కాంగ్రెస్ మార్క్ పరిపాలన
posted on Sep 6, 2013 @ 10:14PM
కాంగ్రెస్ పార్టీ చేసిన రాష్ట్ర విభజనతో నేడు రాష్ట్రం అతలాకుతలం అవుతునపటికీ, ఆ విషయాన్ని పార్లమెంటులో రాష్ట్ర యంపీలు కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నపటికీ, కేంద్ర ప్రభుత్వంలోఎటువంటి చలనం కలగకపోవడం చాలా విచిత్రం. సాక్షాత్ ప్రధానికి రాష్ట్ర నేతలు వెళ్లి మొరపెట్టుకొన్నపటికీ పరిస్థితిని చక్కదిద్దడానికి ఆయన ఎటువంటి చర్యలు చెప్పటకపోవడం బాధ్యతా రాహిత్యమే. ఇక రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నకారణంగా ముఖ్యమంత్రి కూడా అంతే నిర్లిప్తత ప్రదర్శించడం చూస్తే రోమ్ నగరం తగులబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకొంటూ కూర్చొన్నసంగతి స్పురణకి రాక మానదు.
ఇక ప్రజలకు సరయిన మార్గదర్శనం చేయవలసిన రాజకీయపార్టీలు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను మరింత రెచ్చగొడుతూ బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తున్నాయి. వాటి సమ్మతితోనే రాష్ట్ర విభజన చేసినందున, ప్రస్తుత రాష్ట్ర పరిస్థితికి, తాము భాద్యులము కామన్నట్లు కాంగ్రెస్ అధిష్టానం చేతులు దులుపుకొంది. కానీ, ఆ పార్టీకి చెందిన సీమాంధ్ర నేతలే మొదటి నుండి విభజను వ్యతిరేఖిస్తూ వచ్చారు. ఇప్పటికీ వ్యతిరేఖిస్తూనే ఉన్నారన్న సంగతిని మాత్రం కాంగ్రెస్ అధిష్టానం మాట్లాడటం లేదు. అసలు ముందు తన పార్టీ నేతలపైనే పట్టు సాధించలేని కాంగ్రెస్ పార్టీ, ఇక రాష్ట్రంపై, ఇతర పార్టీలపై ఏవిధంగా పట్టు సాధించగలదు? బహుశః అందుకేనేమో నెల రోజులు పైగా రాష్ట్రం పూర్తిగా స్తంభించినా కాంగ్రెస్ అధిష్టానం చేష్టలుడిగి చూస్తోంది.
సీమాంధ్ర ప్రాంతమంతా ఉద్యమాలతో రగులుతుంటే, హైదరాబాదులో ఇరుప్రాంతల ఉదోగుల మధ్య కొట్లాటలు నిత్యకృత్యమయిపోయాయి. రేపు ఏపీ యన్జీవోలు, తెలంగాణావాదుల మధ్య ఘర్షణలు చెలరేగి, పరిస్థితులు చేయి దాటిపోయిన తరువాత కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొనవేమో? కాంగ్రెస్ పాలన ఎంత గొప్పగా ఉంటుందో రాష్ట్ర ప్రజలకు రుచి చూపిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.