గాయం కుడికాలికి... ఆపరేషన్ ఎడమకాలికి
posted on Jun 23, 2016 @ 11:00AM
వేలకు వేలు డబ్బులు కుమ్మరించి కార్పోరేట్ ఆస్పత్రులకు వెళుతుంటాం. కానీ వారి నిర్లక్ష్య ధోరణితో ఎంతో మంది ప్రాణాలతో చెలగాటాలు ఆడేస్తుంటారు. అలా ఒక కాలుకు చేయాల్సిన ఆపరేషన్ ఇంకో కాలుకి చేసి తమ నిర్లక్ష్య ధోరణిని నిరూపించారు ఢిల్లీ ఆస్పత్రికి చెందిన వైద్యులు. వివరాల ప్రకారం.. ఢిల్లీ అషోక్ విహార్ ప్రాంతానికి చెందిన రవిరాయ్ అనే సీఏ విద్యార్ధి ప్రమాదవ శాత్తు మెట్లపై నుండి కింద పడ్డాడు. దీంతో అతని తల్లి దండ్రులు అతనిని ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు సీటీ స్కాన్, ఎక్స్ రే లు వంటివి తీసి కాలి చీలమండలం వద్ద ఫ్రాక్చర్ అయిందని వెంటనే ఆపరేషన్ చేయాలని సూచించారు. కుటుంబ సభ్యులు కూడా అందుకు అంగీకరించారు. దీంతో వైద్యులు ఆపరేషన్ చేయడానికి సిద్దమయ్యారు. అతనికి మత్తు మందు ఇచ్చి ఆపరేషన్ చేశారు. ఇక రవిరాయ్ కు స్పృహ వచ్చిన తరువాత చూసుకుంటే దిమ్మతిరిగిపోయింది. తనకు గాయమైంది కుడి కాలికి అయితే.. వైద్యులు ఆపరేషన్ చేసింది ఎడమకాలికి. దీంతో అతని తల్లిదండ్రులు డాక్టర్లను నిలదీయగా.. జరిగిన తప్పిదానికి ఆస్పత్రి విచారం వ్యక్తం చేసి చేతులు దులుపుకుంది.
దీంతో రవిరాయ్ తల్లిదండ్రులు వెంటనే అతనిని వేరే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రవిరాయ్ తండ్రి మాట్లాడుతూ.. ఇందులో పూర్తిగా నిర్లక్ష్యం ఉందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, భారతీయ వైద్య మండలి, ఢిల్లీ వైద్య మండలిని కూడా ఆశ్రయిస్తామని తెలిపారు.