శాసన సభలోగందరగోళం..స్పీకర్ కు సలహా
posted on Jan 27, 2014 @ 11:22AM
సోమవారం ఉదయం శాసన సభ ప్రారంభం అయిన కాసేపటికే గందరగోళం చెలరేగటంతో వాయిదా పడింది. సభలో పలు తీర్మానాలు చేయాలని సభ్యులు ఇచ్చిన వినతిపత్రాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. అదే విధంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన నోటీసును కూడా తిరస్కరించాలని తెలంగాణ ప్రాంత నేతలు డిమాండ్ చేస్తూ పోడియం చుట్టుముట్టారు. సమైక్యాంధ్ర తీర్మానం చేయాలని, బిల్లును వెనక్కి పంపాలని సీమాంధ్ర నేతలు పోడియం చుట్టుముట్టారు. దీంతో సభలో గందరగోళం రేగింది. సభలో చర్చ జరిగేందుకు సభ్యులు సహకరించాలని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా సభ్యులు సహకరించకపోవడంతో స్పీకర్ సభను అరగంట పాటు వాయిదా వేశారు.
మరోవైపు సభాపతి నాదెండ్ల మనోహర్‌కు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రపతి పంపించింది డ్రాఫ్ట్ బిల్లు కాదని అసలు బిల్లేనని అందులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఏకపక్షంగా నోటీసు ఇచ్చారని, దానిని తిరస్కరించాలని కోరారు. నోటీసు పైన తుది నిర్ణయం స్పీకర్‌దేనని చెప్పారు. మరోవైపు కిరణ్ ఇచ్చిన లేఖను తిరస్కరించాలని తెలంగాణ ప్రాంత మంత్రులు మరోసారి సభాపతికి లేఖ రాశారు.