ఆ ముగ్గురూ
posted on Jan 28, 2014 @ 3:24PM
కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీని, ఒకరినొకరు ఎంత తీవ్రంగా విమర్శించుకొన్నా, సమయంవస్తే అధిష్టానం అందరినీ ఒక్కత్రాటిపైకి తీసుకురాగలదని రాజ్యసభ నామినేషన్ల ఘట్టం రుజువు చేసింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టాన నిర్ణయాన్నే తప్ప, అధిష్టానాన్నివిమర్శించడం లేదని దిగ్విజయ్ సింగ్ మొదలు ముకుల్ వాస్నిక్ వరకు చాలా మంది కాంగ్రెస్ పెద్దలు ఆయనకు క్లీన్ సర్టిఫికెట్లు జారీ చేసారు. అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేఖించడమంటే పార్టీని వ్యతిరేఖిస్తున్నట్లు కాదని అందరూ కలిసి ఒక కొత్త సిద్దాంతాన్ని బాగానే కనిపెట్టారు.
ఈ సిద్దాంతం ప్రకారం కిరణ్ కుమార్ రెడ్డి నేటికీ పార్టీకి విధేయుడు, విశ్వసనీయుడు, క్రమశిక్షణ గల నాయకుడే గనుక, ఆయన కూడా ఈరోజు పార్టీ రాజ్యసభ అభ్యర్ధుల నామినేషను పత్రాలు దాఖలు చేయడానికి వచ్చారు. ఇక, ఆయన ముఖ్యమంత్రిగా ఉండటానికి పనికిరాడని, ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని గట్టిగా కోరే ఆయన బద్ధ శత్రువు దామోదర రాజనరసింహ కూడా ఆయనతో కలిసి వచ్చారు. వీరిరువురికీ ఉమ్మడి శత్రువయిన బొత్ససత్యనారాయణ కూడా వారితో కలిసివచ్చి ఈ అధికారిక తంతు సక్రమంగా, సజావుగా పూర్తి చేయించారు. ఈవిధంగా ముగ్గురు బద్ద శత్రువులు పార్టీకోసం తమ బెషజాలను, అహాన్ని పక్కనపెట్టి కలిసిరావడం కేవలం కాంగ్రెస్ లోనే సాధ్యమేమో!