శైలజానాథ్ ను 'ఢీ' కొన్న రేవంత్, ఎర్రబెల్లి

  మంత్రి శైలజానాథ్ సుదీర్గ ప్రసంగం అనంతరం శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఆయన ప్రసంగం చేస్తున్నంత సేపు కూడా తెరాస, తెదేపా తెలంగాణా నేతలు అడ్డు తగులుతూ ఆయన మాటలను, విమర్శలను త్రిప్పి కొడుతూనే ఉన్నారు. కానీ శైలజానాథ్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా రాష్ట్ర విభజన అంశం మొదలుకొని, విద్య, విద్యుత్, నీళ్ళు, ఉద్యోగాలు తదితర అంశాలన్నిటి గురించీ గట్టిగా తన వాదనలు వినిపించారు. సీమాంధ్రులను దోపిడీదారులనడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. కానీ, తెదేపా నేత రేవంత్ రెడ్డి ఆయనకు ఘాటుగా బదులిస్తూ దోపిడీకి పాల్పడినవారందరూ సీమాంద్రులేనని వాదిస్తూ జగన్మోహన్ రెడ్డి, గాలి జనార్ధన్ రెడ్డి, కృషి వెంకటేశ్వర రావు, సత్యం రామలింగ రాజు తదితరుల పేర్లను పేర్కొన్నారు. కానీ తెలంగాణా లో ఒక్క వ్యక్తి కూడా దోపిడీకి పాల్పడినట్లు దాఖలాలు లేవని ఆయన వాదించారు.   ఇదే రేవంత్ రెడ్డి కొన్నే నెలల క్రితం కేసీఆర్, హరీష్ రావు మరియు వారి కుటుంబ సభ్యులందరూ ఉద్యమాల పేరిట పారిశ్రామిక వేత్తలని, విద్యా, వ్యాపార సంస్థలని దోచుకొంటున్నారని ఆరోపించిన సంగతి మరిచిపోయారు. కొద్ది నెలల క్రితం తెరాస నేత రఘునందన్ రావు ఆ పార్టీ నుండి బహిష్కరింపబడినప్పుడు, హరీష్ రావు పై ఆరోపణలు చేస్తుంటే రేవంత్ రెడ్డి అదే అదునుగా తెరసాను ఏకి పారేశారు. కానీ, ఇప్పుడు తెలంగాణాలో అందరూ నీతిమంతులే, సీమాంధ్రలో అందరూ దొంగలేనని వాదించడం విడ్డూరం. ఇక తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్ రావు శైలజానాథ్ కు దీటుగా బదులిస్తూ, ఇంతగా రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నపుడు, అందుకు కారణమయిన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకుండా ఇంకా సిగ్గులేకుండా మంత్రి పదవిలో ఎందుకు కొనసాగుతున్నారని ఎద్దేవా చేసారు.

కుంటిసాకులతో సభకు మొహం చాటేసిన వైకాపా

  రాష్ట్రాన్నిసమైక్యంగా ఉంచేందుకు ఒంటరి పోరాటం చేస్తున్నామని చెప్పుకొంటున్నవైకాపా శాసనసభలో తన అభిప్రాయాన్ని గట్టిగా చెప్పి తెలంగాణా బిల్లుని తీవ్రంగా వ్యతిరేఖించకుండా, బిల్లుపై ఓటింగ్ ఉంటుందా లేదా? అనే విషయంపై స్పష్టత లేని కారణంగా సభ నుండి వాకవుట్ చేసి కీలకమయిన చర్చలో పాల్గొనకుండా తప్పించుకొంది. వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సభలో ప్రసంగిస్తూ, అధికార, ప్రతిపక్షాలు కలిసి రాష్ట్ర విభజనకు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు రాష్ట్ర విభజనపై ముందు తమ వైఖరి తెలియజేసి ఆనక చర్చలో పాల్గొంటే బాగుంటుందని ఆమె అన్నారు. అవి రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నాయి గనుకనే టీ-బిల్లుపై చర్చలో పాల్గొంటున్నాయని, చర్చలో పాల్గొనడమంటే విభజనకు అంగీకరిచడమేనని, అందువల్ల తాము వాకవుట్ చేస్తున్నామని చెప్పి, తమ పార్టీ సభ్యులతో సహా ఆమె సభ నుండి నిష్క్రమించారు.   వైకాపా నిజంగా రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నట్లయితే, సభలో గట్టిగా వాదించి టీ-బిల్లుని అడ్డుకొనే ప్రయత్నం చేసి ఉండాలి. కానీ, పార్టీకి మనుగడకి రాష్ట్ర విభజన జరగడం అత్యవసరం గనుకనే బిల్లుకి అడ్డుపడకుండా కుంటిసాకులు చెప్పి చర్చలో పాల్గొనకుండా తప్పుకొంటోంది.

శాసనసభలో ధాటిగా ఉపన్యసిస్తున్న శైలజానాథ్

  సంక్రాంతి పండుగ శలవుల తరువాత మళ్ళీ సమావేశమయిన శాసనసభలో తెలంగాణా బిల్లుని వ్యతిరేఖిస్తూ మంత్రి శైజానాథ్ ధాటిగా ప్రసంగిస్తున్నారు. కొందరు వ్యక్తుల స్వార్ధం కోసం తెలంగాణా యువకులను రెచ్చగొట్టి ఉద్యమం లేవదీసారని కేసీఆర్ ని ఉద్దేశించి విమర్శించారు. రాజ్యంగా విరుద్దంగా ఉన్నటీ-బిల్లుతో బాషా ప్రయోక్తంగా ఏర్పరచిన రాష్ట్రాన్ని విడదీస్తున్నందున తాను వ్యతిరేఖిస్తున్నానని స్పష్టం చేసారు. నిజాం పాలన సమయం నాటికే తెలంగాణా అన్ని విధాల అభివృద్ధి చెందిందనే వాదనను ఆయన ఖండిస్తూ, తెలంగాణాలో ఎన్నికళాశాలలు ఉన్నాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. మద్రాసు నుండి విడిపోయి ఆంధ్రప్రదేశ్ బాషా ప్రయుక్త రాష్ట్రంగా అవతరించిన తరువాతనే అందరి సమిష్టి కృషితో తెలంగాణాలో అభివృద్ధి జరిగిందనే సంగతిని మరుగు పరిచి, కొందరు స్వార్ధ రాజకీయ నేతలు సీమాంధ్రవాసులు తెలంగాణాను దోచుకొంటున్నారని నిందిస్తూ చులకన చేసి మాట్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.   తెలంగాణాలో ప్రభుత్వోద్యోగాలను సీమాంధ్ర ప్రజలు తన్నుకుపోతున్నారని అనడాన్ని కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. అనేక వ్రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు ఎదుర్కొని వాటిలో ఉత్తీర్ణులయిన వారికే ప్రభుత్వోద్యోగాలు దక్కుతాయి తప్ప, ప్రభుత్వం ఎవరినీ నేరుగా నామినేషన్ పద్దతిలో నియమాకాలు చేయదని, అటువంటప్పుడు సీమాంధ్ర ప్రజలు అక్రమంగా ఉద్యోగాలు తన్నుకు పోయారని ఆరోపించడం అవివేకమని ఆయన అన్నారు. తమను సీమాంధ్రవాసులనడం కంటే తెలుగు ప్రజలని పిలిస్తేనే చాలా సంతోషిస్తామని ఆయన అన్నారు. తెలంగాణా ప్రజలను తప్పు దారి పట్టించడానికే తెలంగాణా ఏర్పడితే ఏదో చాలా లబ్ది చేకూరుతుందని రాజకీయ నాయకులు మభ్య పెడుతున్నారని, కానీ నిజానికి రాష్ట్ర విభజనవల్ల రెండు ప్రాంతాల ప్రజలు తీవ్రంగా నష్టపోవలసి ఉంటుందని ఆయన హెచ్చరించారు.

రాహుల్ ప్రధాని కాదు...ప్రచార సారథే..!!

      కాంగ్రెస్ గురువారం రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్ధిగా ఖరారు చేసినట్లే కాని ప్రకటన చేయలేదు! కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నకాంగ్రెస్ నేతలందరూ రాహుల్ గాంధీని పార్టీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించాలని సోనియాగాంధీని గట్టిగా కోరినప్పటికీ, కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలకు ముందు ప్రధాని అభ్యర్ధిని ప్రకటించే ఆనవాయితీ లేనందున ఆమె తిరస్కరించినట్లు, ఆ పార్టీ సీనియర్ నేత జనార్ధన్ ద్వివేది మీడియాకు తెలిపారు. కానీ, కాంగ్రెస్ పార్టీ ఆయన సారధ్యంలోనే వచ్చేఎన్నికలను ఎదుర్కోవాలని నిర్ణయించినట్లు తెలిపారు.   ప్రచార కమిటీ సారథి అంటే దాదాపు ప్రధానమంత్రి అభ్యర్థేనని, పార్టీ విజయం సాధిస్తే ఆయనే ప్రధాని అవుతారని పార్టీ సంకేతాలు పంపిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి జనార్దన్ ద్వివేదీ కూడా అంగీకరించారు. "ఆయన సారథ్యంలో ఎన్నికల ప్రచారం జరిగి విజయం సాధిస్తే... భావి నాయకత్వం కూడా ఆయన చేతిలో ఉన్నట్లే'' అని తెలిపారు. సీడబ్ల్యూసీ భేటీలో చివరగా రాహుల్ గాంధీ రెండు నిమిషాలు మాట్లాడారు. పార్టీ తనకు ఏ బాధ్యత అప్పజెప్పినా నిర్వర్తిస్తానని, తనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం మాత్రం తనకు ఇష్టం లేదని చెప్పారు.

ఆ ఆరుగురు ఏఐసీసీ సమావేశానికి

  అధిష్టానంపై తిరుగుబాటు చేసిన ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలకు నేడు డిల్లీలో జరిగే ఏఐసీసీ సమావేశానికి ఆహ్వానించకపోవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కాంగ్రెస్ అధిష్టానం ప్రస్తుతం వారితో సంప్రదింపులు జరుపుతోంది. సమావేశంలో సమైక్యాంధ్ర అంశాన్ని లేవనేత్తకుండా ఉండే షరతుపై వారిని ఆహ్వానించాలని భావిస్తున్నట్లు తాజా సమాచారం. అందుకు వారు అంగీకరించినట్లయితే వారందరూ హుటాహుటిన రెక్కలు కట్టుకొని యువరాజవారి పట్టాభిషేక మహోత్సవ సభలో వాలిపోతారు. రాష్ట్ర విభజన చేస్తున్నందుకు తమ అధిష్టానంపై గుర్రుగా ఉన్న సీమాంధ్ర యంపీలు, రాహుల్ గాంధీని పార్టీ ఎన్నికల రధ సారధిగా ప్రకటించే ఏఐసీసీ సమావేశానికి తమను ఆహ్వానించలేదని చిందులు వేయడం ఒక వింత అయితే, పార్టీపై తిరుగుబాటు చేస్తున్నవారిని కాంగ్రెస్ అధిష్టానం మళ్ళీ ఆహ్వానించాలనుకోవడం మరో వింత. కానీ, వారందరూ కూడా కాంగ్రెస్ అధిష్టానానికి విధేయులేనని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. లేకుంటే ఒకరినొకరు వ్యతిరేఖించుకొంటూ ఈవిధంగా పార్టీ సమావేశాలకు హాజరయ్యి భుజాలు రాసుకొని ఉండేవారు కాదు.

కష్టాలలో అమాద్మీ

  పాపం ఆమాద్మీకి ఒక్కసారే అన్ని కష్టాలు ముంచుకు వచ్చాయి. మంత్రి పదవి దక్కని ఆ పార్టీ నేత వినోద్ కుమార్ బిన్నీఅసంతృప్తితో పొగలు గ్రక్కుతూ ఈనెల 27లోగా పార్టీ మ్యానిఫెస్టో చేసిన వాగ్దానాలను అమలుచేయకపోతే నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించడమే కాక, అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ మార్గదర్శకత్వంలో పనిచేస్తున్నారని, పార్టీ సిద్దాంతాలను ఎందుకు అమలు చేయలేదని అడిగినందుకు తనపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని ఆరోపిస్తూ మీడియాకెక్కారు. బొటాబొటీ మెజార్టీతో కాంగ్రెస్ మద్దతుతో నడుస్తున్నఅమాద్మీ ప్రభుత్వానికి ఒక్క సభ్యుడి మద్దతు తగ్గినా పడిపోయే పరిస్థితి ఉంది గనుకనే, వినోద్ కుమార్ అంత వీరంగం ఆడుతున్నట్లు స్పష్టమవుతోంది.   ఆయన తనకు మంత్రి పదవి ఈయకపోతే కనీసం వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు లోక్ సభ టికెట్ అయినా కేటాయించమని అడిగినట్లు, కానీ పార్టీ నియమావళి ప్రకారం శాసనసభ్యులకు లోక్ సభ టికెట్స్ కేటాయించకూడదు గనుక ఆయన కోరికను నిరాకరించడం జరిగిందని అరవింద్ కేజ్రీవాల్ చెపుతున్నారు.   ఇక ఈ యుద్ధం ఇలాగ సాగుతుంటే, విదేశీ కంపెనీలు రిటైల్ వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టడాన్ని వ్యతిరేఖిస్తూ అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర వాణిజ్యశాఖా మంత్రి ఆనంద్ శర్మకు వ్రాసిన లేఖపై మరో దుమారం చెలరేగుతోంది. యఫ్.డీ.ఐ.లలో పెట్టుబడులపై ఇప్పటికే కేంద్రం ఒక నిర్ణయం తీసుకొందని దానిని మార్చడం వీలుకాదని ఆయన కుండబ్రద్దలు కొట్టారు.   దేశంలో అత్యంత చవక విమాన టికెట్స్ ప్రవేశపెట్టిన కెప్టెన్ గోపీనాథ్ ఆమాద్మీ పార్టీ సభ్యుడు కూడా. ఆయన కూడా రిటైల్ వ్యాపారంలోకి విదేశీ కంపెనీ పెట్టుబడులను అరవింద్ కేజ్రీవాల్ తెరస్కరించాదాన్ని తప్పు బట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఆమాద్మీ పార్టీ కూడా ఇటువంటి చవకబారు ఎత్తుగడలతో ప్రజలను ఆకర్షించాలని ప్రయత్నిస్తే చివరికి అది కూడా మిగిలిన అన్ని పార్టీలలాగే మిగిలిపోతుంది. విదేశీ పెట్టుబడులను వ్యతిరేఖించడం దేశానికి నష్టం కలిగించడమే కాకుండా, భారత్ లో పెట్టుబడులు పెట్టలనుకొంటున్న ప్రపంచ దేశాలకు ఒక తప్పుడు సంకేతం ఇచ్చినట్లవుతుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు కూడా మారుతాయనే సంకేతం మంచిది కాదు. అందువల్ల ఆమాద్మీ పార్టీ దీర్గకాల విధానాలు అవలంభించ వలసి ఉంటుంది,” అని అన్నారు.

బ్యాడ్‌బాయ్‌కి గుడ్‌బై!

      నిన్న మొన్నటి వరకూ వై.ఎస్.జగన్ని గుడ్‌బాయ్ అని పొగిడి, అతని తప్పులన్నిటినీ వెనకేసుకుని వచ్చిన వైసీపీ పెద్దలు ఇప్పుడు ఆయన్ని బహిరంగంగానే బ్యాడ్‌బాయ్ అని విమర్శిస్తున్నారు. బుద్ధి గడ్డితిని బ్యాడ్‌బాయ్‌ని గుడ్‌బాయ్ అనుకున్నామని చెంపలేసుకుంటున్నారు. ఒక్కరొక్కరుగా వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు. ఇంతకాలం జగన్ సన్నిధిలో అణిగిమణిగి, పిల్లల్లా ఒదిగి వున్నవాళ్ళు కూడా ఇప్పుడు జగన్ని తన పిల్లల్ని తానే తినే పాముతో పోలుస్తున్నారు.   సంచలనాత్మకంగా మాట్లాడటంలో ఘనాపాటీ అయిన మాజీ మంత్రి మారెప్ప ఈమధ్య జగన్ మీద విరుచుకుపడిన విషయం, ఆ తర్వాత ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. పార్టీలో అంకురించిన తిరుగుబాటు మారెప్పతో మొదలైంది కాదు... మారెప్పతో ముగిసేది కాదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్సార్సీపీలో కిందిస్థాయి కార్యకర్తల నుంచి పై స్థాయి నాయకుల వరకూ ఏదో ఒక రూపంలో అసంతృప్తి వుందని అంటున్నారు. జగన్ నిరంకుశ ధోరణి వల్ల అతనితో చాలా సన్నిహితంగా వుండేవారు కూడా పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధంగా వున్నారని సమాచారం. దాదాపు 80 శాతం మంది కార్యకర్తలు ఇప్పటికే పార్టీ మారడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని జంప్ అయిపోవడానికి రెడీగా వున్నారని సమాచారం. పార్టీ పెట్టిన దగ్గర్నుంచి, జగన్ జైల్లో వున్నప్పుడు పార్టీని కాపాడుకుంటూ వచ్చిన చాలామంది కీలక నాయకులు వివిధ అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ ఆకాంక్షను వాళ్ళు జగన్ దగ్గర వ్యక్తం చేసినప్పుడు జగన్ వాళ్ళని పూచిక పుల్లను తీసిపారేసినట్టు మాట్లాడాడని, దాంతో వాళ్ళ జగన్ పట్ల గుర్రుగా వుండి పార్టీకి దూరమైపోవాలని భావిస్తున్నారని తెలుస్తోంది. పార్టీకి దూరమయ్యేది కూడా చాలా కీలక సమయంలో జగన్ నెత్తీనోరూ బాదుకునే స్థాయిలో దూరమవ్వాలని భావిస్తున్నట్టు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. బయటి నాయకులు మాత్రమే కాకుండా జగన్ కుటుంబ సభ్యులు కూడా జగన్ వ్యవహారశైలి పట్ల తీవ్ర అసంతృప్తితో వున్నట్టు తెలుస్తోంది. ఆమధ్య తన కుటుంబ సభ్యుల్లో తన పట్ల వున్న వ్యతిరేకతని జగన్ కూల్ చేసినప్పటికీ, వాళ్ళలో జగన్ పట్ల వ్యతిరేకత మళ్ళీ రాజుకున్నట్టు రాజకీయవర్గాల భోగట్టా.

తెలంగాణ: "ఆదేశిక సూత్రాల''ను అమలు చేయకపోతే..!

    - డా. ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]     అనేక అభ్యుదయకరమైన, కొన్ని విప్లవాత్మకమైన తీర్పులను సాహసంతో ప్రకటించిన ఆత్మీయమిత్రులు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి ఒక పుస్తకావిష్కరణ సందర్భంగా [ 11-01-2014] జరిగిన సభలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన అంశాల్ని వెల్లడించారు. సందర్భం పుస్తకావిష్కరణ సభ అయినప్పటికీ, తలాతోకాలేని, ముక్కూముఖంలేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు (2013) రాష్ట్రశాసనసభలో, శాసనమండలిలో సభ్యుల మల్లగుల్లాల మధ్య చర్చలో/ప్రతిష్టంభనలో ఉన్న సమయంలో జస్టీస్ సుదర్శన్ రెడ్డి భారత రాజ్యాంగంలోని "ఆదేశిక సూత్రాల'' లక్ష్యం గురించి నేటి పాలక శక్తులకు వేర్పాటువాదంతో తెలుగుజాతి చీలికను, కృత్రిమ విభజనను కోరుకుంటున్న పదవీస్వార్థపర రాజకీయులకు గుర్తుంచుకోదగిన పాఠం చెప్పారు! ఒకవేళ రేపు ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడినప్పటికీ,అలా ఏర్పడే రాష్ట్రంలోని ప్రభుత్వం రాజ్యాంగంలోని అత్యంత ప్రధానమైన "ఆదేశిక సూత్రాల'' [డైరెక్టివ్ ప్రిన్సిపిల్స్]ను అమలు పరచడానికి తగిన యంత్రాంగాన్ని రాష్ట్రప్రభుత్వం సృష్టించుకొనకపోతే "తెలంగాణా రాష్ట్రం'' ఏర్పాటే విఫల ప్రయోగమవుతుందని జస్టీస్ సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు.   అయితే, సుదర్శన్ రెడ్డి చేసిన హెచ్చరిక ఏ ఒక్క భాగానికో కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ కే కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు, చివరికి మొత్తం కేంద్ర ప్రభుత్వానికీ వర్తిస్తుంది. ఎందుకంటే, రాజ్యాంగంలోని 38 - 39 అధికరణలు ప్రజలకు సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాలలో సమన్యాయం అందించగల సాంఘిక వ్యవస్థను నెలకొల్పడం ద్వారా ప్రజల సంక్షేమాన్ని ప్రభుత్వం కాపాడగల శక్తిగా ఉండాలని [38 వ అధికరణ] ఆదేశిచింది; కాగా, స్త్రీ, పురుషులతో కూడిన పౌరులందరికీ తగిన జీవనభృతిని, ప్రజలందరి సమష్టి ప్రయోజనాలను కాపాడే విధంగా దేశ, రాష్ట్ర వనరులపైన సమష్టి యాజమాన్యం ఉండాలని, ఆ విధంగానే ప్రకృతివనరుల వినియోగం జరగాలనీ అధికరణ - 39 ఆదేశిస్తోంది. అలాగే, సమిష్టి ప్రయోజనాలకు విఘాతం కల్గించే విధంగా దేశ సంపదపైన, ఉత్పత్తి సాధనాలపైన కొలదిమంది గుత్తాధికారం చెలామణీ అయ్యే విధంగా దేశ ఆర్ధికవ్యవస్థ కేంద్రీకరణ ఉండకూడదని కూడా అదే అధికరణ స్పష్టంగా ఆదేశిస్తోంది! అయినా, ఈ రాజ్యాంగ ఆదేశికసూత్రాలను దేశ/రాష్ట్ర పాలకులు ఎందుకు 65 ఏళ్ళుగా భ్రష్టు పట్టించారో ఏ ఒక్క పాలకుడూ ఇప్పటిదాకా సమాధానం యిచ్చిన పాపాన పోలేదు. ఈ వాస్తవం సుదర్శన్ రెడ్డికి తెలియనిది కాదు! ఎందుకంటే, పాలకపక్షాలు తమ స్వార్థప్రయోజనాలకు. తమ సంపదను 'మేటవేసుకోడానికి' రాజ్యాంగంలోని కంతలను ఉపయోగించుకుంటూ వచ్చినవారేగాని ప్రజాబాహుళ్యపు సమష్టి ప్రయోజనాలను గురించి ఆలోచించగల వాళ్ళు కాదు కాబట్టి! పైగా ఈ ఆదేశికసూత్రాలను, పౌరుల ప్రాథమిక హక్కుల అధ్యాయం నుంచి విడగొట్టి ఈ రెండు అంశాలకు మధ్య ఉండవలసిన పరస్పర సంబంధాలను ఆచరణలో తెంచివేశారు; పౌరుల ప్రాథమిక హక్కుల[అధికరణ - 19]యిన భావప్రకటనా స్వేచ్ఛ, సమావేశ స్వేచ్ఛ,  సంఘనిర్మాణ స్వేచ్ఛ, దేశవ్యాపిత పర్యటన స్వేచ్ఛ, దేశంలోని ఏ ప్రాంతంలోనైనా సరే జీవించే స్వేచ్ఛను వ్యాపార స్వేచ్ఛను గ్యారంటీ చేస్తూ ఇన్ని రకాల స్వేచ్ఛలకు ఆటంకం ఏర్పడినప్పుడు న్యాయస్థానాల ద్వారా న్యాయం పొందే హక్కును రాజ్యాంగం కల్పించింది. కాని ఈ ప్రాథమిక హక్కులనుంచి అంతే శక్తిమంతంగా జీవనానికి ఆధారమైన ఆదేశికసూత్రాలు నిర్దేశిస్తున్న సాంఘిక, ఆర్ధిక, రాజకీయ రంగాలలో సమన్యాయాన్ని, ఆచరణలో పొందలేనప్పుడు న్యాయస్థానాల్ని ఆశ్రయించే హక్కును పౌరులకు దక్కకుండా చేశారు! ఈ అంతరాన్ని, ఈ అన్యాయాన్ని రాజ్యంగ నిర్మాతలలో అగ్రగణ్యుడైన డాక్టర్ అంబేడ్కర్ గుర్తించాడు. అయితే మరి ఎందుకు ఈ అంతరాన్ని తొలగించలేకపోయాడు? ఒక దళిత మేథావిగా ఈ దోపిడీవర్గ సమాజంలో నివసించవలసివచ్చిన వ్యక్తిగా, ఆనాటి తాత్కాలిక రాజ్యాంగ నిర్ణయసభలో మెజారిటీ వర్గం సంపన్నులకు ప్రాతినిథ్యం వహిస్తున్న నాయకుల మధ్య అంబేడ్కర్ ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఆనాడు అంబేడ్కర్ మేధస్సును రాజ్యాంగ రూపకల్పనకు ఉపయోగించుకున్న 'పెద్దలు' రాజ్యాంగ రచనా సంఘానికి చైర్మన్ గా ఉంచడంలో ఉద్దేశం కూడా స్వార్థబుద్ధితో కూడినదే. ఈ రాజ్యాంగం సక్రమంగా అమలు జరిగితే ఆ 'ప్రతిభ' అంతా తమదిగానూ, విఫలమయ్యే పక్షంలో ఆ తప్పిదాన్ని కాస్తా అంబేడ్కర్ దిగానూ భావించి, ప్రకటించడానికి ధనికవర్గ నాయకులు సిద్ధంగా కూచున్నారని మరవరాదు! ఆ కానరాని వత్తిడి వాతావరణంలోనే ప్రాథమిక హక్కుల అధ్యాయానికి ప్రాధాన్యమిచ్చి, సమాజ శ్రేయస్సుకు శాశ్వత గ్యారంటీ యివ్వగల సాంఘిక, ఆర్ధిక, రాజకీయ వకాలిక ప్రతిపాదనలను, సంపదపై ప్రజల సమష్టి స్వామ్యాన్ని నికరం చేసే ఆదేశికసూత్రాలను అప్రధానంగా మూలకు నెట్టేశారు, న్యాయస్థానాలు విస్పష్టమైన తీర్పులిచ్చే అవకాశం లేకుండా చేశారు! ఈ బాధను అంబేడ్కర్ తర్వాత బాహాటంగానే బహిరంగంగానే అనేక పర్యాయాలు వ్యక్తం చేశాడు! అందువల్లనే, ఈ అంతరం ఆ రెండు అధ్యాయాలను అమలుపరచడంలో వ్యక్తమవుతోందని, న్యాయస్థానాల చేతులు (ఏ చిన్న చిన్న విషయాలలోనో తప్ప) అచేతనంలో ఉండిపోవలసివస్తోంది. అందుకే, ఈ విషయాలు తెలిసిన జస్టీస్ సుదర్శన్ రెడ్డి 65 ఏళ్ళ తరువాత కూడా 'ఆదేశిక సూత్రాల' (Directive Principles)ను మరోసారి ఏకరువుపెట్టి, గుర్తు చేయాల్సి వచ్చింది - మొద్దు స్వరూపాలుగా మారిన మన పాలకపక్షాలకు! ఇదే సందర్భంగా జస్టీస్ సుదర్శన్ మరొక హెచ్చరిక కూడా చేయక తప్పలేదు - "ఆదేశికసూత్రాలు ఆదేశించిన సాంఘిక, ఆర్ధిక విధానాలను నూతన రాష్ట్రంలో పునర్వ్యవస్థీకరించుకొని అమలు జరపకపోతే తెలంగాణా ప్రజలను వివిధ రూపాలలో ఇకముందు కూడా కొనసాగుతుంద''ని జోస్యం చెప్పారు! జస్టీస్ సుదర్శన్ ప్రస్తావించిన "తెలంగాణా ప్రజల పీడన''  ఈనాటిది కాదు, సుమారు మూడువేల సంవత్సరాల లిపి, భాషా, శాసన, ప్రాచీన నాణేల, చారిత్రిక నేపథ్యం గల్గిన తెలుగుజాతిని కాలక్రమంలో రెండు పరాయి సామ్రాజ్య పాలనాశక్తులు పంచుకుని, విడగొట్టి ఉన్న చారిత్రిక సన్నివేశాన్ని మనం మరవలేము. అవే నిజాం నిరంకుశ రాచరిక పాలనలో ఉన్న తెలంగాణా తెలుగువారు, మద్రాసు రాజధానిగా నలిగిపోయిన తెలుగువారు. ఒకే భాషా సంస్కృతుల పునాదుల మీద ఎదిగివచ్చిన ఈ తెలుగుజాతి పరాయి పాలనల వల్ల పుట్టకొకరు చెట్టుకొకరుగా చెల్లాచెదరై ఉన్నప్పుడు కాలక్రమంలో 'విశాలాంధ్ర' (ఆంధ్రప్రదేశ్)గా అవతరించడానికి తోడ్పడిన మహత్తర చారిత్రిక పరిణామం - ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో నడిచిన తెలంగాణా రైతాంగ సాయుధపోరాటమూ, ఉభయ ప్రాంతాలలో నడిచిన ఆంధ్రోద్యమాలు, ఆంద్రమహాసభాలూనని మరవరాదు. ఈ సత్యం ఇరుప్రాంతాలలో ఉన్న స్వార్థపరులయిన ప్రజావ్యతిరేకులకు, దోపిడీదారులకు తెలియకపోవచ్చు, తెలిసినా గుర్తించగల మేధోశూన్యులైనా కావొచ్చు! మరొక మాటలో స్పష్టంగా చెప్పాలంటే - ఏ నిజాం కనుసన్నల్లో, నిజాముల ఆశీస్సులతో గ్రామాలలో, పట్టణాలలో బతుకులీడుస్తూ ప్రజల్ని నానాబాధలకు, 'గడీ'లలో చిత్రహింసలకూ, స్త్రీల మానభంగాలకూ  కారకులయ్యారో, ఆ 'దొర'లూ, ఆ పటేల్ పట్వారీలు, జాగిర్దార్లూ, భూస్వాములూ, దేశ్ ముఖ్ లూ లేదా వారి సంతానమే 60 ఏళ్ళ తర్వాత తిరిగి తమ నిరంకుశ పాలనను తెలంగాణా ప్రజలపై రుద్దడం కోసమే ప్రస్తుత వేర్పాటు ఉద్యమాన్ని తలపెట్టి నిర్వహించారు! అందుకే ఈ 'ఉద్యమం' ప్రజా ఉద్యమంగా రూపుదాల్చలేక పోతోంది; మూడు-నలుగు జిల్లాలకే పరిమితం కావలసి వస్తోంది. అదీ, ప్రజలలో భ్రమలు వ్యాప్తి చేసిన ఫలితంగా, సోదర తెలుగు ప్రజలపైన స్థానికులలో పరమ విద్వేషం వ్యాప్తి చేసినందువల్ల మాత్రమె ఉద్యమం పరిమితం కావలసివచ్చింది. అందుకే అది రెండు సంపన్న వర్గాల మధ్య తెలంగాణాపై రాజకీయాధికారం కోసం కొనసాగుతున్న పెనుగులాటగా కుమ్ములాటగా మారుతూ వచ్చింది!  దాని ఫలితమే వందలమంది షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తరగతుల, బి.సి.వర్గాలకు చెందిన యువతలో నూటికి 90 మంది ఈ పాక్షిక స్వార్థపర సంపన్నవర్గాల ఎత్తుగడలకు ఆహుతైపోయారు. ఆ వాస్తవం తెలుగుప్రజలు గుర్తించకుండా ఉండేందుకుగాను చివరికి ఈ రెండువర్గాలకు చెందిన నాయకులు కొందరు శాసనసభలో కూడా దౌర్జన్యకాండకు దిగారు; లోగడ వేరే శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగలడమేగాక, అతని ప్రసంగ పాఠాన్ని చించి, ఆయన మీదికి కాగితాలు విసిరికొట్టి, కొందరు సభ్యులపై చేయి చేసుకోవటమూ జరిగింది; ఈ బాపతుకు చెందిన నాయకుడొకడు ఢిల్లీలోని "ఆంధ్రాభవన్'లో పనిచేసుకుంటున్న దళిత అధికారిని కొట్టడమూ జరిగింది; నిన్నగాక మొన్న ఇదే నాయక 'దొర' దళితుడైన కానిస్టేబుల్ ను రాయదుర్గంలో దుర్భాషలాడి, జారిన తన చెప్పుల్ని చేత్తో పట్టుకొచ్చి తనకు తొడగమని ఆదేశించినందుకు అక్కడి పోలీసు స్టేషన్ లో కేసు నమోదు కావలసి వచ్చింది; అలాగే ఇదే 'దొర'తనానికి చెందిన మరొక 'దొర' సౌమ్యంగా కనిపించే బి.సి. వర్గానికి చెందిన మంత్రి పొన్నాలను అసభ్యపదజాలంతో దూషించినందున బి.సి. సంఘాలన్నీ ఆ 'దొర'ను అరెస్టు చేయాలని నినదిస్తున్నాయి! ఇన్ని ఘటనలు వరసక్రమంలో యింకా ప్రత్యేక రాష్ట్రమంటూ ఒకటి ఏర్పడక ముందే సాగుతూంటే, రేపటి పరిస్థితి తెలంగాణాలోనే ఎలా ఉండబోతుందో ఊహించుకోవచ్చు! ఎందుకంటే తెలంగాణలో దొరల, భూస్వాముల దాస్టికాలను నిజాముల నిరంకుశపాలనకు తోడుగా ప్రజల అనుభవించివున్న వారే కాబట్టి, మొత్తం తెలుగుజాతి రక్షణలో భాగంగానే విభజన ముసాయిదా బిల్లును తీవ్ర స్థాయిలోనే అడ్డుకొని తీరాలి; తెలంగాణలో రానున్న పరిణామాల గురించి జస్టీస్ సుదర్శన్ వూహిస్తున్నట్టుగానే, తెలంగాణా ప్రజలను మరోసారి 'దొర' స్వామ్యం నుంచి రక్షించే బాధ్యత యావత్తు తెలుగుజాతిదిగానే ఉండాలని కోరుకోవాలి. తద్వారా ఉభయ ప్రాంతాల దోపిడీ వర్గాలను ఉభయ ప్రాంతాల ప్రజలూ దూరంగా ఉంచగల్గుతారు. ఈ ముసాయిదా బిల్లుకు సవరణల అవసరాన్ని సీమాంధ్రులేగాక, తెలంగాణా ప్రజాఫ్రంటు వర్గాలు, వేర్పాటువాదుల వర్గమూ కూడా గుర్తించినందున, బిల్లుకు పూర్తిస్థాయిలో సవరించి, వివరణలతో కూడిన ముసాయిదాను నిర్దోషంగా రూపొందించి శాసనసభకు పంపాలని అందరూ కోరుతున్నందున కూడా విభజన ప్రక్రియ ఎంత తప్పుడుదో ప్రజలకు అర్థమయింది! విభజన వాదులకు, 'బెంగా'తో ఉన్న కెసిఆర్ వర్గానికి మిగిలిందీ మిగిలేదీ కోపమొక్కటే - "కోపం శేషన పూరయేత్''!

‘ఆ నలుగురు’ తల్లులు!

      మిగతా విషయాల సంగతి ఏమోగానీ, ఒక్క విషయంలో మాత్రం తెలంగాణ ప్రజలు సీమాంధ్ర ప్రజల కంటే నాలుగు రెట్లు అదృష్టవంతులు. ఏ విషయంలో అంటే, తల్లుల విషయంలో! ఈ లోకంలో ఎవరికైనా ఒక్క తల్లే వుంటుంది. అలాగే మొన్నటి వరకూ తెలుగు జాతి మొత్తానికి ఒక్క తెలుగు తల్లి మాత్రమే వుండేది. కేసీఆర్ లాంటి ఉత్తమ పుత్రుడి పుణ్యమా అని తెలంగాణ ప్రజలకు తెలంగాణ తల్లి పుట్టుకొచ్చింది. ఇప్పుడా తల్లి ప్రస్తుతానికి మొత్తం నాలుగు అంశలతో తెలంగాణ బిడ్డలకు ఆశీస్సులు అందిస్తోంది.   ఇంతకీ ఆ నాలుగు అంశలు ఏవంటే... 1. తెలుగు తల్లికి పోటీగా కేసీఆర్ మొట్టమొదట ప్రవేశపెట్టిన ఒరిజినల్ తెలంగాణ తల్లి. 2. కాలక్రమేణా తెలుగు తల్లి రూపురేఖల్ని మార్చి, తెలుగుతల్లి ముఖంలో కేసీఆర్ కుమార్తె కవిత పోలికలు కనిపించేలా ‘జాగ్రత్తలు’ తీసుకుని తెలంగాణ ప్రజల నెత్తిన రుద్దడానికి ప్రయత్నిస్తున్న ‘కవితెలంగాణ తల్లి’. 3. కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు మితిమీరిన ‘మాతృభక్తి’తో తెలంగాణ ఇచ్చేస్తున్నట్టు ప్రకటించిన సోనియాగాంధీనే నిజమైన తెలంగాణ తల్లి అని ప్రకటించి, తన ఫామ్ హౌస్‌లోని సోనియాలయంలో ప్రతిష్టించడానికి ‘విజయవాడ’లో చెక్కిస్తున్న ‘తెలంగాణ సోనియా తల్లి’. 4. కేసీఆర్ ప్రవేశపెట్టిన తెలంగాణ తల్లి ధనిక, భూస్వామ్య వర్గాలకు ప్రతినిధిగా వుందని, హంగూ ఆర్భాటాలతో వుందని తెలంగాణ తల్లి ఉంటే గింటే చాకలి ఐలమ్మ రూపురేఖల్తో వుండాలని ఆ దిశగా కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు సక్సెస్ అయితే బడుగు ప్రజలకు ప్రతినిధిలా వుండే తెలంగాణ తల్లి... వెరసి మొత్తం నలుగురు తెలంగాణ తల్లులు. ఒక్క తల్లి ప్రేమకే ఎవరైనా ఉక్కిరిబిక్కిరి అయిపోతారు. ఇక ఏకంగా నలుగురు తల్లులను పొందిన తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో ఇంకెంత ఉక్కిరిబిక్కిరి అవుతారో!

కేజ్రివాల్ పై 'ఆమ్ ఆద్మీ' ఎమ్మెల్యే ఫైర్..డెడ్ లైన్

      ఏడాది కాలంలోనే అధికారం అందిపుచ్చుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ పరిపాలన మీద ఆయన సొంత పార్టీలోనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. కేజ్రివాల్ చేసిన వాగ్దానాలను అమలు చేయటం లేదంటూ లక్ష్మీనగర్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీ విరుచుకుపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన వాగ్ధానాలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని ఆయన ఈ రోజు విమర్శించారు. ఆప్ పాలన మరో దిశలో సాగుతుందని, చేస్తున్న దానికి ..చెబుతున్న దానికి ఏ మాత్రం పొంతన లేదని అన్నారు.   తాజాగా ఎన్నికల చేసిన వాగ్గానాలను నెరవేర్చడానికి బిన్నీ డెడ్ లైన్ విదించారు. ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే తాను జనవరి 27 తేది నుంచి నిరవధిక దీక్ష చేపడుతానని బిన్నీ హెచ్చరించారు. ఎన్నికల్లో చేసిన వాగ్ధానాలను తుంగలో తొక్కుతున్నారని పార్టీ నేతలపై, ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన కేజ్రివాల్ ఆ రెండు పార్టీలకు  ఎలా భిన్నమో ప్రజలు తెలుపాల్సిన అవసరం ఉందన్నారు.

ఢిల్లీలో విదేశీ మహిళపై గ్యాంగ్ రేప్

      దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. నగరం నడిబొడ్డున రైల్వేస్టేషన్‌వద్ద ఆరుగురు దుండగులు డెన్మార్క్ పర్యాటకురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో వదలక ఆమెవద్ద ఉన్న సొమ్ము, విలువైన వస్తువులను దోచుకెళ్లారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె, వైద్య పరీక్షకు నిరాకరించి దర్యాప్తులో సహకరిస్తానని హామీ ఇచ్చి స్వదేశం వెళ్లిపోయారు.   వివరాలిలా ఉన్నాయి... ఢిల్లీలోని పహార్‌గంజ్‌లో ఒక హోటల్‌లో బసచేసిన ఆమె, మంగళవారం కన్నాట్‌ప్లేస్‌లో మ్యూజియంను సందర్శించారు. ఆ తర్వాత హోటల్‌కు దారి మరచిపోయి కొందరి సాయం కోరారు. ఇదే అదనుగా దుండగులు ఆమెను తప్పుదోవ పట్టించి నిర్మానుష్యంగా ఉండే డివిజనల్ రైల్వే ఆఫీసర్ల క్లబ్ పరిసరాలకు తీసుకెళ్లారు. అక్కడ కత్తితో బెదిరించి నగదు, ఐపాడ్, ఇతర విలువైన వస్తువులు దోచుకున్నారు. అంతటితో వదలక సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమె తంటాలుపడి రాత్రి 7:30 గంటలకు హోటల్ చేరుకుని, సహ పర్యాటకులకు సంఘటన గురించి వివరించారు. అనంతరం హోటల్ మేనేజర్ పోలీసులను పిలిపించగా, వారు ఆమె ఫిర్యాదు స్వీకరించి, వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. వైద్య పరీక్షకు తీసుకెళ్తామని కోరగా ఆమె నిరాకరించారు. ఆ తర్వాత ఆమెను డెన్మార్క్ రాయబార కార్యాలయానికి తీసుకెళ్లారు. అటుపైన బుధవారం మధ్యాహ్నం స్వదేశం వెళ్లిపోతూ తదుపరి దర్యాప్తులో సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. త్వరలో మిగిలినవారినీ అరెస్ట్ చేస్తామని అధికారులు చెప్పారు.  

బాలకృష్ణ రాజ్యసభకు పోటీ చేయబోతున్నారా?

  వచ్చేఎన్నికలలో కృష్ణాజిల్లా నుండి శాసనసభకు పోటీచేయలనుకొన్ననందమూరి బాలకృష్ణను తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు బహుశః రాజ్యసభకు పంపేందుకు ఆలోచిస్తున్నట్లు తాజా సమాచారం. రాష్ట్ర విభజన ను వ్యతిరేఖిస్తూ ఆయన సోదరుడు హరికృష్ణ తన రాజ్యసభ పదవికి రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీ స్థానంలో బాలకృష్ణ పేరును ప్రతిపాదించినట్లయితే పార్టీలో ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేరు. అంతే గాక, రాజ్యసభ సీటుకోసం పార్టీలో పోటీని కూడా నివారించవచ్చునని చంద్రబాబు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. కానీ, రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పాలని ఉవ్విళ్ళూరుతున్న బాలకృష్ణ మరి అందుకు అంగీకరిస్తారో త్వరలోనే తెలిసిపోతుంది.

ఎన్నికల తరువాత చిరంజీవి రాజకీయాలకు రామ్ రామ్?

  సినీ రంగంలో రారాజుగా వెలుగుతున్నమెగాస్టార్ చిరంజీవి, తను పార్టీ పెట్టడమే తరువాయి నందమూరి వారిలా ఏడాది తిరక్కుండా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోవచ్చుననే ఆశతో రాజకీయాలలో అడుగుపెట్టారు. ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయినా తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీకి తాకట్టుపెట్టి కేంద్రమంత్రి అవగలిగారు. అదేమీ దురదృష్టమో కానీ, కేంద్రమంత్రి పదవిలో ఉన్నమజాని పూర్తిగా అస్వాదించక మునుపే, రాష్ట్ర విభజన అంశం మెడకు చుట్టుకోవడంతో, కష్టపడి ముచ్చటపడి సంపాదించుకొన్న కేంద్రం మంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఆయన రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నట్లు మాట్లాడినా, సీమాంధ్ర ప్రజల నమ్మకాన్నికోల్పోయారు. అదే కారణంతో తెలంగాణా ప్రజలకు కూడా దూరమయ్యారు.   ఇక ప్రస్తుతం సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు రాలే పరిస్థితి లేకపోవడంతో, సీనియర్లే తలోపార్టీ వైపు పరుగులు తీస్తుంటే చిరంజీవి పరిస్థితి ఊహించవచ్చును. పోనీ త్వరలో ముఖ్యమంత్రో మరొకరో పెట్టబోయే కొత్త పార్టీలోకి మారుదామంటే, గతంలో సోనియాగాంధీతో మంచి టచ్చులో ఉన్నపుడు ముఖ్యమంత్రికి వ్యతిరేఖంగా చాలా పిర్యాదులు చేయడంతో, ఆయనతో సంభందాలు దెబ్బతినడం వలన ఆ పార్టీలోకి వెళ్ళలేని పరిస్థితి. పోనీ కాంగ్రెస్ అధిష్టానాన్నే నమ్ముకొందామన్నా,ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే కాదు మోడీ పుణ్యమాని కేంద్రంలో కూడా అధికారంలోకి వచ్చేపరిస్థితులు కనబడటం లేదు.   ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా తనకు కలిసిరాని రాజకీయాలలో కొనసాగడం కంటే మళ్ళీ సినీ పరిశ్రమకు తిరిగి వెళ్ళిపోవడమే మంచిదని తలచారో లేక ఎన్నికల తరువాత ఖాళీగా కూర్చొనే బదులు ఏవో నాలుగు సినిమాలు తీసుకొంటూ పోయిన చోటనే ఉంగరం(పరువు) వెతుకోవడం మేలని భావించారో తెలియదు కానీ, ఎన్నికల తరువాత తన 150వ సినిమా చేసేందుకు ఆలోచిస్తున్నాని చిరంజీవి తాజా స్టేట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. ముప్పై ఏళ్ళు కష్టపడి సంపాదించుకొన్నపేరు ప్రతిష్టలు, లక్షలాది అభిమానులను కేవలం మూడు సంవత్సరాలలో పోగొట్టుకొన్న మెగాజీవికి బహుశః అంతకంటే వేరే దారి ఉండబోదు కూడా!  

ఆమాద్మీ వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందా?

  డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిన్నమీడియాతో ఆసక్తికరమయిన వ్యాక్యలు చేసారు. వచ్చే ఎన్నికలలో పోటీ ప్రధానంగా ఆమాద్మీ, బీజేపీల మద్యే ఉంటుందని, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆదరణకు నోచుకోదని అన్నారు. అవినీతిపరుడయిన ఎడ్యురప్పను తిరిగి పార్టీలో చేర్చుకొన్న బీజేపీ అవినీతి గురించి ఏవిధంగా మాట్లాడగలదని ఆయన ప్రశ్నించారు. ఆయన పోటీ ప్రధానంగా ఆమాద్మీ, బీజేపీల మద్యే ఉంటుందని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం తమ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తోంది గనుక, ఆయన కాంగ్రెస్ పార్టీని వెనకేసుకు వస్తూ బీజేపీతోనే పోటీ అంటున్నారా? లేకపోతే బీజేపీ విజయావకాశాలను గండి కొట్టేందుకే తాము కాంగ్రెస్ తెరవెనుక మద్దతుతో ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు సంకేతం ఇస్తున్నారా?ఒకవేళ ఎన్నికల తరువాత ఆయన కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వబోతున్నారా?అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏమయినపట్టికీ, ఆయన కాంగ్రెస్, బీజేపీలతో సమానదూరం పాటించినంత వరకే ఆయనకు, ఆమాద్మీకి ప్రజాదరణ ఉంటుందనే సంగతి ఆయన గుర్తుంచుకోవలసి ఉంది.

నాలుగు రోజుల్లో 10లక్షల మంది ఆమాద్మీ సభ్యత్వం

  జనవరి 10నుండి 26వరకు దేశవ్యాప్తంగా300 జిల్లాలో “నేను కూడా సామాన్యుడినే” అనే నినాదంతో సాగుతున్నఆమాద్మీ పార్టీ సభ్యత్వనమోదు ప్రక్రియలో గత నాలుగు రోజుల వ్యవధిలో ఏకంగా 10లక్షల మంది సభ్యులు పార్టీలో చేరారు. నిర్ణీత గడువులోగా కోటి మంది సభ్యులను చేర్చుకొని పార్టీని దేశ వ్యాప్తంగా బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నట్లు ఈ సభ్యత్వ నమోది ప్రక్రియ అంతటినీ పర్యవేస్తున్న ఆమాద్మీపార్టీ నేత గోపాల్ రాయ్ మీడియాకు తెలియజేసారు.   తమ పార్టీకి మహారాష్ట్ర, హర్యాన, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో ప్రజలనుండి మంచి ప్రతిస్పందన వస్తోందని ఆయన తెలిపారు. కర్ణాటకలో ముఖ్యంగా బెంగళూరు నగరంలో తమ పార్టీకి విపరీతమయిన ఆదరణ దొరుకుతోందని ఆయన తెలిపారు. ఈ ఊపుతోనే దేశంలో ఇతర రాష్ట్రాలలో కూడా పార్టీని వ్యాపింపజేసే ప్రయత్నాలు చేస్తామని ఆయన తెలిపారు.

చంద్రబాబు ప్రయత్నాలు అందుకేనా?

  చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగ సందర్భంగా చిత్తూరులో తన స్వగ్రామమయిన నారావారి పల్లెలో విడిది చేసి, ఒకప్పుడు తనతో కలిసి చదువుకొన్నబాల్య స్నేహితులందరినీ కలుస్తున్నారు. ఆయన ఇంతవరకు దాదాపు వందమంది స్నేహితులను కలిసారు. వారిలో ప్రతీ ఒక్కరు కూడా చంద్రబాబుతో తమకున్నసాన్నిహిత్యాని, ఆనాటి మధురానుభూతులు నెమరువేసుకొంటూ పులకరించిపోయారు.   చంద్రబాబు ఈవిధంగా అకస్మాత్తుగా తన బాల్యస్నేహితులను కలవడం కొంచెం ఆశ్చర్యం కలిగించినా, రాజకీయ కోణం నుండి చూసినట్లయితే ఆయన ఈవిధంగా తన రాజకీయ పునాదులు బలోపేతం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారని అర్ధమవుతుంది. మొదటి నుండి ఆయనకు అండగా నిలిచిన చిత్తూరు జిల్లాపై, ముఖ్యంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజక వర్గంపై ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి కన్నేసిన సంగతి అందరికీ తెలిసిందే. వచ్చేఎన్నికలలో ఎలాగయినా అక్కడ పాగావేసి చంద్రబాబుని, ఆయన ప్రతిష్టని, తెదేపాను దెబ్బతీయాలని జగన్మోహన్ రెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నప్పుడు చంద్రబాబు చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోబోరు. బహుశః ఆ ప్రయత్నంలోనే ఆయన తన బాల్యస్నిహితులను కలుస్తూ వారి ద్వారా పార్టీకి ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారనుకోవచ్చును. ఆయన స్నేహితుల స్పందన చూస్తే ఆయన తన ప్రయత్నంలో సఫలం అయినట్లు అర్ధం అవుతోంది. ఆయన కేవలం వ్యక్తిగతంగానే కాక పార్టీ పరంగా కూడా ప్రజలతో అనుసంధానం అయ్యేందుకు ఇప్పటి నుండే గట్టిగా కృషి చేసినట్లయితే ఆయన కంచుకోటలోకి ఈగ కూడా ప్రవేశించే దైర్యం చేయదు.

రాహుల్ పట్టాభిషేకానికి తరలి వెళ్లనున్నఅసమ్మత నేతలు

  కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన అంశాన్ని భుజానికెత్తుకొన్నపటి నుండి ఆ పార్టీలో ఎవరినీ కూడా ప్రజలు నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. ‘సమైక్యం తమ నినాదం కాదని, అది తమ విధానమని’ నమ్మబలుకుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మొదలు, రాష్ట్ర విభజన వ్యతిరేఖిస్తూ రాజీనామాలు, స్వంత ప్రభుత్వంపైనే అవిశ్వాస తీర్మానం, ఇందిరాపార్కువద్ద నిరాహార దీక్షల డ్రామాలు చేసిన కాంగ్రెస్ యంపీలవరకు ఎవరినీ కూడా ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరు. వారందరూ కలిసి త్వరలో మరో కొత్త పార్టీ పెట్టుకొని సరికొత్త వేషాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ముందుకు రాబోతున్నారు. ఇంత జరిగినా కూడా కాంగ్రెస్ అధిష్టానం అదేమీ తెలియనట్లు వారందరినీ ఈనెల 17న డిల్లీల్లో జరగనున్నఎఐసిసి సమావేశానికి రమ్మని ఆహ్వానాలు పంపడం, అందుకు వారందరూ బయలుదేరుతుండటం గమనిస్తే, కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కలిసి సీమాంధ్ర ప్రజలను ఎంతగా మభ్యపెడుతున్నారో అర్ధమవుతుంది. నిజానికి అధిష్టానాన్నిఇంతగా ధిక్కరించిన వారెవరూ ఇంతవరకు పార్టీలో కొనసాగిన దాఖలాలు లేవు. కానీ ఇంతజరిగిన తరువాత కూడా పార్టీలో ఎవరిపైనా కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. సరికదా ఇప్పుడు వారందరినీ పార్టీ అత్యంత కీలకమయిన సమావేశానికి ఆహ్వానిస్తోంది. వారు తరలివెళ్ళబోతున్నారు. అందుకు ఎవరి సాకులు వారికి ఉన్నాయి. బహుశః తెలుగు ప్రజలను ప్రాంతాలు, కులాలు, మతాలు, వర్గాలవారిగా విడదీసి వారిని లొంగదీసుకోవచ్చుననే ధీమాతోనే వారిని చాలా తక్కువగా అంచనా వేసి కాంగ్రెస్ ఇంత దైర్యం చేయగలుగుతోందేమో.

కొత్త పార్టీకి సన్నాహాలు మొదలు?

  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడతారని చాలా రోజులుగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిని ఆయన గట్టిగా ఖండించడం లేదు, అలాగని సమర్దించడం లేదు. అయితే ఆయన మరొక కాంగ్రెస్ నాయకుడు జనవరి 17న స్థాపించబోయే కొత్త పార్టీలో జనవరి 23 తరువాత చేరవచ్చని తెలుస్తోంది.   కానీ నేడో రేపో కొత్త పార్టీ ఆవిర్భావం తధ్యమనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. దానిని బలపరుస్తున్నట్లు, ఈ మధ్య ముఖ్యమంత్రి నిత్యం పలుకుతున్న ‘సమైక్యం మా నినాదం కాదు, మా విధానం’ అనే వాక్యాలతో ఉన్న భారీ ఫ్లెక్సీ బ్యానర్లు, గోడ మీద పెయింటింగ్స్ నిన్నరాత్రి విజయవాడలో పలుచోట్ల సాక్షాత్కరించాయి. అందులో ముఖ్యమంత్రి లేదా మరే రాజకీయనాయకుడి ఫోటో లేదు కానీ ఆంద్రప్రదేశ్ మ్యాప్ తో పాటు, పొట్టి శ్రీరాములు, బూర్గుల రామకృష్ణరావు, తెలుగు తల్లి బొమ్మలున్నాయి. ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా, మొదటి నుండి ఆయన సమైక్యవాదాన్ని బలంగా సమర్దిస్తున్న విజయవాడ యంపీ లగడపాటి రాజగోపాల్ నేతృత్వంలో కొత్త పార్టీ ఏర్పడవచ్చనిపిస్తోంది. ఆయనే ఈ పోస్టర్స్, బ్యానర్స్ కట్టించి ఉండవచ్చును. అదేవిధంగా ఈ బ్యానర్లను తగిలించుకొని విజయవాడలో కొన్ని ప్రచార రధాలు కూడా తిరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఇదేవిధమయిన ఫోటోలు, వ్యాక్యాలు కలిగిన టీ షర్టు కోసం ఒక ప్రముఖ బట్టల కంపెనీకి భారీ ఎత్తున ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.   ఇదంతా చూస్తుంటే బహుశః జనవరి 17న కొత్త పార్టీకి సన్నాహాలుగా కనిపిస్తున్నాయి. బహుశః రేపు, ఎల్లుండిలోగా కొత్త పార్టీపై మరికొంత స్పష్టత రావచ్చును. ఒకవేళ కొత్త పార్టీ ఏర్పడితే, సీమాంధ్రలో మళ్ళీ రాజకీయ వలసలు పెద్ద ఎత్తున మొదలవవచ్చును.

దామోదర డిల్లీ పయనం దేనికో

  వచ్చేఎన్నికలలోగా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు చేయడం తధ్యమని దిగ్విజయ్ సింగ్ ప్రకటించిన మరునాడే, ముఖ్యమంత్రి రేసులో ఉన్నఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహకు డిల్లీకి రమ్మని ఆహ్వానం అందడంతో, మళ్ళీ ఊహాగానాలు మొదలయ్యాయి. సోమవారం రాత్రి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరిన దామోదర, ఈరోజు సోనియాగాంధీతో సమావేశం కానున్నారు. తెలంగాణా ఏర్పాటుకి ఇంకా చాలా సమయం ఉంది గనుక, ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి గురించి చర్చ ఉండకపోవచ్చును. శాసనసభ మళ్ళీ17న సమావేశమయినప్పుడు టీ-బిల్లుపై ఇరు ప్రాంతాల శాసనసభ్యుల వ్యూహ ప్రతివ్యూహాల ఏవిధంగా ఉండబోతున్నాయనే విషయంపై చర్చించేందుకు లేదా తెరాసను కాంగ్రెస్ లో విలీనంపై ఆయన అభిప్రాయం తెలుసుకొనేందుకు పిలిపించి ఉండవచ్చును.