జగన్ కు సబ్బంహరి హెచ్చరిక

      వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ ఎంపీ సబ్బంహరి తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. నిజమైన సమైక్య వాదులు గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గెరపెట్టుకోవాలని హెచ్చరించారు. జగన్ తన స్వార్ధ రాజకీయాలకోసం సమైక్యవాదులను దొంగలనడం సరికాదన్నారు. ''వాళ్ళు దొంగలు...వీళ్ళు దొంగాలంటే'' ఊరుకొనేదిలేదన్నారు. ప్లీనరీలో ఆయన బాష స్థాయికి తగ్గట్టులేదన్నారు. సిగ్గు గురించి జగన్ మాట్లాడితే సిగ్గుకే సిగ్గేస్తు౦దన్నారు. జగన్ పార్టీలో ఎవరికి ఎంత గౌరవం ఉంటుందో ఆయన సోదరి షర్మిలాకు బాగా తెలుసునని అన్నారు. వైకాపా నేతలకు వున్న సంస్కారాలు తనకు అంటగట్టవద్దని కోరారు. ఇకపైన వైకాపా నేతలు తన గురించి మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు. జగన్ బయట సమైక్యవాది..లోపల విభజనవాది అని ఆరోపించారు.  పార్లమెంట్లో తొంభై శాతం బిల్లులు మూజువాణి ఓటుతోనె ఆమోదం పొందుతాయని తెలిపారు.                                     

టీ-బిల్లుపై కడదాకా అదే సందిగ్దత, సస్పెన్స్

  తెలంగాణా బిల్లు, రాష్ట్ర విభజన అంశాలపై రాజకీయ నేతలు, మీడియా, విశ్లేషకులు కూడా ప్రాంతాల వారిగా విడిపోయి ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తం చేస్తున్నారు. చివరికి రాజ్యాంగ నిపుణులు, రిటైర్డ్ జడ్జీలు కూడా బిల్లుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటంతో ఈ అంశాలపై ప్రజలలో చాలా సందిగ్దత నెలకొంది. కొందరు టీ-బిల్లుపై కిరణ్ ప్రవేశపెట్టిన తీర్మానం పనికిరాదని తేల్చేస్తుంటే, కిరణ్ కుమార్ రెడ్డి అదే బ్రహ్మాస్త్రమని అంటున్నారు.   టీ-బిల్లుపై చర్చలు, వాదోపవాదాలు ఇలా సాగుతుంటే, కేంద్రం మాత్రం తనపని తాను చేసుకుపోతోంది. ఇంకా బిల్లు చేతికి రాకమునుపే, రేపు కేంద్ర మంత్రుల బృందం సమావేశమయి బిల్లుకి తుది రూపం ఇచ్చేందుకు సిద్దమవుతోంది. బిల్లుకి మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి ప్రయత్నాలు చేస్తోందో తెలియదు కానీ, బిల్లుని పార్లమెంటు చేత ఖచ్చితంగా ఆమోదింపజేస్తామని గట్టిగా చెపుతోంది. ఈ రోజు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ అన్ని పార్టీలతో సమావేశమవనున్నారు. బహుశః అదే సమయంలో బీజేపీని టీ-బిల్లుకి మద్దతు ఈయమని కాంగ్రెస్ పార్టీ తరపున మరోమారు అభ్యర్దిస్తారేమో!   అవసరమయితే పార్లమెంటు సమావేశాలు పొడిగించయినా బిల్లుని ఆమోదింపజేస్తామని కాంగ్రెస్ పెద్దలు చెపుతున్నపటికీ, ఈనెల 24 లేదా 26 తేదీలలో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎన్నికల కమీషన్ సిద్దమవుతోంది గనుక, సమావేశాలు ఇక పొడిగించడానికి వీలుకుదరకపోవచ్చును. అందువల్ల ఈలోగానే టీ-బిల్లుని ఆమోదించవలసి ఉంటుంది.   కేవలం రెండు వారాలు మాత్రమే సాగే ఓట్-ఆన్-ఎకౌంట్ సమావేశాలలో, కేంద్రంలో ఎన్నికల తరువాత మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకూ ప్రభుత్వ నిర్వహణకు అవసరమయిన ఖర్చుల నిమ్మితం కొన్ని కీలకమయిన ఆర్ధిక బిల్లులు, రాహుల్ గాంధీ వ్యక్తిగత ప్రతిష్ట పెంచేందుకు ఉద్దేశించబడిన మరికొన్ని బిల్లులు కూడా ఉభయ సభలలో ప్రవేశపెట్టి ఆమోదించవలసి ఉంటుంది. అదే సమయంలో టీ-బిల్లు కూడా ప్రవేశపెట్టి, ఉభయ సభలలో సవివరంగా దానిపై చర్చించిన తరువాతనే ఆమోదించవలసి ఉంటుంది.   కానీ, సమయాభావం వలన ఉభయ సభలలో బిల్లుపై అర్ధవంతమయిన చర్చ జరగపోవచ్చును. బిల్లుపై పార్లమెంటులో కూడా మరింత లోతుగా చర్చ జరగకుండా నివారించేందుకే బహుశః కాంగ్రెస్ అధిష్టానం ఇటువంటి సమయాన్ని ఎంచుకొని ఉండవచ్చును. ఇవే యూపీయే ప్రభుత్వం హయంలో జరిగే చిట్టచివరి పార్లమెంటు సమావేశాలు గనుక, బీజేపీ పార్లమెంటులో బిల్లుకి మద్దతు ఇచ్చినా, ఇవ్వకున్నా అతితక్కువ ఇబ్బందితో, నష్టంతో బయటపడవచ్చనే ఆలోచన కూడా కాంగ్రెస్ అధిష్టానానికి ఉండి ఉండవచ్చును.   రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన నాటి నుండి పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేవరకు ప్రతీ దశలో కూడా ఇటువంటి సందిగ్దత కలిగి ఉండటం, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటం గమనిస్తే ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఎంత అసమర్ధంగా, అసంబద్దంగా నిర్వహిస్తోందో అర్ధమవుతుంది. రాష్ట్ర శాసనసభ తీర్మానంతో మొదలవవలసిన విభజన ప్రక్రియను, ముగింపులో దానికి పంపడం, పంపిన తరువాత కూడా దాని అభిప్రాయానికి ఎటువంటి విలువలేదని చెప్పడం కాంగ్రెస్ అధిష్టానానికి చట్ట సభల పట్ల, ప్రజలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాల పట్ల ఎంతటి చులకన భావం ఉందో తెలియజేస్తోంది. ఏమయినప్పటికీ, రానున్న ఎన్నికలలోగా తెలంగాణా ఏర్పడుతుందో లేదో కేవలం మరో రెండు మూడు వారాలలో ఖచ్చితంగా తేలిపోతుంది.  

అన్నా చెల్లెళ్ళ అనుబంధం!

      ఒక కొమ్మకు పూచిన పువ్వులం అనురాగం మనదేలే... అన్నయ్యా.. నీవేలే నా ప్రాణమూ.. ఓ చెల్లెమ్మా నీవేలే నా లోకమూ... అంటూ అన్నా చెల్లెళ్ళ అనుబంధంతో సాగే సినిమా పాట గుర్తుందిగా. ఆదివారం జరిగిన జగన్ పార్టీ ప్లీనరీలో స్టేజీ మీద ఈ పాటని ప్లే చేసినట్టయితే, స్టేజీమీద కనిపిస్తున్న సీన్‌కి ఈ పాట బాగా సింకయ్యేది. ఎందుకంటే ఈ మీటింగ్‌ వేదిక మీద జగనన్న, ఆ జగనన్న వదిలిన బాణం షర్మిల తమ అన్నాచెల్లెళ్ళ అనుబంధం గురించి అందరికీ తెలిసేలా వ్యవహరిస్తూ అందరి దృష్టినీ ఆకర్షించారు.   జగన్ జైల్లో ఉన్నన్నిరోజులూ పార్టీ బాధ్యతలు తీసుకుని పాదయాత్రలు చేసిన షర్మిలకు జగన్ జైల్లోంచి బయటకి వచ్చాక ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోయింది. షర్మిల కడప నుంచి లోక్‌సభకు పోటీ చేయాలన్న ఆకాంక్షను వ్యక్తపరిచారని, అయితే దాన్ని జగన్ తిరస్కరించడంతో ఆమె పార్టీ ఛాయలకు రావడం మానుకున్నారన్న అభిప్రాయాలు గతంలో వినిపించాయి. అయితే ఇప్పుడు వైసీపీ కష్టాల్లో ఉన్నందున అన్నయ్య పార్టీని రక్షించడానికి షర్మిల మళ్ళీ ముందుకొచ్చారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.  ఈ సందర్భంగా వేదిక మీద తల్లి విజయమ్మ మధ్యలో కూర్చుని వుండగా, అటు జగన్, ఇటు షర్మిల కూర్చుని నవ్వుతూ మాట్లాడుకున్నారు. మేం చాలా సన్నిహితంగా వున్నాం. మామధ్య ఎలాంటి విభేదాలు లేవన్న విషయాన్ని జనంలోకి వెళ్ళేలా చేయడానికే వీరిద్దరూ ఇలా పబ్లిగ్గా అనుబంధాన్ని వ్యక్తం చేసి వుంటారని పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే ఈ వేదిక మీద నుంచి షర్మిల చేసిన ప్రసంగం కూడా తనకు, జగనన్నయ్యకి మధ్య ఎలాంటి విభేదాలు లేవనే అర్థం వచ్చేలా సాగిందని అంటున్నారు. ‘నేను జగనన్న వదిలిన బాణాన్ని అంతిమలక్ష్యం చేరేవరకూ ఎంత దూరమైనా సాగుతాను’ అని షర్మిల స్పష్టంగా చెప్పడం కూడా తామంతా ఒక్కటే అనే సందేశాన్ని జనానికి ఇవ్వడంలో భాగమేనని విశ్లేషిస్తున్నారు.

డిల్లీకి చేరిన విభజన రాజకీయం

  రాష్ట్ర విభజన బిల్లు ఈరోజు డిల్లీ చేరుకోబోతోంది. దానికంటే ముందు, తరువాత రాష్ట్ర రాజకీయ నేతలందరూ కూడా డిల్లీలో దిగి విభజనకు అనుకూలంగా, వ్యతిరేఖంగా లాబీయింగ్ చేస్తున్నారు. అందరి కంటే ముందు డిల్లీలో వాలిన కేసిఆర్ ఆర్.జే.డీ. అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్ లను కలిసి బిల్లుకి మద్దతు ఇచ్చేందుకు ఒప్పించారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాతనే తిరిగి హైదరాబాద్ వస్తానని ఆయన ప్రతిజ్ఞ కూడా చేసారు.   చంద్రబాబు నాయుడు తన ఆంధ్ర, తెలంగాణా యంపీ, యంయల్యేలను వెంటబెట్టుకొని కొద్ది సేపటి క్రితమే డిల్లీకి బయలుదేరారు. ఆయన ఇరుప్రాంతల నేతలను వెంటబెట్టుకొని రాష్ట్రపతిని కలిసి రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని లేకుంటే కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకూ విభజన ప్రక్రియను ఆపివేయాలని కోరనున్నారు. తెదేపాతో ఎన్నికల పొత్తు పెట్టుకొందామని భావిస్తున్న బీజేపీ కూడా సీమాంధ్రకు అన్యాయం జరిగినట్లయితే చూస్తూ ఊరుకోమని, వారి హక్కులను కాపాడుతూ తాము బిల్లులో కొన్ని సవరణలు సూచించబోతున్నామని, కాంగ్రెస్ అధిష్టానం వాటిని ఆమోదిస్తేనే బిల్లుకి తాము మద్దతు ఇస్తామని ఈమధ్యనే ప్రకటించింది.   ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా రేపు డిల్లీలో ఇందిరాగాంధీ సమాధి వద్ద రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ దీక్ష చేప్పట్టి, ఆ తరువాత సీమాంధ్ర కేంద్ర, రాష్ట్ర మంత్రులు, యంపీలు, యంయల్యేలతో కలిసి రాష్ట్రపతిని కలిసి శాసనసభ తిరస్కరించిన బిల్లుని పార్లమెంటుకి పంపవద్దని కోరనున్నారు. అదేవిధంగా ఏపీయన్జీవో ఉద్యోగ సంఘ నాయకుడు అశోక్ బాబు కూడా ఉద్యోగ సంఘ నాయకులను వెంటబెట్టుకొని డిల్లీలో ధర్నా చేయనున్నారు.   వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా తన పార్టీ యంపీలను, యంయల్యేలను వెంటబెట్టుకొని నేడో రేపో రాష్ట్రపతిని కలిసి బిల్లుని తిరస్కరించమని కోరనున్నారు. రాష్ట్రం నుండి అన్ని రాజకీయ పార్టీల నేతలు డిల్లీలో ఇతర పార్టీ నేతలను కలిసి బిల్లుకి అనుకూలంగా, వ్యతిరేఖంగా ఓటువేయమని కోరుతుండటంతో వారు కూడా రెండుగా చీలిపోయారు.   మొదటి నుండి రాష్ట్ర విభజన వ్యతిరేఖిస్తున్న సీపీయం నేతలు తాము పార్లమెంటులో బిల్లుని వ్యతిరేఖిస్తామని స్పష్టం చేసారు. అదేవిధంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేఖిస్తున్న సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్, అతని కుమారుడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన అఖిలేష్ యాదవ్ తెలంగాణా బిల్లుని తాము వ్యతిరేఖిస్తామని ప్రకటించారు.

త్వరలో నారా లోకేష్ సైకిల్ యాత్ర

  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గత సం. “వస్తున్నామీ కోసం”అంటూ పాదయాత్ర చేసి పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉరకలెత్తించారు. ఇప్పుడు ఆయన తనయుడు నారా లోకేష్ అదే స్పూర్తితో త్వరలో సైకిల్ యాత్ర మొదలుపెట్టి రాష్ట్రమంతటా పర్యటించేందుకు సిద్దం అవుతున్నారు. తెదేపా ప్రస్తుతం ఆయన యాత్రకి రూట్ మ్యాప్ సిద్దం చేస్తోంది. త్వరలోనే ఆయన యాత్ర మొదలయ్యే తేదీ ప్రకటించవచ్చును. ఆయన తిరుపతి నుండి తన యాత్రను ప్రారంభించే అవకాశం ఉంది.   మరొక రెండు మూడు నెలలో ఎన్నికలు వస్తున్నందున ఆంద్ర, తెలంగాణా, రాయలసీమ ప్రాంతాలలో ప్రజలను, పార్టీ శ్రేణులను కలిసి గత పది సం.ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఏవిధంగా అధోగతికి దిగజారిపోయిందో వివరిస్తూ, తేదేపాకు ఓటేయమని ప్రజలను కోరుతారు. లోకేష్ తన యాత్రలో ప్రధానంగా యువతను కలిసి మాట్లాడుతూ పార్టీకి వారి సహకారం కోరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నారా లోకేష్ వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయబోవడం లేదని ముందే ప్రకటించారు. గనుక ఆయన పార్టీని బలోపేతం చేయడంపైనే శ్రద్ధ వహిస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన తన సైకిల్ యాత్రలో పార్టీ కార్యకర్తలను, స్థానిక నేతలను కూడా కలుస్తూ పార్టీ పరిస్థితి గురించి చర్చించి, వారి నుండి సలహాలను, సూచనలను తీసుకొంటూ, వారికి తగిన విధంగా మార్గదర్శకత్వం చేసే అవకాశం ఉంది. ఈ నెల 24 లేదా 26 తేదీలలో ఎన్నికల కమీషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయవచ్చునని తాజా సమాచారం. అందువల్ల నారా లోకేష్ ఇప్పుడు మొదలుపెడుతున్న సైకిల్ యాత్ర ఎన్నికల ప్రచారం ముగిసే వరకు కొనసాగించవచ్చును.

వీర విధేయ విచిత్ర కాంగ్రెస్ నేతలు

  రాష్ట్ర విభజన ప్రకటన చేసేవరకు కాంగ్రెస్ అధిష్టానాన్ని దూషిస్తూ, బెదిరిస్తూ అతికష్టం మీద రోజులు దొర్లించుకొచ్చిన టీ-కాంగ్రెస్ నేతలు, ఆ తరువాత సోనియా గాంధీ తెలంగాణా ప్రజల ఇంటి ఇలవేల్పని, ఆమె మాటంటే మాటే! అని ఆమెకు చెక్కభజన చేస్తూ తరిస్తున్నారు. ఒకవేళ పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదించలేక, ఎన్నికలలోగా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు చేయకపోతే అప్పుడు వారందరూ సోనియమ్మకు చెక్క భజన చేస్తారో లేక మళ్ళీ తిట్లు లంఖించుకొంటారో చూడాలి. వారందరూ ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలని నిందిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని నిందించని టీ-కాంగ్రెస్ నేత లేడంటే అతిశయోక్తి కాదు. గత ఐదు నెలలుగా వారందరూ కూడా అతను ముఖ్యమంత్రిగా అనర్హుడని వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. అతని వల్లనే తెలంగాణా ఏర్పాటు ఆలస్యం అవుతోందని వాదిస్తారు. అధిష్టానానికి నిత్యం అతనిపై పిర్యాదులు చేస్తుంటారు. అయితే వారెవరూ కూడా అతని ప్రభుత్వానికి కూల్చే ప్రయత్నం మాత్రం చేయలేదు.   ఇక సీమాంధ్ర కాంగ్రెస్ నేతల పద్దతి మరీ విచిత్రంగా ఉంది. వారిలో కొందరు అధిష్టానానికి దిక్కరిస్తుంటే, మరి కొందరు ఆ విమర్శిస్తున్న వారితో మాటల యుద్ధం చేస్తుంటారు. అలాగని వారు తమ అధిష్టానం నిర్ణయం ప్రకారం రాష్ట్ర విభజనకు అంగీకరిస్తున్నామని చెప్పే సాహసం చేయలేరు. మొన్న రాజ్యసభ అభ్యర్ధుల చేత నామినేషన్లు వేయించడానికి ముఖ్యమంత్రి, దామోదర రాజనరసింహ, బొత్ససత్యనారాయణ ముగ్గురు చెట్టాపట్టాలు వేసుకొని తరలివెళ్లడం చూస్తే, కాంగ్రెస్ నేతలందరి డీ.యన్.ఏ. ఒకటేనని, అందరు అధిష్టానానికి విధేయులేనని అర్ధం అవుతుంది. పార్టీ నిలబెట్టిన అభ్యర్ధులను గెలిపించుకోవడానికి ముఖ్యమంత్రితో సహా సీమాంధ్ర నేతలందరూ కలిసి చేసిన కృషి చూస్తే వీరేనా అధిష్టానాన్ని దిక్కరిస్తోంది? అనే అనుమానం కలగక మానదు.

గన్నవరం కోసం తెలుగు తమ్ముళ్ళ పోరు

  వచ్చేఎన్నికలలో తనకే విజయవాడ లోక్ సభ టికెట్ ఇస్తారని భావించిన వల్లభనేని వంశీ నుండి చంద్రబాబు ఆయన నిర్వహిస్తున్న తెదేపా అర్బన్ అధ్యక్ష పదవి నుండి తప్పించి దానిని కేశినేని నాని అనుచరుడికి, విజయవాడ లోక్ సభ టికెట్ కేశినేని నానికి కేటాయించారు. అందుకు ప్రతిగా తనకు కృష్ణాజిల్లాలో గన్నవరం శాసనసభ టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని వంశీ చెప్పుకొంటున్నారు. అయితే ఈ విషయం చంద్రబాబు ఎన్నడూ కూడా దృవీకరించలేదు. కొద్ది రోజుల క్రితం వంశీ తాను వచ్చే ఎన్నికలలో గన్నవరం నుండి శాసనసభకు పోటీ చేయబోతున్నట్లు పునరుద్ఘాటించారు.   గన్నవరం సిట్టింగ్ శాసనసభ్యుడు దాసరి బాలవర్దనరావు వంశీ మాటలకు ప్రతిస్పందిస్తూ, “సిట్టింగ్ శాసనసభ్యుడనయినా నన్నుకాదని, నాకు తెలియకుండా చ౦ద్రబాబు నా సీటుని వేరెవరికో ఎలా కేటాయిస్తారు? చంద్రబాబు గన్నవరం సీటు నాకే ఇస్తారని పూర్తి నమ్మకం ఉంది. అందువల్ల వచ్చే ఎన్నికలలో కూడా నేను గన్నవరం నుండే పోటీ చేయబోతున్నాను. వంశీ ఆ విధంగా ఎందుకు ప్రచారం చేసుకొంటున్నారో నాకు తెలియదు. కానీ ఆయన చేసుకొంటున్నప్రచారం వలన నా నియోజకవర్గ ప్రజలలో, కార్యకర్తలలో చాలా గందరగోళం, అపోహలు ఏర్పడుతున్నాయి. త్వరలో నేను చంద్రబాబుని కలిసి ఈ విషయమై స్పష్టమయిన హామీ తీసుకొంటాను,” అని అన్నారు.   వంశీని అర్బన్ అధ్యక్ష పదవి నుండి తప్పించినపుడు ఆయన వైకాపా లోకి వెళ్లిపోతారని వచ్చిన వార్తలను ఖండిస్తూ “ఒకవేళ వచ్చే ఎన్నికలలో నాకు పార్టీ గన్నవరం శాసనసభ టికెట్ ఈయకపోయినట్లయితే రాజకీయాలకు స్వస్తి చెప్పి వ్యవసాయం చేసుకొంటాను తప్ప వేరే పార్టీలో చేరను,” అని ఆయన అన్నారు. ఇప్పుడు బాలవర్దనరావు గన్నవరం వదలనని చెపుతుండటంతో వంశీ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చినట్లయింది. ఒకవేళ వంశీ కూడా గన్నవరం కోసమే పట్టుబట్టినట్లయితే చంద్రబాబు ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరిస్తారో వేచి చూడాలి,

స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సోనియా!

      ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ అసెంబ్లీలో తెలంగాణ బిల్లును తిరస్కరిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానం మూజువాణి ఓటుతో ఆమోదింపబడటం ఒకవైపు సమైక్యవాదులకు ఆనందాన్ని కలిగిస్తునప్పటికీ, మరోవైపు ఇదంతా తమను మభ్యపెట్టడానికి జరుగుతున్న తతంగమన్న అనమానం కూడా కలుగుతోంది. సీఎం సమైక్య సింహంలా ఎంత గర్జించిన్నప్పటికీ ప్రజల్లో ఏదో ఒక మూల ఆయన మీద అపనమ్మకం బలంగా వుంటోంది. ఆ సమైక్య సింహం చివరికి తమనే మింగేస్తుందేమోనన్న భయం కూడా సమైక్యవాదుల్లో వుంది.   అసెంబ్లీలో జరిగిన వ్యవహారమంతా సోనియాగాంధీ స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో జరిగి వుంటుందన్న అభిప్రాయాలు సాధారణ ప్రజానీకంలో వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అత్యుత్సాహంతో తెలంగాణ ఇవ్వడానికి ముందడుగు వేసింది. అయితే తన అత్యుత్సాహానికి తగిన ప్రతిఫలం ఎన్నికలలో తెలంగాణ ప్రాంతం నుంచి లభించే అవకాశం కల్పించడం లేదు. తెలంగాణ క్రెడిట్ అంతా తన అకౌంట్లో వేసుకోవడానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ముందు మాటిచ్చిన ప్రకారం టీఆర్ఎస్‌ని కాంగ్రెస్‌లో విలీనం చేయవయ్యా మగడా అంటే, కేసీఆరేమో తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా టీఆర్ఎస్ భాగస్వామిగా వుంటుందని పెద్దపెద్ద స్టేట్‌మెంట్లు ఇస్తున్నాడు. తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో, తెలంగాణని సింగపూర్‌లాగా ఎలా మలుస్తుందో చెప్తున్నాడు. దాంతో కాంగ్రెస్‌కి ఏం చేయాలో పాలుపోవడం లేదు. తెలంగాణని భుజానికెత్తుకున్న పాపానికి సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ మటాషైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కిరణ్‌కుమార్‌ని సీమాంధ్ర సింహంలా ప్రజల ముందు నిలిపి సీమాంధ్ర ప్రాంతంలో రాజకీయ లబ్ధి పొందాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా జనం అనుమానిస్తున్నారు. తెలంగాణ ఇష్యూని మరింత సాగదీసి ప్రెసిడెంట్ ఒప్పుకోలేదనో, కొత్తబిల్లు తయారు చేయాలనో, టైమ్ లేదనో, మరో సాకో చెప్పి కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టే ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉందని భావిస్తున్నారు. తెలంగాణ ఇష్యూని టూమచ్ కాంప్లికేటెడ్ చేయడం ద్వారా, ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌కి ఓట్లేస్తేనే ఈసారి అధికారంలోకి రాగానే తెలంగాణ ఇస్తామంటూ తెలంగాణ ప్రజల్ని, టీఆర్ఎస్‌ని కాంగ్రెస్‌లో విలీనం చేస్తేనే తెలంగాణ ఇస్తామంటూ కేసీఆర్ని దారిలోకి తేవడానికే సోనియా పొలిటికల్ గేమ్ ఆడుతోందని అనుకుంటున్నారు. ఈరకంగా తెలంగాణలో, కిరణ్‌ని సీమాంధ్ర సింహంలా ప్రొజెక్ట్ చేయడం ద్వారా సీమాంధ్రలో ఓట్లు, సీట్లు సంపాదించాలనేది కాంగ్రెస్ వ్యూహమని జనం భావిస్తున్నారు.

అపరిచితుడి డిల్లీలో దీక్ష, ర్యాలీ

  విభజన బిల్లుని శాసనసభలో తిరస్కరింపజేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తరువాత ఏమి చేయబోతున్నారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన డిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేయవచ్చని, లేదా సీమాంధ్ర కాంగ్రెస్ యంపీ, యం.యల్యే, మంత్రులందరినీ వెంటబెట్టుకొని రాజ్ ఘాట్ నుండి రాష్ట్రపతి భవన్ వరకు పాదయాత్ర చేసి రాష్ట్రపతికి తెలంగాణా బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు అనుమతించవద్దని విజ్ఞప్తి పత్రం ఇవ్వవచ్చని వార్తలు వెలువడుతున్నాయి. ఈ నెల నాలుగున కీలకమయిన కేంద్రమంత్రుల బృందం సమావేశం, ఆ మరునాడే పార్లమెంటు సమావేశాలు మొదలవనున్నాయి. గనుక ఆయన అదే సమయంలో తన దీక్ష లేదా పాదయాత్ర చెప్పట్టవచ్చని ఆయనకు సన్నిహితంగా మెలుగుతున్న లగడపాటి రాజగోపాల్ కూడా ద్రువీకరించడంతో ముఖ్యమంత్రి డిల్లీలో హంగామా చేయబోతున్నారని స్పష్టం అవుతోంది.   అయితే కొద్ది రోజుల క్రితమే డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన మంత్రులు, పార్టీ సభ్యులతో కలిసి ఐదుగురు పోలీసు అధికారులపై హోంశాఖ వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జరిపిన ముప్పై గంటల దీక్షకు అనుమతించినందుకు సుప్రీం కోర్టు డిల్లీ పోలీసులను చివాట్లు పెట్టడమే కాకుండా చట్టాన్ని కాపాడవలసిన ముఖ్యమంత్రే స్వయంగా చట్టాన్ని ఉల్లంఘించడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. అందువల్ల మరిప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాష్ట్ర విభజన వ్యతిరేఖిస్తూ డిల్లీలో దీక్షలు, ర్యాలీలు నిర్వహించేందుకు డిల్లీ పోలీసులు అంగీకరిస్తారా? అనుమతిస్తే సుప్రీం కోర్టు ఏవిధంగా స్పందిస్తుంది?   పార్లమెంటులో టీ-బిల్లు ప్రవేశపెట్టే తరుణంలో సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి, అందునా కాంగ్రెస్ పార్టీకే చెందిన ముఖ్యమంత్రి దానిని నిరసిస్తూ డిల్లీలో దీక్షలు, ర్యాలీలు నిర్వహించినట్లయితే అది కాంగ్రెస్ అధిష్టానానికి, కేంద్ర ప్రభుత్వానికి చాలా అవమానకరమే కాక చాలా ఇబ్బందికరమయిన పరిస్థితులు కల్పిస్తుంది. అందువల్ల హోంశాఖ ఆయన దీక్షలకి, ర్యాలీలకు అనుమతిస్తుందా? ఈయకపోతే అప్పుడు ఆయన హైదరాబాదులో దీక్షకు కూర్చోంటారా? లేక మరేవిధంగా స్పందిస్తారు? అనేది మరో రెండు మూడు రోజులలో తేలిపోవచ్చును.   ఒకవైపు పార్టీ నిలబెట్టిన రాజ్యసభ అభ్యర్ధులను గెలిపించుకోనేందుకు తీవ్రంగా కృషి చేస్తూ పార్టీపట్ల వీరవిధేయత చూపిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి, మరోవైపు పార్టీని ఇరుకునబెట్టేవిధంగా డిల్లీలో దీక్షలు ర్యాలీలు చెప్పట్టాలనుకోవడంతో ఆయన ఎవరికీ అర్ధం కాని ఒక అపరిచితుడివలే కనబడుతున్నారు.

జైపాల్ రెడ్డి జోస్యం: మూడు వారాల్లో తెలంగాణ

      ఫిబ్రవరి మూడో వారం లోగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుందని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ప్రకటించారు. ఈలోగా తెలంగాణ బిల్లును అడ్డుకునే ప్రయత్నాలు చేశామని గొప్పలు చెప్పడానికే పనికి వస్తుందని జైపాల్ రెడ్డి అన్నారు. శాసనసభ తీర్మానానికి బలం లేదు, పస లేదు అని ఆయన వ్యంగ్యోక్తి విసిరారు. మూజువాణి ఓటుతో తిరస్కరించడం పద్ధతి కాదంటూ రాజ్యాంగంలోని మూడవ అధికరణం ప్రకారం రాష్ట్రపతి అసెంబ్లీకి ఈ బిల్లును పంపించారని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రం విడిపోయాక ఎటువంటి ఆందోళనలు ఉండవని చెబుతూ అసెంబ్లీలో జరిగిన పరిణామాలతో తెలంగాణ ప్రజలు భయపడవలసిన అవసరం లేదు అని ఆయన భరోసా ఇచ్చారు. ఏకపక్ష ఐక్యత ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు నిలువునా చీలిపోయారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలలో వచ్చిన మార్పును దృష్టిలో ఉంచుకునే కేంద్రం రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నదని ఆయన చెప్పారు.

కాంగ్రెస్ నేతల చేతిలో చైతన్యరాజు బకరా అయ్యారా?

  రాజ్యసభ ఎన్నికల పర్వం మొదలవగానే సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తమను ఇంతగా అవమానిస్తున్న అధిష్టానానికి బుద్ధి చెప్పేందుకు తగిన అవకాశం వచ్చిందని చాల మందే పోటీకి సిద్దమయ్యారు. కానీ, నామినేషన్ల సమయం వచ్చేసరికి, తాము ఎవరికయితే గట్టిగా బుద్ధి చెప్పాలని భావించారో, ఆ అధిష్టానం ఆదేశాలకే తలొగ్గి అందరూ పోటీలో తప్పుకొన్నారు. కానీ, వారి భరోసాతో ప్రముఖ విద్యావేత్త, యం.యల్సీ. చైతన్యరాజు, ఆదాల ప్రభాకర్ రెడ్డి బరిలో దిగారు. వారు నామినేషన్లు వేసినప్పటి నుండి పీసీసీ అధ్యక్షుడు వారిరువురిని, ముఖ్యంగా చైతన్య రాజుని ఎలాగయినా పోటీ నుండి తప్పించాలని చాలా ప్రయత్నాలు చేసారు. చైతన్యవిద్యాసంస్థలకి అధిపతిగా సమాజంలో ఎంతో గౌరవనీయమయిన స్థానంలో ఉన్న చైతన్యరాజుపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్లు ఉన్నాయని రిటర్నింగ్ ఆఫీసరుకు లేఖలు వ్రాసారు. కానీ, ఎన్నికల అధికారులు అవి తప్పుడు ఆరోపణలని నిర్దారించుకొని ఆయన నామినేషన్ దృవీకరించారు.   అప్పటి నుండి ముఖ్యమంత్రి మొదలు అంతవరకు ఆయనకు మద్దతు ఇచ్చిన మంత్రులు, శాసనసభ్యులు అందరూ కూడా ఆయనపై తీవ్ర ఒత్తిడి తీసుకు వచ్చి, చివరికి ఈరోజు ఆయన చేత తన నామినేషన్ ఉపసంహరింపజేసి గానీ ఆయనను వదిలిపెట్టలేదు. విద్యాధికుడు, విద్యావేత్త అయిన చైతన్య రాజు పెద్దల సభకు వెళ్లేందుకు అన్నివిధాల అర్హుడు. ఆయనని పోటీ చేయమని, తాము మద్దతు ఇస్తామని ఉసిగొల్పి తీరాచేసి నామినేషన్ వేసిన తరువాత ఆయనను కాంగ్రెస్ నేతలందరూ కలిసి ఘోరంగా అవమానించడమే కాకుండా, చివరికి ఆయనకు మద్దతు ఇచ్చిన వారే ఆయన చేత బలవంతంగా నామినేషన్ ఉపసంహరింపజేసి మరింత అవమానపరిచారు.   సమాజంలో అందరివద్ద గౌరవం అందుకొనే ఆయన ఈ కాంగ్రెస్ నేతల చేతిలో అవమానం పాలవడం చాలా దురదృష్టకరం. కాంగ్రెస్ నేతలు తమ శాసనసభ్యులకు నచ్చజెప్పుకొని, తమ పార్టీ నిలబెట్టిన అభ్యర్ధులనే గెలిపించుకొని ఉంటే, అప్పుడు ఆయన పోటీలో ఓడిపోయినా ఇంత అవమానంగా ఉండేది కాదు. కానీ ఆయనను ఎన్నికలలో పోటీ చేయమని ప్రోత్సహించి, ఆయనను అప్రదిష్టపాలు చేసిన తరువాత ఆయనను బలవంతంగా పోటీ నుండి విరమింపజేయడం చాలా హేయమయిన చర్య. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎన్నికలు చాల ప్రతిష్టాత్మకంగా భావించి ఉండవచ్చును. కానీ అదేసమయంలో చైతన్యరాజుకి కూడాసమాజంలో ఒక విలువ గౌరవం ఉంటాయనే సంగతి కాంగ్రెస్ పట్టించుకోకపోవడం చాలా విడ్డూరం. ఒకవిద్యావేతను పెద్దల సభకు పంపడం కంటే ముగ్గురు రాజకీయ నాయకులను పంపడమే తనకు మేలని కాంగ్రెస్ భావించడం ఆ పార్టీ దౌర్భాగ్యం.  

రాజ్యసభ ట్విస్ట్: చైతన్యరాజు తప్పుకున్నారు..

      రాజ్యసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన చైతన్యరాజు చివరి నిమిషంలో బరిలో నుంచి వెనక్కి తప్పుకున్నారు. ఈ రోజు ఉదయం చైతన్యరాజు , సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో భేటి అయ్యారు. కిరణ్ ఆయనతో చర్చలు నామినేషన్ ఉపసంహరణకు ఒప్పించినట్లు తెలుస్తోంది. మంత్రులు గంటా, ఏరాసు, శైలజానాథ్, ఎంపీ ఉండవల్లితో కలిసి చైతన్యరాజు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఉపసంహరణ లేఖను అందజేశారు. ముఖ్యమంత్రి సూచన మేరకే నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు చైతన్య రాజు కూడా చెప్పారు. సమైక్యవాదానికి మద్దతుగా అని చెప్పిన చైతన్యరాజు, రాష్ట్ర సమైక్యతపై ఏం హామీ ఎవరి నుంచి పొంది నామినేషన్‌ని ఉపసంహరించుకున్నారో!

టీ ఉద్యోగుల బెదిరింపు సెక్షన్

      తెలంగాణ వస్తుందన్న కలలు మెల్లమెల్లగా కరిగిపోతూ వుండటంతో విభజనవాదులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. గొడవ పడి అయినా, దొమ్మీ చేసి అయినా సీమాంధ్రుల మీద ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తున్నట్టున్నారు. సీమాంధ్రుల మీద తొలుత మాటల దాడి చేసి భయభ్రాంతులకు గురిచేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్రణాళికను అసెంబ్లీ స్థాయి నుంచి గల్లీ స్థాయి వరకూ విజయవంతంగా అమలు చేసే ఉద్దేశంలో కృతనిశ్చయులై వున్నారు.   అసెంబ్లీలో టీ బిల్లుపై చర్చ జరిగే చివరిరోజున తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు సృష్టించిన రాద్ధాంతం చరిత్ర ఎన్నటికీ మరచిపోలేదు. ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన, జరుగుతున్న పరిణామాలు తెలంగాణ ప్రజలు కూడా హర్షించే విధంగా లేవు. అన్నదమ్ముల మాదిరిగా విడిపోదామంటూనే సీమాంధ్రుల పట్ల ఆగర్భ శత్రువుల్లా వ్యవహరిస్తున్న విభజనవాదుల తీరు ఎంతోమందికి ఆవేదన కలిగిస్తోంది. అసెంబ్లీలో సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు తమపై భౌతిక దాడులు జరిగే అవకాశం వుందని, తమకి రక్షణ కల్పించాలని స్పీకర్‌కి మొర పెట్టుకున్నారంటే పరిస్థితి  ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క అసెంబ్లీలో మాత్రమే కాదు... అన్ని రంగాల్లోనే ఇలాంటి ఘర్షణ పూరిత వాతావరణాన్ని సృష్టించడానికి విభజనవాదులు ప్రయత్నిస్తున్నారు. సచివాలయంలో ఉద్యోగుల హౌసింగ్ సొసైటీకి సంబంధించి జరుగుతున్న సమావేశంలో విభజనవాదులు లేనిపోని రాద్ధాంతం సృష్టించి పోలీసు కేసుల వరకూ వెళ్ళారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడిన మాటలు భవిష్యత్తులో నిజంగానే తెలంగాణ వస్తే హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రజల పరిస్థితి ఎలా వుంటుందన్నదానికి అద్దం పట్టేలా వున్నాయి. ఓ తెలంగాణ ఉద్యోగ సంఘం నాయకుడు మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పాసై, రాష్ట్రపతి సంతకం అయ్యే వరకూ వేచి చూస్తాం. ఆ తర్వాత సీమాంధ్రులకు పట్టపగలే చుక్కలు చూపిస్తాం అని వ్యాఖ్యానించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా బతికి వుండగానే ఇలాంటి బెదిరింపు సెక్షన్‌కి పాల్పడుతున్న విభజనవాదులు పొరపాటునో, గ్రహపాటునో రాష్ట్ర విభజన జరిగితే ఎంతకు తెగిస్తారన్నది తలచుకోవడానికి భయం వేసేలా వుంది. ఇలాంటి విపరీత ధోరణులను అరికట్టాల్సిన బాధ్యత అందరిమీదా వుంది.  

కేకే ఓటమి ఖాయమా?

      పాపం కే.కేశవరావుకి ఒక వీక్నెస్ వుంది. ఆయన ఎప్పుడూ ఏదో ఒకపదవిలో వుండాలి. లేకపోతే ఆయనకి ఊపిరి ఆడదు. దాంతో ఆయన ఏ పార్టీలోవుంటే ఆ పార్టీలో వాళ్ళకి ఊపిరి ఆడకుండా చేస్తూ వుంటారు. కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ఒకసారి రాజ్యసభకి పంపించింది. రెండోసారి రాజ్యసభకు పంపకపోవడంతో అలిగిన ఆయన తెలంగాణ ఉద్యమంలో మరోసారి ఒక్క ఉదుటున దూకేశారు. కాంగ్రెస్ పార్టీలో వుంటూనే ఉద్యమం పేరు చెప్పి బోలెడన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. తన ధాటికి కాంగ్రెస్ అధిష్ఠానం బెదిరిపోయి తనను మళ్ళీ ఏ రాజ్యసభకో పంపిస్తుందని ఎదురు చూసిన ఆయనకు ఆ అవకాశం దక్కలేదు.   ఇక కాంగ్రెస్ అధిష్ఠానం తన బెదిరింపులకు లొంగే అవకాశం లేదని స్పష్టంగా అర్థం చేసుకున్న ఆయన ఓ ఫైన్ మార్నింగ్ టీఆర్ఎస్ లోకి జంప్ జిలానీ అయ్యారు. ఆయన పార్టీ వదిలిపోయినందుకు కాంగ్రెస్ పార్టీ ఎంతమాత్రం ఫీలవకుండా ప్రశాంతంగా వుంది. తాజాగా రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఆరు స్థానాలు ఖాళీ కావడంతో కేకే గారికి మళ్ళీ రాజ్యసభ మీద మోజు మొగ్గ తొడిగింది. గెలిచే అవకాశం లేదని తెలుస్తూనే వున్నా ఆయన రాజ్యసభకు పోటీ చేయాలని ముచ్చటపడ్డారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల్లో తనకాళ్ళమీద పడేవాళ్ళు చాలామంది వున్నారని, వాళ్ళు తనకు తప్పకుండా ఓటేస్తారని కేకే నమ్మకం పెట్టుకున్నారు. ఈ పాయింట్‌ని సాకుగా చూపించి టీఆర్ఎస్ తరఫున రాజ్యసభ బరిలో నిలబడటానికి కేసీఆర్‌ని ఒప్పించారు. ఈయన కోరికను కాదంటే మళ్ళీ పార్టీ వదిలి ఎక్కడ వెళ్ళిపోతారని అనుకున్నారో లేదా ఆయన మోజుని ఎందుకు కాదనాలని అనుకున్నారోగానీ కేసీఆర్ కేకేని తమ పార్టీ తరఫున రాజ్యసభ బరిలో నిలబెట్టారు. అప్పటి నుంచి కేకే కాలికి బలపం కట్టుకుని కాంగ్రెస్, సీపీఐ, మజ్లిస్ పార్టీల మద్దతు కూడగట్టుకోవడానికి తిరుగుతున్నారు. అయితే కేకే ఎన్ని తంటాలు పడినా ఆయన గెలిచే అవకాశాలు లేవని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. స్వతంత్ర్య అభ్యర్థులుగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చైతన్యరాజు, ఆదాల ప్రభాకరరెడ్డిలో ఎవరో ఒకరు గెలిచే అవకాశమే వుందని అంటున్నారు. ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు వైసీపీ ఎమ్మెల్యేలు ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఓటు వేసే అవకాశం వుందని అంటున్నారు. అది కూడా కేంద్రమంత్రి పల్లంరాజు ఆశీస్సులు దండిగా వున్న చైతన్యరాజుకే ఎక్కువ ఛాన్స్ వుందని భావిస్తున్నారు. కేకేకి ఓటమి తప్పదని ఊహిస్తున్నారు.

కాంగ్రెస్ కిరణ్ ని ముందుకు తీసుకువస్తోందా

  శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నేతయిన చంద్రబాబు నాయుడు మొన్న సోమవారంనాడు సభలో రాష్ట్ర విభజన అంశంపై ప్రసంగించేందుకు సిద్దమయ్యారు. కానీ, ముఖ్యమంత్రి అకస్మాత్తుగా బిల్లుకి వ్యతిరేఖంగా తీర్మానం పెట్టాలని నోటీసు ఇవ్వడంతో, సభ స్థంభించిపోయింది. దానితో చంద్రబాబుకి సభలో మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. దానిఅపి ఆగ్రహిస్తూ ఆయన కొన్ని ఆసక్తికరమయిన విషయాలు మాట్లాడారు. అదేవిధంగా కొన్ని ఆసక్తికరమయిన ప్రశ్నలు లేవనెత్తారు.   1. సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడేందుకు అవకాశం ఎందుకు ఈయలేదు?   2. ప్రధాన ప్రతిపక్ష నేత హక్కులను కాపాడవలసిన బాధ్యత స్పీకర్ కు లేదా?   3. శాసనసభ్యులు సభ నుండి ఇంకా మీడియా పాయింటు కూడా చేరుకోకముందే, డిల్లీ నుండి దిగ్విజయ్ సింగ్ బిల్లుపై చర్చ ముగిసిందని ఏవిధంగా ప్రకటించారు?   4. రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నానని చెపుతూ బిల్లుకి వ్యతిరేఖంగా తీర్మానం కూడా చేయించిన ముఖ్యమంత్రి, రాష్ట్ర విభజన కోసం అన్ని ఫైల్స్, వివరాలు పంపమని కేంద్రం కోరినపుదు తిరస్కరించకుండా, ఎప్పటికప్పుడు ఎందుకు పంపించి కేంద్రానికి సహకరించారు?   ఇక చంద్రబాబు చెప్పిన ఆసక్తికరమయిన విషయాల కొస్తే, జగన్మోహన్ రెడ్డి సమైక్యవాదిగా ఎదగడానికి ఇంతకాలం సహకరించిన కాంగ్రెస్ అధిష్టానం, ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆ కీర్తి కట్టబెట్టాలని ప్రయత్నిస్తోందని అన్నారు. డిల్లీ నుండి వచ్చిన ఆదేశాల ప్రకారమే ముఖ్యమంత్రి తీర్మానం నోటీసు ఇవ్వడం, సభలో కాంగ్రెస్, తెరాస, వైకాపాలు కలగలిసి నాటకమాడి, సభ జరగకుండా అడ్డుపడి గడువు కంటే ముందే చర్చ ముగించేసి చేతులు దులుపుకోన్నారని ఆయన అన్నారు. పార్టీ తయారు చేసిచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారమే కిరణ్, బొత్స, దామోదర ముగ్గురూ వ్యవహరించి బిల్లుని సజావుగా వెనక్కి త్రిప్పి పంపుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.   ఈ మొత్తం వ్యవహారాన్ని వైకాపా వీలయినంత త్వరగా చుట్టబెట్టేయాలని తాపత్రయపడిందని, కానీ వారి ఆంతర్యం బయటపడటంతో మరో కొత్త నాటకం ఆడారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్న ముఖ్యమంత్రి కేంద్రానికి పరోక్షంగా సహకరిస్తున్నపటికీ, ఆయన చేతే సభలో బిల్లుకి వ్యతిరేఖంగా తీర్మానం చేయించడం ద్వారా ఆయనను సీమాంధ్ర ప్రజల దృష్టిలో సమైక్య ఛాంపియన్ గాఎదిగేందుకు కాంగ్రెస్ సహకరించిందని చంద్రబాబు అభిప్రాయం కావచ్చును.   బిల్లుపై చర్చ ముగిసిన వెంటనే డిల్లీ నుండి మాట్లాడిన దిగ్విజయ్ సింగ్ “బిల్లుపై చర్చించమని తామే తమ నేతలకు అనుమతి ఇచ్చామని వారు ఆ పనిని సక్రమంగా పూర్తి చేసారని” కితాబు ఇవ్వడం బహుశః అందుకే కావచ్చును.   ఇక కాంగ్రెస్ అధిష్టానం జగన్మోహన్ రెడ్డిని వెనక్కి నెట్టి, కిరణ్ కుమార్ రెడ్డిని ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తోందని చంద్రబాబు అనడం చూస్తే కాంగ్రెస్ వ్యూహం మారిందని ఆయన అభిప్రాయపడుతున్నట్లు అనుకోవచ్చును. అదే నిజమయితే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ కష్టకాలం మొదలవుతుందేమో!

ఆమ్ ఆద్మీ మీద కాంగ్రెస్ కత్తి!

      అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారం చేపట్టి నెలరోజులు పూర్తయ్యాయి. ఈ నెలరోజుల్లోనే కేజ్రీవాల్ ఏ స్థాయి పరిపాలనా దక్షుడో ఢిల్లీ ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది. ఆయన పార్టీ అభ్యర్థులను అనవసరంగా ఎమ్మెల్యేలుగా గెలిపించామన్న పశ్చాత్తాపంతో ఇప్పుడు ఢిల్లీ ప్రజలు కుమిలిపోతున్నారు. దేవుడి దయవల్ల ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తే అటు కాంగ్రెస్‌ని, ఇటు కేజ్రీవాల్‌ని జాయింట్‌గా ఇంటికి పంపించేసి బీజేపీకి పట్టం కట్టాలని భావిస్తున్నారు.   కేజ్రీవాల్ చెప్పేదొకటి చేసేదొకటి అనే విషయం ఈ నెలరోజుల్లో అనేక సందర్భాలలో రుజువైంది. దీనికితోడు ఆమ్ ఆద్మీ పార్టీలో అధికారం కోసం కుమ్ములాటలు, ఒక ఎమ్మెల్యే తిరుగుబాటు చేయడం, ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించడం ఢిల్లీ ప్రజల్లో ఆమ్ ఆద్మీ పార్టీని చులకన చేసేశాయి. కేజ్రీవాల్ ప్రభుత్వంలోని ఓ మంత్రిగారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమే కాకుండా, సినిమా ఫక్కీలో దాడులు, సోదాలు చేస్తూ వుండటం ప్రజలకు మింగుడు పడటం లేదు. నిర్భయ సంఘటనను ఆధారంతా చేసుకుని ఆమ్ ఆద్మీ పార్టీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. అయితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన పది రోజులకే ఢిల్లీలో ఓ విదేశీ వనిత మీద అత్యాచారం జరిగింది. ఈ సంఘటన విషయంలో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ బాధ్యత తీసుకోకుండా తప్పించుకునే ధోరణిలో వ్యవహరిస్తోంది. అందుకే తాము చేసిన పొరపాటును దిద్దుకోవడం కోసం ఢిల్లీ ఓటర్లు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కాగలకార్యం గంధర్వులే తీర్చుతారన్నట్టుగా ఢిల్లీ ప్రజలు కోరుకున్న రోజు కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అని త్వరలో వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ ఎన్నికలలో నిలబడింది. సదరు పార్టీ పునాదుల్లోనే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత వుంది. అయితే ఎన్నికలు పూర్తయిన తర్వాత అదే పార్టీ కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ తనని ఎంతగా తిట్టినా వాటినన్నిటినీ మర్చిపోయినట్టు నటిస్తూ కాంగ్రెస్ పార్టీ తగుదునమ్మా అంటూ వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చింది. ఒకపక్క ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని నడుపుతూనే మరోపక్క కాంగ్రెస్ పార్టీని నాన్‌స్టాప్‌గా తిడుతూనే వుంది. దీంతో మంచి ముహూర్తం చూసి ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఉపసంహరించాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేసి, మళ్ళీ ఎన్నికలు వచ్చేలా చేస్తే తాను మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం వుందని కాంగ్రెస్ కలలు కంటోంది.

కాంగ్రెస్ లో అధికార వికేంద్రీకరణ సాధ్యమేనా

  ఇటీవల రాహుల్ గాంధీ ఒక ప్రముఖ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బీజేపీ అధికారాన్ని మోడీ ద్వారా కేంద్రీకృతం చేయాలని భావిస్తుంటే, తాను అధికార వికేంద్రీకరణ జరిగి, సామాన్యులు కూడా అందులో భాగాస్వాములవ్వాలని కోరుకొంటున్నాని చెప్పుకొచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీలో అధికార (వి)కేంద్రీకరణ ఎంత గొప్పగా అమలవుతోందో అందరికీ తెలుసు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నఏ రాష్ట్ర ప్రభుత్వమయినా ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నావెంటనే డిల్లీకి పరిగెత్తడం అందరూ చూస్తేనే ఉన్నారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమయినా కుట్టదన్నట్లు హైకమాండ్ ఆజ్ఞ లేనిదే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ నిర్ణయమూ స్వయంగా తీసుకోలేవని అందరికీ తెలుసు. అయినా యువరాజవారు అధికార వికేంద్రీకరణ గురించి మాట్లాడటం చూస్తే ఆయన మాటలకి చేతలకీ పొంతన ఉండదని స్పష్టమవుతోంది. సామాన్యులు అధికారంలో భాగస్వాములవడం మాట దేవుడెరుగు. కోట్లు ఖర్చుపెట్టి ఎన్నికలలో పోటీ చేయగలవారికే పార్టీలో దిక్కు లేదు.   ఇంతకీ ఈ ఉపోద్గాతం అంతా ఎందుంటే, బొత్ససత్యనారాయణ తాను, ముఖ్యమంత్రి, మరికొందరు కాంగ్రెస్ పెద్దలు కలిసి ఎంపిక చేసిన పార్టీ రాజ్యసభ అభ్యర్ధులకు వ్యతిరేఖంగా పోటీలో ఉన్న తిరుగుబాటు అభ్యర్ధులు వెంటనే పోటీ నుండి విరమించుకోవాలని, అదేవిధంగా కాంగ్రెస్ శాసనసభ్యులందరూ విధిగా పార్టీ అభ్యర్దులకే ఓటేయాలని, అలా కాకుండా ఇతరులకి ఓటేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.   ఆయన, తను మరి కొందరు కాంగ్రెస్ పెద్దలు కలిసి అభ్యర్ధుల పేర్లు ఖరారు చేసామని చెపుతున్నారు. కానీ, నిజానికి వారు అభ్యర్ధుల జాబితాను పట్టుకొని డిల్లీ వెళ్లి అధిష్టానం ఆమోదముద్ర వేయించుకోకుండా తమంతట తాము అభ్యర్ధులను ఖరారు చేయలేరు. మరప్పుడు ఎవరికీ కూడా ఈ అధికార వికేంద్రీకరణ గురించి ఆలోచన కూడా రాలేదు. చివరికి కాంగ్రెస్ శాసనసభ్యులు ఎవరికి ఓటు వేయాలో కూడా పార్టీయే నిర్ణయిస్తుంది. బహుశః అది కూడా అధికార (వి) కేంద్రీకరణగానే అందరూ అర్ధం చేసుకోవలసి ఉంటుంది.   ప్రధానమంత్రయి దేశాన్ని ఏలాలనుకొంటున్న రాహుల్ గాంధీ, కీలకమయిన రాష్ట్ర విభజన సమస్య గురించి ఎన్నడూ దైర్యంగా మాట్లాడలేదు. సమస్యను సామరస్యంగా పరిష్కరించలేకపోయారు. ఆ భాద్యతను పార్టీ సీనియర్ల నెత్తిన పడేసి, వీలుచిక్కినప్పుడల్లా తను ఆచరించి చూపలేని తన ఆశయాలు గురించి ఈవిధంగా ఉపన్యాసాలు ఇవ్వడం వలన ఆయనకి కానీ, పార్టీకి గానీ ఒరిగేదేమీ ఉండదు. అసలు స్వంతపార్టీలోనే ముఖ్యమంత్రితో సహా నేతలందరూ పార్టీపై తిరుగుబాటు చేస్తున్నప్పుడు, ముందుగా పార్టీని చక్కబెట్టుకోకుండా దేశాన్ని చక్కబెట్టేస్తానని చెప్పడం మరీ ఆశ్చర్యం కలిగిస్తుంది.

టీ-బిల్లుపై కాంగ్రెస్ పెద్దల కొత్త కబుర్లు

  రాష్ట్ర విభజన అంశం మళ్ళీ డిల్లీకి మారింది. ఇంతవరకు బిల్లుపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తలోమాట మాట్లాడితే, ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానంలో పెద్దలు తలోమాట మాట్లాడటం మొదలు పెట్టారు. శాసనసభ బిల్లుని తిరస్కరించిన వార్త వెలువడిన వెంటనే స్పందించిన దిగ్విజయ్ సింగ్, దాని వల్ల బిల్లుకొచ్చే నష్టమేమీ లేదని, రాష్ట్ర విభజన ఆగబోదని ప్రకటించారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన హోం మంత్రి షిండే బిల్లుపై నిర్ణయం తీసుకోవడానికి తమకు కొంత సమయం అవసరమని, బిల్లుని శాసనసభ వ్యతిరేఖించినందున అటార్నీ జనరల్ని సంప్రదించి న్యాయసలహా తీసుకుంటామని తెలిపారు. ఈ నెల 4వతేదీన జరిగే మంత్రుల బృందం సమావేశంలో శాసనసభ లేవనెత్తిన అన్నిఅంశాల గురించి చర్చించి తగు నిర్ణయం తీసుకొంటామని ఆయన చెప్పారు. బిల్లుపై స్పందించిన ఇద్దరిలో ఒకరు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తే, మరొకరు న్యాయసలహా తీసుకొంటామని చెప్పడం విశేషం. బహుశః త్వరలో చాకో, ఆజాద్, తివారీ, జైపాల్ రెడ్డి వంటి మరికొందరు మీడియా ముందుకు వచ్చి బిల్లుపై మరిన్నికొత్త కబుర్లు చెపుతారేమో!

తెలంగాణతో తిరిగొస్తా: కెసిఆర్

      ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తెలంగాణ వచ్చితీరుతుందని, రేపు ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి వెళుతున్నానని, తిరిగి వచ్చేది తెలంగాణ రాష్టంలోకేనని టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లు తిరస్కరణకు గురికావడంపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ 15 రోజులలో తెలంగాణ ప్రజల కల సాకారం కాబోతుందని, ఎవరూ నిరాశ చెందవద్దని, సంతోషంగా ఉండాలని, సంబరాలు చేసుకుందామని, స్వీట్లు తినిపిస్తానని స్పష్టం చేశారు.   ముఖ్యమంత్రి కిరణ్‌కు, ప్రతిపక్షనేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఏం మాట్లాడాలో తెలియదని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి అనుకుంటే శాసనసభనే రద్దు చేయగలని, వాళ్ళవి చిల్లర వ్యాఖ్యలని ఆయన విమర్శించారు. ఇంత జరిగిన తర్వాత ఇక కలిసి ఉండలేమని, మానసికంగా విడిపోయామని కేసీఆర్ పేర్కొన్నారు. సీమాంధ్రకు ఏం కావాలో కేంద్రం కోరుకోమని అంటే, కోరుకోకుండా ఏదో మాట్లాడుతున్నారని కేసీఆర్ అన్నారు. తెలంగాణ విషయంలో తెలంగాణ ప్రజలు నిర్భయంగా ఉండాలని, ఈరోజుతో అసెంబ్లీ అయిపోయిందని, ముఖ్యమంత్రి కిరణ్, చంద్రబాబు నాయుడులు ఏం చేయలేరని, ఇక జరగాల్సింది ఢిల్లీలోనేనని కేసీఆర్ పేర్కొన్నారు.