ఇంతకీ సుబ్బిరామి రెడ్డి గెలిచినట్లా, ఓడినట్లా?
posted on Jan 28, 2014 @ 10:57AM
కాంగ్రెస్ అధిష్టానం సుబ్బిరామి రెడ్డి రాజ్యసభ అభ్యర్ధిగా ప్రకటించడంతో ఆయన కంగు తిన్నారు. ఆయన గతః ఏడాదిగా వైజర్ లోక్ సభ సీటు కోసం సిట్టింగ్ యంపీ పురందేశ్వరితో మాటల యుద్ధం చేస్తున్నారు. వైజాగ్ తో, అక్కడి ప్రజలతో తనకు మూడు దశాబ్దాల అనుబంధం ఉందని, తాను వైజాగ్ కోసం, అక్కడి ప్రజల కోసం చాలా సేవలు చేశానని, అందువల్ల వైజాగ్ సీటుపై న్యాయంగా తనకే సర్వహక్కులు ఉన్నాయని వాదించారు. అంతేగాక వైజాగ్ సీటుని తనకే ఇస్తానని కాంగ్రెస్ అధిష్టానం తనకు చాలా కాలం క్రితమే మాటిచ్చిందని, అదొక దేవ రహస్యమని ఆయన అన్నారు. అందువల్ల, పురందేశ్వరిని పొరుగునున్న ఏ నరసాపురం నియోజక వర్గానికో మారిపొమ్మని ఆయన ఉచిత సలహా కూడా ఇచ్చారు. కానీ, ఆయనకు పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు చాలా ఘాటుగా బదులీయడంతో సుబ్బిరామి రెడ్డి రూ.10కోట్లకు పరువు నష్టం దావా కూడా వేస్తానని బెదిరించారు. దానికీ వెంకటేశ్వర రవు ‘సై’ అనడంతో సుబ్బిరామి రెడ్డి ఇక వెనక్కి తగ్గక తప్పలేదు. గత మూడు నాలుగు నెలలుగా ఆయన వైజాగ్ లో సినిమా హీరోలతో క్రికెట్ మ్యాచులు, కళాకారులకు సన్మాన కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తూ, వాటి గురించి వైజాగ్ లో పెద్దగా ప్రచారం చేసుకొంటున్నారు. ఆయన వైజాగ్ ప్రజలకు చేస్తున్న సేవలు, దానధర్మాలు, ధర్మకార్యాల గురించి వివరిస్తూ ఆయన ఫోటోలతో కూడిన పెద్దపెద్ద బ్యానర్స్ గత రెండు మూడు వారాలుగా వైజాగ్ అంతటా వెలిసాయి.
కానీ కాంగ్రెస్ అధిష్టానం ఆయనను మళ్ళీ రాజ్యసభకే నామినేట్ చేయడంతో ఆయన చేసిన ఈ ప్రయత్నాలు, పురందేస్వరితో చేసిన యుద్ధం అన్నీ కూడా వృధా అయిపోయాయి. ఇది చాలదన్నట్లు ఆయనకు సీమాంధ్ర కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్ధుల నుండి పోటీ ఎదుర్కోక తప్పదు. అధిష్టానం ఆయనను రాజ్యసభ అభ్యర్ధిగా నామినేషన్ ఖాయం చేసినప్పటికీ, అధిష్టానం మాటవిని వారందరూ ఆయనకి మద్దతు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆయనే స్వయంగా పూనుకొని సీమాంధ్ర కాంగ్రెస్ శాసనసభ్యుల మద్దతు కూడగట్టుకోవలసి ఉంటుంది. ఇక, పురందేశ్వరిని నరసాపురం తరలిపొమ్మని చెప్పిన ఆయన వైజాగ్ లోక్ సభ సీటుని ఆమెకే వదిలిపెట్టి తనే ఇప్పుడు రాజ్యసభకు పోక తప్పడంలేదు. ఆయనను తిరిగి రాజ్యసభకు పంపడంతో అధిష్టానం వద్ద ఆమెకి ఎంత పట్టు ఉందో కూడా స్పష్టమయింది.
అందువల్ల తను తిరిగి రాజ్యసభ సీటు పొందినందుకు సంతోషించాలో లేక తను ముచ్చట పడిన లోక్ సభ సీటు తన ప్రత్యర్ధికి వదిలిపెట్టవలసి వచ్చినందుకు బాధ పడాలో తెలియని పరిస్థితి ఆయనది. ఒకవిధంగా ఇది ఆయనకు ఓటమి క్రిందే లెక్క. గనుక, పురందేశ్వరికి టికెట్ రాకుండా అడ్డుపడటమో, వీలుకాకపోతే ఎన్నికల సమయంలో ఆమెకు తన అనుచరుల ద్వారా పొగ బెట్టడమో చేస్తారేమో!