ఏపీకి వెళ్లలేక ఉద్యోగుల ఏడుపులు..
posted on Jun 23, 2016 @ 3:07PM
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జూన్ 27నాటికి హైదరాబాద్లో ఉన్న ఉద్యోగులందరూ రాజధానికి రావాల్సిందేనని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. అయితే ఒకపక్క సీఎం గారు ఎంత చెప్పినా.. కొంత మంది మాత్రం ఏపీకి రావడానికి అస్సలు ఇష్టపడటం లేదు. ఎన్ని రకాలుగా వసతులు కల్పించినా వారు మాత్రం ససేమిరా ఉంటున్నారు. ఆఖరికి వారు ఏపీ వెళ్లాల్సిన సమయం రానే వచ్చింది. ఈ నేపథ్యంలో నేడు హైదరాబాద్ సచివాలయంలో ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. చంద్రబాబు ఆజ్ఞల ప్రకారం.. ఏపీ ఉద్యోగులు కొంతమంది ఈరోజు బస్సెక్కారు. ఇక ఎంతో కాలంగా ఇక్కడ పనిచేస్తున్న కారణంగా.. తెలంగాణ ఉద్యోగులతో ఏర్పడిన బంధం వల్ల.. వారిని విడిచి రాలేక.. వీరు కూడా వారిని వదులుకోలేక.. ఒకరినొకరు హత్తుకొని కన్నీటి పర్యంతమయ్యారు. కానీ ప్రభుత్వ ఆదేశాలు పాటించక తప్పదు కాబట్టి భారమైన హృదయాలతోనే ఏపీ ఉద్యోగులు బస్సెక్కగా, అంతకంటే భారమైన మనసులతో తెలంగాణ ఉద్యోగులు వారికి వీడ్కోలు పలికారు. కాగా ఇప్పటికే రాజధానిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం పూర్తి కావచ్చింది. తుది దశకు చేరుకుంది. అప్పుడే పలు శాఖల కార్యాలయాలు కూడా అమరావతికి తరలివెళ్లాయి. మొత్తానికి కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉండి.. ఇప్పుడు ఏపీకి వెళ్లమంటే ఉద్యోగులకు కూడా కష్టమైన పనే..