ఇస్రో సరికొత్త రికార్డ్... ఒక్కసారే 20 ఉపగ్రహాలు
ఇస్రో మరో రికార్డ్ సృష్టించింది. ఒక్కసారే 20 ఉపగ్రహాలు నింగిలోకి పంపి చరిత్ర సృష్టించింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి పీఎస్‌ఎల్‌వీ సి-34 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. భారత్‌కు చెందిన కార్టోశాట్-2సి, మన దేశ విద్యా సంస్థలకు సంబంధించిన రెండు ఉప గ్రహాలు, అమెరికా, కెనడా, జర్మనీ,ఇండోనేషియాకు చెందిన 17 ఉప గ్రహాలను బుధవారం ఉదయం 9.26 గంటలకు వాహకనౌక నింగిలోకి మోసుకెళ్లింది. దీంతో అమెరికా, రష్యా తర్వాత ఒకేసారి 20 ఉపగ్రహాలను నింగిలోకి పంపిన దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. పీఎస్ఎల్వీ సీ-34 ప్రయోగం విజయవంతమవడంతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇస్రో ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ కూడా శాస్త్రవేత్తలను అభినందించారు.