మెజార్టీతో గెలిపించండి: రాష్ట్రపతి
posted on Jan 27, 2014 @ 11:02AM
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశ్యించి ప్రసంగించిన రాష్ట్రపతి “వచ్చేఎన్నికలలో ప్రజలు ఏదో ఒక పార్టీకి స్పష్టమయిన మెజారిటీతో గెలిపించవలసిన అవసరం ఉందని, అప్పుడే దేశంలో స్థిరమయిన రాజకీయ వ్యవస్థ ఏర్పడి, దేశం అన్ని రంగాలలో నిలకడగా అభివృద్ధి సాధించగలదని” అన్నారు. రాహుల్-మోడీల రాజకీయ భవిష్యత్తుని నిర్దేశించబోయే వచ్చేఎన్నికలు కాంగ్రెస్, బీజేపీలకు జీవన్మరణ పోరాటం వంటివి గనుక, ఆ రెండు పార్టీల మధ్య జరిగే తీవ్రమయిన పోటీలో దేశప్రజలు రాహుల్-మోడీల మధ్య రెండుగా చీలిపోతే ఎవరికీ పూర్తి మెజార్టీ రాకపోవచ్చని ఆయన అభిప్రాయం కావచ్చును.
గత పది సం.లలో దేశంలో ప్రాంతీయ పార్టీలు బాగా బలపడటంతో, అవి కేంద్రప్రభుత్వ మనుగడను కూడా శాసించే స్థాయికి ఎదిగాయి. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలు పేరుకి జాతీయపార్టీలే అయినా, వాటంతట అవి పూర్తి మెజార్టీ సాధించే పరిస్థితులు లేవు. కేంద్రంలో ఏ కూటమి అధికారంలోకి రావాలన్నాతప్పనిసరిగా ప్రాంతీయ పార్టీలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సర్వసాధారణమే అయినప్పటికీ, రాజకీయాలలో, పార్టీలలో, ప్రజాప్రతినిధులలో నైతిక విలువలు దిగజారిన ఈ పరిస్థితుల్లో, కేంద్రానికి మద్దతు ఇస్తున్నకారణంగా ప్రాంతీయ పార్టీలు, అదేవిధంగా పెద్దన పాత్ర పోషిస్తున్నకారణంగా కేంద్రం ప్రాంతీయ పార్టీలను తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం ఒకరినొకరు తరచు చెయ్యి మెలిపెట్టుకొంటూ పరిపాలన సాగిస్తుంటే కేంద్రంలో, రాష్ట్రాలలో కూడా బలహీనమయిన ప్రభుత్వాలు ఏర్పడటం వలన దేశ అభివృద్ధి కుంటుపదుతుంది. గనుకనే, ప్రజలందరూ సరయిన పార్టీకి పూర్తి మెజార్టీ కట్టబెట్టాలని రాష్ట్రపతి కోరారు.
కాంగ్రెస్, బీజేపీలు ఆయన సూచనను ఆహ్వానించినప్పటికీ, రెంటికీ గెలుపు అత్యావశ్యకం గనుక పోటాపోటీగా ప్రచారం చేసి ప్రజలను తమవైపు త్రిప్పుకొనే ప్రయత్నం చేస్థాయి. వీటికి తోడు ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలతో వాటి పొత్తులు, ప్రాంతీయ సమస్యల తీవ్ర ప్రభావంతో ప్రజలు కూడా ఆ రెండు పార్టీల మధ్య చీలిపోవడం ఖాయం. కానీ ఇంతవరకు వెలువడుతున్న సర్వేలనీ దేశ వ్యాప్తంగా ప్రజలు నరేంద్ర మోడీకి అనుకూలంగా ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి. కానీ, ఈ సారి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టలేకపోయినట్లయితే, ఆయనకి మళ్ళీ ఎప్పుడూ ఆ అవకాశం వస్తుందో, అసలు వస్తుందో రాదో కూడా తెలియదు గనుక, వచ్చేఎన్నికలలో గెలిచేందుకు కాంగ్రెస్ తన సర్వశక్తులు ఒడ్డి పోరాడుతుంది. ఆ పరిస్థితుల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది మిలియన్ డాలర్ ప్రశ్న. కానీ ఎవరికి పట్టం కట్టదలచుకొన్నా పూర్తి మెజార్టీతో పట్టం కట్టమని రాష్ట్రపతి సలహా.