వైఎస్ షర్మిల యాత్రకు సమైక్య సెగ

      సమైక్య శంఖారావం పేరుతో తిరుపతి నుండి యాత్ర మొదలు పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ షర్మిల యాత్రకు అనంతపురం జిల్లా పామిడిలో బ్రేక్ పడింది. సమైక్యాంధ్ర జేఏసీ నేతలు షర్మిల యాత్రను అడ్డుకుని గోబ్యాక్ షర్మిల నినాదాలు చేశారు. దీంతో కంగుతిన్న షర్మిల మరో దారిలో కర్నూలు వైపు వెళ్లిపోయారు.   తెలంగాణ ప్రకటన వచ్చిన తరువాత సమన్యాయం అని దీక్షలకు దిగి ఆ తరువాత సమైక్య వాదం అందుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. కానీ అనంతపురంలో యాత్రకు అడ్డుపడడం ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. ఇక నెల్లూరులో జరుగుతున్న సింహగర్జన కార్యక్రమానికి వచ్చిన ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిని సమైక్యవాదులు అడ్డుకుని వెనక్కి పంపించడం విశేషం. ఇక్కడ రాజకీయ నాయకులతో పనిలేదు అని వారు తేల్చిచెప్పారు.

న్యాయశాఖకు చేరిన తెలంగాణా నోట్

  సమైక్యాంధ్ర ఉద్యమాలతో సీమాంధ్ర ప్రాంతం ఉడికిపోతున్నా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పదవి నుండి తప్పుకొంటానని హెచ్చరిస్తున్నా, మంత్రులు, యంపీలు రాజీనామాలు చేసినా, హైదరాబాదులో ఆంధ్ర-తెలంగాణా ఉద్యోగులు కత్తులు దూసుకొంటున్నాకాంగ్రెస్ అధిష్టానం ఎంత మాత్రం చలించకుండా తెలంగాణా ఏర్పాటుకి ప్రయత్నాలు ముమ్మరం చేయడం విశేషం. బహుశః కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నడూ ఇంత దృఢసంకల్పం చూపించిన దాఖలాలు లేవేమో!   ఈ రోజు హోంశాఖ తను తయారు చేసిన ‘తెలంగాణా నోట్’ ని కేంద్ర న్యాయశాఖకు పంపింది. న్యాయశాఖ ఆ నోట్ ను పరిశీలన చేసి, న్యాయపరంగా తగిన అంశాలను జోడించి మళ్ళీ హోంశాఖకు పంపుతుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు పదిరోజులు పట్టవచ్చును. ఆ తరువాత ఆనోట్ ను హోంశాఖ కేంద్రమంత్రి మండలికి సమర్పిస్తుంది.

సోనియాకు అమెరికా కోర్టు సమన్లు

      కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అమెరికాలోని న్యూయార్క్ ఫెడరల్ కోర్టు సమన్లు జారీ చేసింది.1984లో సిక్కుల ఊచకోతలో పాల్గొన్న కాంగ్రెస్‌ నేతల రక్షించడానికి సోనియాగాంధీ ప్రయత్నిస్తున్నారని న్యూయార్క్‌లోని న్యాయస్థానం తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసింది. వైద్య పరీక్షల కోసం అమెరికా పర్యటనలో ఉన్న సోనియాగాంధీకి అక్కడి న్యాయస్థానం సమన్లు జారీ చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని....నిస్సందేహంగా న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని కాంగ్రెసు అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. గతంలో కూడా న్యాయం కోసం ఆందోళన చేస్తున్న అమెరికాలో నివసిస్తున్న సిక్కు జాతీయులు ఆ దేశ చట్ట పరిధిలోకి పంజాబ్‌ ముఖ్యమంత్రి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌, కేంద్ర మంత్రి కమల్‌ నాథ్‌లపై ఇటువంటి ప్రయత్నమే చేసింది. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు.

హైదరాబాద్ ‘యూటీ’ తో మజ్లిస్ ‘యూ’ టర్న్

  హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయబోతున్నారనే వార్త తెలంగాణా నేతలలో కలకలం రేపింది. ముఖ్యంగా హైదరాబాదుకి చెందిన దానం నాగేందర్, మజ్లిస్ నేతలు అసదుద్దీన్ వంటి వారు ఈ వార్తలతో చాలా కలవరపడ్డారు. కారణం అలాగ చేస్తే హైదరాబాదు కేంద్రప్రభుత్వపాలన క్రిందకు వెళ్ళిపోయి అక్కడ ఎన్నికలు జరుగవు. అప్పుడు వారందరూ మరెక్కడినుంచయినా పోటీ చేయవలసివస్తుంది. కేవలం హైదరాబాదుకే పరిమితమయిన నేతలకి ఇది నిజంగా ప్రాణ సంకటమే అవుతుంది. గనుక వారు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు.   ఇంతవరకు సమైక్యాంధ్రకు మొగ్గు చూపిన మజ్లిస్ పార్టీ నేతలు అసదుద్దీన్, అక్బరుదీన్ ఓవైసీలు ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణాలో అంతర్భాగమని దానిని ఏవిధంగాను విడదీయడానికి తాము ఒప్పుకోమని గట్టిగా చెప్పడానికి కారణం ఇదే. హైదరాబాద్ జోలికి రానంత వరకు రాష్ట్రం కలిసి ఉన్నా,విడిపోయినా తమకు అభ్యంతరం లేదన్నట్లు వ్యవహరించిన ఒవైసీ సోదరులు, ఇప్పుడు తమ రాజకీయ ఉనికే ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఏర్పడటంతో మాట మార్చితాము కూడా ఆందోళనకు సిద్ధమని చెపుతున్నారు.   వారి ఈ బలహీనతలు అర్ధం చేసుకొన్నతెరాస ఈ ప్రతిపాదన అమలు చేస్తే మజ్లిస్ పార్టీతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం మొదలుపెడతామని కేంద్రాన్నిహెచ్చరించింది. ఏమయినప్పటికీ, కేంద్రం ముందుగా ఇటువంటి మీడియా లీకులు ఇచ్చిదానికి వచ్చిన ప్రతిస్పందన బట్టి ఎప్పటికప్పుడు తన వ్యూహం మార్చుకొని ముందుకు సాగుతోంది. ఇది చూస్తే ఈ మీడియా లీకులు కూడా ఇప్పుడు రాజకీయ వ్యూహంలో భాగమయిపోయినట్లు అర్ధం అవుతోంది.

విభజనతో సీమాంద్రాలో కాంగ్రెస్ ఖాళీ అవుతుందా

  రాష్ట్రవిభజన నిర్ణయంతో తెదేపా, వైకాపాలకు తెలంగాణాలో చెక్ పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం, ఇప్పుడు అదే నిర్ణయం వల్ల సీమాంధ్రను కోల్పోబోతోందా? ప్రస్తుతం ఆ రెండు పార్టీలు సమైక్యాంధ్ర లేదా సమన్యాయం కోసం చేస్తున్నఉద్యమాలకు కాంగ్రెస్ బలి కాబోతోందా? అది తెలిసి కూడా కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణా ఏర్పాటుకే మొగ్గు ఎందుకు చూపుతోంది?   తెలంగాణా ఉద్యమాల ఒత్తిడి కారణంగా కేంద్రం తెలంగాణా ఏర్పాటుకి సిద్దపడినట్లు పైకి కనిపిస్తున్నప్పటికీ, ఈ నిర్ణయంతో రానున్న ఎన్నికలలో రెండు ప్రాంతాలలో లాభపడాలనే కాంగ్రెస్ అడియాస లేకపోలేదు. ఇక, తమను దెబ్బ తీసేందుకే రాష్ట్ర విభజన చేస్తోందని తెదేపా, వైకాపాలు చేస్తున్నఆరోపణలలో కొంత నిజం లేకపోలేదు. ఈ దెబ్బతో ఆ రెండు పార్టీలు తెలంగాణాను కాంగ్రెస్ పార్టీకి వదిలిపెట్టక తప్పనిసరి పరిస్థితి కల్పించింది.   అందుకు ప్రతిగా ఆ రెండు పార్టీలు సీమాంధ్ర ప్రజల తరపున స్వచ్చందంగా వఖల్తా పుచ్చుకొని సమైక్యాంధ్ర లేదా సమన్యాయం అంటూ తీవ్ర పోరాటం చేస్తున్నాయి. రాష్ట్ర విభజన చేసి సీమాంధ్రకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని, అదే విధంగా ఎదుట పార్టీకూడా ఈ కుట్రలో పాలుపంచుకొందని రెండు పార్టీ నేతలు గట్టిగా చెపుతూ సీమాంధ్ర ప్రాంతంపై పట్టుకోసం పోరాడుతున్నారు. ఈ రేసులో ప్రస్తుతం వైకాపా ముందు ఉందని మారుతున్న రాజకీయ పరిణామాలు చెపుతున్నాయి.   సమైక్యావాదం గట్టిగా వినిపిస్తున్నవైకాపాకే రానున్నఎన్నికలలో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేసుకొన్న అనేక మంది కాంగ్రెస్ యంయల్యేలు, మంత్రులు, చిన్నాపెద్దా నేతలు వీలయినంత త్వరగా గోడ దూకేసి వైకాపాలో పడితే ఒడ్డున పడినట్లేనని భావిస్తున్నారు. వారిలో మంత్రులు విశ్వరూప్, వట్టి వసంతకుమార్, కాసు కృష్ణా రెడ్డి, యంపీలు సాయి ప్రతాప్, యస్.పీ.వై.రెడ్డి, యంయల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, అడల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు, శిల్పా మోహన్ రెడ్డి, యమ్యల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి తదితరులున్నారు. మాజీ మంత్రి మోపిదేవి కుటుంబ సభ్యులు ఇప్పటికే వైకాపాలో చేరారు.   ఇక సాక్షాత్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా నేడో రేపో పార్టీని వీడి సీమాంధ్ర నేతలు పెట్టబోయే కొత్త రాజకీయ పార్టీకి నాయకత్వం వహిస్తారని నిత్యం వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ నిర్ణయం వికటించిందని, తను తవ్వుకొన్న గోతిలో తనే పడిందనిపిస్తుంది.   అయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, దైర్యంగా రాష్ట్ర విభజనకు సిద్దపడుతోంది. అంటే, సీమాంధ్రలో పార్టీని కాపాడుకోవడానికి తగిన వ్యూహాలు, ప్రతిపక్షాలపై ప్రయోగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం వద్ద మరికొన్నిఅస్త్రాలు సిద్ధంగా ఉన్నాయని అర్ధం అవుతోంది. రాష్ట్ర విభజన చేసినప్పటికీ బలమయిన సీమాంధ్రను పోగొట్టుకొనేంత తెలివి తక్కువది కాదు కాంగ్రెస్ పార్టీ. సీమంధ్ర కాంగ్రెస్ నేతలు కోరుతున్నవిధంగా వారికి ప్యాకేజీలు ఇచ్చిబుజ్జగించడమో లేకపోతే మధ్యంతర ఎన్నికలకి గంట కొట్టి పార్టీ టికెట్స్ ప్రహసనం మొదలుపెట్టి తన నేతలని కట్టడి చేయడమో చేయవచ్చును.

వైకాపాలో ముదురుతున్న ఆదిపత్యపోరు

  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో రోజు రోజుకి కుమ్ములాటలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే తెలంగాణ విషయంలో పార్టీ వైఖరికి నిరసనగా పలువురు నేలు పార్టీకి దూరంగా కాగా మరికొందరు ఈ అధిపత్యపోరుతో దూరమయ్యేలా ఉన్నారు. తాజా షర్మిల పాదయాత్ర విషయంలో ఈ వివాదాలు మరోసారి తెరమీదకు వచ్చాయి. షర్మిల త్వరలో కర్నూలు జిల్లాలో బస్సు యాత్రకు వస్తుండగా ఆమె తమ నియోజక వర్గంలోనే తిరిగేలా రూట్‌ మ్యాప్‌ రెడీ చేస్తున్నారు శోభనాగిరెడ్డి, భూమానాగిరెడ్డిలు. చిత్తూరు, అనంతపురం లాంటి జిల్లాల్లో కూడా కేవలం రెండు నియోజక వర్గాల్లోనే బహిరంగ సభలు నిర్వహిస్తుండగా, కర్నూలులో మాత్రం నాలుగు బహిరంగ సభలకు షర్మిలను ఒప్పించారు భూమా దంపతులు. దీంతో ఆ జిల్లాలోని ఇతర నాయకులతో పాటు ఇతర జిల్లాల నాయకులు కూడా ఈ దంపతులపై గుర్రుగా ఉన్నారు. ఈ అధిపత్యం ఇలాగే కొనసాగితే మరింత మంది నాయకులు పార్టీని వీడే అవకాశం ఉందంటున్నారు.

దోషులుగా రుజువైతే పోటికి అనర్హులే

  గతంలో దోషులుగా రుజువైన వారు ఎలక్షన్లలో పోటికి అనర్హులంటూ వ్యాఖ్యానించిన సుప్రిం కోర్టు మరోసారి అదే వ్యాఖ్యను చేసింది. తాము ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించే ఆలోచనే లేదన్న సుప్రీం నేరస్థులుగా రుజువైతే చట్టసభలకు పోటీ చేయడానికి అనర్హులంటూ తేల్చింది. జూలై 10న సుప్రిం కోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలిచాలంటూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. అయితే తాము ఇచ్చిన తీర్పు పార్టమెంట్‌కు నచ్చని పక్షంలో ప్రజాప్రాతినిధ్య చట్టంలో సవరణలు చేసుకునే హక్కు పార్లమెంట్‌కు ఉందని తేల్చి చెప్పింది. అయితే గతంలో నేరారోపణ ఎదుర్కొంటున్న వారు కూడా పోటికి అనర్హులంటూ తీర్పు చెప్పిన కోర్టు ప్రస్థుతం వారి విషయంలో పునఃపరిశీలనకు అంగీకరించింది.

శాంతి ర్యాలి చేయనివ్వకపోతే బంద్‌

  హైదరాబాద్‌లో ఏపిఎన్జీవోల సభకు అనిమతించడంతొ తెలంగాణ జేఎసి నాయకులు భగ్గుమంటున్నారు. తాము శాంతియుతంగా ర్యాలి చేస్తామన్నా అనుమతి నిరాకరించిన పోలీసులు సమైక్యవాధుల సభకు అనుమితి ఎలా ఇస్తారని ప్రశ్నించారు.. అంతేకాదు తమ ర్యాలికి అనుమతివ్వని పక్షంలో హైదరాబాద్‌ నగరంలో 48 గంటలు లేదా 72 గంటలపాటు బంద్‌ నిర్వహించే ఆలోచనలో ఉంది తెలంగాణ జెఎసి. అయితే 7వతేది కాకుండా మరో రోజు ర్యాలి చేసుకోవాలి పోలీసులు కోరినా అందుకు అంగీకరించని టి జెఎసి అనుమతి ఇచ్చినా ఇవ్వకున్నా ర్యాలి జరిపి తీరుతామన్నారు. ఒకే రోజుల తెలంగాణ జెఎసి, లాయర్‌ జెఎసి, విద్యార్ది జెఎసి మూడు ర్యాలీలకు అనుమతి కోరడంతో పోలీసులు వారి అభ్యర్ధనను తిరస్కరించారు. దీంతో ఇప్పుడు 7న హైదరాబాద్‌లో ఏంజరుగుతుందో అన్న ఉత్కంట నెలకొంది.

చంచల్‌గూడ చేరిన జగన్‌

  సమన్యాయం నినాదంతో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన వైయస్‌ జగన్‌ నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.. అయితే ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకోవటంతో బుధవారం రాత్రి ఆయన్ను డిశ్చార్జ్‌ చేశారు. ఆగస్టు 25న చంచల్‌గూడ జైళులో దీక్ష చేపట్టిన జగన్‌ను 29 అర్ధరాత్రి జైలు నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తరువాత జగన్‌ ఆరోగ్యం మరింత క్షీణించడం ఉస్మానియా నుంచి 30 అర్థరాత్రి జగన్‌ను నిమ్స్‌కు తరలించారు. 31వ తేది మధ్యాహ్నం వరకు దీక్ష కొనసాగించిన జగన్‌ ఆరోగ్యం మరింత క్షీణించడంతో, అధికారుల అనుమతితొ నిమ్స్‌ వైధ్యులు బలవంతంగా జగన్‌కు ఐవి ఫ్లుయిడ్స్‌ ఎక్కించి ఆయన దీక్ష భగ్నం చేశారు. అప్పటినుంచి నిమ్స్‌లోనే చికిత్స పొందుతున్న జగన్‌ బుధవారం రాత్రి డిశ్చార్జి అవ్వటంతో ఆయనను తిరిగి చంచల్‌ గూడ జైలుకు తరలించారు.

కాంగ్రెస్ గూటికి కొండా దంపతులు

  తెలంగాణపై వైకాపా ‘యూ’ టర్న్ తీసుకొన్నందున ఆగ్రహించి బయటకి వచ్చిన అనేక నేతలలో కొండా సురేఖ దంపతులు కూడా ఒకరు. వైకాపాను వీడినప్పటి నుండి వారు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలు నేటికి ఫలించాయి. వారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ సమక్షంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు.   తమ కార్యకర్తల, తెలంగాణా ప్రజల అభిమతం మేరకు తాము కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వారు మీడియాకు తెలిపారు. ఇదివరకులాగే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ త్వరలో తెలంగాణా ఏర్పాటు ప్రక్రియ పూర్తిచేస్తుందని తాము విశ్వసిస్తున్నామని వారు అన్నారు.   వారిరువురు సమైక్యవాదం గట్టిగా వినిపిస్తున్నకిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే పార్టీలో చేరవలసిరావడం విచిత్రం. ఆయన తన ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా చేస్తున్నవాదనలలో తమకు తప్పేమీ కనబడటం లేదని చెప్పడం విశేషం.   గతంలో వారు కాంగ్రెస్ పార్టీని వీడి వైకాపాలో చేరిన తరువాత, కాంగ్రెస్ పార్టీకి చెందిన చిన్న పెద్ద నేతలను నోరారా తిట్టిపోశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేసిన నోటితోనే, మళ్ళీ వైకాపాను వీడగానే జగన్మోహన్ రెడ్డికి డబ్బు యావ ఎక్కువని, వైకాపాకు అధికారా లాలస కోసమే నాటకాలు ఆడుతోందని వారి విమర్శించారు. ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ గూటిలోకి వచ్చిపడ్డ వారిరువురూ ప్రస్తుతం ఆయన వాదనలో తప్పేమీ లేదని చెప్పవచ్చును. కానీ రేపు మళ్ళీ ఆయన సమైక్యవాదం వినిపించినప్పుడు మిగిలిన తెలంగాణా నేతలతో బాటు ఆయనని తిట్టకుండా వదిలిపెడతారా? అప్పుడు కూడా ఆయన వాదనలో తప్పేమీ లేదని చెప్పగలరా?   ఒకసారి కాంగ్రెస్ గూటిలోకి చేరిన చిలుకలు ఆగూటి పలుకులే పలుకుతాయి. రేపు కాకపోతే మరో రోజయినా సురేఖ ముఖ్యమంత్రిని మీడియా సాక్షిగా దుయ్యబట్టడం ప్రజలే చూస్తారు.

మోడిని అరెస్ట్ చేయండి

  భావి ప్రదానిగా బిజెపి చెపుతున్న నరేంద్రమోడి కి ఎంత సపోర్ట్ వస్తుందో అదే స్థాయిలో వ్యతిరేకత కూడా వస్తుంది. గుజరాత్ కు చెందిన స్వచంద సంస్థ జ‌న సంఘ‌ర్ష మోర్చ న‌రేంద్రమోడిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేసింది. అంతేకాదు గుజ‌రాత్‌లో రాష్ట్రప‌తిపాల‌న విదించాలంటూ కోరింది. బూట‌క‌పు ఎన్‌కౌంట‌ర్ల కేసులో జైల్లో ఉన్న వివాదాస్పద ఐఎఎస్ అధికారి డీజి వంజారా మోడి త‌న‌ను అక్రమంగా ఈ కేసులు ఇరికించారంటూ లేఖ రాసిన నేప‌థ్యంలొ జ‌న సంఘ‌ర్ష మోర్చా ఈ డిమాండ్ చేసింది. అంతేకాదు లేఖ‌లో వంజారా తాను బూట‌క‌పు ఎన్‌కౌంట‌ర్లకు పాల్పడిన‌ట్టుగా పేర్కొన‌టంతో మోడి ప్రభుత్వం వెంట‌నే అసెంబ్లీ ర‌ద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. మంగ‌ళ‌వారం రాజీనామా చేసిన వంజారా అహ్మదాబాద్‌లోని స‌బ‌ర్మతీ కేంద్ర కారాగారంలో ఉన్న వంజారా ఈ మేర‌కు 10 పేజీల రాజీనామ లేఖ‌ను హోంశాఖ‌కు పంపారు.. ఈ లేఖ‌లో త‌న‌తో పాటు బూట‌క‌పు ఎన్‌కౌంట‌ర్లకు పాల్పడ్డ అధికారులంద‌రూ ప్రభుత్వ విధానాల‌నే పాటించార‌ని వారే త‌ప్పు చేయ‌లేద‌ని తేల్చిచెప్పారు. దీంతో ఇప్పుడు గుజారాత్ మోడి ప్రభుత్వం ఇబ్బందులో ప‌డింది.

కావలసింది ఉత్తుత్తి 'యాత్రలు' కాదు, తెలుగుజాతి రక్షణకు ఐక్యతా 'మాత్రలు'!

     డా. ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]     "విశాలాంధ్ర ఏర్పాటు బలీయమైన రాష్ట్రావతరణకు మార్గం వేస్తుంది. ఈ బలమైన తెలుగురాష్ట్రం భారతదేశ ఐక్యతను పటిష్టం చేస్తుంది. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అనేక సమస్యలకు దారితీస్తుంది, అధ్వాన్నపరిస్థితుల్ని సృష్టిస్తుంది, ఫలితంగా అప్పుడు ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం దొరల, పెట్టుబడిదారుల చేతుల్లోకి జారుకుని, దెబ్బతినిపోతుంది; ప్రజాతంత్ర శక్తులు బలహీనపడి నిర్వీర్యమైపోతాయి''                              - హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నిర్మాత                                 స్వామి రామానందతీర్థ ప్రకటన                                 (1953 నవంబరు 3వ తేదీ) ముందు చూపుగల ఆనాటి నాయకత్వం తెలుగువారందరి భావిభాగ్యోదయాన్ని కోరి, ఆంధ్రప్రదేశ్ అవతరణకు మూడేళ్ళముందే చేసిన ఈ హెచ్చరిక నేటి రాష్ట్రంలోని మూడుప్రాంతాలలోని మూర్ఖపు నాయకులకు పట్టనందుననే తెలుగుజాతికి ఇన్ని అనర్థాలు దాపురించాయి. నాటి నాయకుల దూరదృష్టికి, నేటి అరకొర జ్ఞానులయిన నాయకులకు, ప్రతీ సమస్యను పదవీ ప్రయోజనాలతో 'తూకం' వేసుకుని చూచేనాటి రాజకీయ నిరుద్యోగుల సంకుచిత దృష్టికీ మధ్య ఉన్న అంతరాన్ని స్వామి రామానందతీర్థ ప్రకటన మరొక్కసారి బట్టబయలు చేస్తోంది. రామానందతీర్థ ప్రకటనలోని హెచ్చరికను పాటించకనే రకరకాల పేర్లతో నేడు రాష్ట్రంలోని రాజకీయపక్షాలు కొన్ని పూర్తిగా పక్కదారులు పట్టి తెలుగుజాతి పరువును బజారుపాలు చేసి ఇప్పుడు "పాదయాత్రల''నీ, "బస్సు యాత్రల''నీ తలపెట్టారు. రాజకీయ పక్షాల నాయకులకు రాష్ట్ర భవితవ్యంపైన, తెలుగుజాతి భాషా సంస్కృతులపైన ఏమాత్రం గౌరవం ఉన్నా ఒక్క మాటమీద నిలబడి, జాతి విభజన ప్రతిపాదనను స్వార్థపరుల కృత్రిమ ఉద్యమాలను ఆదిలోనే ఎదిరించి, తిరస్కరించాల్సింది. కాని రాజకీయ స్వార్థప్రయోజనాల కొద్దీ వివిధస్థాయిల్లో మూడుప్రాంతాలలోని చెడిపోయిన నాయకులు ఆ పనిచేయలేక పోయారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఆదినుంచీ అనేక తీర్మానాల ద్వారా అభిలషించి నిండుమనస్సుతో ఆశీర్వదించిన ఆనాటి జాతీయ కాంగ్రెస్ కుటుంబ స్వార్థప్రయోజనాల్లో నేడు ఈదులాడుతూ తెలుగుజాతిని అవమాన పరచడానికి సాహసించిన విషయం గమనించిన తరువాతనైనా తెలుగు ప్రధాన రాజకీయపక్షాలు ఎదురొడ్డి నిలవవలసింది! కాని అన్ని పక్షాలూ కుటుంబ స్వార్థప్రయోజనాల్లో ఈదులాడుతున్నవి. కాబట్టి జాతిని చీల్చడానికి తలా ఒక చెయ్యి వేశాయి!   రాష్ట్ర విభజన అవసరమా, అనవసరమా అన్నది కాంగ్రెస్ అధిష్ఠానపు "కుటుంబ రాజకీయం'' ప్రయోజనాల దృష్ట్యానే యు.పి.ఎ. అధ్యక్షురాలుగా, కాంగ్రెస్ అధ్యక్షురాలుగా సోనియాగాంధి పరిశీలించింది; కొడుకు రాహుల్ గాంధీని దేశ ప్రధానమంత్రిగా కూర్చోబెట్టడం కోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎన్నికల తక్కెటలో తూచబోయింది. ఇందిరాగాంధీ నాయకత్వం జాతీయ ప్రయోజనాల దృష్ట్యా భాషాప్రయుక్త రాష్ట్రాలను చీల్చడాన్ని వ్యతిరేకిస్తూ రాగా, కోడలు సోనియా 'విభజన' చిట్కా ద్వారా తొమ్మిది కోట్లమంది తెలుగుప్రజల ఐక్యతను భగ్నపరచడానికి గజ్జెకడుతున్న విషయం తెలిసి కూడా కొన్ని పార్టీలు, కొందరు నాయకులూ పోటాపోటీలమీద 'విభజన' మంత్రాన్ని ముందు సూత్రప్రాయంగా ఆమోదించి, ఆ తర్వాత ఎవరికివారు ఎక్కడ 'వెనకబడి' పోతామోనని భావించి 'మూజువాణీ' నుంచి మూకకొలువుకు మారిపోయి ఉత్తరాలు కూడా యిచ్చి రావడం పెద్ద హైలైట్! ఇప్పుడు ఆ ఉత్తరాలను వెనక్కి తీసుకోవడానికి కూడా కాంగ్రెస్ అధిష్ఠానం అనుమతివ్వదు! అధిష్ఠానం ఎంతటి 'చావుతెలివితో' వ్యవహరించిందంటే 'విభజన' ప్రతిపాదనపైన ఈ క్షణం దాకా పాలకపక్షంగా కాంగ్రెస్ అభిప్రాయమేమిటో స్పష్టం చేయకుండా "కాగల కార్యం గంధర్వులే తీరుస్తార''న్న దిలాసాతో ఇతరపార్టీల నాయకుల అభిప్రాయాల్ని అడిగి నమోదు చేసుకుందే గాని తన నిర్ణయమేమిటో బయటపెట్టలేదు. ఇతర పక్షాలను యిరికించిం తరువాత, "వాళ్ళంతా విభజనకు అనుకూలం కాబట్టి కాంగ్రెస్ అధిష్ఠానం చేయగలిగిందేమీ లేదు, రాష్ట్రాన్ని విభజించడం తప్ప'' అని ముక్తాయింపు విసిరింది! ఈ కృత్రిమ విభజన ప్రతిపాదకుడయిన అసలు రాజకీయ నిరుద్యోగి కె.సి.ఆర్. అయినందున, "ముట్టించి ముచ్చట'' చూడడమే అతగాడి పని అని అందరికీ తెలిసినా, అతడ్ని కాంగ్రెస్ తన ప్రయోజనాల కోసం [రాహుల్ ను ప్రధాని పదవికి తీసుకురావడం]వాడుకోదలచింది; ఈ కిటుకును కూడా ప్రతిపక్షాలు, చివరికి కమ్యూనిస్టు పార్టీలోని ఒక శాఖ [సి.పి.ఐ.]సహా కనిపెట్టలేక పోయారు.   ఇక "తెలుగుదేశం'' అధినేత చంద్రబాబు కూడా రెండుకళ్ళ సిద్ధాంతం'' పేరిట రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నట్టు నటించి నటించి తనపై ఉన్న కేసుల బెడదనుంచి బయటపడడం కోసం కాంగ్రెస్ నాయకత్వాన్ని అంటకాగి, దౌర్భాగ్యపు లాలూచీ రాజీ ప్రతిపాదనగా కాంగ్రెస్ "విభజన'' సూత్రానికి "సై'' అని వచ్చాడు. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, మాజీముఖ్యమంత్రిగా చంద్రబాబు చేయకూడని పని ఎందుకు చేశాడో తెలుగుప్రజలకు అర్థమైపోయింది. మొత్తం రాష్ట్రంలో "దేశం'' పార్టీ నిలువునా చీలిపోకుండా ఆయన ఎత్తిన ఎత్తుగడ - ప్రాంతానికో విధానాన్ని పార్టీ అనుసరించడం ద్వారా పార్టీని కాపాడుకోవటం! కాని ఈ "కిటుకు''ను కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈలోగా కాంగ్రెస్ పార్టీ తప్పుడు రాజకీయం ద్వారా అటు కోస్తాంధ్రలోనూ, ఇటు తెలంగాణాలోనూ ఆ పార్టీ వోటర్లలో భారీ స్థాయిలోనే పరువు కోల్పోతోంది. ఇది గమనించిన బాబు వర్గం జరిగిన తప్పు జరిగిపోయింది కాబట్టి, కాలిన చేతులు మానాలంటే మరో 'చిట్కా'కు తెర లేపాడు.   దాని పేరు "సమన్యాయం'', "విభజన వల్ల తలెత్తే సమస్యకు ముందు పరిష్కారం చూపాలి'' అలా చూపకపోతే తన "పోరాటాన్ని ఆపనని మరో యాత్ర సీమాంధ్రలో తలపెట్టాడు. కాని ఎంతసేపూ విభజనవల్ల తలెత్తే సమస్యలకు పరిష్కారం చూపాలని కేంద్రానికి మొరపెట్టుకోవటమే తప్ప - కాంగ్రెస్ అధిష్ఠానానికి విభజనకు అంగీకారం తెలుపుతూ రాసిన ఉత్తరాన్ని మాత్రం ఈరోజు దాకా బాబు ఉపసంహరించుకోలేదు; అంటే ఇతనికీ విభజనను బలపర్చడం ద్వారా అటు తెలంగాణలో పార్టీ ప్రతిష్ఠ పోకూడదు, ఇటు కోస్తాలో 'సమైక్యాంధ్ర' పేరిట కాకపోయినా రాజధాని నిర్మాణానికి అయిదు లక్షల కోట్లు కేటాయించాలన్న ప్రతిపాదన ద్వారా కోస్తాంధ్రులకు దగ్గర అయినట్టూ కన్పించాలి! ఈ శ్లేష్మంలో పడికొట్టుకుంటున్నాడు బాబు ప్రస్తుతానికి! వైరుధ్యంతో కూడిన ఇలాంటి ప్రకటనలు విడుదల చేస్తున్న చంద్రబాబు ఒకవైపు నుంచీ, చంద్రబాబు తన 'ప్రభావం' నుంచి జారిపోకుండా చూడ్డానికి కాంగ్రెస్ మరొక వైపునుంచీ పరస్పరం ప్రయోజనకర 'లాలూచీకుస్తీ'లలోకి దిగారు!   ఇందుకోసం ఈ రెండు పార్టీలలో ఒకటి తనకు ప్రత్యర్థులుగా భావించుకుంటున్న కెసిఆర్ పార్టీ టి.ఆర్.ఎస్.ను, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తుండగా, మరో పక్షంవారు [కాంగ్రెస్ వారు] మరో 'లాలూచీకుస్తీ'లో తనకు దొంగ ప్రత్యర్థులుగా భావిస్తున్న టి.డి.పి.నీ, వై.ఎస్.ఆర్. పార్టీనీ 'టార్గెట్' చేస్తున్నారు. ఎటుతిరిగీ స్వార్థ రాజకీయాలు ఇరుపక్షాలవని ప్రజలకు వివరించి చెప్పకుండానే అర్థమయిపోయింది! ఇది యిలా వుండగా నిన్నటిదాకా "దేశం'' పార్లమెంటు సభ్యుడిగా ఉన్న బాబు బావమరిది నందమూరి హరికృష్ణ తన బావగారి మీద "రాజకీయ బాంబు''ను పేల్చాడు! 2009 ఎన్నికల సందర్భంగా తన ప్రయోజనాల కోసం చంద్రబాబు స్థానిక టి.ఆర్.ఎస్. నాయకుడు కె.సి.ఆర్.తో పొత్తులు పెట్టుకోవద్దని, పొత్తుకలసినందువల్ల రెండు ప్రాంతాలలోనూ (తెలంగాణా, కోస్తాంధ్రలలో) తీవ్ర సమస్యలు ఉత్పన్నమావుతాయనీ తాను "దేశం'' నాయకత్వాన్ని ముందుగానే హెచ్చరించానని హరికృష్ణ [02-09-2013] వెల్లడించాడు!   ఈ పొత్తువల్ల తెలంగాణా, సీమాంధ్రలలో "దేశం'' పార్టీ అనేక సీట్లు కోల్పోతుందని తాను హెచ్చరించినా వినలేదని ఆయన పేర్కొన్నాడు! అందువల్ల బాబును ఇరుప్రాంతాల ప్రజలూ విశ్వసించాలంటే కాంగ్రెస్ అధిష్ఠానానికి రాష్ట్ర విభజనకు అనుకూలతను వ్యక్తంచేస్తూ తాను రాసిన లేఖను ఉపసంహరించుకుని తెలుగుజాతి ఐక్యతను కాపాడడానికి సంసిద్ధతను ఈ ఆఖరి క్షణంలోనైనా బాహాటంగా వెల్లడించాలి. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ ను తాను ఎంత విమర్శించినా కనీసం ఆ పార్టీ అంతవరకూ విభజించినా "ఇరుప్రాంతాలకు సమన్యాయం చేయండి'' అంటూ చేస్తున్న ప్రకటనలను ఆపివేసి, రాష్ట్రాన్ని విభజించడానికి వీలులేదని స్పష్టాటిస్పష్టంగా ప్రకటించగల్గింది. కాని ఆ మాత్రపు సాహసం కూడా రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షనాయకుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా బాబు చేయలేకపోవటం దురదృష్టకరం!   "ఆత్మగౌరవ'' నినాదంతో ఎన్టీఆర్ ఆనాడు రాష్ట్రప్రజల మనస్సుల్ని చైతన్యవంతం చేయడంతో పాటు, అంతవరకూ తెలుగుజాతిని "మద్రాసీలు''గా మాత్రమే కేంద్రనాయకులతో సహా పిలుస్తున్న దశలో ఢిల్లీని గడగడలాడించి, జాతి గౌరవాన్ని పెంచాడు. కాని, ఈనాడు చంద్రబాబు కేసుల వలయంనుంచి బయటపడేందుకు స్వార్థప్రయోజనాల్ని ముందుకునెట్టి, తెలుగుజాతి గౌరవాన్ని ఫణంగా పెట్టి కూడా, తలపెట్టిన యాత్ర మాత్రం "ఆత్మగౌరవ''యాత్ర అనిపించుకోదు! ఆత్మగౌరవమే ఉంటే ఆదిలోనే అది ప్రస్ఫుటం కావాల్సింది!

ముఖ్యమంత్రి పర్యటన ముగిసిందలా

  మూడు రోజుల పర్యటనకని డిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేవలం ఒక్క రోజులోనే తన పర్యటన ముగించుకొని, ఈ రోజు రాత్రి హైదరాబాద్ తిరిగి వచ్చేస్తున్నారు. ఆయన తన ఒక్కరోజు పర్యటనలో అంటోనీ కమిటీని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగుని, ఆఖరుగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి రాబోతున్నారు. ఆయన విభజనను వద్దని మరోమారు కేంద్రానికి గట్టిగా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే విభజన ఆగదనే విషయన్నికేంద్రం కూడా అంతే ఖరాఖండిగా ఆయనకు చెప్పినట్లు సమాచారం. అయితే హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేసే వార్తలేవీ ఆయన పర్యటన సందర్భంగా వెలుగులోకి రాకపోవడం విశేషం. ఒకవేళ ఆ వార్తలు గాలి వార్తలయితే, ఆయన త్వరలోనే రాజీనామా చేయవచ్చును.   సమైక్యాంధ్రకు మద్దతుగా మాట్లాడుతున్న ఆయనను పదవి లోంచి వెంటనే దిగిపోవాలని పార్టీలో సీనియర్స్ కూడా కోరుతున్న ఈ తరుణంలోఆయన కూడా అట్టే ఎక్కువకాలం పదవిలో కొనసాగేందుకు ఇష్టపడటం లేదని సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలోపూర్తి స్థాయి ప్రభుత్వం ఉన్నపటికీ, అదిప్పుడు దాదాపు అచేతనావస్థలో ఉంది. అటువంటి ప్రభుత్వానికి నాయకుడిగా కొనసాగుతూ అప్రతిష్ట మూట గట్టుకోవడం కంటే రాజీనామా చేయడమే మేలనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెపుతున్నారు. మరి ఈ రోజు ఆయన డిల్లీ నుండి తిరిగి వచ్చిన తరువాత రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తారా లేక సోనియాగాంధీ తిరిగి వచ్చేవరకు ఆగుతారా? లేక గంటా శ్రీనివాసరావు చెపుతున్నట్లు శాసనసభలో తెలంగాణా బిల్లును ప్రవేశపెట్టేవరకు ఆగుతారా అనేది త్వరలోనే తేలిపోతుంది. ఆయన రాజీనామా చేసేందుకు కేవలం తగిన సమయం కోసమే ఎదురుచూస్తున్నారు.

చంద్రబాబు యాత్రపై ఎర్రబెల్లి అసంతృప్తి

      తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన తరువాత తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నెల రోజులు వేచి చూసి తప్పని సరి పరిస్థితులలో సీమాంధ్ర యాత్రకు బయలు దేరాడు. గుంటూరులో తెలుగుజాతి ఆత్మగౌరవయాత్ర మొదలు పెట్టిన చంద్రబాబు నాయుడు అసలు తెలంగాణను అడ్డుకున్నది తానేనని ప్రకటించారు. అయినా తెలంగాణ తెలుగుదేశం నేతలు చంద్రబాబుకు అనుకూలంగానే ఉన్నారు. విడిపోతున్నామన్న బాధలో ఉన్న సీమాంధ్రులను ఓదార్చేందుకే చంద్రబాబు యాత్ర అని సరిపెట్టారు. అయితే చంద్రబాబు మెల్లమెల్లగా సమైక్యవాదాన్ని తెరమీదకు తెచ్చారు. తెలుగుజాతిని విడదీస్తే ఒప్పుకోనని, పార్లమెంటులో మా పార్టీ ఎంపీలు తీవ్రంగా పోరాడుతున్నారని అన్నారు. ఈ పరిణామాలు మెల్లగా తెలంగాణ తెలుగు తమ్ముళ్లకు రుచించడం లేదు. తెలంగాణకు చంద్రబాబు వ్యతిరేకంగా మాట్లాడితే తాను కొత్త పార్టీ పెడతానని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పకుండానే చంద్రబాబు సమైక్య వాదం అందుకోవడం మీద తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారట. అయితే ఎర్రబెల్లి పార్టీ పెడితే వెళ్లే పరిస్థితి లేకున్నా చంద్రబాబు వ్యాఖ్యలు మాత్రం భరించలేకుండా ఉన్నాయని వారు అంటున్నారు.

హైదరాబాద్ యూటీగా ఒప్పుకోం

      తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ ను కేంద్ర పాలితప్రాంతంగా చేస్తామంటే ఒప్పుకోమని రాష్ట్ర మంత్రి దానం నాగేందర్, టీర్ఎస్ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, హరీష్ రావులు వేర్వేరుగా స్పందించారు. ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలనే రాష్ట్రాలుగా మారుస్తుంటే ఇప్పుడు యూటీ వాదన ఏంటి..దానికి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం అని దానం నాగేందర్ తేల్చిచెప్పారు. జాతీయ ఛానళ్లలో వచ్చిన యూటీ వార్తలు ఊహాగానాలని, హైదరాబాద్ ప్రజాప్రతినిధులం అంతా అంటోని కమిటీని కలుస్తామని ఆయన తెలిపారు.   హైదరాబాద్ యూటీ అంటే తాట తీస్తామని, అలాంటి ఆలోచన ఏది ఉన్నా వెనక్కి తీసుకోవాలని, తమకు దక్కనిది ఇంకొకరికి దక్కకూడదన్న ఆలోచన సీమాంధ్ర నేతలు చేస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ తెలంగాన ప్రజల రక్తమాంసాలతో నిర్మితమయిన నగరం అని దానిని యూటీ చేస్తామంటే చూస్తూ ఊరుకోమని ఈటెల రాజేందర్ హెచ్చరించారు. హైదరాబాద్ లో సమైక్య సభ పెడతామంటున్న ఏపీఎన్జీఓ నేతలు చిత్తూరులోనో, విశాఖలోనో, విజయవాడలోనో సభ పెట్టుకోవాలని, హైదరాబాద్ వచ్చి సభ పెడతామంటే కళ్లప్పగించి చూస్తూ ఉండమని అన్నారు. పుండు మీద కారం చల్లే చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు.

నారా లోకేష్ పందికొక్కా!

      తమ పార్టీ నేత రాహుల్ గాంధీని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముద్దపప్పుగా అభివర్ణించడంపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ పందికొక్కా అని ఆయన అడిగారు. లోకసభలో తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు బూతు పురాణాన్ని అబ్బించుకున్నారని, తెలుగుజాతి గౌరవాన్ని దిగజార్చారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలుగుదేశం పార్లమెంటు సభ్యుల తీరుపై ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపిలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.

ఏపీ యన్జీవోల సభకు అనుమతెందుకు

  ఏపీ యన్జీవోలు ఈ నెల 7న హైదరాబాదులో తలపెట్టిన భారీ బహిరంగ సభకు పోలీసులు అనుమతినీయడం, అదే సమయంలో టీ-జేఏసీ, ఓయు విద్యార్ధి జేఎసీలు తలపెట్టిన ర్యాలీలకు అనుమతి నిరాకరించడం వివాదస్పదమైంది. ఊహించినట్లుగానే టీ-కాంగ్రెస్, తెరాస తదితర తెలంగాణావాదులు పోలీసులను, వారి నిర్ణయం వెనుకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తప్పుపడుతున్నారు. మీడియాలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి అభీష్టం మేరకే ఏపీ యన్జీవోల సభకు పోలీసులు అనుమతినిచ్చారని వార్తలు ప్రచురితమయ్యాయి.   అయితే, ఈ నిర్ణయం వివాదాస్పదం అవుతుందని ముఖ్యమంత్రికి తెలియకనే ఆయన ఏపీ యన్జీవోల సభకు అనుమతినిచ్చారనుకోలేము. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా సమైక్యవాదిగా వాదిస్తున్నఆయన తన భవిష్యత్ సీమంధ్రతోనే ముడిపడి ఉంటుందనే సంగతి గ్రహించినందునే, బహుశః ఏపీ యన్జీవోల సభకు అనుమతించివచ్చును. తద్వారా మున్ముందు సీమంధ్రలోవారి మద్దతు పొందే అవకాశం ఉంటుంది.   ఈ నిర్ణయం వలన ఆయన ప్రస్తుతం తెలంగాణా నేతల నుండి విమర్శలు ఎదుర్కొన్నపటికీ దానివల్ల ఆయనకి నష్టం జరుగకపోగా మేలే జరుగుతుంది. ఆయనపై తెలంగాణావాదులు దాడిచేస్తున్న కొద్దీ సీమంధ్రలో ఆయన పట్ల ప్రజలకి మరింత సానుభూతి, మంచి అభిప్రాయం కలిగే అవకాశం ఉంది. ఇప్పటికే తన సమైఖ్యవాదంతో సీమంద్రాలో ‘డేరింగ్ యండ్ డాషింగ్ రియల్ హీరో’గా మంచి పేరు తెచ్చుకొన్న కిరణ్ కుమార్ రెడ్డి, ఈ సభకు అనుమతినీయడం ద్వారా ఏపీ యన్జీవోల మద్దతు పొందటం, తెలంగాణా వాదులను అడ్డుకొన్నకారణంగా మరింత గుర్తింపు పొందడం ఖాయం.

తెదేపా, వైకాపాలకు హైదరాబాద్ తో కాంగ్రెస్ చెక్ పెడుతుందా

  హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో ఇరు ప్రాంత ప్రజలకు అమోదయోగ్యమయిన విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోబోతున్నట్లు రక్షణ శాఖ మంత్రి ఎకె అంటోనీ సీమాంద్ర నేతలతో అన్నట్లు సమాచారం. ప్రస్తుతం సీమంధ్రలో ప్రజలు, ఉద్యోగులు, పార్టీలు విభజనను వ్యతిరేఖిస్తూ సమైక్యాంధ్ర ఉద్యమాలు చేస్తున్నపటికీ, హైదరాబాద్ విషయంలో వారికి అనుకూలమయిన నిర్ణయం జరిగితే వారు శాంతించే అవకాశం ఉందని, అదేవిధంగా హైదరాబాదులో ఉన్న ఆంధ్ర ఉద్యోగులు, ప్రజల భయాందోళనలు పోగొట్టేందుకు కూడా ఇదే సరయిన పరిష్కారమని కేంద్రం ఆలోచిస్తున్నట్లుంది.   అయితే, అందుకు టీ-కాంగ్రెస్ నేతలు, తెరాస ఇతర తెలంగాణావాదులు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోరని కేంద్రానికి తెలియకపోలేదు. కానీ, తెలంగాణా ప్రజల చిరకాల వాంఛ అయిన తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసినందుకు ప్రతిగా, ఈ తాత్కాలిక ప్రతిపాదనకు అంగీకరించమని కాంగ్రెస్ కోరవచ్చును. తద్వారా రాష్ట్ర విభజన ప్రక్రియను కూడా త్వరగా పూర్తి చేయగలిగే అవకాశముంటుందని వారికి కేంద్రం నచ్చజెప్పి, తనకు సహకరించవలసిందిగా కోరవచ్చును.   కాంగ్రెస్ పార్టీ తెరాసను తనలో విలీనం చేసుకోగలిగితే తన నిర్ణయాలను అమలుచేయడానికి పెద్దగా శ్రమ పడనవసరం లేదు. కానీ విలీనం అంత సులువు కాదు. విలీనం జరిగినా, జరుగకపోయినా కేంద్రం వారి కొన్ని డిమాండ్లకు అంగీకరించి వారిచే హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేందుకు అంగీకరింపజేసే అవకాశముంది.   అదే జరిగితే, తమ హక్కులు, భద్రత గురించి నిరవధిక సమ్మె చేస్తున్నఏపీ యన్జీవోలు కూడా వెనక్కి తగ్గే అవకాశముంది. దానితో ‘సమైక్యం-సమన్యాయం’ అంటూ ఉద్యమిస్తున్న తెదేపా, వైకాపాలు కూడా తమ ఆందోళనలు నిలిపివేయక తప్పదు. ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలించే అంశం.   ఈ నిర్ణయం తీసుకోవడానికి ఇంతా కాలం ఎందుకు జాప్యం చేసిందంటే, ముందే ఈ ప్రకటన చేసి ఉంటే, తెదేపా, వైకాపాలు ఈవిధంగా సమైక్య ఉద్యమాలు చేసేవి కావు, వైకాపా తెలంగాణాను వదులుకొనేది కాదు. పైగా ఆ రెండు పార్టీలు మరో సరికొత్త వ్యూహంతో, కొత్త డిమాండ్ తో తమను ఇబ్బందిపెట్టే అవకాశం ఉంది. ఒకప్పుడు తెలంగాణకు అనుకూలమని లేఖలు ఇచ్చిన వైకాపా, తెదేపాలను ఇంత కాలం సమైక్య ఉద్యమాలు చేయనిచ్చితమ వేలితో తమ కళ్ళు పొడుచుకొనేలా చేయడమే కాకుండా, ఇంతకాలం పాదయాత్రలు, బస్సు యత్రలతో ఇబ్బంది పెడుతున్న ఆ రెండు పార్టీల నేతలని ఈ నిర్ణయంతో చావు దెబ్బ తీయగలదు.   తెలంగాణా ఏర్పాటు చేసిన కారణంగా తెలంగాణా ప్రజల ఓట్లను, సీమంధ్ర ప్రజల ఒత్తిడికి లొంగి హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన కారణంగా సీమంధ్ర ప్రజల ఓట్లను కూడా దండుకోవచ్చునని కాంగ్రెస్ ఆలోచన. అదేవిధంగా నెలరోజులపైగా ఉద్యమాలు చేస్తున్నసీమంధ్ర ప్రజల అహం చల్లార్చి, వారికి తాము కేంద్రం మెడలు వంచామనే తృప్తి కలిగింపజేసి అంతిమంగా వారిచే గౌరవప్రదంగా ఉద్యమం విరమింపజేసేందుకే ఈ జాప్యమని భావించవచ్చును. అందుకే సమైక్యాంధ్ర ఉద్యమాలు ఎంత తీవ్రంగా సాగుతున్నపటికీ కాంగ్రెస్ అధిష్టానం దైర్యంగా తెలంగాణా ఏర్పాటుకి సిద్దపడుతోంది.   ఇక, తెలుగు ప్రజలకి, రాజకీయ పార్టీలకి ఆలోచించుకొనే వ్యవధి ఈయకూదదని కాంగ్రెస్ భావిస్తే ఈనెలలో లేదా వచ్చేనెలాఖరులోగానో మధ్యంతర ఎన్నికల ప్రకటన చేసినా ఆశ్చర్యం లేదు. రాష్ట్రంలో రెండుప్రాంతలలో పరిస్థితి తనకనుకూలంగా మారినట్లయితే కాంగ్రెస్ డిశంబర్ లో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలతో బాటు ఇక్కడ కూడా మధ్యంతర ఎన్నికలకు వెళ్ళినా ఆశ్చర్యం లేదు.

విభజనపై పునరాలోచించండి : సియం

  తెలంగాణ ప్రకటన తరువాత రెండోసారి ఢిల్లీ వెల్లిన కిరణ్‌కుమార్‌ రెడ్డి మరోసారి సమైక్యవాదాన్ని బలంగా వినిపించారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయం మీద పునరాలొచించాలని ఆంటోని కమిటీకి స్పష్టం చేశారు. మంగళ వారం రాత్రి ఆంటోని కమిటీని కలిసిన సీమాంద్ర జిల్లాలో జరుగుతున్న ఉద్యమతీవ్రతను కమిటీ ప్రతినిధులకు తెలియజేశారు. 35 రోజులుగా సీమాంద్ర జిల్లాలో లక్షల సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వస్తున్నారని, ఏ పార్టీ ప్రమేయం లేకుండానే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుందని ఆయన కమిటీ సభ్యులకు తెలియజేశారు. ప్రస్థుత పరిస్థితులో ప్రజలు నాయకుల మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరని, ప్రజల్లోకి వెళ్లాలంటే రాజీనామాలు చేయక తప్పని పరిస్థితి ఏర్పాడిందని చెప్పారు. సీమాంద్రలో ఒక్కసీటు కూడ గెలిచే అవకాశం లేదన్న ఆయన ఊరూరా జరుగుతున్న లక్షగళ ఘోష, 175 కిలో మీటర్ల మానవహారం లాంటి అంశాలను కమిటీ దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రవిభజన వల్ల సీమాంద్ర జిల్లాలకు తీరని అన్యాయం జరుగుతుందని అందుకే నిర్ణయంపై కేంద్ర పునరాలోచించాలని కోరారు. ప్రజల మనోభావాలు లెక్కచేయకుండా ముందుకు వెలితే పార్టీ మనుగడే కష్టమవుతుందని కమిటీకి తేల్చిచెప్పారు.