హైకోర్టు వద్ద భారీ బందోబస్తు.. ఢిల్లీకి లాయర్లు..

  తెలంగాణ న్యాయాధికారులకు అన్యాయం చేస్తూ రూపొందించిన ఆ జాబితాను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ లాయర్లు ఆందోళన చేపడుతున్నసంగతి తెలిసిందే. దీనిలో భాగంగా నిన్న 120 మంది న్యాయాధికారులు తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా నిరసనలు చేపట్టారు. ఈ రోజు కూడా లాయర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో  హైకోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.  తనిఖీలు చేసిన వాహనాలనే కోర్టులోకి అనుమతిస్తున్నారు. మరో వైపు ఈ రోజు నుంచి చీఫ్‌ జస్టిస్‌ కోర్టును బహిష్కరిస్తామని లాయర్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ లాయర్ల బృందం ఢిల్లీ వెళ్లనుంది. తెలంగాణ మంత్రులు, ఎంపీలతో కలిసి కేంద్రంలో కీలక మంత్రులకు వినతిపత్రం ఇవ్వనున్నారు.

హత్యకు చిలుక సాక్ష్యం..

మన పంచతంత్ర కథల్లో జంతువులు, పక్షులు మాట్లాడుకోవడం చదివాం..అలాగే ఆ కథల్లో ఇతర జంతువుల మధ్య గొడవలు జరిగినప్పుడు సాక్ష్యాలు చెప్పడం విన్నాం. ఇప్పుడు అలాంటి సంఘటన ఈ 21వ శతాబ్ధంలో జరగబోతోంది. అమెరికాలోని మిచిగన్ సాండ్‌లేక్ పట్టణంలో గత ఏడాది మేలో భర్తను హత్య చేసిందనే ఆరోపణలతో గ్లెన్న డురమ్ అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. బుల్లెట్ గాయాలతో భర్త మార్టిన్ మృతదేహంతో పాటు బుల్లెట్ గాయంతో గ్లెన్న పడివుంది. ఈ కేసులో విచారణ జరుపుతున్న పోలీసులు గ్లెన్నానే మార్టిన్‌ను హత్య చేసిందా లేదా మరేవరైనా వీరిపై దాడికి పాల్పడ్డారా అనేది అర్థంకాక జుట్టు పీక్కుంటున్నారు. సరిగ్గా ఈ సమయంలో మరోసారి ఆధారాల కోసం ఇంటిని పరిశీలిస్తుండగా ఆ ఇంట్లో పెంపుడు చిలక ఇంట్లోంచి వెళ్లిపో..ఎక్కడి వెళ్లాలి..నన్ను కాల్చోద్దు అనే పదాలను పొడిపొడిగా చెబుతుండటాన్ని పోలీసులు గమనించారు. దీని ఆధారంగా ఈ కేసులో చిక్కుముడిని విప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే చిలక సాక్ష్యం కోర్టు పరిగణనలోనికి తీసుకుంటుందో లేదో వేచి చూడాలి.

జగన్ ను తిట్టినందుకు ర్యాంకులా..?

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాధారణంగా.. మంత్రులు, అధికారుల పనితీరును బట్టి వారికి ర్యాంకులు ఇస్తారన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కూడా చంద్రబాబు ర్యాంకులు ఇవ్వనున్నారంట. అయితే ఈ ర్యాంకులు ఎందుకనుకుంటున్నారా..? వింటే మీరు కూడా అశ్యర్యపోవాల్సిందే. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ను ఎవరైతే ఘాటుగా విమర్శిస్తారో వారికి ర్యాంకింగ్స్ ప్రకటించనున్నారంట.   అయితే టీడీపీ నేతలు మాత్రం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేయాలంటే ఎప్పుడూ ముందే ఉంటారు. అయితే అందరు నేతల సంగతేమో కాని ఈసారి మాత్రం.. ర్యాంకింగ్స్ ఇస్తే దేవినేని ఉమనే పస్టే ర్యాంకు కొడతారని అనుకుంటున్నారు. ఎందుకంటే గత కొంత కాలంగా జగన్ పై  విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఏ చిన్న విషయం దొరికినా జగన్ ను ఏకి పారేస్తున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. జగన్ విదేశీ పర్యటనలో ఉన్నాగానీ దేవినేని ఉమ మాత్రం జగన్‌పై మండిపడుతూనే వున్నారు. దీంతో ఈసారి దేవినేని ఉమకే ఆ అవకాశం దక్కే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు.   మొత్తానికి పని చేసినందుకు ర్యాంకులు ఇవ్వడం చూశాం కానీ.. ఇలా తిట్టినందుకు ర్యాంకులు ఇవ్వడం వెరైటీగానే ఉంది. మరి చూద్దాం.. జగన్ ను ఎవరు ఎక్కువగా తిట్టారో.. ఎవరికి ఫస్ట్ ర్యాంకు వస్తుందో..

ఆఖరికి సుందర్ పిచాయ్ కూడా..

  ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ సోషల్ మీడియా అకౌంట్లు హ్యాకింగ్ కు గురైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్టులో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా చేరిపోయాడు. ఆయన కూడా హ్యాకింగ్ కు బుక్కయ్యాడు. అవర్ మైన్ గ్రూప్ ఈ హ్యాకింగ్ కు పాల్పడినట్టు చెబుతోంది. సుందర్ పిచాయ్ క్వారా అకౌంట్ ను అవర్ మైన్ గ్రూప్ హ్యాకింగ్ చేసి.. క్రౌడ్ సోర్స్ డ్ సమాధాన సైట్ కు అనుసంధానంగా ఉండే ట్విట్టర్ అకౌంట్లో తప్పుడు క్వారా పోస్టులను పోస్టు చేసింది. అంతేకాదు సుందర్ పిచాయ్ క్వారా అకౌంట్ హ్యాకింగ్ కు పాల్పడ్డామని, గూగుల్ సీఈవో భద్రత చాలా వీక్ గా ఉందని అవర్ మైన్ గ్రూప్ తెలిపింది. ఎవరైనా దాడిచేసే విధంగా ఉందని పేర్కొంది. అయితే అవర్ మైన్ గ్రూప్, తనకు తాను భద్రతా సంస్థగా అభివర్ణించుకుంటోంది. ఈ హ్యాకింగ్ ఘటనలు మళ్లీ జరగకుండా, సర్వీసులను ఆఫర్ చేస్తుందని వెల్లడిస్తోంది.

స్వామి ఇప్పటికైనా మారతాడా..?

బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి నోటి గురించి తెలిసిందే. ఈమధ్య ఆయన నోటికి మరీ పని ఎక్కువ చెప్పేసి.. ఎవరి మీద పడితే వారిమీద విమర్శలు చేయడం మొదలు పెట్టారు. కాంగ్రెస్ నేతలను విమర్సించడం నుండి మొదలు పెట్టిన ఆయన.. సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేసే వరకూ వెళ్లారు. అయితే స్వామి ఇంతలా రెచ్చిపోతున్నా.. ప్రధాని మోడీ ఎందుకు ఆపే ప్రయత్నం చేయడం లేదు.. ఆయన నోటికి ఎందుకు బ్రేక్ వేయడం లేదు అని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో.. ఎట్టకేలకు మోడీ స్వామి ఆరోపణలపై స్పందించి స్వామికి షాకిచ్చారు. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. 'ఇది మా పార్టీలో జరింగిందా లేక వేరే పార్టీలోనా అన్నది పక్కనబెడితే.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. పబ్లిసిటీపై మోజుతో ఇలా చేయడం దేశానికి ఏమాత్రం మేలు చేయదు. ప్రజలు ఎంతో బాధ్యతాయుతంగా మెలుగాల్సిన అవసరముంది. ఎవరైనా తాము వ్యవస్థ కంటే గొప్పవారమని అనుకుంటే అది తప్పు' అని మోదీ తేల్చి చెప్పారు. అంతేకాదు రాజన్ గురించి మాట్లాడుతూ..  రాజన్ దేశభక్తిని ఏమాత్రం శంకించలేమని, తామందరికీ తీసిపోని స్థాయిలో ఆయనలో దేశభక్తి ఉందని అన్నారు.   కాగా ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పై స్వామి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన తరువాత కేంద్ర ఆర్ధిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణియన్ పై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత వీదేశీ యాత్రలు చేసే మంత్రులు డ్రెస్సింగ్ పైనా కామెంట్లు చేస్తూ వ్యాఖ్యానించారు. ఇక కేంద్రంలోనే కాకుండా తిరుమల విషయంలో ఏపీ టీడీపీ పైనా కూడా ఆయన విరుచుకుపడ్డారు. మరి ఇప్పుడైనా మోడీ వ్యాఖ్యలతో ఆయన తన నోటిని అదుపులో పెట్టుకుంటారో లేదో చూడాలి.

ఊసరవెల్లి లాంటి స్మార్ట్ పెన్...

మనం ఎన్నో రకాల పెన్ పేర్లు వింటుంటా. కానీ ఇప్పుడు మార్కెట్ లోకి ఓ కొత్త స్మార్ట్ పెన్ రానుంది. దాని పేరు వింటేనే కొంచం వెరైటీగా ఉంది. మరి ఆ పెన్ పేరు ఎంటనుకుంటున్నారా..? ఊసరవెల్లి స్మార్ట్ పెన్ అంటా. అంటే ఈ పెన్ దగ్గర ఏదైనా రంగును ఉంచితే, అచ్చు గుద్దినట్టు అదే రంగులోకి మారిపోతుందన్నమాట. దీని పేరు 'స్క్రిబుల్ పెన్'. దీంతో అత్యంత సహజసిద్ధమైన రంగులను పెయింట్ చేసుకోవచ్చని దీన్ని తయారు చేసిన సంస్థ చెబుతోంది. స్క్రిబుల్ పెన్ లోని కలర్ సెన్సార్లు, ఓ రంగును స్కాన్ చేసి అదే రంగుతో పెయింట్ చేసుకునే కలర్ పెన్ గా మారిపోతుంది. బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ పెన్ నుంచి వెలువడే రంగు నీళ్లు పడినా చెదిరిపోదట. మరి ఇది ఎప్పుడు మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందో చూడాలి.

ఎంటీసీఆర్.. భారత్ కు సభ్యత్వం

  ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం భారత్ గట్టి ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ప్రత్యర్ధ దేశాలు చైనా, పాకిస్థాన్ దేశాలు కూడా బాగానే అడ్డుపడుతున్నాయి. అయితే ఇప్పుడు కొంతలో కొంత ఊరటగా.. ఎంటీసీఆర్ (మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజీమ్) లో భారత్ కు సభ్యత్వం లభించింది. దీంతో ఇక నుండి ఇండియాలో తయారు చేసే పృథ్వి తరహా క్షిపణులను ఇకపై విదేశాలకు విక్రయించవచ్చు. దీనిలో భాగంగానే.. విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్.జైశంకర్.. నేడు జరిగే ఓ కార్యక్రమంలో, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, లగ్జెంబర్గ్ ప్రతినిధుల సమక్షంలో ఎంటీసీఆర్ పై సంతకాలు చేయనున్నారు. ఈ సందర్భంగా 48 దేశాల అణు సరఫరాల బృందంలో చేరలేకపోయిన తరుణంలో ఎంటీసీఆర్ లో పూర్తి సభ్యత్వం శుభపరిణామమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్వీట్ చేశారు.

సీఎం అభ్యర్ధిత్వానికి షీలా నో.. కారణం అదేనా..?

యూపీ సీఎం అభ్యర్ధి ఎవరన్న దానిపై ఇప్పటికీ ఎన్నో అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ యూపీ సీఎంగా షీలా దీక్షిత్ పేరును తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనికి షీలా దీక్షిత్ నిరాకరించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం అభ్యర్ధిత్వంపై సోనియాగాంధీ షీలా దీక్షిత్ తో చర్చించగా దానికి ఆమె నిరాకరించినట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే దీనికి కారణం  షీలా దీక్షిత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన నీళ్ల టాంకర్ల కుంభకోణంపై ఆరోపణలు రావడమే అంటున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. నీళ్ల టాంకర్లపై కుంభకోణ జరిగిందంటూ షీలా దీక్షిత్ పై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆమె విచారణలో పాల్గొననున్నారు.   కాగా ముందుగా యూపీ సీఎం అభ్యర్దిగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని బరిలో దించుదామని అనుకున్నారు. కానీ రాహుల్ గాంధీ అయితే గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయని.. రాహుల్ ను కాకుండా.. ప్రియాంక గాంధీని బరిలో దించాలని కాంగ్రెస్ నేతలు పట్టుబట్టారు. ప్రియాంక గాంధీనే రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తారు అనుకున్నారు. కానీ సోనియా గాంధీ మాత్రం షీలా దీక్షిత్ ను ఎన్నికల్లో దించాలని చూశారు. ఈ నేపథ్యంలో ఆమెతో భేటీ కూడా అయ్యారు. కానీ ఆఖరికి ఆమె నిరాకరించింది. మరి ఇప్పుడు ఎవరు ఎన్నికల బరిలో దిగుతారో చూడాలి. రాహుల్ కు అవకాశం ఇస్తారా.. ? లేక ప్రియాంకాకు అవకాశం ఇస్తారా..? లేక వారిద్దరికి కాకుండా.. మరెవరికైనా అవకాశం ఇస్తారా చూడాలి. సోనియా ఏ నిర్ణయం తీసుకుంటారో..

ఉద్యోగుల రాకతో రాజధానిలో హడావుడి..

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు హైదరాబాద్లో ఉన్న ఏపీ ఉద్యోగులు దాదాపు అమరావతి చేరిపోయారు. ఈ నెల 27 వరకూ ఉద్యోగులందరూ రాజధానికి రావాల్సిందే అని చంద్రబాబు చెప్పగా.. ఉద్యోగులందరూ దాదాపు వచ్చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుండి వచ్చిన ఉద్యోగులకు సాదరంగా ఆహ్వానం పలికారు. గుంటూరు, కృష్ణాజిల్లలో ఇప్పటికే 25కి పైగా కార్యాలయాలు ఏర్పాటవ్వగా.. ఈ రోజు ఒక్కరోజే మరో 15 కార్యాలయాలు ప్రారంభం కానున్నాయి. అంతేకాదు హైదరాబాద్ నుండి ఏపీకి వచ్చిన 300 మండి ఉద్యోగులకు వారంరోజుల పాటు ఉచిత వసతి సౌకర్యాలు అందించనున్నారు. విజయవాడ, గుంటూరు పరిసరాల్లో ప్రారంభమైన కార్యాలయాలు. విజయవాడ నక్కల రోడ్డులోని పాత చరితశ్రీ ఆసుపత్రి భవనంలో పంచాయితీ రాజ్ కమిషనర్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయం * మారుతీ నగర్ లోని జీపీఆర్ స్ట్రీట్ లో ఉన్న వీ ప్లాజాలో ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసు * పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ ఎదురుగా ఉన్న జెడ్పీ ఆఫీసులో పంచాయితీ రాజ్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రారంభించనున్నారు. * ప్రసాదంపాడులో అద్దెకు తీసుకున్న భవంతిలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్, ఏపీ బ్రెవరీస్ కార్పొరేషన్ ఎండీ, డెరైక్టరేట్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ ఎన్‌ ఫోర్స్‌ మెంట్ ఆఫీసులను ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించనున్నారు. * గొల్లపూడిలో ఆర్ డబ్ల్యూఎస్ కార్యాలయాన్ని అయ్యన్నపాత్రుడు, అక్కడే సెర్ప్ ఆఫీసును కిమిడి మృణాళిని, శాప్ కార్యాలయాన్ని చైర్మన్ మోహన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని మంత్రి గంటా, బస్ భవన్ ను పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

స్టేజ్‌పై సిద్దూకి ముద్దిచ్చింది

ఖరీదైన వాచ్, కుమారుడి కోసం లాబీయింగ్‌లు, ఏసీబీ ఏర్పాటు, కాకి వాలిందని కారు మార్చడం ఇలా ఏది చేసినా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు తలనొప్పిగా మారుతోంది. తాజాగా ప్రజలందరూ చూస్తుండగానే..ఓ బహిరంగ సభలో అందరి ముందు ముఖ్యమంత్రికి ఓ మహిళ ముద్దు పెట్టింది. ఇవాళ బెంగుళూరులో జరిగిన కురుబ కమ్యూనిటీ సన్మాన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. చిక్‌మగ్‌ళూర్ జిల్లా తరికేరే ప్రాంతానికి చెందిన పంచాయతీ సభ్యురాలు గిరిజా శ్రీనివాస్‌ను సీఎం సిద్దరామయ్య సన్మానించారు. అంతే ఆమె సభావేదికపైనే అందరూ చూస్తుండగానే సీఎం బుగ్గ మీద ముద్దు పెట్టేసింది.ఈ పరిణామంతో సభలో ఉన్నవారంతా షాక్‌కు గురయ్యారు. దీనిపై సదరు మహిళ మీడియాతో మాట్లాడింది. ఆయన నా తండ్రిలాంటి వాడు..మొదటిసారి నేను ఆయన్ని కలుస్తున్నాను. ఆ సంతోషాన్ని ఆపుకోలేక ముద్దుపెట్టుకున్నాను...ఇందులో తప్పేముంది అని చెప్పింది. ముఖ్యమంత్రిని ఎవరో ముద్దుపెట్టుకున్నారంట అనే వార్త ప్రస్తుతం కర్ణాటకను ఊపేస్తోంది.

రేవంత్‌రెడ్డిపై మరో కేసు

టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిపై కేసు నమోదైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీఆర్ఎస్ నేత మన్నె గోవర్థన్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిన్న మెదక్ జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌లో రేవంత్ మాట్లాడుతూ..కేసీఆరే ఆంధ్రావాళ్లతో అంటకాగుతున్నారని దుయ్యబట్టారు. చండీయాగానికి చంద్రబాబు, వెంకయ్యను పిలిచారని, ఇలా అందరూ ఆంధ్రావాళ్లనే పిలిచారని, తెలంగాణ కోసం పాటుపడిన ఏ ఒక్కరినీ పిలవలేదన్నారు. తెలంగాణ కోసం అడ్డుపడ్డవాళ్లే ఆయనకు ఆత్మీయులయ్యారన్నారు. దీనిపై స్పందించిన గోవర్థన్ రేవంత్‌పై ఫిర్యాదు చేశారు. సెక్షన్ 504, 290, 188 సెక్షన్ల కింద పోలీసులు రేవంత్‌పై కేసు నమోదు చేశారు.

ఒక రైలును తప్పించబోయి..మరో రైలు కిందపడిన తల్లీకూతుళ్లు

చిత్తూరు జిల్లా కుప్పంలో విషాదం చోటు చేసుకుంది. తల్లీకూతుళ్లు ఒక రైలును తప్పించుకోబోయి..మరో రైలు కిందపడి ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని దళవాయికొత్తపల్లెకు చెందిన కలీం కుటుంబం కూలీనాలీ చేసుకుని జీవనం సాగిస్తోంది. కలీం భార్య హల్మాన్స, కుమార్తె తరానా నిన్న ఇంట్లోకి సరుకులు కొనేందుకు కుప్పం వెళ్లారు. సరుకులు కొని స్థానిక టీటీడీ కళ్యాణ మండపం పక్కనే ఉన్న సందులోంచి రైలు పట్టాల మీదకు వచ్చారు. ఆ సమయంలో చెన్నై నుంచి బెంగళూరు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ దూసుకొచ్చింది. దాన్ని తప్పించుకునే క్రమంలో తళ్లీకూతుళ్లు పక్కనే ఉన్న మరో ట్రాక్ మీదకు దూకారు. అదే సమయంలో అ వైపు నుంచి గూడ్స్ దూసుకొచ్చింది. దీంతో హతాశులైన తల్లీబిడ్డకు ఎటు వెళ్లాలో పాలుపోక ఇద్దరు పట్టాల మీదే నిలబడిపోయారు. వారిద్దరినీ గూడ్స్ రైలు బలంగా ఢీకొనడంతో పక్కనే ఉన్న కాలువలో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తల్లీకూతుళ్లు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి చివరికంటూ ప్రయత్నించారు. కాని విధి ముందు తలవంచక తప్పలేదు..ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు మృతదేహలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

న్యాయవాదిని సజీవ దహనం చేసిన దుండగులు

రంగారెడ్డి జిల్లా కీసరలో దారుణం జరిగింది. నిన్న అర్థరాత్రి ఓ న్యాయవాదిని దుండగులు కారులో సజీవదహనం చేశారు. కుషాయిగూడకు చెందిన న్యాయవాది ఉదయ్‌కుమార్‌ను దాయారు కీసర వద్ద నిర్మానుష్య ప్రాంతంలో కారుతో పాటు దహనం చేశారు. ఉదయం దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులోపల పూర్తిగా కాలిపోయిన మృతదేహన్ని కనుగొన్నారు. మృతదేహంపై ఉన్న దుస్తులు, ఇతర ఆధారాలతో హత్యకు గురైన వ్యక్తి న్యాయవాది ఉదయ్‌కుమార్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పాతకక్షలే హత్యకు దారి తీసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

చైనా పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు

మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చైనా చేరుకున్నారు. నిన్న రాత్రి విజయవాడ నుంచి ఢిల్లీ చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో సీఎం చైనా బయల్దేరారు. ఇవాళ ఉదయం హాంకాంగ్ చేరుకున్నారు. చంద్రబాబుతో పాటు 12 మంది సభ్యులున్నారు. రెండు రోజుల పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో ముఖ్యమంత్రి బృందం పాల్గొంటుంది. దీనిలో భాగంగా హాంకాంగ్ నుంచి సాయంత్రం 4.35 గంటలకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు జరిగే టియాంజిన్ నగరానికి సీఎం బృందం చేరుకుంటుంది. చైనాతో రాజకీయ, వ్యాపార సంబంధాలను మెరుగుపరచుకోవడంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చైనా కంపెనీలను ఆయన ఆహ్వానించనున్నారు.

పోలీసుల అదుపులో డిప్యూటీ సీఎం

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్రప్రభుత్వం మధ్య సంబంధాలు రోజు రోజుకి దెబ్బతింటున్నాయి. ఆప్ ఎమ్మెల్యే దినేష్‌ను అరెస్ట్ చేయడంతో పాటు ఢీల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై కేసు పెట్టినందుకు గానూ ఆప్ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీనిపై ఆందోళనకు దిగిన వారు సిసోడియాతో కలిసి రేస్ కోర్సు రోడ్డులోని ప్రధాని మోడీ అధికార నివాసానికి ర్యాలీగా బయల్దేరారు. ఈ నేపథ్యంలో ఢీల్లీ పోలీసులు ప్రధాని నివాసం వెంబడి 144 సెక్షన్ విధించారు. దీనితో పాటు సిసోడియాతో పాటు 65 మంది ఎమ్మెల్యేలను రేస్‌కోర్స్ రోడ్డుకు వెళ్లకుండా తుగ్లక్ రోడ్డు సమీపంలో వారిని అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   నిన్న సిసోడియా ఘజియాబాద్ మండిలో పర్యటించిన సందర్భంగా తమను దూషించారంటూ పలువురు వ్యాపారవేత్తలు డిప్యూటీ సీఎంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన తనపై ఫిర్యాదు చేసిన వారు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని...వాటిని మానకుంటే లైసెన్స్ రద్దు చేస్తానని హెచ్చిరించినట్టు సిసోడియా తెలిపారు. తనపై కావాలనే కేంద్రప్రభుత్వం కక్ష కట్టిందని ఆరోపించారు. వరుస పరిణామాలను గమనిస్తున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోడీ ఎదుట సిసోడియా పోలీసులకు లొంగిపోతారని ప్రకటించారు.