7వ వేతన సిఫారసులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం...

  కేంద్ర ప్రభుత్వం 7వ వేతన సంఘం సిఫారసులకు ఆమోదం తెలిపింది. ఈరోజు దీనిపై చర్చించిన కేంద్ర ప్రభుత్వం.. ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటూ.. 7వ వేతన సంఘం సిఫారసులకు ఆమోద ముద్ర వేసింది. అయితే నివేదికను యథాతథంగా అమలుచేస్తుందా.. లేక ఏమైనా మార్పులు చేసిందా అనే సంగతి మాత్రం ఇంకా తెలియలేదు. ఒకవేళ యథాతథంగా అమలు చేస్తే ఉద్యోగుల ఫిట్‌మెంట్ 2.57 నుంచి 2.7కు పెరగనుంది. అంటే కొత్తగా చేరినవారి జీతం రూ. 18,000 నుండి రూ.23,000 వరకూ చేరుతుంది.  సుమారు 47 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 52 లక్షల మంది పెన్షర్లకు లబ్ధి చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జులై 1 నుంచి కొత్త వేతనాలను అమలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సంబరాల్లో మునిగితేలుతున్నారు.

సిద్ద రామయ్యను శపించాడంట..

  కర్ణాటక సీఎం సిద్దరామయ్య కారుపై కాకి వాలినందుకే ఆయన కారును మార్చి వేరే కారు తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై పలువురు పలు రకాలుగా విమర్శించిన సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు మరో తాజా వార్త ఒకటి చక్కర్లు కొడుతుంది. సిద్దరామయ్యను ఎవరో ఓ గుర్తు తెలియని వ్యక్తి శపించాడంట. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇది నిజమని అంటున్నారు. అసలు సంగతేంటంటే.. ఇంటి వద్దకు వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి సిద్దరామయ్య కారులో వెళుతుండగా వచ్చి అతనికి పూజ చేసిన ఓ వస్త్రాన్ని ఇచ్చాడంటా. అయితే దానిని సీఎం స్వీకరించకపోవడంతో కోపగించుకున్న అతను ముఖ్యమంత్రిని శపించాడట. అయితే ఈ విషయాన్ని సీఎం గారు పెద్దగా పట్టించుకోకపోయినా కార్యకర్తలు మాత్రం ఆందోళనలు చెందుతున్నారు. దీనిపై మాట్లాడిన కార్యకర్తలు అసలే కొంతకాలంగా సీఎంను దురదృష్టం వెంటాడుతోందని, ఈ సమయంలో ఇలాంటి పరిణామం చోటుచేసుకోవడం ఆందోళనకరంగా ఉందని అన్నారు. అందుకే శాపాన్ని వెనక్కు తీసుకోవాలని అతన్ని కోరినట్లు వివరించారు.

తెలంగాణ హైకోర్టు.. మరింత ముదిరిన వివాదం..

తెలంగాణలో హైకోర్టు వద్ద ఇంకా టెన్షన్ వాతావరణం నెలకొంది.  హైకోర్టులో న్యాయాధికారుల నియామకాలకు సంబంధించి ఆప్షన్ విధానాన్ని నిరసిస్తూ తెలంగాణ తరుపు న్యాయాధికారులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తమకు న్యాయం చేయాలంటూ న్యాయమూర్తులు, లాయర్లు మూడు రోజుల నుండి హైకోర్టు వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. దీంతో ఆగ్రహం చెందిన హైకోర్టు.. నిన్న 11 మంది జడ్జిలను సస్పెండ్ చేసింది. అయితే ఇప్పుడు వారి సస్పెన్షన్ ను నిరసిస్తూ ఆందోళనలు చేపడుతున్నారు. దీనిలో భాగంగానే వచ్చే నెల 15 వరకు సామూహిక సెలవులు పెట్టారు.   మరోవైపు న్యాయవాదులు చలో హైకోర్టుకు పిలుపునివ్వడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లాయర్లు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో హైకోర్టు వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. న్యాయవాదులను అడ్డుకుంటున్నారు. అంతేకాదు.. మొన్న గవర్నర్ ను కలిసి వినతి పత్రం ఇచ్చినట్లుగానే ఈ రోజు కూడా న్యాయాధికారులు ర్యాలీగా వెళ్లి గవర్నర్ కు వినతి పత్రం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.

మహిళా క్యాబ్ డ్రైవర్ మృతి.. కారణం అదేనా..?

  తొలి మహిళా క్యాబ్ డ్రైవర్ గా రికార్డ్ సృష్టించిన తొలి మహిళా క్యాబ్ డ్రైవర్ భారతి మరణించిన సంగతి తెలిసిందే. అయితే అనుమానాస్పద స్థితిలో మరణించిన ఈమె మృతిపై పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆమె ఈమధ్యనే లింగమార్పిడి చేయించుకుందని.. గత కొంత కాలంగా తను ఒక మహిళతో కలిసి ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇటీవల వారిద్దరి మధ్య విభేధాలు తలెత్తడంతో ఆమె వేరే అతనితో వెళ్లిపోయిందని... అప్పటినుండి ఒంటరిగా ఉంటూ మానసికి ఒత్తిడికి గురైందని.. దీంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని స్థానికులు అంటున్నారు. అంతేకాదు ఆమె ఓ పిల్లాడిని దత్తత తీసుకోవాలని చూసిందని.. దీని గురించి ఓ లాయర్ ను కూడా సంప్పదించి ఇటీవలే వివరాలు అడిగి తెలుసుకుందని.. ఇంతలోనే ఆత్మహత్య చేసుకుందని తెలుపుతున్నారు. అయితే, పోస్టుమార్టం నివేదిక వచ్చాక పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

ఉగ్ర కలకలం..ఉలిక్కిపడిన హైదరాబాద్

దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దాని మూలాలు మన భాగ్యనగరంలోనే దొరుకుతున్నాయి. ముష్కరులకు హైదరాబాద్ సేఫ్ జోన్‌గా మారిపోవడంతో చాలా మంది ఇక్కడి నుంచే తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. తాజాగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ఒక గ్రూప్‌గా ఏర్పడి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక టెర్రరిస్ట్ గ్రూప్ కుట్రను ఎన్‌ఐఏ అధికారులు బట్టబయలు చేశారు. హైదరాబాద్‌లోని పలువురు ప్రముఖుల్ని లక్ష్యంగా చేసుకుని..వివిధ ప్రాంతాల్లో పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లుగా ఎన్‌ఐఏ అధికారులకు సమాచారం అందింది. వెంటనే ఢిల్లీ నుంచి ఎన్‌ఐఏ బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. స్థానిక పోలీసుల సాయంతో పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో దాడులు చేపట్టి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, మారణాయుధాలు, కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో హైదరాబాద్ పోలీసులు ఉలిక్కిపడ్డారు

ఇస్తాంబుల్‌ ఎయిర్‌పోర్ట్‌పై ఉగ్రపంజా

టర్కీలోని ప్రముఖ పట్టణం అటాటర్క్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌పై ఉగ్రవాదులు పంజా విసిరారు. ముగ్గురు ఉగ్రవాదులు విమానాశ్రయంలోకి చోరబడి ప్రవేశద్వారం వద్ద కాల్పులు జరిపి ఆ తర్వాత తమని తాము పేల్చేసుకున్నారు. ఈ దాడిలో 36 మంది మరణించగా..150 మందికి పైగా గాయపడ్డారు. ఉగ్రవాదులు ఎయిర్‌పోర్ట్‌లోకి చొరబడటాన్ని గమనించిన భద్రతా దళాలు వారిని పట్టుకునేలోపే ఘోరం జరిగిపోయింది. మృతుల్లో టర్కీ వాసులతో పాటు విదేశీయులు కూడా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఐసిస్ ఉగ్రవాదులే దాడులకు పాల్పడి ఉంటారని టర్కీ ప్రధాని బినాలీ ఇల్దిరిం తెలిపారు. టర్కీ దాడులను ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీమూన్, భారత ప్రధాని నరేంద్రమోడీ ఖండించారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు.

వెంకయ్య నాయుడికి కోపం వచ్చింది.

  కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడికి కోపం వచ్చింది. అంతలా వెంకయ్యకు ఎవరు కోపం తెప్పించారబ్బా అని అనుకుంటున్నారా.. ఇంకెవరూ ఎయిర్ ఇండియా సంస్థ. ఎయిర్ ఇండియా కస్టమర్లను అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది కేంద్రమంత్రులను కూడా ఇబ్బందికి గురి చేస్తుంది. వెంకయ్య నాయుడు నిన్న ఓ పని నిమిత్తం హైదరాబాద్ రావల్సి ఉండగా.. అందుకు ఆయన విమానం కోసం ఎయిర్ పోర్టులో గంట సేపు వెయిట్ చేశారు. అయితే ఎంత సేపటికి ఫ్లైట్ రాకపోవడంతో ఆయన తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. అనంతరం ఆయన ట్విట్టర్లో ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతూ..తన ఆగ్రహాన్ని తెలిపారు. సర్వీసు ఎందుకు ఆలస్యమైందో చెప్పాలని ఎయిర్ ఇండియాను డిమాండ్ చేశారు. విమానయాన సంస్ధల్లో ప్రస్తుతం ఉన్న పోటీకి అనుగుణంగా మారడంతోపాటు పారదర్శకత, జవాబుతారీతనం పెంపొందించుకోవాలని ఎయిర్ ఇండియా విమానయాన సంస్థకు మంత్రి వెంకయ్య నాయుడు హితవుపలికారు. మరి ఎయిర్ ఇండియా వెంకయ్యకు సమాధానం చెబుతుందో లేదో చూడాలి.    

కేజ్రీవాల్ మాదిరిగా చేస్తున్నారు కేసీఆర్..

  కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ కేసీఆర్ పై విమర్సల బాణాలు వదిలారు.  తెలుగు రాష్ట్రాల హైకోర్టు విభజన కేసు పెండింగ్ లో ఉండగా, కేంద్రం ఏమీ చేయలేదన్న సంగతి కేసీఆర్ కు తెలియదా? అని ఆయన ఎద్దేవా చేశారు. కనీసం పదేళ్ల పాటు హైకోర్టు హైదరాబాద్లో ఉండటానికి విభజన చట్టం కల్పించిందని.. అది కూడా తెలియకుండా..ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తానని కేసీఆర్ మాట్లాడటం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు. చంద్రబాబు చొరవతోనే హైకోర్టు విడిపోతుందని కేసీఆర్ తెలుసుకోవాలని హితవు పలికారు. వాస్తవాన్ని పక్కనబెట్టి కేజ్రీవాల్ మాదిరిగా, ధర్నాలు, నిరసనలు తెలిపితే తమకేమీ అభ్యంతరం లేదని, అయితే, శాంతిభద్రతల సమస్యలు తప్ప మరేమీ ప్రయోజనం ఉండబోదని సదానందగౌడ అభిప్రాయపడ్డారు.

స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా..ఇది గమనించారా.?

స్మార్ట్‌ఫోన్.. ఈ ఆధునిక యుగంలో ఇది లేకుండా నిమిషం కూడా ఉండలేమంటే అతిశయోక్తి కాదు. ప్రొద్దున లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునేవరకు స్మార్ట్‌ఫోన్ లేకుంటే..అసలు ఆ మాటే ఊహించలేం. టెక్నాలజీకి రెండు వైపులా పదునుంటుంది. ఎంత సౌకర్యాన్నిస్తుందో..తేడా వస్తే అంతు చూస్తుంది. అలాంటి మరో ముప్పు తాజాగా స్మార్ట్‌ఫోన్ విషయంలో వెలుగులోకి వచ్చింది. అదేపనిగా స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే వారిలో బొటనవేలు పరిమాణం పెరుగుతుందట...సహజసిద్ధంగా జరిగే పెరుగుదల కాకపోవడంతో దీనికి కండరాలు సిద్ధంగా ఉండవు. దీంతో అంతర్గతంగా గాయాలవుతున్నాయని పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా 18 నుంచి 34 వయసున్న యువతలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వారు హెచ్చరించారు.

ఎవండోయ్ ఇది విన్నారా..పిల్లికి నోటీసులంట

పిల్లికి నోటీసులు ఇచ్చిన విచిత్రమైన సంఘటన హోస్టన్‌లో జరిగింది. బ్రౌజర్‌గా అందరి అభిమానాన్ని అందుకున్న ఆ పిల్లి టెక్సాస్‌లోని వైట్ సెటిల్‌మెంట్ పబ్లిక్ లైబ్రరీలో ఆరేళ్లుగా ఉంటోంది. అయితే దాని వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చిన్నారులు పిటిషన్ వేశారు. ఓటర్లు కూడా వివిధ సందర్భాల్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దానిని అక్కడ నుంచి పంపించి వేయాలని టెక్సాస్ సిటీ కౌన్సిల్ ఓటింగ్ నిర్వహించింది. ఆ పిల్లిని అక్కడి నుంచి మరో చోటికి పంపించి వేయాల్సిందిగా ఎక్కువమంది ఓటు వేశారు. దీంతో నెల రోజుల్లో లైబ్రరీ ఖాళీ చేయాల్సిందిగా కౌన్సిల్ బ్రౌజర్‌కు నోటీసులు పంపింది. సిటీ హాల్, సిటీ బిజినెస్ జంతువులకు నివాస స్థలాలు కావని కౌన్సిల్ మెంబర్ ఎల్జీ క్లెమెంట్ పేర్కొంటూ పిల్లి లైబ్రరీని ఖాళీ చేయక తప్పదని పేర్కొన్నారు. అయితే బ్రౌజర్ వల్ల ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేవని, అందరూ దానిని ఇష్టపడతారని వైట్ సెటిల్‌మెంట్ పబ్లిక్ లైబ్రరీ ఫ్రెండ్స్ అంటున్నారు.

ఆడవాళ్లపై అమానుషాలు ఇంకెన్నాళ్లు..

  ఆడవాళ్లపై ఆకృత్యాలు రోజు రోజుకి పెరిగిపోవడం చూస్తూనే ఉన్నాం.. ఇప్పటి వరకూ ఎన్నో ఘటనల గురించి వినుంటాం.. చూసుంటాం.. ఇప్పుడు ఒకేరోజు రెండు దారుణమైన ఘటనలు వెలుగు చూశాయి.     రాజస్థాన్ లో ఓ వివాహితపై అత్యంత దారుణంగా ఆమె భర్త.. అతనితో పాటు అతని సోదరులు కూడా అత్యాచారానికి ఒడిగట్టారు. వివరాల ప్రకారం.. రాజస్థాన్ లోని రేణి గ్రామానికి చెందిన జగన్నాథ్ తో బాధిత మహిళకు వివాహం జరిగింది. అయితే వివాహం జరిగిన కొంత కాలం నుండి అదనపు కట్నం కోసం జగన్నాథ్ వేధిస్తున్నాడు. అతనితో పాటు అతని సోదరులు కూడా ఆమెను హింసించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే వారు ఆమెపై అత్యాచారం చేసి.. అనంతరం.. ఆమె ఒంటిపై అసభ్య పదాలతో కూడిన పచ్చబొట్లు కూడా పొడిపించారు. దీంతో ఈవిషయం వెలుగుచూడటంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇంకా ఈ ఘటనపై కేంద్ర మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకాగాంధీ దిగ్భాంతి వ్యక్తం చేసి.. కేసు విచారణను వెంటనే జరపాల్సిందే అని అదేశించారు.     తమిళనాడులో కూడా మరో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. తన ఫొటోను మార్ఫింగ్ చేసినందుకుగాను మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. వివరాల ప్రకారం.. తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన విష్ణుప్రియ డిగ్రీ చదువుకుంటోంది. అయితే ఆమె ఫొటోను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. దీనిపై విష్ణుప్రియ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అనంతరం మరో ఫొటోను మార్పింగ్ చేసి పెట్టగా బాధితురాలి తల్లిదండ్రులు మరోసారి ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. అయితే వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లి వచ్చేలోపే విష్ణుప్రియ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో విగతజీవిగా ఉన్న తమ కూతురిని చూసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ కూతురు మృతిపై విష్ణుప్రియ తండ్రి మాట్లాడుతూ.. ఫొటో చూసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదని.. నిందితుణ్ని అరెస్ట్ చేసేంతవరకూ మృతదేహాన్ని తీసేది లేదని డిమాండ్ చేశారు. మరి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.. జరుగుతూనే ఉంటాయి. మరి ఈ ఆగడాలకు అంతం ఎప్పుడో..

హైకోర్టు ఆగ్రహం... 11 మంది జడ్జిలు సస్పెండ్..

  హైకోర్టు ఎదుట న్యాయవాదుల ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు 11 మంది జడ్జిలను సస్పెండ్ చేసింది. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డారంటూ సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో జడ్జిల సస్పెన్సన్ పై లాయర్లు ఆందోళ‌న కొన‌సాగిస్తున్నారు. అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. తమ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయమని ఏపీ ప్ర‌భుత్వం కేంద్రానికి ఎందుకు లెట‌ర్ రాయడం లేద‌ని న్యాయ‌వాదులు ప్ర‌శ్నిస్తున్నారు. ఏపీ ప్ర‌భుత్వం ప్రోత్సాహంతోనే తెలంగాణ న్యాయాధికారుల‌ను తొల‌గిస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు.

మళ్లీ మేల్కొన్న రోజా.. చంద్రబాబుపై విమర్శలు..

  వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మరోసారి విరుచుకుపడ్డారు. అసెంబ్లీ నుండి ఏడాది పాటు సస్పెషన్ చేసినప్పుడు మాత్రం రోజూ.. ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి టీడీపీని.. టీడీపీ అధినేతను విమర్శించడమే పనిగా పెట్టుకున్న రోజా.. ఆతరువాత ఆ వ్యవహారం ముగిసే సరికి చాలా రోజుల నుండి సైలెంట్ గానే ఉన్నారు. మళ్లీ ఇన్ని రోజుల తరువాత మేల్కొని.. చంద్రబాబుపై తన విమర్శల బాణాలు వదిలారు.   ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఒక పక్క ప్రధాని నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా అంటూ ముందుకెళ్తుంటే.. చంద్రబాబు మాత్రం సింగపూర్ కంపెనీలకే ప్రాధాన్యం ఇస్తున్నారు.. అమరావతి ఆంధ్రప్రదేశ్‌కు రాజధానా? లేక సింగపూర్‌కు రాజధానా? అని ప్రశ్నించారు. అంతే కాదు స్విస్ ఛాలెండ్ పద్దతిపై కూడా ఆమె మాట్లాడుతూ.. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో జరుగుతున్న అమరావతి దోపిడీని తాము అడ్డుకొని తీరుతామని.. ఏపీని చంద్రబాబు సింగపూర్ దొరల చేతుల్లో పెడుతున్నారని, సింగపూర్‌కు రాజధానిని అప్పగించేందుకు స్కెచ్ వేసారని విమర్శించారు. బినామీల కోసమే చంద్రబాబు సింగపూర్ కంపెనీలకు రాజధానిని అప్పగించారన్నారు. భూములను బినామీలతో కొనుగోలు చేయించారన్నారు. స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని అడ్డుకుంటామని, త్వరలో ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలుస్తామని రోజా తెలిపారు. మరి రోజా వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఎయిర్ హోస్టెస్ తో సెల్ఫీ.. యువకుడు అరెస్ట్..

ఎయిర్ హోస్టెస్ తో బలవంతంగా సెల్ఫీ దిగి.. ఆఖరికి అరెస్ట్ అయ్యాడు ఓ ప్రయాణికుడు. వివరాల ప్రకారం.. డామన్‌ నుంచి ముంబయి వస్తున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానంలోఅబు బకర్ అనే వ్యక్తి ఎయిర్ హోస్టెస్ తో అసభ్యంగా ప్రవర్తించి.. ఆమెను చేయి పట్టుకొని లాగి సెల్ఫీ దిగుదాం రా అంటూ సెల్ఫీ తీసుకున్నాడు. దీంతో ఆమె అరవడంతో మిగిలిన సిబ్బంది అక్కడికి రాగా.. అతను వెంటనే టాయిలెట్‌లోకి వెళ్లాడు. అక్కడ కూడా సిగరెట్‌ తాగి బయటకు రావడంతో విమాన ప్రయాణ నియమాలను ఉల్లంఘించినందుకు గాను విమానం ముంబయిలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయానికి రాగానే పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా తాను నడుస్తుండగా అబు బకర్‌ తన చేయి లాగి ఓ సెల్ఫీ దిగుదాం రా అంటూ సెల్ఫీ తీసుకున్నాడని.. వద్దన్నా అతడు వినలేదని ఎయిర్‌హోస్టెస్‌ తన ఫిర్యాదులో వెల్లడించారు.

విజయకాంత్ మెడకు 500 కోట్లు...

  తమిళనాడు ఎన్నికల్లో డీఎండీకే అధ్యక్షుడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈసారి అధికారం నాదే అన్న రేంజ్ లో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కానీ రిజల్ట్ శూన్యం. చాలా దారుణంగా ఓడిపోయింది డీఎండీకే. అయితే ఇప్పుడు ఆయనపై ప్రజాహిత వాజ్యం దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ కార్యకర్తలు, జిల్లా శాఖల నాయకుల నుంచి సేకరించిన రూ.500 కోట్లు ఏమయ్యాయని మక్కల్‌ డీఎండీకే నేత చంద్రకుమార్‌ ప్రశ్నిస్తూ.. విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత, బావమరిది సుదీష్‌లపై ప్రజాహిత వాజ్యం దాఖలు చేయనున్నారు. డీఎండీకే నాయకుడు విజయకాంత్ పార్టీ అభివృద్ధి కోసం, సామాజిక కార్య్రకమాల్లో పేదలకు సహాయకాలు పంపిణీ కోసం జిల్లాలవారీగా పార్టీ శాఖల కార్యదర్శుల నుంచి తలా రూ.27 లక్షల వంతున రూ.500 కోట్ల వరకు విరాళాలు సేకరించి మోసగించారని ఆరోపించారు. ఆ విరాళాల మోసంపై త్వరలో ప్రజాహితవాజ్యం వేయాలని భావిస్తున్నామని చెప్పారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే..  ప్రజాసంక్షేమ కూటమితో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇది ఎంత మాత్రం ఇష్టం లేని చంద్రకుమార్‌ పార్టీ నుండి బయటకు వచ్చి.. క్కల్‌ డీఎండీకే పేరుతో డీఎంకేతో పొత్తు పెట్టుకున్నారు.

ఆయన దారిలోనే నేనూ నడిచా.. చంద్రబాబు

  ఏపీ ముఖ్యంత్రి చంద్రబాబు చైనా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన అక్కడ పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియాలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది ఆయనేనని.. ఆయన మార్గంలోనే తాను కూడా పయనించినట్టు తెలిపారు. పీవీ ఆర్థిక సంస్కరణలను తాను రాష్ట్రంలో కొనసాగించానని.. అప్పటివరకూ అమలవుతున్న లైసెన్స్ కోటా రాజ్ విధానానికి పీవీ చరమగీతం పాడారని కొనియాడారు. సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టి, పెట్టుబడుల గమ్యస్థానంగా ఇండియాను మార్చిన ఘనత పీవీ నరసింహారావుదేనని అన్నారు. కాగా ఏపీకి పెట్టుబడులు తీసుకురావడానికి చంద్రబాబు చైనాలో మూడు రోజులు పర్యటించనున్నారు.

బీజేపీ ఇప్పుడు కళ్లు తెరిచిందా..!

  చేతులు కాలాకా ఆకులు పట్టుకుంటే ఏం లాభం.. ఇప్పుడు బీజేపీ పరిస్థితి అలానే ఉంది. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి విచ్చలవిడిగా.. అందరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నంతకాలం సైలెంట్ గా ఉండి..ఇప్పుడు మాత్రం ఆయన వైఖరిపై మండిపడుతోంది. అంతేకాదు ఇన్ని రోజులు ఏం మాట్లడని ప్రధాని మోడీ.. స్వామి వ్యాఖ్యలపై స్పందించి చురకలు అంటించిన సంగతి తెలిసిందే. వ్యవస్థ కంటే తాము ఎప్పుడు అధికులం కాదని.. అలా అలోచించకూడదని.. అది తప్పని స్వామిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈనేపథ్యంలోనే ఆయన ప్రసంగించాల్సిన రెండు సభలను రద్దు చేసింది బీజేపీ. ముంబైలో జరగాల్సిన ఓ కార్యక్రమాన్ని, చెన్నైలో ఆర్ఎస్ఎస్ తలపెట్టిన మరో ప్రోగ్రామ్ నూ రద్దు చేసుకున్నట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఈ రెండింటిలో సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడాల్సి వుండగా, ఆయనేం వ్యాఖ్యలు చేస్తారోనన్న భయంతోనే వీటిని రద్దు చేసినట్టు సమాచారం.   కాగా ఇటీవల కాలంలో సుబ్రహ్మణ్యస్వామి బాగా రెచ్చిపోయిన సంగతి విదితమే. ఆర్భీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ నుండి మొదలు పెట్టి ఆఖరికి అరుణ్ జైట్లీని కూడా వదలకుండా విమర్శించారు. దీంతో పార్టీ నేతలు ఆయనపై అగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ముందు జాగ్రత్తగా సభలు కూడా రద్దు చేసింది. మరి ఈ జాగ్రత్తలేవో ముందే తీసుకుంటే పరిస్థితి ఇక్కడి వరకూ వచ్చేది కాదు కదా అని కొంతమంది అనుకుంటున్నారు. మరి స్వామి గారు ఇప్పటికైనా తన రూట్ మారుస్తారా.. లేక ఎప్పటిలాగే నాదారి రహదారి అంటారా చూడాలి.

విచిత్రం.. పిల్లికి 30 రోజుల నోటీసులు..

  సాధారణంగా ఎవరన్నా ఇబ్బంది పెడుతున్నప్పుడో.. కొన్ని కారణాల వల్ల నోటీసులు జారీ చేస్తుంటాం.  అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఏకంగా ఓ పిల్లికే నోటీసులు జారీ చేశారు. ఈ విచిత్రమైన ఘటన అమెరికాలో జరిగింది. అమెరికాలోని టెక్సాస్ లోని ఓ లైబ్రరీలో బ్రౌజర్ అనే పిల్లి గత ఆరేళ్లుగా ఉంటోంది. లైబర్రీకి వచ్చే వెళ్లే వారందరికీ ఈ పిల్లి బాగా తెలుసు. అయితే మొదట బాగానే ఉన్నా ఆ తరువాత.. మాత్రం అది తమను చదువుకోనివ్వకుండా డిస్టబ్ చేస్తుందని.. చాలా మంది ఫిర్యాదు చేశారు. దీంతో లైబ్రరీ నిర్వాహకులు పిల్లిపై రెఫరెండం పెట్టారు. అయితే దీనికి కొంతమంది పిల్లని బయటకు పంపించాలని కోరగా.. కొంత మంది మాత్రం ఉంచాలని కోరారు. అయితే ఎక్కువమంది పంపించేయాలని కోరడంతో.. పిల్లికి 30 రోజుల నోటీసును ఇచ్చారు. మొత్తానికి పిల్లికి కూడా నోటీసులు ఇవ్వడం ఏంటో..

నాకు బ్రతకాలని ఉంది.. మోడీకి లేఖ..

  తనకు బ్రతకాలని ఉందని.. ప్రపంచాన్ని చూడాలని ఓ బాలుడు ప్రధాని నరేంద్రమోడికి లేఖ రాశాడు. వివరాల ప్రకారం.. అంశ్ ఉప్పేటి అనే బాలుడు బ్లడ్ కేన్సర్ తో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో తనకు సహాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీకి, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కి లేఖ రాశాడు. తనకు ఇప్పుడు 11 ఏళ్లని.. తనకు బ్రతకాలని ఉందని.. తన చికిత్స కోసం ఇప్పటికే తల్లి దండ్రులు ఇంటిని కూడా అమ్మేశారని లేఖలో పేర్కొన్నాడు. అంతేకాదు.. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల కారణంగా అల్లోపతి చికిత్స తీసుకోలేకపోతున్నట్లు, ప్రస్తుతం ఆయుర్వేద ఔషధాలు వాడుతున్నట్లు.. జబ్బు కారణంగా కుటుంబం రెండుపూటలా తినడం కూడా గగనమైపోతోందని ఆ బాలుడు తన లేఖలో పేర్కొన్నాడు.