కిరణ్ దిగ్విజయ్ కి మొహం చాటేస్తారా

  రాజ్యసభ ఎన్నికలలో సీమాంధ్ర కాంగ్రెస్ శాసనసభ్యులు పార్టీ అభ్యర్ధికి వ్యతిరేఖంగా తమ అభ్యర్ధిని నిలబెత్టేందుకు సిద్దమవుతుండటంతో కాంగ్రెస్ అధిష్టానానికి ముచ్చెమటలు పడుతున్నాయి. ఈరోజు పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ డిల్లీ వెళ్లి పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ తో రాజ్యసభ అభ్యర్ధుల విషయంలో మంతనాలు చేస్తున్నారు.   కాంగ్రెస్ అధికారిక అభ్యర్ధుల మాటెలా ఉన్నా, తిరుగుబాటు అభ్యర్దులలో కూడా మళ్ళీ తీవ్రమయిన పోటీ నెలకొంది. ఇంతవరకు జేసీ.దివాకర్ రెడ్డి, గంటా శ్రీనివాస రావుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తుంటే ఇప్పుడు వారికి ఉండవల్లి అరుణ్ కుమార్, యం.యల్సీ. చైతన్య రాజు కూడా తోడయ్యారు. వారిలో జేసీ దివాకర్ రెడ్డి తనకు 40మంది శాసనసభ్యుల మద్దతు ఉందని చెప్పుకొంటుండగా, చైతన్యరాజు తనకి 52మంది మద్దతు ఉన్నట్లు చెప్పుకొంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒకవేళ రేపు పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ ని కలిసేందుకు డిల్లీ వెళ్ళినట్లయితే ఈ పరిస్థితులు మారిపోయినా ఆశ్చర్యం లేదు. ఈరోజు శాసనసభలో తెలంగాణా బిల్లుని చాలా ధాటిగా త్రిప్పికొట్టిన ఆయన రేపు డిల్లీకి వెళ్ళకుండా తమ తరపున వీరిలో ఎవరో ఒకరి పేరుని ఆయన ప్రతిపాదించవచ్చును.

బిల్లుని తిప్పి పంపేయమని కోరిన ముఖ్యమంత్రి

  కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ నిన్నముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి తెలంగాణా బిల్లును వీలయినంత త్వరగా చర్చ ముగించి వెనక్కి పంపాలని కోరినట్లు చెప్పారు. బహుశః అందుకేనేమో, ఈరోజు శాసనసభలో తెలంగాణా బిల్లుపై చర్చలో మాట్లాడుతూ లోపభూయిష్టమయిన టీ-బిల్లుని, దానిని ఆవిధంగా రూపొందించిన హోంశాఖను, కేంద్రాన్ని, చివరికి తన అధిష్టానాన్ని కూడా తూర్పార బట్టిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇటువంటి తప్పుల తడక బిల్లుపై ఇంకా సభలో చర్చఅవసరం లేదని దానిని వెంటనే వెనక్కి త్రిప్పిపంపమని స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు నోటీసు ద్వారా కోరారు.    ఆ తరువాత మాట్లాడిన తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ముఖ్యమంత్రిపై, కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర విమర్శలు గుప్పించిన తరువాత ఆయన కూడా ఇటువంటి లోపభూయిష్టమయిన బిల్లుపై చర్చించవలసిన అవసరం లేదని వెంటనే త్రిప్పి పంపమని స్పీకర్ ను కోరారు. అదేవిధంగా శాసనమండలిలో మంత్రి సి.రామచంద్రయ్య కూడా సరిగ్గా ఇదే కారణాలతో బిల్లును వెనక్కి త్రిప్పిపంపాలని మండలి చైర్మన్ చక్రపాణికి నోటీసులు ఇచ్చారు.   ఒకవైపు బిల్లుపై చర్చ జరగడానికి ఇంకా గడువు కావాలంటూనే, ఏవో కారణాలు చెప్పి బిల్లుని గడువు కంటే ముందే వెనక్కి త్రిప్పిపంపేయాలని కోరడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ గమ్మతయిన విషయం ఏమిటంటే, బిల్లుని ఎంత త్వరగా వెనక్కి పంపుదామా అని ఎదురు చూస్తున్న టీ-కాంగ్రెస్ నేత కే.జానారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రపతి సభలో చర్చించమని పంపిన బిల్లును ఒక ముఖ్యమంత్రో లేక ప్రతిపక్ష నాయకుడో త్రిప్పి పంపమని అడిగే అధికారం ఉందా? తెలుపమని స్పీకర్ ని కోరారు. ఆయన ప్రశ్నకు చంద్రబాబు బదులిస్తూ, మనం ఎవరికీ బానిసలు కామని, సభ్యులందరికీ స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుందని అన్నారు. బిల్లు లోపభూయిష్టంగా ఉన్నట్లయితే త్రిప్పి పంపమని అడిగే హక్కు ఉంటుందని ఆయన అన్నారు   రాష్ట్ర విభజన బిల్లును వెనక్కి త్రిప్పి పంపాలని స్పీకర్ కి నోటీసులిచ్చిన ముఖ్యమంత్రి బిల్లుని ఏకమొత్తంగా తిరస్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి హోదాలో ఒక తీర్మానం ప్రవేశపెట్టబోతున్నట్లు తాజా సమాచారం. ఆవిధంగా చేయడం ద్వారా అధిష్టానం ఆదేశాల మేరకు బిల్లుని వీలయినంత త్వరగా వెనక్కి త్రిప్పి పంపుతున్నపటికీ, తనపై ఎటువంటి  నింద పడకుండా, తాను బిల్లును గట్టిగా వ్యతిరేఖిస్తున్నట్లు చెప్పుకొనే సౌలభ్యం కూడా ఆయనకి ఉంటుంది. బిల్లుని తిరస్కరిస్తూ తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు, దానిపై తెలంగాణా సభ్యులందరూ ఆయనపై చెలరేగిపోవడం ఖాయం గనుక అది కూడా ఆయనకు సీమాంధ్రలో సానుభూతిని సంపాదించి పెడుతుంది.     అదేవిధంగా తెలంగాణా సభ్యులందరూ ఆయన పెట్టబోయే తీర్మాన్నాన్ని, ఆయనని ఎంతగా విమర్శించినప్పటికీ, ఆ తీర్మానం వలననే బిల్లు గడువు కంటే ముందుగానే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుందని తెలుసు గనుక ఆయనకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకోకుండా ఉండరు.    .  

టీ-బిల్లుని ఎండగట్టిన ముఖ్యమంత్రి

  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణా బిల్లుపై ఈరోజు శాసనసభ లో జరుగుతున్నచర్చసందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర విభజన చేసేందుకు బిల్లు రూపొందిస్తున్నపుడు అందులో తప్పనిసరిగా పేర్కొనవలసిన అనేక అంశాలను కేంద్రం, హోంశాఖ పూర్తిగా విస్మరించాయని, కనీసం ఆ వివరాలను కోరినప్పుడయినా పొంతనలేని సమాధానాలు చెపుతూ ఇవ్వడానికి నిరాకరించిందని కేంద్రాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన రాజ్యాంగంలో సూచించిన కొన్నినియమాలను చదివి వినిపించి, కేంద్రం కనీసం రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా నయినా బిల్లు రూపొందించలేకపోయిందని ఆక్షేపించారు.   ఒక రాష్ట్రాన్ని విభజిస్తున్నపుడు దానివలన రెండు ప్రాంతాలకు, ప్రజలకు ఏవిధంగా ప్రయోజనం కలుగుతుందో, విభజనకు కేంద్రం ఏవిధమయిన ఏర్పాట్లు చేస్తోందో, అందులో ఇమిడి ఉన్నఅనేక ఆర్ధిక అంశాలను ఏవిధంగా పరిష్కరించబోతోందో, నిధులను ఏవిధంగా సమకూర్చదలచుకొందో వంటి ముఖ్యమయిన వివరాలను బిల్లులో పొండుపరచకుండా, చేస్తాం, చూస్తాం, ఆలోచిస్తాం, పరిశీలిస్తాం అంటూ చేతులు దులుపుకొనే ప్రయత్నం చేసిందని తీవ్రంగా ఆక్షేపించారు. కేంద్రం తనేవిధంగా రాష్ట్ర విభజన చేయదలచుకున్నదీ వివరించకుండా, ఇటువంటి అసమగ్రమయిన బిల్లుని శాసనసభకి పంపితే తాము దానిపై ఏవిధంగా చర్చించగలమని ఆయన ప్రశ్నించారు. అసలు ఇది బిల్లా లేక ముసాయిదా బిల్లో కూడా తెలియని పరిస్థితని ఆయన ఆక్షేపించారు.

తెలంగాణా ఏర్పాటుకి తెరాస విలీనంతో లంకె ఉందా

  రాష్ట్ర విభజనతో ప్రత్యర్ధ రాజకీయ పార్టీలను దెబ్బతీయాలని చూసిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అదే కారణంగా సీమాంధ్ర కాంగ్రెస్ నేతల తిరుగుబాటుని, ప్రజలలో వ్యతిరేఖతని ఎదుర్కోకతప్పడం లేదు. అయితే ఇది కూడా ప్రతిపక్షాలను ఏమార్చడానికి వేసిన ఎత్తుగడ అయినా ఆశ్చర్యం లేదు. ఎన్నికలలోగా రాష్ట్ర విభజన చేస్తామని చెపుతున్న కాంగ్రెస్ పార్టీ, సీమాంధ్రలో కాంగ్రెస్ నేతలు తిరుగుబాటు చేస్తున్నకారణంగా అభ్యర్ధులను ఖరారు చేయలేకపోతుంటే, తెరాస తమతో విలీనం అవుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొని ఉండటం వలన తెలంగాణాలో అభ్యర్ధులను ఖరారు చేయలేకపోతోంది. అందువల్ల సీమాంధ్రలో కిరణ్ కుమార్ రెడ్డో మరొకరో కొత్తపార్టీ స్థాపించిన తరువాత, పార్టీలో ఇంకా ఎంత మంది మిగులుతారో లెక్కలు సరిచూసుకొని అప్పుడే తన అభ్యర్ధులను ప్రకటించవచ్చును.   అదేవిధంగా తెలంగాణాలో తెరాసతో పొత్తులు, విలీనం లెక్కలు తెలితేగానీ, ఆ రెండు పార్టీలు తమ అభ్యర్ధుల పేర్లను ప్రకటించలేవు. తెరాస అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు డిశంబర్ రెండవ వారంలోనే తమ అభ్యర్దుల తొలి జాబితా ప్రకటిస్తానని గతంలో చెప్పినప్పటికీ ఇంతవరకు ప్రకటించలేకపోవడానికి కారణం కూడా బహుశః ఇదే అయిఉండవచ్చును. ఆ రెండు పార్టీలు వచ్చే ఎన్నికలలో చేతులు కలుపుతాయా లేదనే సంగతి పార్లమెంటులో తెలంగాణా బిల్లు పెట్టిన తరువాతనే తేలవచ్చును.   అయితే, వచ్చేఎన్నికలలో తెరాసకే మెజార్టీ రావచ్చని సర్వేలు స్పష్టం చేస్తుండటంతో, తెలంగాణా బిల్లు ఆమోదం పొందినా, పొందకపోయినా తెరాస కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపేందుకు ఇష్టపడకపోవచ్చును. అదే జరిగితే, రాష్ట్ర విభజన చేసి రెండు ప్రాంతాలలో లబ్ది పొందాలని ఎత్తువేసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో కూడా ఘోరంగా దెబ్బతినడం ఖాయం. ఒకవేళ ఎన్నికలలోగా కాంగ్రెస్ తెలంగాణా ఏర్పాటు చేసినప్పటికీ, ఆ క్రెడిట్ మొత్తం తెరాస ఎత్తుకుపోవడం ఖాయం. ఎందుకంటే, వచ్చే ఎన్నికలలో తెలంగాణా సెంటిమెంటు చాలా బలంగా ఉంటుంది గనుక, దానిని, తెరాసను తట్టుకొని కాంగ్రెస్ ఒంటరిగా గెలవలేదు. గనుక, ఎట్టిపరిస్థితుల్లో పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందక మునుపే, కాంగ్రెస్ పార్టీ తెరాసను విలీనం లేదా ఎన్నికల పొత్తుల కోసం ఒత్తిడి చేయవవచ్చును. ఒకవేళ తెరాస విలీనానికి లేదా పొత్తులకి అంగీకరించకపోయినట్లయితే, తెలంగాణా బిల్లును రాష్ట్రపతి వద్ద త్రోక్కిపెట్టించో లేకపోతే బీజేపీని రెచ్చగొట్టి బిల్లుకి మద్దతు ఈయకుండా చేసి నెపం దానిమీద పెట్టో పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదింపజేయకుండా తప్పుకొని, సీమాంధ్రలో తన రహస్య మిత్రులను గెలిపించుకొనే ప్రయత్నం చేయవచ్చును. తద్వారా కొంత మేరయినా నష్టం తగ్గించుకోగలదు.

ఎన్టీఆర్ మానవతా వాది: రేవంత్

      నందమూరి తారకరామారావు సమైక్యవాది అని ముద్ర వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కానీ ఆయన గొప్ప మానవతా వాది అని రేవంత్ రెడ్డి అన్నారు. విభజన బిల్లుపై చర్చ సంధర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ...తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించడానికే ఎన్టీఆర్ టిడిపి పార్టీ స్థాపించారని అన్నారు. తెలంగాణ యువతకు అన్యాయం జరిగిందని ఎన్టీఆర్ భావించారని, ఆయన తీసుకున్న నిర్ణయాల కారణంగానే కేసీఆర్, ఎర్రబెల్లి, బాలయోగి, ఎర్రన్నాయుడు, యనమల, దేవేందర్ గౌడ్, తుమ్మల నాగేశ్వరరావు తదితర ఆణిముత్యాల వంటి నేతలు ఈ దేశానికి లభించారని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ పేదల పక్షపాతి అని, పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకువచ్చి ఆయన ప్రజలకు మేలు చేశారని అన్నారు.

డిఎంకె పార్టీలో రచ్చకెక్కిన విభేదాలు

      డిఎంకె పార్టీలో కుటుంబ, పార్టీ విభేదాలు రచ్చకెక్కాయి. కరుణానిధి ఏకంగా తన తనయుడినే పార్టీ పదవుల నుండి బహిష్కరించడంతో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పార్టీ నుండి బహిష్కరణకు గురైన కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి పార్టీపై మండిపడ్డారు. తన తండ్రిని కొ౦త మంది బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని అన్నారు. డీఎంకేలో ప్రజాస్వామ్యం లెదని..కార్యకర్తలకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడంతో బహిష్కరించారని అన్నారు. డిఎంకె పార్టీ విజయకాంత్ నేతృత్వంలోని డిఎండికెతో పొత్తు ప్రయత్నాలు చేస్తోంది. దీనిని అళగిరి, ఆయన వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కరుణ వ్యూహం అమలు కానున్న తరుణంలో ఎంపీ అళగిరి ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్‌కాంత్‌పై విమర్శలకు దిగారు. విమర్శలు చేసినందుకు అళగిరిని కరుణ తీవ్రంగా మందలించారు. డిఎంకెలో కీలక బాధ్యతలు చేపట్టే విషయంలో కరుణానిధి కుమారులు అళగిరి, స్టాలిన్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే.

తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం ఖాయ౦: కమల్‌నాథ్

      ఫిబ్రవరి 5 నుంచి మొదలుకానున్న పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం ఖాయమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ ధీమా వ్యక్తం చేశారు. అవసరమైతే పార్లమెంటు సమావేశాలు పొడిగించైనా తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా చూస్తామని పేర్కొన్నారు. పార్లమెంటులో బిల్లును త్వరగా ప్రవేశపెట్టాల్సిన అవసరాన్ని' దృష్టిలో ఉంచుకుని గడువు వారం మాత్రమే పెంచుతున్నట్లు రాష్ట్రపతి తన ఆదేశాల్లోనే పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కమల్‌నాథ్ చేసిన ప్రకటనతో వచ్చేనెలలో బిల్లు ప్రవేశపెట్టడం ఖాయమని తెలిసిపోతోంది. వచ్చేనెల 5 నుంచి 20వ తేదీ వరకు పార్లమెంటు సమావేశ పరచాలని కేంద్రం నిర్ణయించుకుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తోపాటు మరికొన్ని కీలక బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది.

అనూహ్య హత్య: షిండేని కలిసిన తండ్రి

      ముంబై నగర శివార్లలో కాలిన శవమై లభించిన మహిళ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనూహ్య తండ్రి ప్రసాద్ శుక్రవారం కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేని కలిసి తమకు న్యాయం చేయాలని, దోషులను త్వరగా పట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. తన కూతురిని వెతుకుతూ తాను అనుభవించిన మనోవేదన ఏ తల్లిదండ్రులకు రాకూడదని ఆయన షిండేతో అన్నారు. అనంతరం ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ జరిగిన దుర్ఘటన గురించి షిండేకు తెలిమజేశామని అన్నారు. కేసు విషయంలో పోలీసులు కూడా తమకు సహాయపడడంలేదని, తమ కుమార్తె అదృశ్యమైనప్పటి నుంచి ఆచుకీ కోసం స్వయంగా తామే గాలించామని, చివరికి పదిరోజుల తరువాత తను మృతదేహం లభించింది. మాకు కలిగిన ఈ బాధ మరే తల్లిదండ్రులకి రాకూడదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

శాసనసభలో టీఆర్ఎస్ వర్సెస్ టిడిపి

      తెలంగాణ బిల్లుపై శాసనసభలో తీవ్ర గందరగోళం మధ్య చర్చ జరుగుతోంది. సభలు పలుమార్లు టీఆర్ఎస్, టిడిపి సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగింది. విభజన బిల్లుపై టీఆర్ఎస్ నేత జోగురామన్న మాట్లాడుతూ తెలంగాణకు ప్రధాన అడ్డంకి చంద్రబాబు నాయుడే అని, టీడీపీ వైఖరి వల్లే వేలాది మంది ఆత్మహత్య చేసుకున్నానరని జోగు రామన్న ఆరోపించారు. దీనిపై సభలో కొద్ది సేపు గందరగోళం నెలకొంది. జోగురామన్న వ్యాఖ్యలపై టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అవకాశవాదం వల్లే తెలంగాణలో వేలాది మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని మండిపడ్డారు. అమరవీరుల కుటుంబాలకు అడుగడునా ఆదుకున్నది టీడీపీనే అని తెలియజేశారు.

సల్మాన్ 'జయహో': అసద్ కు కౌంటర్

      బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ మీద ప్రశంసల జల్లు కురిపించి మద్దతు ప్రకటించడంపై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ సినిమాలను బహిష్కరించాలని తన మద్దతుదారులకు పిలునిచ్చారు. తాజాగా దీనిపై సల్మాన్ ఖాన్ స్పందించారు. నరేంద్ర మోదీని కలవడాన్ని ఆయన సమర్ధించుకున్నారు.   జయహో చిత్రం ప్రోమోషన్ కోసం గుజరాత్ వెళ్లానని..పతంగులు ఎగురవేశానని చెప్పారు. తాను సగం హిందూ..సగం ముస్లీంనని అన్నారు. అలాగే తన తండ్రి ముస్లిం అని, తన తల్లి హిందువు అని చెప్పారు.గుజరాత్ రాష్ట్రంలో ముస్లిం సోదరులు బాగా అభివృద్ధి చెందుతున్నారని చెప్పారు. ''జయహో'' మంచి మెసేజ్ వున్నా చిత్రమని అందరూ తప్పక చూడాలని అన్నారు.      

కాంగ్రెస్ లోకి అరవింద రెడ్డి!

      ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరవింద రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. రాబోయే ఎన్నికల్లో తనకు సీటు ఇస్తామని హామీ ఇస్తే పార్టీలో చేరతానంటూ కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కలిసి చెప్పినట్లు సమాచారం. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ...తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని అరవింద్ రెడ్డి చెప్పారు. ఢిల్లీ లో కాంగ్రెస్ పెద్దలను కలిసిన మాట వాస్తవమేనని..తెలంగాణ ప్రజల పక్షానే ఉన్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అరవింద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్‌తో ఆయనకు సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయంటున్నాయి పార్టీ వర్గాలు.

విజయవాడ టికెట్ ఇస్తే పొట్లూరి తెదేపా గూటికి

  కొన్ని రోజుల క్రితం ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు సినీ నిర్మాత పొట్లూరు వర ప్రసాద్ త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి, విజయవాడ నుండి పోటీ చేయబోతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ, జగన్మోహన్ రెడ్డిని తట్టుకొని పార్టీలో ఎక్కువకాలం కొనసాగడం కష్టమని గ్రహించిన ఆయన వైకాపాలో చేరే ఆలోచనను విరమించుకొన్నారు. అయితే, ఇదంతా జగన్మోహన్ రెడ్డిని, వైకాపాని అప్రదిష్టపాలు చేసేందుకు చంద్రబాబు, ఆయనకి అనుకూలంగా ఉండే మీడియా చేసిన కుట్రే తప్ప తామేనాడు పొట్లూరిని పార్టీలోకి ఆహ్వానించలేదని, టికెట్ కూడా ఆఫర్ చేయలేదని వైకాపా వాదించింది.   తాజా సమాచారం ఏమిటంటే పొట్లూరి తెదేపాలో చేరే ప్రయత్నంలో కృష్ణా జిల్లాకు చెందిన ఒక ప్రముఖ తెదేపా నాయకుడుని వెంటబెట్టుకొని మొన్న చంద్రబాబుని కలిసి విజయవాడ లోక్ సభ టికెట్ కోసం అభ్యర్ధించినట్లు తెలుస్తోంది. కానీ, ఆ సీటు ఇప్పటికే కేశినేని నానికి కేటాయించినందున దానిని ఆయనకు ఇవ్వడం సాధ్యం కాదని, వేరెక్కడి నుండయినా పోటీ చేసేందుకు సిద్దపడితే ఆలోచిస్తామని చంద్రబాబు జవాబు చెప్పినట్లు తెలుస్తోంది. గతేడాది చంద్రబాబు పాదయాత్ర చేసినప్పుడు విజయవాడ సీటుని ఆశిస్తున్న వల్లభనేని వంశీని తప్పించి, కేశినేని నానికి అప్పగించారు. దానితో వంశీ చాలా ఆగ్రహించినపుడు, ఆయనకు గన్నవరం శాసనసభ టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని సమాచారం. అందువల్ల ఇప్పుడు పొట్లూరి విజయవాడ టికెట్ ఆశించినా ఇవ్వలేని పరిస్థితి.   పొట్లూరి కృష్ణాజిల్లాలో కొందరు తెదేపా శాసనసభ్యులను కలిసి వారి మద్దతు కూడగట్టుకొనే ప్రయత్నం చేసారు. కానీ వారెవరూ కూడా పార్టీ అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేఖంగా వెళ్లేందుకు సిద్దపడకపోవడంతో పొట్లూరి చివరి ప్రయత్నంగా నేరుగా చంద్రబాబునే కలిసి మాట్లాడారు, కానీ ఫలితం లేకపోయింది. ఈసారి ఎన్నికలలో పోటీ చాలా తీవ్రంగా ఉండబోతునందున, చంద్రబాబు అభ్యర్దుల ఎంపికలో చాలా ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. మరో పక్క నారా లోకేష్ కూడా వేరేగా ఎప్పటికప్పుడు నియోజక వర్గాల వారిగా సర్వేలు నిర్వహింపజేయిస్తూ గెలుపు గుర్రాల పేర్లను తండ్రికి సూచిస్తునట్లు సమాచారం.   ఒకవేళ పొట్లూరి విజయవాడ కోసం పట్టుబట్టకుండా వేరే చోట నుండి పోటీకి అంగీకరించినప్పటికీ, తెదేపా టికెట్స్ కోసం చాలా ఒత్తిడి ఉన్నకారణంగా ఆయనకు ఎక్కడి నుండి టికెట్ కేటాయించాలన్నాచాలా కష్టమే అవుతుంది. అయినప్పటికీ, ఒకవేళ పొట్లూరి అందుకు అంగీకరిస్తే చంద్రబాబు ఏదోవిధంగా సర్దుబాటు చేయవచ్చునేమో! ఒకవేళ పొట్లూరి విజయవాడ టిక్కెటే కావాలనుకొంటే, ఆయన తరువాత గమ్యం కాంగ్రెస్ పార్టీ కావచ్చును. ఎందుకంటే విజయవాడ కాంగ్రెస్ యంపీ లగడపాటి రాజగోపాల్ అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగురవేసి కిరణ్ కుమార్ రెడ్డి లేదా తనే స్వయంగా స్థాపించబోయే కొత్త పార్టీ టికెట్ మీద పోటీ చేయబోతున్నారు గనుక, పోట్లూరికి కాంగ్రెస్ పార్టీలో టికెట్ దొరికే అవకాశం ఉంది. కానీ, సీమాంధ్రలో తీవ్ర ప్రతికూలత ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేయడమంటే అది మరొక వర్ణ చిత్రమే అవుతుంది ఆయనకు. గనుక తన కల నెరవేర్చుకోవడానికి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయవలసి ఉంటుంది. కానీ, అది కూడా చాలా భారీ ఖర్చు, రిస్కుతో కూడిన వ్యవహారమే గనుక, పొట్లూరి ఏమి చేయబోతున్నారో తెలుసుకోవాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

రాజ్యసభ ఎన్నికలకు వైకాపా దూరం!

  వచ్చిన ఏ అవకాశాన్నివదులుకోవడానికి ఇష్టపడని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తనకు సరిపోయినంత మంది శాసనసభ్యుల మద్దతు లేనందున ఫిబ్రవరి 7న జరిగే రాజ్యసభ ఎన్నికలలో తమ అభ్యర్ధిని పోటీకి నిలబెట్టడం లేదని ఆ పార్టీ నేత మైసూరా రెడ్డి ప్రకటించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇతర పార్టీల మద్దతు తీసుకొని పోటీకి నిలబెట్టడమంటే విభజన వాదులతో కుమ్మకు కావడమేనని, కాంగ్రెస్, తెరాస, తెదేపాలు విభజనవాదులే గనుక రాజ్యసభ ఎన్నికలలో ఒకరికొకరు సహకరించుకొంటూ పోటీ చేస్తున్నారని ఒక వింత సిద్ధాంతం కూడా కనిపెట్టారాయన.   సాధారణంగా ఇటువంటి అవకాశం దొరికితే తన రాజకీయ ప్రత్యర్ధులను ఇరుకునబెట్టి వికృతానందం అనుభవించే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఈవిధంగా నీతులు వల్లిస్తూ మడికట్టుకొని కూర్చొంటానని చెప్పడం చాలా అనుమానం కలిగిస్తోంది. రాజ్యసభ ఎన్నికలకు సిద్దమయితే, బహుశః పార్టీలో లుకలుకలు మొదలవుతాయని భయపడిందో లేక మొన్న ఏపీయన్జీవో ఎన్నికలలో వేలు పెట్టి భంగ పడినందున, మళ్ళీ మరోసారి భంగపడకూదదని వెనక్కి తగ్గిందో లేకపోతే సీమాంధ్ర కాంగ్రెస్, తెదేపాల నుండి వైకాపాలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నఅభ్యర్ధులకు మద్దతు ఇచ్చి వారిని పార్టీలోకి ఆకర్షించే ఆలోచనలో ఉందో తెలియాలంటే ఈ నెల 28న అభ్యర్ధులందరూ నామినేషన్లు దాఖలు చేసేవరకు వేచి చూడవలసి ఉంటుంది. బహుశః అప్పటికి వైకాపా ఆలోచనలేమిటో బయటపడవచ్చును.

సీఎం బెదిరింపులకు దడవను: హరీష్

      ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్తుంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. కిరణ్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ..బెదిరింపులకు ఎవరూ లొంగరు. ఆయన భయపెడితే భయపడే వారు ఎవరూ ఇక్కడ లేరు. తెలంగాణ రైతులకు బోర్ల కొరకు 19 వేల కోట్ల రూపాయల ఉచిత విద్యుత్ ఇచ్చానని ముఖ్యమంత్రి అసేంబ్లీలో చెబుతున్నాడు. కానీ ఆ బోర్లు వేసేందుకు, వాటి మోటార్లకు తెలంగాణ రైతులు 40 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారన్న విషయం గుర్తుపెట్టుకోవాలని టీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నేత హరీష్ రావు సూచించారు. సీమాంధ్రకు నీరు కాలువల ద్వారా వెళ్తుంటే ..తెలంగాణ రైతులు స్వంత డబ్బుతో బోర్లు తవ్వుకుంటున్నారు. దానికి ఉచిత విద్యుత్ పేరుతో రాత్రివేళ ..ఇష్టం వచ్చినప్పుడు విద్యుత్ సరఫరా చేస్తుండడంతో తెలంగాణ రైతులు విద్యుత్ షాక్ లతో, పాము, తేలు కాట్లకు గురయి మరణిస్తున్నారు. సీమాంధ్రలో నీటి సరఫరా ఖర్చు ప్రభుత్వం భరిస్తే, తెలంగాణలో ఖర్చు రైతు భరిస్తున్నాడని హరీష్ రావు తెలిపారు.

అక్కినేని అంత్యక్రియలు పూర్తి

      నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు గురువారం సాయంత్రం 4 గంటలకు అన్నపూర్ణ స్టూడియోలో ముగిసాయి. అక్కినేని వారసులు వెంకట్, నాగార్జున, సుమంత్, నాగ చైతన్య, సుప్రియ, అఖిల్ తదితరులు ఈ అంత్యక్రియల క్యార్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అక్కినేని అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు అక్కినేనికి గన్ సెల్యూట్ చేసారు. అంతకుముందు గురువారం ఉదయం నాగేశ్వరరావు భౌతికకాయాన్ని పలువురు సందర్శనార్థం ఫిల్మ్‌చాంబర్‌లో ఉంచారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఫిల్మ్‌చాంబర్ నుంచి అన్నపూర్ణ స్టూడియో వరకు అక్కినేని అంతిమయాత్ర జరిగింది. ఫిలింఛాంబర్‌లో అక్కినేని పార్థివదేహాన్ని సందర్శించేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చి నివాళులర్పించారు.

రాజగోపాల్ బావమరిది తెదేపాలోకి జంప్?

  హిందూపురం కాంగ్రెస్ ఇన్-ఛార్జ్ అంబిక లక్ష్మినారాయణ, తెలుగుదేశం పార్టీలోకి జంపైపోవాలని ఉబలాట పడుతున్నారు. అయితే ఆయన ఓబులాపురం అక్రమ గనుల తవ్వకాల కేసులో అరెస్టయ్యి జైలుకి వెళ్ళిన గనులశాఖ డైరెక్టర్ రాజగోపాల్ కి బావమరిది కావడంతో స్థానిక తెదేపా నేతలు, కార్యకర్తలు ఆయనని పార్టీలో చేర్చుకోవడానికి అభ్యంతరం చెపుతున్నారు. కానీ, లక్ష్మినారాయణ మాత్రం తెదేపాలోకి మారేందుకు గట్టిగానే కృషి చేస్తున్నట్లు సమాచారం. ఆయన గత ఎన్నికలలో కాంగ్రెస్ టికెట్ మీద హిందూపురం నుండి పోటీ చేసారు, కానీ తెదేపా అభ్యర్ధి అబ్దుల్ ఘనీ చేతిలో ఓడిపోయారు. ఈసారి సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి ఏమీ బాగుండకపోవడంతో ఏకంగా తెదేపాలోకే జంపైపోవడం సేఫ్ అనుకొన్నారేమో, తెదేపా టికెట్ కోసం కాస్త గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డితో కలిసి చంచల్ గూడా జైలులో చాలాకాలం సహవాసం చేసిన రాజగోపాల్ సైతం వచ్చే ఎన్నికలలో ఉరవకొండ శాసనసభ నియోజక వర్గం నుండి పోటీ చేయాలని ఉబలాటపడుతున్నట్లు సమాచారం. కానీ, ఆయన మాత్రం వైకాపా టికెట్ పైనే పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే బావ బావమరుదులిద్దరూ వచ్చే ఎన్నికలలో రాజకీయ ప్రత్యర్దులవుతారేమో!

ఎమ్మెల్యేల చెవిలో పువ్వులు...హరీష్ కు కిరణ్ వార్నింగ్

      తెలంగాణ ముసాయిదా బిల్లుకు వ్యతిరేకంగా విభజనను నిరసిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన ప్రసంగంలో వెల్లడిస్తున్న అంశాల మీద తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు అడుగడుగునా అభ్యంతరాలు చెబుతున్నారు. సీమాంధ్ర ప్రజల చెవ్విలో ముఖ్యమంత్రి పువ్వులు పెడుతున్నారని, అబద్దాలు చెబుతూ తెలంగాణ మీద విషం కక్కుతున్నాడని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలుపుతున్నారు. ఈ సంధర్భంగా చెవిలో పువ్వులు పెట్టుకున్న వారిని చూసి ముఖ్యమంత్రి చాలా అందంగా ఉన్నారని అన్నారు.   ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యులు హరీష్ రావును గురువారం శాసన సభలో హెచ్చరించారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ సమయంలో తన ప్రసంగంపై హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేయగా కిరణ్ ఘాటుగా స్పందించారు. హరీష్ రావు నోటిని అదుపులో పెట్టుకోవాలని, కాస్త కంట్రోల్లో ఉండాలని హెచ్చరించారు. ఏది అంటే అది మాట్లాడవద్దని సూచించారు. మరో సమయంలో ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు పైన ఏ సీమాంధ్ర నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదని స్పష్టం చేశారు.

బిజెపికి నో..కాంగ్రెస్ లోనే: పనబాక

      కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఆమె కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీ వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని..పార్టీని ఎప్పటికి వీడనని చెప్పారు. బాపట్ల నుంచి పార్లమెంట్‌కు పోటీ చేస్తానని పనబాక లక్ష్మి స్పష్టం చేశారు. తన నియోజకవర్గానికి ఎస్సీ,ఎస్టీ నిధులు మంజూరుకావడం లేదని, నిధులు కోరితే ప్రభుత్వం పైసా కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులపై పనబాక అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు తనకు సహకరించడం లేదని, వారి సహకారం ఉంటే బాపట్ల నియోజవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగి ఉండేదని పనబాక లక్ష్మి అన్నారు.