టీమిండియా కోచ్ గా కుంబ్లే.. చక్రం తిప్పిన కోహ్లి..!
posted on Jun 23, 2016 @ 3:52PM
ఎంతో సస్పెన్స్ కూడిన తరువాత టీమిండియా కోచ్ ఎవరూ అనే విషయం తెలిసిపోయింది. స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లేను టీమిండియా హెడ్ కోచ్ గా ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ కోచ్ పదవికి దాదాపు 57 ధరఖాస్తులు రాగా.. వాటిలో మాజీ డైరెక్టర్ రవిశాస్త్రితో పాటు అనిల్ కుంబ్లే, సందీప్ పాటిల్, వెంకటేశ్ ప్రసాద్ లు దరఖాస్తులు పెట్టారు. అంతేకాదు విదేశాలనుండి కోచ్ పదవికి ధరఖాస్తులు వచ్చాయి. అయితే వారందరిని వెనక్కి నెట్టి కుంబ్లే కోచ్ పదవికి ఎంపికయ్యారు.
అయితే వచ్చిన 57 దరఖాస్తుల నుండి మొత్తం 20 మందిని సెలక్ట్ చేసి వారి నుండి హెడ్ కోచ్ ను ఎంపిక చేయాలని.. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ లతో కూడిన త్రిసభ్య కమిటీకి బీసీసీఐ సూచించింది. ఈ మేరకు అందరిని ఇంటర్వ్యూ చేసిన కమిటీ.. దానికి సంబంధించిన నివేదికను బీసీసీఐకు అందించింది. దీనిని పరిశీలించిన బీసీసీఐ అనిల్ కుంబ్లేకు హెడ్ కోచ్ పదవి అప్పగించాలని నిర్ణయించింది. అయితే కుంబ్లేకు హెడ్ కోచ్ పదవి దక్కడంలో టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీల పాత్ర ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.