రాజ్యసభ పోరు రసవత్తరం: తెరపైకి టీఎస్ఆర్
posted on Jan 28, 2014 @ 9:54AM
తెలంగాణ అంశంపై రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభంపై తీవ్ర ఒత్తిడిలో వున్న కాంగ్రెస్ పార్టీ...రాజ్యసభ కు మళ్ళీ సిట్టింగ్ ఎంపీలకే అవకాశం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి కేవీపీ రామచంద్రరావు, ఎంఏ ఖాన్, టి.సుబ్బిరామిరెడ్డిల పేర్లను ప్రకటించింది. కేవీపీ, ఖాన్‌లకు మరో విడత ఖాయమని తొలినుంచీ వార్తలు వస్తున్నా అనూహ్యంగా సుబ్బిరామిరెడ్డికీ మళ్లీ చాన్స్ దక్కడం గమనార్హం.
సీమాంధ్రలో తిరుగుబాటు ఆందోళన విషయంలో సురక్షితంగా ముందుకు సాగాలనే ఉద్దేశ్యంతో కేవీపీ, సుబ్బిరామిరెడ్డిలకు అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. సమైక్యాంధ్ర నినాదంతో బరిలో నిలిచేందుకు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి, విద్యాసంస్థల అధిపతి చైతన్యరాజు సిద్ధమవుతున్నారు. మరో నేత ఆదాల ప్రభాకర రెడ్డి సైతం తనకు మద్దతుగా సంతకాల సేకరణ జరుపుతున్నారు. దీంతో ఎమ్మెల్యేలు చీలిపోయి, తమ ఓట్లకు చిల్లు పడుతుందని కాంగ్రెస్ లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి రాకుండానే సీమాంధ్రకు చెందిన కేవీపీ, సుబ్బిరామిరెడ్డిలను అభ్యర్థులుగా ఎంచుకున్నట్లు భావిస్తున్నారు. ఎవరెవరు నామినేషన్లు వేస్తారో..ఎవరు ఉప సంహరించుకుంటారు, అంతిమంగా ఎవరు బరిలో నిలుస్తారో 31వ తేదీన స్పష్టమవుతుంది.