హరీశ్ దేవినేని నీటి వివాదం.. పంతం నీదా నాదా..
నీటి కేటాయింపులపై ఏపీ, తెలంగాణకు మధ్య వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై చర్చించడానికి ఇరు రాష్ట్రాల మంత్రులు కేంద్రం వద్ద చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఇరువురి వాదనలు ఎడ్డెం అంటే తెడ్డెం అనే రకంగా ఉన్నాయి. దీంతో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరిలో ఎవరూ కూడా తగ్గే పరిస్థితి వచ్చింది. ఇక్కడే అసలు సమస్య వస్తుంది. కనీసం ఒక్కరైనా తగ్గితే సమస్య పరిష్కారం అయిపోతుంది. కానీ ఎంతైనా మంత్రులు.. అందునా కొట్టుకొని మరీ విడిపోయిన వాళ్లం.. ఇంకా ఎందుకు తగ్గుతారు.
ఒక పక్క కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు కేటాయించిన వాటాలో చుక్క నీటిని కూడా వదులుకునేందుకు తాము సిద్ధంగా లేమని హరీశ్ రావు అంటుంటే.. తమ పరిధిలోని ప్రాజెక్టుల గేట్ల వద్ద తమ పోలీసులు పహారా కాయడాన్ని కూడా తెలంగాణ తప్పుబడుతున్నదని, ఇదెక్కడి న్యాయమని ఆయన ఏపీ వాటాలో చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని దేవినేని తేల్చిచెప్పారు. ఈ రకంగా ఇద్దరూ వాదించుకున్నదే.. వాదించుకుంటూ ఈసారి భేటీ కూడా అర్థాంతరంగానే ముగించేశారు. పైకి మాత్రం, దేవినేని ఉమ తెలంగాణపైనా.. హరీష్‌రావు ఆంధ్రప్రదేశ్ మీదా మమకారం కురిపించేస్తున్నారు. 'అందరం తెలుగువారమే..' అని ఇద్దరూ చెబుతున్నారు కానీ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల్ని అడ్డుకుంటోందనీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాజెక్టుల్ని అడ్డుకుంటోందనీ ప్రచారం చేసేశారు. ప్రజలు కూడా దానికి కనెక్ట్ అయిపోయారు. మరి ఈ నేపథ్యంలో ఈ వివాదం ముగియడం కష్టమే అని అనిపిస్తోంది. ఏం జరుగుతుందో చూద్దాం...