రాజ్యసభ ఎన్నికలతో చంద్రబాబుకు తలనొప్పులు
posted on Jan 25, 2014 @ 9:09PM
తెలుగుదేశం పార్టీకి ఉన్న రెండు రాజ్యసభ సీట్ల కోసం దాదాపు ఐదారు మంది పోటీ పడుతూ చంద్రబాబుకి బీపీ పెరిగేలాచేస్తున్నారు. రెండు రాజ్యసభ సీట్లలో ఒకటి తెలంగాణా కు, మరొకటి సీమాంధ్రకు కేటాయించవలసి ఉంటుంది. తెదేపా సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు తాను పార్టీకి చేసిన సేవలకి ప్రతిగా రాజ్యసభ సీటు ఆశిస్తున్నట్లు గట్టిగానే చెపుతున్నారు. ఇంతకాలంగా చంద్రబాబుపై ఈగ కూడా వాలనీయకుండా కాపాడుకొంటూ వచ్చిన తనకు ఆయన తప్పకుండా రాజ్యసభ సీటు ఇస్తారని నమ్ముతున్నానని మోత్కుపల్లి అంటున్నారు. అయితే, పార్టీలో కార్పోరేట్ వర్గం తనకు టికెట్ రాకుండా అడ్డుకొంటుందేమోననే భయం కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో తెలంగాణా నేతలు ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి ఇద్దరూ కూడా రాజ్యసభ సీటుపై ఆసక్తి చూపకపోయినా, మొత్కుపల్లికి మద్దతు ఇచ్చేందుకు కూడా ముందు రాలేదు. పార్టీలో మరికొందరు నేతలు వరంగల్ కు చెందిన తెదేపా జనరల్ సెక్రెటరీ గరికపాటి రామ్మోహన్ రావుకు మద్దతు ఇస్తున్నట్లు సమాచారం.
ఇక వీరు కాక నన్నపనేని రాజకుమారి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కే. రామ్మోహన్ తదితరులు పోటీలో ఉన్నారు. వీరిలో నన్నపనేని రాజకుమారి, చంద్రబాబు తనకు తప్పకుండా రాజ్యసభ సీటు ఇస్తారని చెప్పుకొంటున్నారు. హరికృష్ణ రాజీనామాతో ఖాళీ అయిన సీటుని ఆయన సోదరుడు బాలకృష్ణకే ఇద్దామని మొదట అనుకొన్నపటికీ, ఆయనను వచ్చే ఎన్నికలలో శాసనసభకు పోటీ చేయించడం వలెనే పార్టీకి ఎక్కువ ప్రయోజనం ఉంటుందని భావించడంతో ఆయన ఈ పోటీ నుండి దాదాపు విరమించుకొన్నట్లే. కానీ పోటీలో మిగిలిన ఇంత మంది అభ్యర్ధులలో ఎవరిని కాదన్నా అలకలు బుజ్జగింపులు తప్పవు. ఈనెల 28న నామినేషన్లు వేయవలసి ఉంటుంది గనుక రేపే తెదేపా తన ఇద్దరు అభ్యర్దుల పేర్లు ఖరారు చేయవచ్చును. గనుక ఎల్లుండి నుండి తెదేపాలో అలకపాన్పు సీన్లు మొదలవుతాయేమో.