మూజువాణి ఓటుతో టీ-బిల్లుని ఆమోదం పొందనుందా
ఈనెల 10న టీ-బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెడతామని హోంమంత్రి షిండే ప్రకటించారు. ముఖ్యమంత్రితో సహా రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాలన్నీకూడా రాష్ట్రపతిని కలిసి బిల్లుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి, దానిని ఆమోదించవద్దని కోరుతున్నపుడు, రాష్ట్రపతి ఎటువంటి నిర్ణయం తీసుకొంటారో తెలియదు. కానీ, హోంమంత్రి షిండే బిల్లుని 10వ తేదీన రాజ్యసభలో ప్రవేశపెడతామని ముందే ప్రకటించడం చూస్తే, బిల్లుపై ఎవరెన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా అవేవి పట్టించుకోకుండా రాష్ట్రపతి బిల్లుని ఆమోదిస్తారని ఆయన నుండి హామీ లేదా గుడ్డి నమ్మకం కలిగి ఉన్నందునే ఆయన అంత ధీమాగా ప్రకటించారేమో! ఈరోజు సుప్రీంకోర్టు బిల్లుకి వ్యతిరేఖంగా దాఖలయిన 8 పిటిషన్లపై విచారణ మొదలుపెట్టబోతోంది. కోర్టు బిల్లుపై తన అభిప్రాయాలు తెలిపినట్లయితే దానిని బట్టి రాష్ట్రపతి కూడా తగు నిర్ణయం తీసుకోవచ్చును. ఒకవేళ సుప్రీం కోర్టు విచారణ మొదలుపెట్టి, విభజన ప్రక్రియపై ‘స్టే’ విదిస్తూ ప్రతివాదులుగా పేర్కొనబడిన కేంద్రప్రభుత్వానికి నోటీసులు జారీ చేసినట్లయితే ఇక రాష్ట్ర విభజన అధ్యాయం ముగిసిపోయినట్లే. అలా కాకుండా విచారణను మరో వారం పదిరోజులకి వాయిదా వేసినట్లయితే, సుప్రీంకోర్టు నుండి కూడా బిల్లుకి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే భావించవచ్చును.
గనుక ఇక రాష్ట్రపతి కూడా బిల్లుపై ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా ఆమోదముద్ర వేసినట్లయితే, షిండే ప్రకటించినట్లు బిల్లుని 10వ తేదీన రాజ్యసభలో ప్రవేశపెట్టడం సాధ్యమవుతుంది. కానీ, బీజేపీతో సహా అనేక ప్రతిపక్షపార్టీలు, యూపీఏకి బయట నుండి మద్దతు ఇస్తున్నసమాజ్ వాదీ పార్టీ, సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలు బిల్లుని వ్యతిరేఖిస్తామని చెపుతున్నపుడు పార్లమెంటులో బిల్లు అమోదం పొందడం కష్టమవుతుంది.
అయితే ఈ గండం గట్టేందుకు కూడా కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ఒక విజయవంతమయిన ఫార్ములాను దిగ్విజయంగా ఉభయసభలలో తన సభ్యుల ద్వారా అమలుచేస్తోంది. సీమాంధ్ర,తెలంగాణా కాంగ్రెస్ పార్టీ సభ్యులు, రాష్ట్రానికి చెందిన ఇతర పార్టీల సభ్యులు అందరూ కలిసి గత రెండు రోజులుగా ఉభయ సభలలో ఆందోళన చేస్తూ సభాకార్యక్రమాలు జరుగకుండా అడ్డుపడుతుండటంతో ఉభయసభలు వాయిదాలు పడుతున్నాయి. బహుశః సమావేశాలు ముగిసే వరకు కూడా ఇదే తంతు కొనసాగే అవకాశం ఉంది.
రాష్ట్ర శాసనసభకు టీ-బిల్లు వచ్చినప్పుడు అక్కడ కూడా ఇదే విధంగా జరిగింది. కానీ, ముఖ్యమంత్రి టీ-బిల్లుకి వ్యతిరేఖంగా ప్రవేశపెట్టిన తీర్మానం తీవ్ర గందరగోళం నడుమ మూజువాణి ఓటుతో ఆమోదింపబడింది. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలంగాణా బిల్లుని అదే పద్దతిలో ఆమోదింపజేసే ఆలోచనలో ఉన్నట్లు కనబడుతోంది. ఇంతకాలంగా బిల్లుకి బేషరతుగా మద్దతు ఇస్తానని చెపుతూ వచ్చిన బీజేపీ ఇప్పుడు వ్యతిరేఖంగా ఓటువేసి అప్రదిష్టపాలవడం కంటే, కాంగ్రెస్ అమలు చేస్తున్న ఈ వ్యూహానికి చాలా సంతోషంగా సహకరిస్తూ, ఓటింగ్ సమయానికి సభలో జరుగుతున్నరాద్ధాంతాన్ని నిరసిస్తూ సభ నుండి వాకవుట్ చేసి బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందేలా చేయవచ్చును. ఈవిధంగా కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఈ గండం నుండి గట్టెక్కగలవు.
కానీ, అంతకంటే ముందు మూడు సమస్యలు బిల్లుకి అవరోధంగా నిలిచే అవకాశం ఉంది. 1. సుప్రీంకోర్టు బిల్లుపై వెలువరించబోయే నిర్ణయం. 2. రాష్ట్రపతి బిల్లుకి ఆమోదం3. ఒకవేళ కేంద్రం హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తే టీ-కాంగ్రెస్, తెరాస నేతలు బిల్లుని వ్యతిరేఖిస్తే ఏమి చేయాలి? ముందుకు సాగాలా? వెనక్కి తగ్గాలా?
ముందుకు వెళితే దానివలన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణాలో ఎటువంటి రాజకీయ లబ్ది కలుగకపోగా, అక్కడ కూడా పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవచ్చును. వెనక్కి తగ్గితే సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలు బిల్లుకి వ్యతిరేఖంగా ఓటు వేస్తారు. కానీ మూజువాణి ఓటుతో బిల్లుని పార్లమెంటులో ఆమోదింపజేయాలని కాంగ్రెస్ భావిస్తే, హైదరాబాద్-కేంద్రపాలిత ప్రాంతం ప్రతిపాదనను కేంద్రం చెత్తబుట్టలో పడేసి నిర్భయంగా ముందుకు సాగవచ్చును.