డీజీపీ ఆస్తులపై సీబీఐ విచారణకు సుప్రీం ఆదేశం జారీ
posted on Sep 6, 2013 @ 12:59PM
డీజీపీ దినేష్ రెడ్డి, ఐపీయస్ ఆఫీసర్ ఉమేష్ కుమార్ మద్య గత కొంత కాలంగా సాగుతున్న ప్రచ్చన్న యుద్ధం ఈరోజు సుప్రీంకోర్టు డీజీపీ దినేష్ రెడ్డి ఆస్తులపై సీబీఐ విచారణకు ఆదేశించడంతో తారా స్థాయికి చేరింది. డీజీపీ దినేష్ రెడ్డి కొద్ది కాలం క్రితం ఉమేష్ కుమార్ పై హైకోర్టులో పిటిషను వేయడంతో, అతనిపై ఫోర్జరీ కేసు నమోదుచేసి కోర్టులో విచారణ సాగుతోంది. అందుకు ప్రతిగా ఉమేష్ కుమార్ కూడా సుప్రీంకోర్టులో డీజీపీ దినేష్ రెడ్డి ఆస్తులపై విచారణ కోరుతూ వేసిన పిటిషనుపై నేడు కోర్టు సానుకూలంగా స్పందిస్తూ సీబీఐకు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో తనపై క్రింద కోర్టులోఫోర్జరీ కేసు విచారణను నిలిపివేయమని ఉమేష్ కుమార్ పెట్టుకొన్న దరఖాస్తును తిరస్కరిస్తూ ఆ సంగతి క్రింద కోర్టులోనే తేల్చుకోమని సూచించింది. దీనితో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఒకరిపై మరొకరు వేసుకొన్నకేసులలో ఇరుకొన్నారు.
గతంలో మాజీ మంత్రి శంకర్ రావు కూడా డీజీపీ దినేష్ రెడ్డి అక్రమాస్తులు సంపాదించారని తీవ్ర ఆరోపణలు చేసి సీబీఐ విచారణ కోసం డిమాండ్ చేసారు. అయితే, పోలీసులు ఆయనను ప్రశ్నించినప్పుడు ఆయన ఎటువంటి ఆధారాలు చూపలేకపోవడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసారు. గ్రీన్ ఫీల్డ్స్ భూ భాగోతంలో పోలీసులు తనను అరెస్ట్ చేసినప్పటి నుండి శంకర్ రావు డీజీపీ దినేష్ రెడ్డిపై కత్తులు నూరుతున్నారు. అయితే ఆయనను ఏమీ చేయలేకపోయారు. తన చిరకాల కోరిక నేడు ఉమేష్ కుమార్ ద్వారా తీరబోతునందున శంకర్ రావు మీడియా ముందుకి వచ్చిఅదే విషయంపై హంగామా చేయవచ్చును.