కేసీఆర్ మరో ఉద్యమానికి తెర తీస్తున్నారా..?
posted on Jun 23, 2016 @ 6:17PM
రాష్ట్ర విడిపోయిన తరువాత దాదాపు అన్నింటిలోనూ ఇరు రాష్ట్రాలకు పంపకాలు జరిగాయి. ఏపీకి రావాల్సినవి ఏపీ తీసుకుంది.. తెలంగాణకు రావాల్సింది తెలంగాణ తీసుకుంది. ఇప్పటికే కొన్ని అంశాలపై జరుగుతున్న వివాదులు ఓ కొలిక్కి రావడం లేదు. అటు హైకోర్టు విషయంలో కాని, నీళ్ల విషయంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇవి కానట్టు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో వివాదానికి తెరలేపుతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ వాటి గురించే కొట్టుకుంటుంటే ఇప్పుడు ఢిల్లీలో ఉన్న వాటి గురించి కూడా రగడ మొదలయ్యేలా ఉంది.
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ తెలంగాణ రాష్ట్రానికే చెందుతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దీనిలో భాగంగానే ఆయన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కు రెండు పేజీల లేఖ రాశారు. ఢిల్లీలోని ఏపీ భవన్ స్థలాన్ని తెలంగాణకు బదిలీ చేయాలని కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. ఏపీ భవన్ స్థలంలో తెలంగాణ నూతన భవనాన్ని నిర్మించుకుంటామని కేసీఆర్ తెలిపారు. అలాగే షెడ్యూల్ 10పై నిర్ణయాన్ని పునసమీక్షించాలని ఈ సందర్భంగా కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. భారత విదేశీ వ్యవహారాలశాఖ రికార్డుల ప్రకారం 1917, 1928, 1936 సంవత్సరాల్లో 18.18 ఎకరాల స్థలాన్ని నిజాం ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు ఏపీ భవన్ స్థలానికి సంబంధించి పరిహారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని లేఖలో స్పష్టం చేశారు.
మరి దీనికి ఏపీ నేతలు ఎలా స్పందిస్తారూ.. కేసీఆర్ ఇచ్చిన ఆఫర్ కు వాళ్లు అంగీకరిస్తారా.. లేక దీనిపై కూడా ఇరు రాష్ట్రాలు కొట్టుకుంటాయా చూడాలి.