మోత్కుపల్లి శాంతించారా?
posted on Jan 29, 2014 @ 9:49AM
రాజ్యసభ సీటు ఇవ్వకపోవడంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కొంత శాంతించినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు మోత్కుపల్లిని బుజ్జగించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించినట్లు తెలుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడాలని మోత్కుపల్లి అనుకున్నారు. ఇంతలో పార్టీ నేతలు వచ్చి తనను కలవడంతో ఆయన ఆ యోచన విరమించుకొన్నారు.
అయితే పార్టీ నేతల వద్ద ఆయన మరోసారి తన బాధను వ్యక్తం చేశారు. తనకు సర్దుబాటు చేసే పరిస్ధితి లేకపోతే కొంత ముందుగానే చెప్పి ఉంటే బాగుండేదని, కాని ఆఖరి నిమిషం వరకూ తేల్చకపోవడంతో తన ప్రతిష్ట దెబ్బ తిందని ఆవేదన వెలిబుచ్చారు. తన వంటి సీనియర్ల విషయంలో బాబు తన మనసులోని మాటను బహిరంగంగా చెప్పాలని, చెప్పలేకపోతే ఇలాగే బాధపడాల్సి వస్తుందన్నారు.
మోత్కుపల్లికి ఇవ్వలేకపోయినందుకు చంద్రబాబు కూడా బాధపడుతున్నారని, కొన్ని సమీకరణాల వల్ల ఈ సమస్య వచ్చింది తప్ప వేరే ఆలోచన లేదని పార్టీ నేతలు ఆయనకు నచ్చజెప్పారు. కాగా, వచ్చి తనను కలవాలని చంద్రబాబు ఈ నేతల ద్వారా ఆయనకు కబురు చేశారు. అయితే, తాను ఇప్పుడే రాలేనని, తర్వాత వచ్చి కలుస్తానని మోత్కుపల్లి తెలిపారు.