అసలు ప్రత్యేక హోదా బిల్లు చర్చకు వస్తుందా..?
posted on Jul 22, 2016 @ 12:17PM
జులై 22వ తేదీ.. ఏపీ ప్రజలు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు. ఎందుకంటే కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ బిల్లుపై ఈరోజు ఓటింగ్ జరగనుంది. దీంతో ఏం జరుగుతుందా అని అందరూ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. మరోపక్క పార్టీలన్నీ ఎవరి వ్యూహాంలో వాళ్లు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పలు పార్టీలతో మంతనాలు జరిపి మద్దతు తెచ్చుకుంది. బీజేపీ కూడా బిల్లును అసలు చర్చకు రానీయకుండా ఎలా చేయాలా అని ప్లాన్ లు వేస్తుంది.
అయితే పరిస్థితి చూడబోతే నిజంగానే అసలు ఈ బిల్లు చర్చకు వస్తుందా అన్న సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే సాధారణంగా ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత రాజ్యసభలో సభ్యులు ప్రతిపాదించే ప్రైవేటు బిల్లులపై చర్చ జరుగుతుంది. 2.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ చర్చ జరుగుతుంది. అయితే ఈరోజు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 ప్రైవేటు బిల్లులపై చర్చలు జరగనున్నాయి. ఇక మన ప్రత్యేక హోదా బిల్లు వంతు 14. ఈ నేపథ్యంలో 13 బిల్లుల ప్రస్తావన ముగిసి 14వ బిల్లుగా ఉన్న కేవీపీ బిల్లు అసలు సభలో ప్రస్తావనకు వస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ కాంగ్రెస్ మాత్రం తప్పనిసరిగా ఈ బిల్లుపై ఓటింగ్ జరిపించాలని పట్టుబడుతోంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.