మనసున్న ముఖ్యమంత్రి..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పెద్ద మనసును చాటుకున్నారు. చిత్తూరు జిల్లా మొలకలచెరువు మండలంలోని ఆర్ఎస్ కొత్తపల్లే గ్రామానికి చెందిన 9 నెలల బిడ్డ జ్ఞానసాయి కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. వైద్య శాస్త్ర పరిభాషలో బిలిరియా అట్రాసియా అంటారు. చికిత్స కోసం ఇప్పటి వరకు ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు. పాప బతకాలంటే మరో 30 లక్షల రూపాయలు కావాలి. కానీ అంత స్థోమత వారికి లేదు. దీంతో బిడ్డను చంపుకునేందుకు కారుణ్య మరణానికి దరఖాస్తు చేసుకున్నారు.   ఈ విషయం మీడియా వెలుగులోకి తీసుకురావడంతో వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించి విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. పాప పరిస్థితి తెలుసుకున్న సీఎం చలించిపోయారు. చిన్నారికి అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. గ్లోబల్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించి, ప్రపంచంలోనే అత్యుత్తమ డాక్టర్లను ఎంపిక చేసి చిన్నారికి వైద్యం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ముంబైలో కుంభవృష్టి

దేశ ఆర్థిక రాజధాని ముంబై తడిసి ముద్దవుతోంది. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు మహా నగరాన్ని ముంచెత్తుతున్నాయి. గుజరాత్ సమీపంలో అరేబియా సముద్రంలో ఏర్పడిన ద్రోణి కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని కొలాబా, శాంతాక్రజ్ ప్రాంతాల్లో 26.8 మి.మీల నుంచి 50 మి.మీల వర్షపాతం నమోదయ్యిందని పేర్కొన్నారు. వర్షాల కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. లోకల్ రైళ్లను నడపటానికి ఇబ్బందులు ఏర్పడినప్పటికి సాధారణ సమయానికే రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ ప్రయత్నిస్తోంది. ముంబయితో పాటు కొంకణ్ తీరం, గోవాల్లో కూడా వచ్చే రెండు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మత్య్సకారులు చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

ఖైదీలతో పోలీసుల మందుపార్టీ..ఉద్యోగాలు ఊస్టింగ్

ఎక్కడైనా హోదా..అధికారం అడ్డోస్తాయేమో కానీ మందు దగ్గర మాత్రం అందరూ ఒక్కటే. ఈ విషయం ఎన్నో సార్లు రుజువైంది కూడా..తాజాగా కోర్టు విచారణకు తీసుకువెళ్లిన ఖైదీలతో పోలీసులు మందుకొట్టి ఉద్యోగాలు పొగొట్టుకున్నారు. మహారాష్ట్రలోని నాసిక్ సెంట్రల్ జైల్లో వార్డర్లుగా పనిచేస్తున్న ప్రమోద్ జాదవ్, సాగర్ బోధ్లే, రాహుల్ దోంగ్డేలు విచారణ నిమిత్తం ఓ ఖైదీని కోర్టుకు తీసుకువెళ్లారు. అయితే విచారణ ముగిసిన వెంటనే తిరిగి జైలుకు రావాల్సిన వారు..ప్రభుత్వ వాహనాన్ని కోర్టు ఆవరణలోనే వదిలేసి ప్రైవేట్ వాహనంలో గుర్తు తెలియని ప్రాంతానికి వెళ్లి అక్కడ మందు పార్టీ చేసుకున్నారు. ఆ తర్వాత నగరంలో కరడుగట్టిన నేరస్థుడైన గణేశ్ సురేశ్ వా ను కలిసి ముచ్చట్లు చెప్పుకున్నారు. ఎంజాయ్ చేసి చేసి అలసిపోవడంతో రాత్రి కోర్టు దగ్గరికి వెళ్లి పోలీస్ వ్యాన్‌లో తిరిగి జైలుకు చేరుకున్నారు. లేటెందుకైందని ఉన్నతాధికారులు ప్రశ్నించడంతో వ్యాన్ చెడిపోయిందని..బాగు చేసుకుని వచ్చేలోగా ఆలస్యమైందని కహానీ చెప్పారు. దీనిపై అనుమానం వచ్చిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా మందుపార్టీ విషయం బయటకు వచ్చింది. పోలీసులై ఉండి నేరస్థులతో గడిపినందుకు వీరి ముగ్గుర్ని సర్వీసు నుంచి తొలగించారు.

బీసీసీఐ పేరు మారబోతోంది..?

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్రికెట్ బోర్డుగా పేరు గాంచిన బీసీసీఐ పేరు మారబోతోంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ స్వయంగా ప్రకటించారు. 1928లో బోర్డు ఏర్పడిన నాటి నుంచి ఇదే పేరు స్థిరపడిపోయింది. "ది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా"లో "కంట్రోల్" అనే పదాన్ని మార్చనున్నట్లు ఠాకూర్ తెలిపారు. బోర్డు ఎవరిని నియంత్రించదని..ఆటగాళ్లు, క్రికెట్ అభిమానులు, కోచ్‌లు, సెలక్టర్లు, పరిపాలనా విభాగానికి చెందిన ప్రతి ఒక్కరి క్షేమాన్ని కోరుకుంటుందని అన్నారు. అందువల్ల "కంట్రోల్" అన్న పదం మార్చి దాని స్థానంలో "కేర్" అనే పదాన్ని పెట్టాలనుకుంటున్నామని అనురాగ్ ఠాకూర్ అన్నారు. బీసీసీఐ వెబ్‌పైట్‌లో దీనిపై ఓటింగ్ పెడతామని ఆయన తెలిపారు.

కేసీఆర్, హరీశ్ రావు ఆంధ్రా వాళ్లతో కుమ్మక్కయ్యారు..

  తెలంగాణలో ప్రస్తుతం మల్లన్న సాగర్ పై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ మంత్రి హరీశ్ రావు ఒక పక్క ప్రాజెక్ట్ ఎలాగైన పూర్తి చేస్తామని హరీశ్ రావు అంటుంటే.. దీనిని అడ్డుకొని తీరుతామని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఈనేపథ్యంలోనే రేవంత్ రెడ్డి దీక్ష కూడా ప్రారంభించారు. దీనిలోభాగంగానే గజ్వేల్ నియోజక వర్గానికి వెళ్లారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హరీశ్ రావు, కేసీఆర్ పై దుమ్మెత్తి పోశారు. మామా, అల్లుడు ఆంధ్రాకాంట్రాక్టర్లతో కుమ్మక్కయి అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారని.. అక్కడి ప్రజలు ప్రజెక్టు నిర్మాణానికి వ్యతిరేకత తెలిపినా కూడా మల్లన్న సాగర్ నిర్మించడం కోసం మంత్రి హరీశ్‌రావు రైతులను బెదిరిస్తున్నారని.. రైతులు శాంతియుతంగా వారి వ్యతిరేకతను తెలుపుతున్నారని, కాని హరీశ్‌రావు శాంతిభద్రతలకు భంగం కల్గిస్తున్నారని విమర్శించారు.  4వేల గ్రామాలను కదిలిస్తామని హరీశ్‌ బెదిరిస్తున్నారని, అమాయక రైతులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. మరి దీనిపై హరీశ్ రావు ఎలా స్పందిస్తారో చూడాలి.

విషాదంలో దావూద్ ఇబ్రహీం..

  బాంబు దాడుల్లో పాత్ర వహించి ఎంతో మంది ప్రాణాలు బలిగొన్న అండర్ వరల్డ్ డాన్ కు కూడా విషాదం తప్పలేదు. గత కొంత కాలంగ కేన్సర్ వ్యాదితో బాధ పడుతున్న అతని తమ్ముడు హుమాయున్ కస్కర్ చనిపోయాడు. 1993లో ముంబైలో మారణ హోమం సృష్టించిన తర్వాత గుట్టు చప్పుడు కాకుండా దేశం విడిచి పరారైన దావూద్... పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ భధ్రత మధ్య నిశ్చింతగా కాలం వెళ్లదీస్తున్నాడు. ముంబై పేలుళ్లతో సంబంధం లేకున్నా హుమాయున్ కస్కర్ కూడా అతడిని సోదరుడి దగ్గరే ఉంటున్నాడు. ఇతనిపై ముంబైలో పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలో గత కొంతకాలం క్రితం కేన్సర్ సోకిన కస్కర్ సుదీర్ఘ కాలం పాటు చికిత్స తీసుకున్నాడు. అయినా ఫలితం లేకపోవడంతో అతడు ఇటీవలే చనిపోయాడు.

స్వామి కన్ను ఇప్పుడు టీడీపీపై పడిందా..?

  నిన్నటి వరకూ కాంగ్రెస్ నేతలు, ఆర్ధిక వేత్తలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఇప్పుడు టీడీపీపై కూడా ఆయన కన్ను పడినట్టుంది. ఏపీలోని పుణ్య కేత్రమైన తిరుమల నేపథ్యంలో ఆయన టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రంపై టీడీపీ ప్రభుత్వం గుత్తాధిపత్యం కొనసాగిస్తోందని.. ఆలయ భూములపై టీడీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో టీడీపీ ప్రభుత్వం తన వైఖరి మార్చుకోని పక్షంలో తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు. మరి దీనిపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా ఎప్పుడూ కాంగ్రెస్ పై ఏదో ఒక ఆరోపణలు చేసి వారిని ఇరుకున పెట్టే సుబ్రహ్మణ్యస్వామి.. ఆ తరువాత ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ను టార్గెట్ చేశారు. ఆ తరువాత.. కేంద్ర ఆర్ధిక సలహాదారు.. అరవింద్ సుబ్రమణియన్ ను టార్గెట్ చేశాడు. అది అయిపోయిందనుకుంటే.. విదేశీ యాత్రలు చేసే మంత్రుల డ్రస్సింగ్ గురించి ట్విట్టర్లో కామెంట్లు విసిరి దుమారం రేపారు. మళ్లీ ఇప్పుడు తాజాగా ఆయన కన్ను ఏపీలోని టీడీపీ పై పడింది మరి దీనిపై ఎంత రగడ చేస్తారో.. దీనికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా స్పందిస్తారో వెయిట్ చేయాల్సిందే.

చంద్రబాబు, కేసీఆర్.. మళ్లీ మొదలైంది..

  అనుకున్నంత పనే జరిగింది. ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ గురించి కూడా ఇరు రాష్ట్రాల మధ్య రగడ మొదలైనట్టు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ఏపీ భవన్ గురించి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖలో.. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్‌ తెలంగాణ రాష్ట్రానికే చెందుతుందని.. ఢిల్లీలోని ఏపీ భవన్‌ స్థలాన్ని తెలంగాణకు బదిలీ చేయాలని..  ఏపీ భవన్‌ స్థలంలో తెలంగాణ నూతన భవనాన్ని నిర్మించుకుంటామని పేర్కొన్నారు. భారత విదేశీ వ్యవహారాలశాఖ రికార్డుల ప్రకారం 1917, 1928, 1936 సంవత్సరాల్లో 18.18 ఎకరాల స్థలాన్ని నిజాం ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు ఏపీ భవన్‌ స్థలానికి సంబంధించి పరిహారాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని లేఖలో స్పష్టం చేశారు.   ఇప్పుడు దీనిపై స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలే ఒక పక్క కేంద్రం నుండి నిధులు రాక మొత్తుకుంటుంటే.. మనకు సహకరించాల్సింది పోయి.. అన్నింటిలోనూ ఇబ్బంది పెడతారని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ మనం ముందుకెళ్లాలి. తెలివే మన ధైర్యం. దృఢ సంకల్పంతో ముందుకెళ్లాల్సి ఉంది. 4 శాతం జనాభా ఉన్న ఏపీ... జేఈఈలో 15 ర్యాంకులు దక్కించుకోవడం మన సత్తాకు నిదర్శనం'' అని అన్నారు. మరి చంద్రబాబు వ్యాఖ్యలకు కేసీఆర్ స్పందిస్తారా.. లేదా..? ఇంకా ఎంత దుమారం రేగుతుందో చూడాలి.

రాహుల్ గాంధీ గురించి చెప్పండి.. లక్ష రూపాయలు తీసుకోండి..

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ అప్పుడప్పుడు కనిపించకుండా పర్యటనలకు వెళుతుంటారు అది కామన్. గతంలో కూడా ఇలాంటివి చాలానే చూశాం. ఆయన విదేశీ పర్యటనలకు వెళ్లడం.. ఆ తరువాత ఆయన కనిపించకుండా వెళ్లిపోయాడు అనుకోవడం ఇంకా కామన్. ఇప్పుడు మళ్లీ ఆయన విదేశీ పర్యటనపై ఇలాంటి కామెంట్లే వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ ఇటీవలే తన 46 వ పుట్టిన రోజు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కొద్ది రోజుల పర్యటన నిమిత్తం విదేశాలకు వెళ్లారు. దీంతో రాహుల్ గాంధీ పర్యటనపై ప్రత్యర్థులు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు.   మధ్యప్రదేశ్ బిజెపి అధికార ప్రతినిధి వీరేంద్ర సింగ్ సిసోడియా మాత్రం ఏకంగా రివార్డునే ప్రకటించేశారు. 'రాహుల్ ఏ దేశంలో ఉన్నారు? ఆయనకు సంబంధించి సమాచారం ఉంటే ఇవ్వండి. నా జేబులోంచి లక్ష రూపాయలు ఇస్తాను' అని చెప్పారు. కాగా, కాంగ్రెస్ పార్టీ నేత రవి సక్సేనా వెంటనే ఈ బిజెపి నేత రివార్డుకు కౌంటర్ ఇచ్చారు. బిజెపికి రాహుల్ ఫోబియా పట్టుకుందని అన్నారు. హోంమంత్రిత్వ శాఖను అడిగితే రాహుల్ ఆచూకీ తెలుస్తుందని అన్నారు. ఎమ్మెల్యే టికెట్ దక్కని కారణంగానే సిసోడియా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

హరీశ్, రేవంత్ రెడ్డి.. ఎవరి పంతం నెగ్గుతుందో..?

మల్లన్న సాగర్ పై అధికార పార్టీ అయిన టీఆర్ఎస్, టీడీపీ పార్టీలు మధ్య రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హరీశ్ రావు, రేవంత్ రెడ్డిలు పోటా పోటీగా సవాళ్లు చేస్తున్నారు. ఒకపక్క ఎన్ని అడ్డంకులు సృష్టించినా మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టి తీరుతామని హరీశ్ రావు అంటుంటే.. మరోపక్క రేవంత్ రెడ్డి ప్రాజెక్ట్ కట్టడానికి వీల్లేదు అంటూ దీక్ష చేస్తానని పూనుకున్నారు.   హరీశ్ రావు మాట్లాడుతూ..  ప్ర‌భుత్వం చేప‌డుతోన్న‌ ప‌థ‌కాల‌పై ప్ర‌తిప‌క్షాలు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నాయని.. తెలంగాణ ఏర్పాటుకు స‌హ‌క‌రించ‌ని నాయ‌కులు ఇప్పుడు అభివృద్ధికి కూడా స‌హ‌క‌రించ‌డం లేద‌ని అంటున్నారని.. ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్ట్ కట్టి తీరతామని అంటున్నారు.   రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మల్లన్నసాగర్ ప్రాజెక్టుతో సర్వం కోల్పోతున్న ముంపు గ్రామాల ప్రజల కోసం ఏటిగడ్డ కిష్టాపురంలో 48గంటల దీక్ష చేపడుతానని.. . ముంపు గ్రామాల ప్రజలకు టీడీపీ అండగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వం పోలీసు బలగాలతో అడ్డుకున్నా దీక్ష చేసి తీరుతానన్నారు. ముంపు గ్రామాలకు కేసీఆర్, హరీశ్‌రావు వెళ్తే, ప్రజలు బట్టలిప్పదీసి కొడతారన్నారు. దమ్ముంటే ముంపు గ్రామాలకు రావాలని హరీశ్‌రావుకు సవాల్ విసిరారు. తాను కూడా వస్తానని, ప్రజలను కూర్చోబెట్టి మాట్లాడి, ఏం కావాలో అడిగి, ఒప్పిద్దామన్నారు. మరి ఇద్దరు నేతలూ మంచి పట్టున్న నేతలే.. ఈనేపథ్యంలో ఎవరి పంతం నెగ్గుతుందో చూడాలి.

జగన్ టూర్ పై సొంత పార్టీ నేతలే ఏడ్పా..?

రాష్ట్రంలో ఒకపక్క ముద్రగడ దీక్ష..మరోపక్క తాత్కాలిక సచివాలయంలో నేల కుంగిపోవడం.. మరి ఇన్ని జరుగుతుంటే.. వీటిని ప్లస్ చేసుకొంటూ.. ఇంకేముంది ఇన్ని జరగడానికి కారణం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే అని ఊదరగొట్టే జగన్ ఎక్కడ..? ఏ చిన్న పాయింట్ దొరుకుతుందా.. ఎప్పుడు చంద్రబాబుని విమర్శిద్దామని చూసే జగన్ ఎక్కడ..? ఇంక ఎక్కడ.. చక్కగా బ్రిటన్ లో విహరిస్తున్నాడు. లేకపోతే ఇంత సైలెంట్ గా ఉంటారా. అయితే ఇప్పుడు ఆయన వెళ్లడం ఏమో కానీ చాలా మంది నేతలు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారంట. అది కూడా పార్టీ నేతలే కావడం విశేషం. ఒకపక్క కాపులకు రిజర్వేషన్లు కల్పించాలి అంటూ ముద్రగడ చేస్తున్న దీక్షతో రాష్ట్రం అట్టుడికిపోయింది. ఇలాంటి సమయంలో జగన్ విహార యాత్రకు వెళ్లడంతో నేతలు చాలా ఫీల్ అవుతున్నారట. పార్టీ నుంచి ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోతుంటే.. ఇలాంటి సమయంలో జగన్ విహార యాత్రకు వెళ్లడం బాధకరం అంటూ వాపోతున్నారట. అంతేకాదు జగన్ అక్కడ తీసుకున్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. వాటిలో జగన్ మోహన్ గోల్ఫ్ ఆడుతున్నాడు. ఇంకేముంది ఆ ఫొటోలను చూసి ఇంకా ఏడుస్తున్నారంట. ఇవన్నీ ఒకఎత్తైతే.. దీనిపై టీడీపీ నేతలు కూడా స్పందించడం ఇంకో ఎత్తు. జగన్ చాలా బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నారని.. వైసీపీ నేతలు కూడా ఈ విషయంలో ఆరోపిస్తున్నారని అంటున్నారు. మొత్తానికి జగన్ విదేశీ పర్యటన మాత్రం చాలామంది నేతలకు కడుపుమంటను పుట్టిస్తుందని అర్ధమవుతోంది. ఆయన మాత్రం ఇవన్నీ ఎప్పుడూ ఉండేవేలా అని చక్కగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్నారు. మరి ఇక్కడికి వచ్చిన తరువాత ఆయన ఈ విమర్శలపై ఎలా స్పందిస్తారో చూడాలి.

అప్పుడు ముఖ్యమంత్రిని నేనే...

  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఈ మధ్య ఎంటో ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకే సవాల్ చేస్తూ హాట్ టాపిక్ అయిన జానారెడ్డి.. ఇప్పుడు.. మరోసారి రెచ్చిపోయారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రినని అందరికి షాకిచ్చారు. నల్గొండ జిల్లా హాలియాలో ఈరోజు జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చింది, తెలంగాణను ప్రత్యేక రాష్ట్రం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ సీఎంతో సమాన హోదా ఉన్న ఏకైక నాయకుడిని తానేనని జానారెడ్డి చెప్పుకొచ్చారు. మరి ఈ వ్యాఖ్యలపై నేతల రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి

తప్పుడు రాతలు రాస్తున్నారు..

  ఏపీ కేబినెట్ మీటింగ్ ముగిసింది. ఈసందర్భంగా.. ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంద‌ని, సంక్షోభాల‌ను అవ‌కాశాలుగా మార్చుకోవాలని అన్నారు. క‌ట్టుబ‌ట్ట‌లతో హైద‌రాబాద్‌కు వ‌చ్చామ‌ని అమ‌రావ‌తిని అభివృద్ధి చేసుకుందామ‌ని.. అంద‌రికీ ఆమోద‌యోగ్య‌మైన ప్రాంతాన్ని రాజ‌ధానిగా నిర్ణ‌యించామ‌ని, రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 33వేల ఎక‌రాల భూములిచ్చారని ఆయ‌న అన్నారు. రాజధాని నిర్మాణానికి 'స్విస్ ఛాలెంజ్‌' పద్ధతికి కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపామ‌ని చంద్రబాబు తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.   నిన్న సచివాలయం కుంగిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై పలు కథనాలు వచ్చాయి కూడా. ఆ వార్తలపై స్పందించిన చంద్రబాబు ‘స‌చివాల‌యం కుంగిపోయింద‌ని దుర్మార్గంగా రాశారు’ అని మండిపడ్డారు. అంతేకాదు రాజ‌ధానిలో ల‌క్ష కోట్ల రూపాయల అవినీతి జ‌రుగుతోందంటూ రాశారని.. ల‌క్ష కోట్ల అవినీతి జ‌రిగే అవ‌కాశం, ఆస్కారం అక్క‌డ ఎక్క‌డ ఉంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇటువంటి వార్తలు రాస్తే ఇక్క‌డికి వ‌చ్చే సంస్థ‌ల్లో, భూములిచ్చిన ప్ర‌జ‌ల్లో అభ‌ద్ర‌తా భావం క‌లుగుతుంద‌ని ఆయ‌న అన్నారు. అటువంటి నేరాన్ని చేయొద్ద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.

మనకి ఈ సవాళ్లు ఎందుకు జానా..?

  తెలంగాణ ప్రభుత్వం కనుక రైతులకు రెండో పంటను ఇస్తే తాను టీఆర్ఎస్ పార్టీ తరపున ప్రచారం చేస్తానంటూ సవాల్ విసిరారు. ఇంతకీ అంతటి సవాల్ విసిరింది ఎవరనుకుంటున్నారా. ఇంకెవరూ అటు కాంగ్రెస్ కు అనుకూలమా.. లేక టీఆర్ఎస్ కు అనుకులమా అన్నట్టు వ్యాఖ్యానించే జానారెడ్డి గారు. జానారెడ్డిగారే.... కొత్తగా ఇలాంటి సవాల్ ను తెలంగాణ ప్రభుత్వానికి విసిరారు. అయితే ఇప్పుడు ఇంత సడెన్ గా జానారెడ్డి గారు.. ఇలాంటి సవాల్ ఎందుకు విసిరారబ్బా.. అందునా టీఆర్ఎస్ పార్టీకి అని చర్చించుకుంటున్నారు.   ఎందుకంటే.. కాంగ్రెస్ నేత అయిన జానారెడ్డి.. అవ్వడానికి ప్రతిపక్షనేత అయినా.. అప్పుడుప్పుడు టీఆర్ఎస్ పార్టీపైన ప్రశంసలు కురిపిస్తూనే ఉండేవారు. ఒకవైపు పార్టీ నేతలు టీఆర్ఎస్ పార్టీపై పొగడ్తలు కురిపించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ జానారెడ్డి మాత్రం సత్య హరిశ్చంద్రుడు మాదిరి.. టీఆర్ఎస్ ను పొగిడేవారు. దీంతో జానారెడ్డి టీఆర్ఎస్ పార్టీకి మిత్రపక్ష నేతగా వ్యవహిస్తున్నారు అన్న వార్తలు కూడా వచ్చాయి. ఇక ఈ వార్తలపై స్పందించిన జానా.. నన్ను అంత మాత అంటారా.. నేను పదవులకు రాజీనామా చేస్తున్నా.. అంటూ ఎన్నోసార్లు చెప్పారు. కానీ చేసింది మాత్రం లేదు. అందుకే తనను టీఆర్ఎస్ కోవర్ట్ అనే విమర్శలు వున్నాయి. ఇప్పుడు ఆ విమర్శల నుండి తప్పించుకుందామని ప్రయత్నిస్తున్నారేమో.. ఏకంగా తెలంగాణ సర్కార్ కు సవాల్ విసిరారు.   మరి జానారెడ్డి అయితే సవాల్ విసిరారు. మరి సవాల్ ను కేసీఆర్ స్వీకరిస్తారా..? అన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉనికి ఉన్నదే అంతంతమాత్రం.. ఇక ఆ పార్టీ నేతలు చేసే సవాళ్లను టీఆర్ఎస్ నేతలు స్వీకరిస్తారా.. అందునా టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండే జానారెడ్డి సవాల్ ను... మరోవైపు అసలు మనకు ఈ సవాళ్లేందుకు జానారెడ్డి అనుకునేవారు కూడా ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.