ఏపీ ప్రత్యేక హోదా బిల్లుకు పెరుగుతున్న మద్దతు..!
posted on Jul 21, 2016 @ 11:16AM
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రా రావు రాజ్యసభలో ఏపీ ప్రత్యేక హోదాపై పెట్టిన ప్రైవేటు బిల్లు జాతకం రేపటితే తేలిపోనుంది. రేపు జరగబోయే బిల్లు ఓటింగ్ లో.. బిల్లు ఆమోదించబడుతుందా.. లేదా అన్నదానిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ బిల్లును ఎలాగైనా ఆమోదింపజేసుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ మినహా ఏపీలోని అధికార పార్టీ టీడీపీ సహా అన్ని పార్టీలు కేవీపీ బిల్లుకు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వేరే పార్టీ నేతలతో కూడా కాంగ్రెస్ నేతలు మంతనాలు జరుపుతున్నారు. దీనిలోభాగంగానే వారు తమిళనాడులో విపక్ష పార్టీగా ఉన్న ద్రవిడ మున్నేట్ర కగజం (డీఎంకే) ఎంపీ, ఆ పార్టీ అధినేత కరుణానిధి కూతురు కనిమొళిని కాంగ్రెస్ పార్టీ నేతలు కలిశారు. ఏపీ ప్రత్యేక హోదా బిల్లుకు తమ మద్దతు తెలపాలని ఆమెను కోరారు. దీనికి ఆమె సానుకూలంగానే స్పందించి తమ మద్దతు తెలుపుతామని హామీ ఇచ్చారు. తప్పకుండా ఓటు వేస్తామని చెప్పారు. దీంతో బిల్లుకు మరింత మద్దతు లభించినట్టుయింది.