కాంగ్రెస్ నేతల మాటల మతలబేమిటో
posted on Jan 27, 2014 @ 3:20PM
రాష్ట్ర విభజన అంశాన్నిభుజానికెత్తుకొన్నకాంగ్రెస్ అధిష్టానం, అది తనకెంత భారంగా ఉన్నాకూడా ఇంతవరకు కాడి క్రిందన పడేయకుండా ప్రయాసపడుతూ మోసుకుపోతోంది. అంటే దానర్ధం తెలంగాణా ఏర్పాటు పట్ల దానికెంతో నిబద్దత ఉందని కాదు. ఉన్నట్లు నటిస్తోంది అంతే! బీజేపీ మద్దతు లేనిదే పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందదని తెలిసి ఉన్నపటికీ, ప్రతీ కాంగ్రెస్ నాయకుడు కూడా “తెలంగాణా బిల్లును పార్లమెంటులో తప్పకుండా ప్రవేశపెడతాము, ఆమోదింపజేస్తాము” అంటూ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి ముహూర్తాలు కూడా తరచు ప్రకటించడం కూడా ఈ జగన్నాటకంలో భాగమే. ఒక అబద్దాన్ని పదిమంది పదిసార్లు పదిమందికి చెపితే నిజమవుతుందన్నట్లు, కాంగ్రెస్ అధిష్టానం తాను స్వయంగా తెలంగాణా ఏర్పాటు చేసే స్థితిలో లేకపోయినా, తెలంగాణా ఏర్పాటు చేస్తానని పదేపదే గట్టిగా చెపుతుండటం వలన, కాంగ్రెస్ నిజంగానే చాలా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నట్లు ప్రజలు భావించే అవకాశం ఉంది. భావిస్తున్నారు కూడా. అందుకు టీ-కాంగ్రెస్ నేతలు కూడా “తెలంగాణా ఇచ్చేది తెచ్చేది తామేనంటూ”, కాంగ్రెస్ అధిష్టానానికి (ఉడతా) భక్తిగా పక్కవాయిద్యాలు వాయిస్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నంలో ఉన్నారు.
అందువల్ల బీజేపీ పార్లమెంటులో తెలంగాణా బిల్లుకు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఈ సమస్య నుండి సురక్షితంగా బయటపడేందుకు కాంగ్రెస్ చాలా ముందు నుండే ఈ వ్యూహం అమలు చేస్తోంది. ఒకవేళ ఏ కారణంగానయినా పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందలేకపోయినా కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న ఈ అతి నిజాయితీని చూసి తెలంగాణా ప్రజలు “తెలంగాణా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ పాపం! చాలా నిజాయితీగా చాలా గట్టిగానే కృషిచేసింది. కానీ, ఆ దుష్ట బీజేపీ మద్దతు ఈయకపోతే తను మాత్రం ఏమి చేయగలదు పోనీలే పాపం!” అని క్షమించి ఓట్లేస్తారని కాంగ్రెస్ (దురా)లోచన.
ఒకవేళ బీజేపీ నిజంగానే బిల్లుకి మద్దతు ఇచ్చినా కూడా మంచిదే. టీ-కాంగ్రెస్ నేతలు చెప్పుకొంటున్నట్లు “తెలంగాణా ఇచ్చేది, తెచ్చేది తామేనని” డంకా భజాయించి చెప్పుకొని మరీ ప్రజలని ఓట్లు అడగవచ్చును. ఇంకా చెప్పుకోదలిస్తే తాము బీజేపీ కొమ్ములు ఏవిధంగా వంచి తెలంగాణాకి మద్దతు ఇప్పించిందీ కధలు కధలుగా చెప్పుకొని ఓట్లు నొల్లుకోవచ్చును.
అందువల్ల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రదర్శిస్తున్న ఈ అతి నిజాయితీ, నిబ్బదత అంతా కూడా ఒకవేళ బిల్లుని ఆమోదింపజేయలేకపోతే తాము వచ్చే ఎన్నికలలో సురక్షితంగా లేదా తక్కువ నష్టంతో బయటపడేందుకే తప్ప, తెలంగాణా ప్రజల పట్ల వెర్రి అభిమానంతో తెలంగాణా ఏర్పాటు చేసేయాలనే ఆలోచనతో మాత్రం కాదు.