పిలిస్తేనే ఆ సభకు వెళ్లాను..

బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు టోకరా పెట్టి బ్రిటన్ పారిపోయిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, కింగ్‌షిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్‌మాల్య లండన్‌లోని పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్నాడంటూ వచ్చిన వార్తలు కలకలం సృష్టించాయి. దీనిపై రచయిత సుహేల్ సేథ్ స్పందిస్తూ ఇది ఓపెన్ ఈవెంట్ అని ఎవరైనా రావొచ్చని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో మాల్యా ట్విట్టర్‌ ద్వారా వెలుగులోకి వచ్చారు. పిలవకుండా పోవాల్సిన అవసరం తనకు లేదని..నా జీవితంలో ఎన్నడూ పిలవని పేరంటాలకు వెళ్లలేదన్నారు. అసలు అలాంటి చోట్లకు ఎన్నడూ వెళ్లను కూడా. నాకు ఆహ్వానం ఉందని పోస్ట్ చేశారు. నాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవు..చార్జ్‌షీట్ లేదు. ఏదైనా ఆరోపించే ముందు నా వాదన చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇది దురదృష్టకరం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అమరావతిలో టీడీపీ, వైసీపీ బాహాబాహీ..

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. అమరావతి దేవస్థానానికి చెందిన సదావర్తి సత్రం భూముల వ్యవహారంలో టీడీపీ అవకతవకలకు పాల్పడిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై నిజానిజాలను తేల్చేందుకు పార్టీ తరపున కమిటీ వేసింది. దానిలో భాగంగా ఈ కమిటీ సభ్యులు ఇవాళ అమరావతిలో పర్యటించారు. విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు వీరిని అడ్డుకున్నారు. తప్పుడు ఆరోపణలు చేసేందుకే వైసీపీ నేతల పర్యటన అంటూ టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి. ఇరు పార్టీల కార్యకర్తలు రహదారిపై బైఠాయించి పోటాపోటిగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు

"అతి"థి మర్యాద..జడ్జిల భోజనం కోసం వెండికంచాలు..

మధ్యప్రదేశ్ ప్రభుత్వం తమ అతిథుల కోసం "అతి" చేసింది. అదేంటంటే ఈ ఏడాది ఏప్రిల్ 16 నుంచి నాలుగు రోజుల పాటు సుప్రీంకోర్టు జడ్జిల నాలుగో సదస్సు జరిగింది. దీనిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జడ్జిలతో పాటు వారి భార్యలు కూడా హాజరయ్యారు. సదస్సు తమ రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి వీరందరికి ఎలాంటి లోటు చూసుకోవాలనుకుంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. ఇక్కడి వరకు బాగానే ఉంది కాని..వీరిని ప్రభుత్వ అతిథులుగా ప్రకటించింది. అంతేకాకుండా వారు భోజనం చేయడానికి ఏకంగా వెండి కంచాలను, పాత్రలను కొనుగోలు చేసింది. వాటి కొనుగోలుకు రూ.3.57 లక్షలు, ఆహార పదార్థాల కోసం రూ.3.37 లక్షలు ఖర్చు చేసింది. అంతేకాకుండా అతిథులకు బహుమతులు కూడా అందజేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను అజయ్ దూబే అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించడంతో ప్రభుత్వ అతి మర్యాదలు బయటపడ్డాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తిరుమలలో హరీశ్‌రావు..

తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న సతీసమేతంగా కాలినడకన అలిపిరి నుంచి తిరుమల కొండకు వచ్చారు. ఈ సందర్భంగా వీరికి టీటీడీ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఓఎస్‌డీ లక్ష్మీనారాయణ యాదవ్ తదితరులు స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. అలాగే తెలంగాణకే చెందిన మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కుటుంబసభ్యులతో కలిసి రోడ్డుమార్గంలో తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికిన అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. వీరిద్దరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అర్చకులు, పట్టువస్త్రాలను బహుకరించారు. అనంతరం రంగనాయక మండపంలో తీర్థప్రసాదాలు అందించారు.

ఐసిస్ హిట్‌లిస్ట్‌లో రామేశ్వరం..

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు భారత్‌పై దాడులు చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటోంది. మన నిఘా, పోలీస్ వ్యవస్థలు అప్రమత్తమై ఐసిస్ కుట్రలను భగ్నం చేశాయి. తాజాగా మరోసారి భారత్‌పై ఎక్కు పెట్టింది. తమిళనాడులోని రామేశ్వరంపై దాడి చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ కుట్రపన్నిందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. 2008 తరహాలో పలు రాష్ట్రాల్లోని 180 ఓడరేవులను ఇందుకు లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపాయి. రామేశ్వరంలోని ఓడరేవు, పాంబన్ వంతెనపై దాడులు జరగవచ్చని హెచ్చరించడంతో తమిళనాడు పోలీసులు అప్రమత్తమయ్యారు. తీర ప్రాంతాల్లో నిఘా పెంచడంతో పాటు జలాశయాలు, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, ముఖ్యమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

లండన్‌లో భారత రాయబారి కార్యక్రమంలో మాల్యా..

బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకుండా లండన్‌ పారిపోయిన కింగ్‌ఫిషర్ అధినేత విజయ్‌మాల్యా కోసం భారత్‌లోని అత్యున్నత దర్యాప్తు సంస్థలు వేటాడుతున్నాయి. మాల్యాను ఎలాగైనా దేశానికి రప్పించాలని అవి చేయని ప్రయత్నం లేదు. ఈ నేపథ్యంలో లండన్‌లోని ఒక పుస్తకావిష్కరణ సభలో మాల్యా ప్రత్యక్షమయ్యాడు. ఆ కార్యక్రమానికి బ్రిటన్‌లోని భారత రాయబారి కూడా హాజరుకావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రముఖ రచయిత సుహెల్ సేథ్ రచించిన మంత్రాస్ ఫర్ సక్సెస్: ఇండియాస్ గ్రేటెస్ట్ సీఈవోస్ టెల్ యు హౌ టు విన్ అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిన్న లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా భారత రాయబారి నవతేజ్ సర్న హాజరయ్యారు.   ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంపై సుహేల్ సేథ్ స్పందించారు. ఈ కార్యక్రమానికి మాల్యా హాజరయ్యారని, ప్రేక్షకుల్లో కూర్చున్నారన్నారు. ఈ కార్యక్రమం ఓపెన్ ఈవెంట్ అని ప్రత్యేకించి ఎవరికీ ఆహ్వానాలు పంపలేదని, కేవలం ట్విట్టర్ ద్వారా మాత్రమే ప్రచారం చేశామని ఆయన చెప్పుకొచ్చారు. ఎవరైనా హాజరుకావచ్చునని చెప్పడం వల్ల మాల్యా ఈ కార్యక్రమానికి వచ్చారని, ప్రేక్షకుల్లో కూర్చోని కార్యక్రమాన్ని వీక్షించారని ట్వీట్ చేశారు. మీడియా కావాలనే దీన్ని హైలెట్ చేస్తోందని సుహెల్ విమర్శించారు.  

మాట తడబడిన రక్షణమంత్రి పారికర్..

  రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలంగాణ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న పారికర్ పొరపాటున మాట తడబడ్డారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా డాక్టర్ లక్ష్మణ్‌ నియామకం అయినా సంగతి తెలిసిందే. అయితే.. పారికర్ మాత్రం అది మర్చిపోయినట్టున్నారు.. పొరపాటున కిషన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఆయన సంబోధించారు. దీంతో  వేదికపై ఉన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌తో పాటు ఇతర నేతలు కూడా ఖంగుతిన్నారు.   ఇంకా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీపైన విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ పార్టీలో పార్టీ ఫిరాయింపులు యథేచ్ఛగా సాగుతున్నాయని.., ఇప్పుడు ఆ పార్టీలో చేరినవాళ్లంతా చివరి ఏడాదిలో మళ్లీ తిరుగుముఖం పట్టడం ఖాయమని పారికర్ చెప్పారు. తెలంగాణలో వాస్తుపాలన సాగుతోందని.. ఇక్కడ బీజేపీ ఎదిగేందుకు చాలా అవకాశం ఉందని.. మోదీ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పారికర్ అన్నారు.

కాశ్మీర్‌లో మళ్లీ పాక్‌ జెండా రెపరెపలు..భారత్ వ్యతిరేక నినాదాలు

జమ్మూకశ్మీర్‌లో పాక్ జెండాలు ఎగరడం షరా మామూలైపోయింది. తాజాగా వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ నిన్న శ్రీనగర్‌లో నిర్వహించిన ర్యాలీలో మరోసారి పాక్ జెండాలు ఎగిరాయి.  కాశ్మీర్‌లో ఆర్మీ, పోలీస్, ప్రభుత్వ ఉద్యోగులను వేరు చేసి వారికి ప్రత్యేక నిఘూ ఏర్పాటు చేసేందుకు విడిగా కాలనీలు కట్టించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని నిరసిస్తూ హురియత్ కాన్ఫరెన్స్ శ్రీనగర్‌లో భారీ ర్యాలీ నిర్వహించింది. దీనికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. అయితే ర్యాలీ జరుగుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్థాన్‌కు అనుకూలంగా.,భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా ఇస్లామిక్ స్టేట్, పాక్ జాతీయ పతాకాలను ఎగురవేశారు.

రఘురామ్ రాజన్ కు అసలు నిజం తెలిసిపోయిందా.. ?

  రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గా ఉన్న రఘురామ్ పదవిపై ఇప్పటికే ఎన్నో అనుమానాలు ఉన్న సంగతి తెలిసందే. ఈయనను గవర్నర్ పదవి నుండి తొలగించాలని ఒకపక్క బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆరోపిస్తుంటే.. కొంతమంది నెటిజన్లు మాత్రం ఈసారి కూడా ఆయననే గవర్నర్ గా కావాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రధాన మంత్రి మోడీ కూడా ఇంతవరకూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.   అయితే రఘురామ్ రాజన్ కు మాత్రం ఈసారి పదవి దక్కకపోవచ్చని తెలిసిపోయిందో ఏమో కానీ... తాను మళ్లీ అధ్యాపక వృత్తిలోకి వచ్చి, పాఠాలు చెప్పుకొంటానని వ్యాఖ్యానించారు. భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా  తన పదవీకాలం సెప్టెంబర్ 4వ తేదీతో ముగుస్తుందని, ఆ తర్వాత మళ్లీ పాఠాలు చెప్పుకొంటానని ఆయన తన సహచరుల వద్ద అన్నారట. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి పదవి దక్కకపోవచ్చని అలా అన్నారా..? లేక మోడీ ప్రభుత్వం తనకు పదవి ఇవ్వడానికి సముఖత చూపించని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారా అని అనుకుంటున్నారు. మరి అసలు నిజం ఏంటో రాజన్ కే తెలియాలి..

గూగుల్ ఫాదర్స్ డే గిఫ్ట్.. "ద హీరో"

ప్రముఖ సెర్చింజిన్ గూగుల్ భారతీయులకు ఫాదర్స్ డే కానుకనిచ్చింది. ఊహ తెలిసినప్పటి నుంచి మనం రకరకాలుగా కలలు కంటాం. యాక్టర్ అవ్వాలనో..పోలీస్ అవ్వాలనో..డాక్టర్ అవ్వాలనో..అయితే అనుకోని అవాంతరాలు అడ్డోచ్చి ఆ కలలు కలలుగానే మిగిలిపోతాయి. అలా తీరని తండ్రికి తీరని కోరికగా మిగిలిపోయిన ఒక కోరికను తీర్చాడో కొడుకు.   కొన్నేళ్ల క్రితం మీ తాతయ్య ఒప్పుకుని ఉంటే..నాన్న షోలే సినిమాకు హీరో అయి ఉండేవాడు. దానితో పాటే బాలీవుడ్‌లో పెద్ద కథానాయకుడిగా ఎదిగి ఉండేవాడు. అయితే తాతయ్య అప్పుడు కాదనడంతో నాన్న అంత పెద్ద అవకాశాన్ని కోల్పోవలసి వచ్చింది. సినిమాల్లో నటించాల్సిన వాడు ఆఖరికి సినిమా థియేటర్‌లో పనిచేస్తూ రిటైరవ్వాల్సి వచ్చింది. నాన్న జీవితంలో ఇది వెలితిగా మిగిలిపోయిందని అమ్మ ద్వారా తెలుసుకున్న కొడుకు నాన్నని ఎలాగైనా సంతోష పెట్టాలనుకుంటాడు.   నాన్నతో టూర్‌కి వెళ్లి.. ఆయనను షోలే సినిమా షూటింగ్ జరిగిన స్పాట్‌కు తీసుకెళ్లాడు. ఆయనతో ఆ సినిమాలోని డైలాగ్‌లు చెప్పించాడు. అంతేకాకుండా మరికొన్ని సినిమా షూటింగ్‌లు జరిగిన ప్రదేశాలకు తీసుకెళ్లి వాటన్నింటినీ వీడియోలు చేశాడు. ఆ వీడియోల్ని కొడుకు ఏం చేశాడు. వాటితో తండ్రి కల ఎలా నెరవేరింది..? లాంటివి తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఓ లుక్కేయండి. ఉద్వేగం నిండిన ఈ షార్ట్‌ఫిల్మ్‌ని గూగుల్ ఇండియా ద హీరో పేరుతో విడుదల చేసింది. రేపు ఫాదర్స్ డే కూడా కావడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.  

మాజీ ఎమ్మెల్యే కొడుకు ఐపీఎస్ అధికారిగా బురిడి..

  తాను ఐపీఎస్ అధికారిని అంటూ ఒకర్ని కాదు ఇద్దర్ని కాదు ఏకంగా 60 మందిని పైగా బురిడీ కొట్టించాడు ఓ కిలాడి. ఇంతకీ బురిడీ కొట్టించింది ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే. ఓ మాజీ మంత్రి మనవడు, మాజీ ఎమ్మెల్యే కుమారుడు.. అది కూడా ప్రభుత్వ అధికారుల్ని. వివరాల ప్రకారం.. రాహుల్ కుమార్ పంజాబ్ మాజీ మంత్రి జ్ఞాన్ చంద్ మనవడు, దీనానగర్ మాజీ ఎమ్మెల్యే రూప్ రాణి కుమారుడు. అయితే రాహుల్ తాను విజిలెన్స్ ఎస్పీగా అధికారులు తమ నుంచి డబ్బులు డిమాండ్ చేస్తూ వారి నుంచి సుమారు 30 లక్షల రూపాయలకు పైగా మొత్తాన్ని వసూలు చేశాడు. ఈ నేపథ్యంలోనే అమృత్ సర్ డివిజన్ అటవీశాఖాధికారి ఎస్.కే.సాగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ నకిలీ ఐపీఎస్ అధికారిని పట్టుకున్నారు. రాహుల్ ను విచారిస్తున్నామని, ఆయన అధికారుల నుంచి ఎంత మొత్తం వసూలు చేశాడన్నది తెలియాల్సి ఉందని ఆయన తెలిపారు.

వివాదంలో ప్రియాంక గాంధీ ఇల్లు...

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూతురు ప్రియాంక గాంధీ సిమ్లాలో కొత్త ఇల్లు నిర్మించుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఇల్లు కూడా వివాదంలో పడేట్టు కనిపిస్తోంది. బీజేపీ నేత సురేష్ భరద్వాజ్ అనే వ్యక్తి ప్రియాంక ఇల్లు గురించి అభ్యంతరం వ్యక్తం చేస్తూ హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు.  ప్రియాంకా గాంధీ కొత్త ఇంటిని నిర్మిస్తున్నది.. రాష్ట్రపతి వేసవి విడిది భవనానికి అత్యంత సమీపంలో ఉండటం వల్ల రాష్ట్రపతి, ఇతర ప్రముఖులకు ఈ నిర్మాణం అపాయకరమని, ఇంటి నిర్మాణానికి సంబంధించిన అనుమతులను రద్దు చేయాల్సిందిగా ఆయన లేఖలో కోరారు. మొత్తానికి సోనియా అండ్ ఫ్యామిలీ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటారు.. ఇప్పుడు ఆఖరికి ఇల్లు కూడా వివాదంలో ఇరుక్కుంది.

అయ్యప్పను చూడాలని అబ్బాయిగా మారింది..దొరికిపోయింది

సుప్రసిద్థ పుణ్యక్షేత్రం శబరిమలై అయ్యప్ప దేవాలయంలోకి మహిళలకు ప్రవేశం ఉండదని అందరికి తెలిసిందే. అయితే అయ్యప్పను చూడాలన్న పట్టుదలతో ఒక మహిళ..మగాడిగా మారింది, అయినా ఆమె ఆశ నెరవేరలేదు. మధురైకి చెందిన లక్ష్మీ అనే యువతి శబరిమలై వెళ్లి అయ్యప్ప దర్శనం చేసుకోవాలనుకుంది. అయితే అక్కడి దేవాలయంలోకి కేవలం మగవారికే ప్రవేశం ఉందని తెలియడంతో ఎంచేయాలో పాలుపోలేదు. చివరికి మగవేషంలో శబరిమలై కొండకు వెళ్లింది. గత రాత్రి 7 గంటల సమయంలో ప్యాంటు, షర్టు వేసుకుని గుండు చేయించుకుని పంబానది ప్రాంతంలో నడిచి వెళ్తోంది. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న భద్రతాధికారులకు అనుమానం రావడంతో అడ్డుకుని ప్రశ్నించారు. ఆలయంలోకి ప్రవేశించేందుకు గుండు గీయించుకుని మగవేషంలో వచ్చినట్టు ఆమె అంగీకరించింది.

రాళ్ల మధ్యలో డ్రగ్ స్మగ్లింగ్..

డ్రగ్స్ ను తరలించడానికి మాఫియా వాళ్లు పన్నే పథకాలు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యూహాలు చేసుకుంటూ పోలీసుల కళ్లు కప్పి డ్రగ్స్ ను తరలిస్తూనే ఉంటారు. ఇప్పుడు అలా అక్రమంగా తరలిస్తున్న డ్రగ్ ను అమెరికా అధికారులు పట్టుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 726 కిలోల మారిజువానా అనే డ్రగ్ ను లాండ్ స్కేపింగ్ రాళ్ల మధ్య తరలిస్తూ పోలీసులకు చిక్కారు. వివరాల ప్రకారం. మెక్సికో సరిహద్దులలోని ఒటే మెసా కార్గో ద్వారా లాండ్ స్కేపింగ్ కోసం ఉపయోగించే పెద్ద సైజు రాళ్లను తరలిస్తుండగా.. అనుమానం వచ్చిన  కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు వాటిని పరిశీలించారు. ఆ రాళ్లను డ్రిల్ చేసి చూడగా అసలు బండారం బయటపడింది. ఆ రాళ్ల మధ్యలో డ్రగ్ పెట్టి తరలిస్తున్నారు. మొత్తం 577 ప్యాకెట్లలో మారిజువానా బయటపడింది. ఈ డ్రగ్స్ విలువ దాదాపు రూ. 5.5 కోట్లుగా అధికారులు అంచనా వేశారు.