సెల్ఫీ పిచ్చి.. ఆరుగురు మృతి
posted on Jun 23, 2016 @ 4:17PM
సెల్ఫీ సరదా ఏమో కానీ.. దాని వల్ల ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారన్న సంగతి తెలిసిందే. అయినా కానీ కొంతమందికి ఈ సెల్ఫీ పిచ్చి పోవడంలేదు. కొంతమందికైతే ఇదో అలవాటులా తయారైపోయింది. తాము ఏం చేస్తున్నా.. ఎక్కడ ఉన్నా..కాస్తంత వెరైటీగా అనిపిస్తే చాలు సెల్ఫీ తీసేసుకోవడం.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం. ఇక ఆ తరువాత ఏముంది. దానికి ఎన్ని లైకులు వచ్చాయి.. ఎన్ని షేర్లు వచ్చాయి.. ఎన్ని కామెంట్లు వచ్చాయి.. అని చూసుకోవడంతోనే సరిపోతుంది.
ఇప్పుడు ఈ సెల్ఫీ క్రేజ్ తోనే ఒకేసారి ఏడుగురు తమ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ బాధాకరమైన ఘటన కాన్పూర్లో చోటుచేసుకుంది. కాన్పూర్లోని కొలొనేల్‌గంజ్‌కు చెందిన శివం వారి మిత్రులతో కలిసి గంగానది స్నానానికి వెళ్లారు. ఈ క్రమంలో తాను సెల్ఫీ తీసుకుంటూ నీళ్లలో పడిపోయాడు. దీంతో అతనిని కాపాడటం కోసం ప్రయత్నించిన ఆరుగురు మిత్రులు కూడా నీళ్లలో కొట్టుకుపోయారు. గజఈతగాళ్ల ద్వారా వారిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. రెండు గంటల తర్వాత వారి మృతదేహాలు లభించాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటన వల్ల నది వద్ద పెద్ద బారికేడ్లు నిర్మించాలని ఆదేశించారు. ఎవరైనా బారికేడ్లు దాటి నది లోపలికి వెళ్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీన్నిబట్టి ఏం అర్ధమవుతోంది.. సెల్పీ తీసుకోవడం తప్పుకాదు..కానీ దానికో టైం.. ప్లేస్ ఉంటుంది.. ఇలాంటి ప్రమాదకరమైన ప్రదేశాల్లో తీసుకుంటే ప్రమాదాలే జరుగుతాయి.. సో జర భద్రం...