నేను బకరాలా కనిపిస్తున్నానా..?
posted on Jul 21, 2016 @ 10:44AM
నేనేమన్నా బకరా అనుకుంటున్నావా.. ఈ వ్యాఖ్యలు చేసిందెవరు అనుకుంటున్నారా.. ఇంకెవరు తెలంగాణ మంత్రి హరీశ్ రావు. ఓ ప్రిన్సిపాల్ పై హరీశ్ రావు మండిపడ్డారు. వివరాల ప్రకారం.. హరీశ్ రావు మెదక్ జిల్లా కల్హేర్ మండలం సిర్గాపూర్ లో పర్యటించి తిరిగి వెళుతున్న నేపథ్యంలో నల్లవాగు గురుకుల పాఠశాల వద్ద ప్రిన్సిపాల్ మెవాబాయి మంత్రి ప్రయాణిస్తున్న కాన్వాయ్ ని ఆపి.. తమ పాఠశాల హరితహారంలో పాల్గొనాలని, మొక్కలు నాటాలని కోరారు. అయితే దీనికి హరీశ్ రావు కూడా అంగీకరించి మొక్కలు నాటడానికి వెళ్లారు. అయితే అక్కడి మొక్కలు నాటడానికి కనీసం పార, పలుగు కాదుకదా... చుక్క నీరు కూడా అందుబాటులో లేదు. దీంతో ఆగ్రహంతో మంత్రి ప్రిన్సిపాల్ పై మండిపడ్డారు. హరితహారం కార్యక్రమానికి తనను ఆహ్వానించి సరైన ఏర్పాట్లు చేయలేదని.. తానేమైనా బకరా మంత్రిని అనుకుంటున్నావా? ఇవేనా ఏర్పాట్లు? తనను సరదాకి పిలుద్దామని రోడ్డెక్కారా? అంటూ మండిపడ్డారు. దీంతో మెవాబాయి కొంత మనస్తాపంతో, తప్పు జరిగిందని చెబుతూ, మొక్కలు నాటాలని కోరడంతో, హరీశ్ స్వయంగా గుంత తీసి మొక్కను నాటారు.