రూ.10,250కే రాజ్యసభ సీటు!
ప్రస్తుత రాజకీయాలలో నెగ్గుకు రావాలంటే అంగబలం, అర్ధబలం చాలా అవసరమని అందరికీ తెలిసిన విషయమే. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ప్రజాసేవ ఇవ్వన్నీ ప్రజలను మభ్యపెట్టడానికి మన రాజకీయ నాయకులు అలవాటులో పొరపాటుగా చెప్పే మాటలయితే, టికెట్ల కోసం, మంత్రి పదవుల కోసం, అధికారం కోసం, కాంట్రాక్టుల కోసం వారు చేసే పైరవీలు పచ్చియదార్ధమని ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ, కులం, మతం, ప్రాంతం వగైరా వగైరా బలహీనతలతో బాధపడుతున్న ప్రజలను మభ్యపెట్టి ఎన్నికలలో గెలవడం రాజకీయ నాయకులకి ఉగ్గుపాలతో అబ్బిన విద్య గనుక, ప్రజల మద్దతు గురించి వారెన్నడూ దిగులు పడలేదు. పడరు కూడా. ఆ దైర్యంతోనే వారు చట్ట సభలలో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. టికెట్స్ కోసం పైరవీలు చేసుకొంటూ గెలవడానికి ఎంత ఖర్చు పెడుతున్నామో నిర్లజ్జగా ప్రకటిస్తున్నారు.
ఇటీవల శాసనసభ ఆవరణలో జేసి దివాకర్ రెడ్డి మరి కొందరు శాసనసభ్యుల మధ్య రాజ్యసభ సీటు కోసం దాదాపు కోటి రూపాయలు ఖరీదు చేసే వోల్వో బస్సులను బహుమతులుగా పంచడంపై జరిగిన చర్చ గురించి మీడియాలో ప్రజలందరూ చూసే ఉంటారు. మన రాజకీయ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో, ప్రజాస్వామ్యం ఎంత ఖరీదయినదో ఇది స్పష్టం చేస్తోంది.
రాజ్యసభ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నచైతన్యరాజు నిన్న ఒక ప్రముఖ తెలుగు న్యూస్ చానల్ ఇంటర్వ్యులో పాల్గొన్నప్పుడు, సదరు చానల్ వాళ్ళు “నలబై కోట్లు ఖర్చు చేయలేకనే జేసీ దివాకర్ రెడ్డి డ్రాపయిపోయితే, మీరయితే అంత ఖర్చు చేయగలరనే మిమ్మల్ని అభ్యర్ధిగా నిలబెట్టారట కదా? అని ప్రశ్నించినప్పుడు ఆయన, “నాది, నా భార్యదీ కలిపినా అంత మొత్తం ఆస్తి లేదు. నేను కేవలం రూ.250 పెట్టి ఒక దరఖాస్తు, రూ.10వేలు డిపాజిట్ మాత్రమె కట్టాను” అని గడుసుగా జవాబిచ్చారు.
జేసీ లెక్క ప్రకారం ఒక శాసనసభ్యుడి మద్దతు ఖరీదు ఒక వోల్వో బస్సు అనుకొంటే, మరి చైతన్యరాజు గెలవడానికి కనీసం 36 నుండి 39మంది సభ్యుల మద్దతు అవసరమయితే దానికి ఎంతవుతుందో ఆ మాష్టారుకి తెలియకపోదు. అయినా, కేవలం రూ.10,250 తో రాజ్యసభకు పోటీచేస్తున్నాని చెప్పడం, ప్రజలని కూడా ఆయన చిన్న పిల్లలనుకొని పాటాలు చెప్పబోవడమే అవుతుంది. ఏమయినప్పటికీ, ఆయనకీ మద్దతుగా సంతకాలు పెట్టినవారిలో కొందరు పార్టీ నుండి హెచ్చరికలు అందుకొన్నాక తమ మద్దతు ఉపసంహరించుకొంటున్నట్లు ఎన్నికల అధికారికి లేఖలు వ్రాసారు. చైతన్యరాజు ఎలాగూ కేవలం రూ.10,250 మాత్రమే ఖర్చు చేసానని చెప్పుకొంటున్నారు గనుక, ఒకవేళ ఓడిపోయినా పెద్దగా బాధపడనవసరం కూడా ఉండదు.