చంద్రబాబుగారు ఇప్పటికైనా టైం కేటాయించండి..
posted on Jul 21, 2016 @ 12:24PM
ఒక పక్క ఏపీలో అధికార పార్టీ అయిన టీడీపీలోకి విపక్ష పార్టీల నుండి నేతలు వలసలు కడుతుంటే.. మరోపక్క తెలంగాణ రాష్ట్రం నుండి టీడీపీ నేతలు మాత్రం పార్టీ నుండి జంప్ అవుతున్నారు. ఇప్పటికే తెలంగాణ టీడీపీ నుండి పలువురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అవ్వగా.. ఇప్పుడు మరో మాజీ మంత్రి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో నంబర్ 2గా చక్రం తిప్పిన దివంగత ఎలిమినేటి మాధవరెడ్డి సతీమణి ఉమా మాధవరెడ్డి పార్టీని వీడనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అక్కడ అధికార పార్టీ అయిన టీఆర్ఎస్లో అందరూ చేరుతుండగా ఆమె కూడా టీఆర్ఎస్లో చేరుతారని అనుకున్నారు కానీ.. ఆమె కాంగ్రెస్లో చేరుతారని అంటున్నారు. అంతేకాదు దీనికి సంబంధించి ఆ పార్టీ శాసనసభా పక్ష నేత జానారెడ్డి, ఉమల మధ్య చర్చలు జరిగాయని కూడా చెబుతున్నారు. కాంగ్రెస్ కూడా ఆమె రాకకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. ఓ ముహూర్తాన్ని ఖరారు చేసి.. ఓ భారీ బహిరంగ సభ ద్వారా ఘనంగా స్వాగతం పలికాలని చూస్తున్నారు.
మరి ఇప్పటికే తమ పార్టీపై నేతలు అసంతృప్తిగా ఉన్నట్టు టీ టీడీపీ కీలకనేతలు కొంతమంది చంద్రబాబు దగ్గర మొరపెట్టుకున్నారు. తెలంగాణ పార్టీ కోసం కూడా కొంత సమయం కేటాయించాలని కోరారు. మరి ఇప్పుడైనా టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణ టీడీపీపై శ్రద్ద చూపించకపోతే ఉన్న ఇద్దరు, ముగ్గురు నేతలు కూడా పార్టీ మారే ముప్పు ఉంటుందని రాజకీయ విశ్లేషకలు చర్చించుకుంటున్నారు.