే.   తనను పార్టీ ప్రధాని అభ్యర్ధి గా ప్రకటింపజేసుకోవడంతో ఆయన తొలి పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఇక రేపటి నుండి పార్టీలోపల, బయట ఎదురయ్యే విమర్శలకు, పరీక్షలకు ఆయన సిద్ధంగా ఉండక తప్పదు. ముఖ్యంగా రాహుల్ గాంధీని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టి చూసుకోవాలని తపిస్తున్నసోనియమ్మకు సైంధవుడిలా అడ్డుపడుతున్నమోడీని సోనియా-రాహుల్ భజన బృంద సభ్యులు ఎన్నటికీ క్షమించలేరు. గనుక రేపటి నుండి మోడీ వారి ఆగ్రహానికి గురికాక తప్పదు. వారు పెట్టే పిల్లి శాపాలను భరించక తప్పదు.

ఆపరేషన్ కిరణ్ సర్కార్

   క్రమంగా రాష్ట్ర విభజన అనివార్యమని తేలుతున్నతరుణంలో దానిని వ్యతిరేఖిస్తున్నముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరియు సీమాంధ్ర మంత్రులు ఇప్పుడు ఏమి చేయబోతారనే ప్రశ్న తలెత్తుతోంది. సీమాంధ్ర ప్రజలు, ఏపీ ఎన్జీవోలు సమైక్యాంధ్ర కోరుతూ నానాటికి ఉద్యమం తీవ్రతరం చేస్తుండగా, వారికి తాము ఏవిధంగా జవాబు చెప్పుకోవాలని ఆవేదన చెందుతున్నారు. ఇక సీమాంద్రాకు చెందిన కేంద్ర మంత్రులయితే రాష్ట్రానికి తిరిగి రావడానికి కూడా భయపడుతూ డిల్లీలోనే కాలక్షేపం చేస్తున్నారు. ఇటీవల డిల్లీ వెళ్ళిన శైలజానాథ్ తదితరులకు త్వరలో హోంశాఖ తెలంగాణా నోట్ కేంద్ర మంత్రి మండలి ఆమోదానికి పంపుతున్న సంగతి తెలుసుకొని కంగు తిన్నారు. ఆ తరువాత తెలంగాణా ఏర్పాటుకోసం రాష్ట్ర శాసనసభలో బిల్లు ప్రవేశ పెట్టినప్పుడు దానిపై సభలో చర్చజరుగుతుంది తప్ప ఓటింగ్ లేకుండా చేసేందుకు, కేంద్రం ముందుగానే స్పీకర్ నాదెండ్ల మనోహర్ కి అందుకు తగిన సూచనలు ఇచ్చింది.   అందువల్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బిల్లుపై చర్చ జరిగిన తరువాత, సభలోనే రాజీనామా చేసి, సమైక్యవాదిగా బయటకు రావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఆయన పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేఖించినప్పటికీ అడ్డుకోబోవడం లేదు గనుక పార్టీ ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉపేక్షించవచ్చును. ముఖ్యమంత్రితో బాటే మిగిలిన సీమాంధ్ర మంత్రులు, శాసనసభ్యులు అందరూ కూడా రాజీనామాలు చేసే అవకాశం ఉంది గనుక, అంతకంటే ముందే కేంద్రం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి శాసనసభను నిద్రాణ స్థితిలో ఉంచి, విభజన ప్రక్రియ వేగవంతం చేసే అవకాశం ఉంది.   ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన వెనుకనే మిగిలిన సీమాంధ్ర మంత్రులు ప్రజలలోకి వచ్చి తాము ఆఖరి నిమిషం వరకు పోరాడి ఓడిపోయామని, ఇక ‘సమన్యాయం’ కోసం పోరాటం మొదలుపెడతామని ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేయవచ్చును. అప్పటికి ఏపీ యన్జీవోలు కూడా తమ పట్టు సడలించే అవకాశం ఉందని, వారితో బాటే ప్రజలు కూడా వెనక్కి తగ్గే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ప్రజలు, ఉద్యోగులు వెనక్కి తగ్గితే ఇక తెదేపా, వైకాపాలు వారిని అనుసరించక తప్పదు. అంటే ఈ పరిణామాలన్నీ రాగల 10రోజుల్లో జరిగే అవకాశం ఉందనుకోవచ్చును.   ఆ తరువాత అంటోనీ కమిటీతో బేరసారాల డ్రామాలతో మరో నెల, రెండు నెలలు సాగదీస్తూ రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా కనబడగానే ఎన్నికలకి గంట కొట్టేస్తే అప్పుడు అందరి దృష్టి రాష్ట్ర విభజనపై నుండి ఎన్నికల పైకి మళ్ళుతుంది. ఈ లోగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో అతని అనుచర మంత్రులు కూడా మెల్లగా సర్దుకోవడానికి వెసులుబాటు దొరుకుతుంది.   కాకపోతే తమ ఉద్యమాలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా రాష్ట్ర విభజన చేసినందుకు ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓడిస్తారా లేక కిరణ్ కుమార్ రెడ్డి మొహం చూసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారా అనేది తేలేందుకు చాల సమయం ఉంది.

సీమాంద్ర నాయ‌కుల రాజీనామా..?

  తెలంగాణ,సీమాంద్ర ప్రాంతాల్లో ఆందోళ‌నల సంగ‌తులు ఎలా ఉన్నా.. కేంద్ర మాత్రం విభ‌జ‌న దిశ‌గా వ‌డి వ‌డిగా అడుగులు వేస్తుంది. ఇప్ప‌టికే హోం శాఖ నోట్ కూడా రెడీ చేసిన కేంద్ర త‌దుప‌రి చ‌ర్య‌లకు కూడారెడీ అవుతుంది. ఆంటోని క‌మిటీ కూడా త‌న నివేదిక‌ను నేడు కేంద్ర ముందు ఉంచ‌నుంది. తెలంగాణ ప్ర‌క‌ట‌న త‌రువాత వ‌చ్చిన భావోద్వేగాల నేప‌ధ్యంలో కేంద్రం ఈ క‌మిటీని ప్ర‌క‌టించింది. ఈ నేప‌ధ్యంలో నిర్ణ‌యం తెలంగాణ‌కు అనుకూలంగా వ‌స్తే సీమాంద్ర ప్ర‌జా ప్ర‌తినిధులు మూకుమ్మ‌డి రాజీనామాల‌కు సిద్దం అవుతున్నారు. సీమాంద్రుల‌తో పాటు తెలంగాణ ప్రాంత నాయ‌కులు ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను సేక‌రించిన ఆంటోని క‌మిటీ దాదాపుగా తెలంగాణ‌కు అనుకూలంగా నివేధిక ఇచ్చే అవ‌కాశం ఉంద‌టున్నారు విశ్లేష‌కులు. కేంద్ర నిర్ణ‌యంతో పాటు హోం శాఖ నోట్ తుదిమెరుగులు కూడా ఆంటోని క‌మిటీ ఆదారంగా త‌యారు చేయ‌నున్న నేప‌ధ్యంలో సీమాంద్ర ప్రజాప్ర‌తినిధులు త‌మ ఆఖ‌రి అస్త్రాల‌ను సిద్దం చేసుకుంటున్నారు.

నిర్భయ కేసులో నలుగురికి ఉరిశిక్ష

      దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు దోషులకు సాకేత్ కోర్టు ఉరి శిక్ష విధించింది. ఇదే కేసులో ఉన్న మరో బాల నేరస్థుడికి జువైనల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఇక ఇదే కేసులో ఉన్న మరో ప్రధాన నిందితుడు రాసింగ్ గత మార్చిలో తీహార్ జైలులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నలుగురి నిందితులపై 13 అభియోగాలు రుజువైన నేపథ్యంలో వారికి ఉరిశిక్ష విధిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. శిక్షపడిన వారిలో అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, వపన్ గుప్తా, ముఖేష్ లు ఉన్నారు. నిందితులకు సరయిన శిక్ష పడిందని కోర్టు వద్దకు వచ్చిన విద్యార్థి సంఘాలు అభిప్రాయపడ్డాయి. ఇక కోర్టు తీర్పు మీద దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.

చంద్రబాబు జోకర్

      సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమం కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య ఆధిపత్య పోరుకు తెరలేపింది. మొదటి నుండి తెలంగాణలో బలహీనంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర విభజన ప్రకటన వస్తుందనగానే తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించింది. ఇక ఆ తరువాత నాలుగు రోజులు సమన్యాయం వాదన ఎత్తుకుని ఆ తరువాత సమైక్యాంధ్ర వాదం ఎత్తుకుంది. ఈ మేరకు సమైక్య శంఖారావం యాత్ర మొదలు పెట్టిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడును టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తోంది.     తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర చేస్తున్న చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నన్ను చూస్తే భయపడేవాడు..అంతే కానీ నేను ఎవరికీ భయపడను అని అన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల చంద్రబాబు ఆరోపణలను తిప్పికొట్టింది. చంద్రబాబును చూసి వైఎస్ ఎప్పుడూ జోకర్ ను చూసినట్టు నవ్వుకునే వారని, కావాలంటే వారి పాత సంభాషణలు, కలిసిన సన్నివేశాలను సాక్షి ఛానల్ లో వేయించి చూయిస్తామని ప్రకటించింది. ఎంత సొంత ఛానల్ ఉంటే మాత్రం పాత సీడీలు వేసి మరీ చూయిస్తామని చెప్పడం ఆశ్చర్యకరం.

మరి కొద్ది సేపటిలో నిర్భయ కేసులో తుది తీర్పు

  సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక అత్యాచార కేసులో దోషులుగా గుర్తించబడిన నలుగురు వ్యక్తులు-పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ టాకూర్ మరియు ముకేష్ లకు డిల్లీలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు మధ్యాహ్నం రెండున్నర గంటలకు శిక్షలు ఖరారు చేస్తూ తుది తీర్పు ప్రకటించనుంది. ఈ సందర్భంగా నగరం నలుమూలల నుండి భారీ ఎత్తున ప్రజలు తరలి వస్తుండటంతో కోర్టు వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసారు. దోషులకు ఉరిశిక్ష విధించవలసిందేనంటూ ప్రజలు నినాదాలు చేస్తున్నారు. అయితే, దోషుల కుటుంబీకులు మాత్రం వారికి యవజీవ కారాగార శిక్ష విధించాలని లాయర్ల ద్వారా కోర్టుకి విన్నవించుకొన్నారు.   కోర్టు ఒకవేళ వారికి ఉరిశిక్ష విధించినప్పటికీ, వారు హైకోర్టు ఆ తరువాత సుప్రీంకోర్టులలో అప్పీలు చేసుకోవచ్చును. ఈ రెండు కోర్టులలో ఎంత లేదన్నా కనీసం మరో ఏడాది సమయం కేసు సాగే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు కూడా క్రింద కోర్టు తీర్పునే ఖాయం చేసినట్లయితే ఆ నలుగురు రాష్ట్రపతి క్షమాభిక్షకి దరఖాస్తు చేసుకోవచ్చును. దేశ రాజకీయ పరిణామాలను బట్టి ఆయన ఎటువంటి నిర్ణయమయినా తీసుకొనే అవకాశం ఉంది.

టీ-నోట్ సిద్దం, విభజన ఖాయం, హైదరాబాద్ అయోమయం

  తెలంగాణా నోట్ దాదాపు సిద్దం అయిపోయిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు ఇటీవల తమను కలిసిన సీమాంధ్ర నేతలు శైలజానాద్ తదితరులకు తెలియజేసారు. ప్రభుత్వోద్యోగుల నియమాకాలు, పదోన్నతులు తదితర అంశాలతో ముడిపడిఉన్నఆర్టికల్ 371 (డీ)ని రాష్ట్ర విభజన చేస్తున్నసందర్భంగా కొనసాగించాలా లేక రద్దు చేయవచ్చా? అనే అంశంపై న్యాయ నిపుణుల సలహాల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఈ సంగతి కూడా తేలిపోతే టీ-నోట్ కేంద్ర మంత్రి మండలి ఆమోదానికి పంపేందుకు తాము సిద్దంగా ఉన్నామని వారు తెలియజేసారు.   అయితే హైదరాబాదు అంశంపై వారు ఎటువంటి సంకేతం కూడా ఇచ్చేందుకు నిరాకరించారు. దానిపై కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకొంటుందని మాత్రమే చెప్పారు. ప్రస్తుతం సీమాంధ్ర ప్రాంతంలో ఉవ్వెత్తున సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాలను కూడా తమ శాఖ పరిగణనలోనికి తీసుకొన్నట్లు వారు తెలిపారు.   తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుపై సోనియా గాంధీ చాలా పట్టుదలతో ఉన్నందున, సమైక్య ఉద్యమాలు ఎంత తీవ్ర తరం అవుతున్నపటికీ, రాష్ట్ర విభజనపై ఇక కేంద్రం వెనకడుగు వేసే అవకాశం ఎంత మాత్రం లేదని, అందువల్ల వీలయినంత వేగంగా విభజన ప్రక్రియ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు తాజా సమాచారం. మరి దీనికి ఏపీయన్జీవోలు, ప్రజలు, రాజకీయ పార్టీలు ఏవిధంగా స్పందిస్తాయో చూడాలి.

టిడిపికి 30 లోక్ సభ స్థానాలు..!

      వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 30 లోక్ సభ స్థానాలు వస్తాయని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తన బస్ యాత్రలో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని ,రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీనే సరైన పార్టీ అన్న భావన ప్రజలలో ఏర్పడుతోందని ఆయన అన్నారు.   తెలంగాణ – సీమాంధ్ర ప్రజలను శత్రువులుగా మార్చి తన పబ్బం గడుపుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని, తెలంగాణలో టీఆర్ఎస్, సీమాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలతో ఆ పార్టీ గారడీ చేయిస్తుందని అన్నారు. అయితే విభజనకు తాను వ్యతిరేకం కాదని, అన్ని ప్రాంతాలు నాకు సమానం అని, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కానని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సీమాంధ్రలో గత 40 రోజులుగా ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుంటే కేంద్రం చోద్యం చూస్తుందని, ఈ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలను చర్చలకు పిలవాలని లేదా రెండు ప్రాంతాల జేఏసీలను పిలిచి చర్చలు జరపాలన్న డిమాండ్ తో చంద్రబాబు ఢిల్లీ యాత్ర చేయనున్నారు.

ఈ రోజు చాలా ఇంపార్టెంట్ గురూ

  ఈ రోజు దేశంలో కొన్నికీలక సంఘటనలు జరుగబోతున్నాయి. ఈ రోజు జరుగబోయే కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణా నోట్ పై చర్చించి పార్టీ ఒక నిర్ణయం తీసుకోబోతోంది. ప్రస్తుతం ఉవ్వెత్తున సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాల నేపధ్యంలో అంటోనీ కమిటీ తన నివేదికను సమర్పించే వరకు ఆగడం మేలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది. అయితే తెలంగాణా విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు తగ్గే ఆలోచన కూడా లేదని సమాచారం.   ఇక ఈ రోజే నరేంద్ర మోడీని బీజీపీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించేందుకు ఆ పార్టీ అగ్రనేతల పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగుతోంది. మోడీ అభ్యర్ధిత్వాన్ని అద్వానీ, సుష్మాస్వరాజ్ తదితరులు తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నపటికీ, బీజేపీ మోడీ పేరును ఈ రోజే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అదే జరిగితే భారత రాజకీయాలు, పార్టీలలో అనేక పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. ముఖ్యంగా బీజేపీ నిలువునా చీలినా ఆశ్చర్యం లేదు. అదేవిధంగా రాహుల్ గాంధీని తమ ప్రధాని అభ్యర్ధిగా ముందుకు తెస్తున్న కాంగ్రెస్ పార్టీపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకు తగిన విధంగా ఆ పార్టీ మళ్ళీ సరికొత్తగా వ్యూహకల్పన చేసుకోవలసి ఉంటుంది. యావత్ భారత దేశ రాజకీయాలను, వివిధ వర్గాలను కూడా బీజేపీ నిర్ణయం ప్రభావితం చేయబోతోంది.   ఇక, నిర్భయ కేసులో దోషులుగా గుర్తింపబడిన నలుగురు నేరస్తులకు ఈ రోజే ఫాస్ట్ ట్రాక్ కోర్టు శిక్షలు ఖరారు చేయబోతోంది. వారికి ఉరిశిక్ష పడే అవకాశం ఉందని హోంమంత్రి షిండే ముందుగానే చెప్పడం వివాదాస్పదమయ్యింది.   ఇక జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టయిన మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణరావు బెయిలు పిటిషను ఈ రోజే విచారణకు రాబోతోంది. గత 15నెలలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయన ఆరోగ్యకారణాలతో బెయిలు కోరుతున్నారు. ఇటీవల తరచూ ఆయన అనారోగ్యం పాలవుతున్నారు.

విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో 22 గ్రామాలలో అంధకారం

  బుధవారం అర్ధరాత్రి నుండి సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు మొదలుపెట్టిన 72గంటల సమ్మె ప్రభావం విజయనగరం జిల్లా యస్.కోట పరిధిలో ఉన్న 22గ్రామాలపై పడింది. ఆ గ్రామాలలో నిన్నటి నుండి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ఆ గ్రామాలకు విద్యుత్ సరఫరాను పునరుద్దరించేందుకు ఉద్యోగులు లేకపోవడంతో సంబందిత అధికారులే దానిని సరిచేసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అయితే, కొన్ని చోట్ల పంపిణీ వ్యవస్థలోలోపాలు ఏర్పడటం వలన వారు కూడా చేయగలిగిందేమీ లేదని తెలుస్తోంది. ఇంతవరకు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అడపా దడపా విద్యుత్ అంతరాయాలు కలుగుతున్నా వాటిని అధికారులే ఎలాగో సరిచేస్తూ నెట్టుకొస్తున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా 22గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఏమీ చేయాలో తెలియక తలలు పట్టుకొన్నారు. వీలయినంత త్వరలో విద్యుత్ సరఫరా పునరుద్దరిస్తామని సంబంధిత అధికారులు మీడియాకు తెలిపారు.

చంద్రబాబుకి డిల్లీలో ఏమి పనో

  ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి బెయిలు పిటిషను సీబీఐ కోర్టులో ఉంది. తెలంగాణా నోట్ హోంమంత్రి షిండే వద్ద తయారుగా ఉంది. నరేంద్ర మోడీని బీజేపీ తన ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించేందుకు డిల్లీలో కసరత్తు చేస్తోంది. ఇటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలను వెంటపెట్టుకొని నేడో రేపో డిల్లీ వెళ్లేందుకు నిశ్చయించుకొన్నారు. ఆయన ఆకస్మిక డిల్లీ పర్యటనకు ఇంతవరకు పార్టీ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ రాష్ట్ర విభజన సందర్భంగా సమన్యాయం చేయమని కేంద్రాన్ని డిమాండ్ చేసేందుకే వెళుతున్నట్లు ఆ పార్టీ నేతలు చెపుతున్నారు.   ఇక తెదేపా నేతలు వైకాపా గౌరవాధ్యక్షురాలు డిల్లీ వెళ్లి తన కొడుకు జగన్మోహన్ రెడ్డి బెయిలు కోసం కాంగ్రెస్ పార్టీతో రహస్య ఒప్పందం చేసుకొని వచ్చారని, అందువల్ల త్వరలో అతను బెయిలుపై విడుదలవడం ఖాయమని గట్టిగా చెపుతున్నారు. అందుకు ప్రతిగా ఒకప్పటి చంద్రబాబు సన్నిహిత మిత్రుడు, ప్రస్తుత వైకాపా నేత అయిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, చంద్రబాబు జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రాకుండా చక్రం తిప్పెందుకే హడావుడిగా డిల్లీ పరుగులు తీస్తున్నారని ఆరోపించారు. అసలు చంద్రబాబు ఇంత హడావుడిగా ఇప్పుడు డిల్లీకి ఎందుకు వెళుతున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.   ఇక, తెలంగాణా వాదులు వారి కోణంలో చూస్తూ ఆయన తెలంగాణాను అడ్డుకోవడానికే డిల్లీ వెళుతున్నారని అభిప్రాయపడుతున్నారు. ఆయన అటువంటి ప్రయత్నలేవయినా చేసినట్లయితే సహించేది లేదని వారు హెచ్చరిస్తున్నారు.   ఇక, నరేంద్ర మోడీకి బీజేపీ పట్టాభిషేకం చేయబోతున్నశుభ సందర్భంగా, చంద్రబాబు వేరే ఏదో మిషతో డిల్లీకి వెళ్లి అక్కడ ఆయనను పలకరించే అవకాశం కూడా ఉంది. మోడీ ఇటీవల తన హైదరాబాదు పర్యటన సందర్భంగా తెదేపాతో ఎన్నికల పొత్తులకు సంకేతాలు పంపారు. ఒకవేళ రానున్న ఎన్నికలలో కాంగ్రెస్, వైకాపా, తెరాసలు చేతులు కలిపినట్లయితే, బలమయిన ఆ కూటమిని ఎదుర్కొనేందుకు తెదేపా తప్పనిసరిగా బీజేపీతో చేతులు కలిపే అవకాశం ఉంది.   సాధారణ ఎన్నికలకు కేవలం మరో 7నెలలు మాత్రమే ఉన్నందున, ఒకవేళ మోడీని బీజేపీ తమ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించగలిగితే, చంద్రబాబు తన డిల్లీ పర్యటనలోఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయనను కలిసి బీజేపీకి సానుకూలమయిన సంకేతాలు ఇచ్చివచ్చే అవకాశం కూడా ఉంది.

హైదరాబాద్ మీద అనుమానం

      కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు హైదరాబాద్ మీద అనుమానమొచ్చింది. అసలు ఇది హైదరాబాదా ? లేక పాకిస్తానా ? అని అనుమానం వ్యక్తం చేశారు. ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, జగన్ సోదరి షర్మిల కూడా పలుమార్లు ఇలాగే హైదరాబాద్ ను పాకిస్తాన్ తో పోల్చారు. ఇప్పుడు మల్లాది విష్ణు కూడా అదే మాట అంటున్నారు. ఏపీ ఎన్జీఓలు హైదరాబాద్ లో సభ నిర్వహించడంతో టీఆర్ఎస్ పార్టీ కలవర పడుతుందని, హైదరాబాద్ లో సభ అడ్డుకోవడం చూస్తుంటే పాకిస్తాన్ లో ఉన్న అనుమానం కలిగిందని ఆయన అన్నారు.   తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని చెప్పకుండా సీమాంధ్రలో తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర చేయడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. అయితే నేతలు హైదరాబాద్ ను పాకిస్తాన్ పోల్చడం నిజంగా తప్పుపట్టాల్సిన అంశమే. ప్రజలను రెచ్చగొట్టేందుకో .. ఆకట్టుకునేందుకో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి  

డివైడ్ అండ్ రూల్ ఇష్టోరీ పార్ట్-1

  బ్రిటిష్ వాళ్ళని దేశం నుండి తరిమి కొట్టిన కాంగ్రెస్ పార్టీ, వారి విభజించి పాలించు సిద్దాంతాన్ని మాత్రం పదిలంగా తన దగ్గిరే అట్టేబెట్టుకొని అవసరమయినప్పుడల్లా తీసి ఉపయోగించుకొంటోంది. రాష్ట్ర విభజనతో ముందు తెలుగు ప్రజలను విభజిస్తున్నకాంగ్రెస్ పార్టీ, తెరాసను దెబ్బ తీసేందుకు టీ-జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ను ఎగద్రోసి చూసింది.   జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీసేందుకు రాయలసీమను విభజించాలని కూడా ఆలోచన చేసింది గానీ అంత సాహసం చేయలేకపోయింది. అయితే రాష్ట్ర విభజనతో వైకాపాను తెలంగాణా నుండి విభజించి దెబ్బ తీయగలిగింది. తెదేపాలో కూడా విభజన చిచ్చుబాగానే పెట్టగలిగింది.   ఇక స్వయంగా తన స్వంత పార్టీ నేతలను కూడా ప్రాంతాల వారిగా విభజించి, పక్కా ప్రణాళికతో పావులు కదుపుతోంది. ఇరు ప్రాంతాల నేతల చేత సమర్ధంగా డ్రామా నడిపిస్తూ రెండు ప్రాంతాలలో కూడా పాగా వేయాలని ఎత్తులు వేస్తోంది. విభజన పుణ్యమాని తెదేపా, వైకాపాలు సీమాంధ్రపై ఆధిపత్యం కోసం కత్తులు దూసుకొని పోరాడుతుంటే, తన సీమాంధ్ర నేతలకి కిరణ్ కుమార్ రెడ్డిని నాయకుడిగా మలిచి ఆ రెండు పార్టీలను తుడిచిపెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాంగ్రెస్ పార్టీ సృష్టించిన ఈ సందిగ్ధంలో ప్రజలు ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితులు కల్పించి, ఇంతవరకు కాంగ్రెస్ పాలనలో నరకం చూసిన, చూస్తున్నప్రజల చేతనే కిరణ్ కుమార్ రెడ్డి అందరి కంటే యోగ్యుడని అనిపించగలిగింది.   ఇక నేడోరేపో ఆయన చేత సమైక్యాంధ్ర కోరుతూ పాదయాత్రలు కాకపోయినా ఏవో ఒక రకమయిన యాత్రలు చేయించే అవకాశం ఉంది. ఈ దెబ్బకి వైకాపా, తెదేపాలకి సమైక్య ఆయుధం చేజారిపోతుంది. సాక్షాత్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డే సమైక్యాంధ్ర ఉద్యమాలు చేస్తుంటే ఇక ప్రజలు షర్మిలను, చంద్రబాబును పట్టించుకొంటారో లేదో త్వరలోనే తేలిపోతుంది.   అయితే తరువాత ఇస్టోరీ ఏమిటాంటారా ? సస్పెన్స్? దీని క్రింద వచ్చేఇస్టోరీ చదివి అందులోంచి మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకొనే అవకాశం మీకే ఉంది.

డివైడ్ అండ్ రూల్ ఇష్టోరీ పార్ట్-2

  కాంగ్రెస్ పార్టీ (తెరాస కాదు) తెలంగాణా రాష్ట్రం ఇస్తోంది గనుక రానున్న ఎన్నికలలో అక్కడ కొంచెం వీజీగానే విజయం సాధించవచ్చును. అవసరమయితే తెరాసను కలిపేసుకోవచ్చును, ఇంకా మొండికేస్తే వాళ్ళని కూడా విభజించి తెరాసను నామరూపాలు లేకుండా చేయవచ్చును. ఏదారి లేకపోతే చివరికి పొత్తులు కూడా పెట్టుకోవచ్చును.   కానీ, సమైక్యాంధ్ర అని ఘర్జిస్తున్న సీమాంధ్రలో ప్రజలని ఎలా పడేయాలి? 25మంది యంపీలు, 150మంది శాసన సభ్యులు ఉన్న సీమాంధ్రలో గెలవాలంటే ఉపాయలేమిటి? బహుశః ఈ రాష్ట్ర విభజన సీరియల్లో, కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే, డైలాగులు చివరికి ప్రమోషన్ కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ అధిష్టానం ముందే సిద్దం చేసుకొందనే విషయం త్వరలోని క్రమక్రమంగా బయటపడుతుంది.   ఆ ప్రకారమయితే, కాంగ్రెస్ ముందు మూడు ఆప్షన్స్ సిద్దంగా ఉన్నాయి. వాటిలో ఆ పార్టీకి కావలసింది అది ఎంచుకొంటే, మీకు నచ్చింది మీరు ఎంచుకోవచ్చును. లేకుంటే మన్ది ఇంతా చెడ్డా ప్రజాస్వామ్యం గాబట్టి సింపుల్ గా ‘రిజక్ట్ బటన్’ నొక్కేయవచ్చును.   ఆప్షన్ 1:ముఖ్యమంత్రి ధిక్కార స్వరం, పదవికి, పార్టీకి రాజీనామా, సీమాంద్రా కాంగ్రెస్ నేతలు కొందరు కొత్త పార్టీ స్థాపన, దానికి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వం, ఆయన నాయకత్వంలో ఎన్నికల వరకు కాంగ్రెస్ అధిష్టానంపై సమైక్యాంధ్ర పోరాటం, సీమాంధ్రలో తెదేపా, వైకాపాలకు చెక్ పెడుతూ ప్రజల ఓట్లను నొల్లుకోవడం, ఆనక షరా మామూలుగా కాంగ్రెస్ పార్టీలోవిలీనం చేసేయడం.   ఆప్షన్ 2: ఇది కొంచెం నష్టదాయకమయినది, పైగా రిస్క్ తో కూడుకొన్నది. జగన్మోహన్ రెడ్డికి బెయిలు మంజూరు, వీలయితే వైకాపా విలీనం లేకుంటే షరా మామూలుగా ఆ పార్టీ నేతలని కూడా డివైడ్ అండ్ రూల్ తో లాగేసుకోవడం, తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలలో పొత్తులు. ఒకవేళ వ్యవహారం పొత్తుల వరకు వెళితే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మద్దతు, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి మద్దతు.   ఆప్షన్ 3: సీమాంధ్రలో మరో రెండు మూడు కొత్త డమ్మీ సమైక్య రాజకీయ పార్టీలను పుట్టించి తెదేపా, వైకాపాల ఓట్లు చీల్చి, ఎన్నికల తరువాత ఆ కొత్త పార్టీలను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసుకోవడం.