విశాఖలో బాలిక అనుమానాస్పద మృతి..ఏం జరిగింది..?

విశాఖపట్నంలో బాలిక అనుమానాస్పద స్థితిలో మరణించింది. నగరంలోని కృష్ణరాయపట్నంలో తొమ్మిదో తరగతి చదువుతున్న తనూజ నిన్న సాయంత్రం ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది.. అలా ఆదృశ్యమైన అమ్మాయి, ఇవాళ ఉదయం శరీరంపై బట్టలు లేకుండా, నిర్జీవంగా ఓ చెత్తకుప్పలో శవమై కనిపించింది. ఆమెను ఆత్యాచారం చేసి, హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. జీవం లేకుండా పడి ఉన్న కూతురును చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలను సేకరిస్తున్నారు. మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

పంజాగుట్ట ఫ్లై ఓవర్ వద్ద మళ్లీ అదే ఘటన

పంజాగుట్ట ఫ్లై ఓవర్ వద్ద జరిగిన కారు ప్రమాద ఘటనను తెలుగు రాష్ట్రాల ప్రజలు మరచిపోగలరా..? మద్యం మత్తులో కారు నడిపి ఒక కుటుంబాన్ని తీరని విషాదంలోకి నెట్టిన ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా..మిగిలిన ఇద్దరు మంచానికే పరిమితమయ్యారు. ఇది ఇంకా కళ్ల ముందే మెదులుతుండగా..అదే ఫ్లైఓవర్ వద్ద అచ్చం అలాంటి ఘటనే జరిగింది.   ఫుల్‌గా మద్యం సేవించిన కొందరు యువకులు మద్యం మత్తులో కారును నడపడంతో పంజాగుట్ట ఫ్లైఓవర్ దాటిన తరువాత డివైడర్‌ను ఢీకొట్టి కొద్ది దూరం వరకూ అలాగే రోడ్డుపైనే దూసుకెళ్లింది. అర్థరాత్రి దాటిన తర్వాత ప్రమాదం జరగడం, ఆ సమయంలో రహదారిపై వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భయపడిన మందుబాబులు కారును నడిరోడ్డుపైనే వదిలి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కారును స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

వైభవంగా ప్రారంభమైన ఉజ్జయిని మహంకాళి బోనాలు

సుప్రసిద్ధ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం తరపున తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెల్లవారుజామున 4 గంటలకు కుటుంబసమేతంగా తొలి బోనం సమర్పించారు. అంతకు ముందు మంత్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన తలసాని..బోనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రపండుగగా గుర్తించిన తర్వాత అత్యంత వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది మంచి వర్షాలు పాడిపంటలతో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు మంత్రి వెల్లడించారు. అమ్మకు బోనాలు సమర్పించడానికి తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు.

మంత్రిని స్కూటరిస్ట్ ఢీ.. కాలికి ఫ్రాక్చర్

  రాజస్థాన్ మంత్రిని స్కూటరిస్ట్ ఢీ కొన్న ఘటన అజ్మీర్ లో చోటుచేసుకుంది. సెక్యూరిటీ అంతా ఉండగానే రోడ్డు దాటుతున్న మంత్రిగారికి ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం.. రాజస్థాన్ విద్యా శాఖ మంత్రి వాసుదేవ్ దేవ్ నాని అజ్మీర్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి అక్కడికి వెళ్లారు. అయితే అక్కడి నుండి వేరే ప్రాంతానికి వెళ్లేందుకు అయన తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి రోడ్డు దాటే ప్రయత్నం చేశారు. ఇంతలో అటుగా వచ్చిన ఓ స్కూటరిస్టు మంత్రిని ఢీ కొట్టడంతో ఆయన గాయపడ్డారు. వెంటనే ఆయనను అజ్మీర్ లోని జేఎల్ఎన్ ఆసుపత్రికి తరలించగా, ఆయన కాలికి ఫ్రాక్చర్ అయిందని, శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు.

కోహ్లీ డబుల్ సెంచరీకి కారణం అదేనట...

ప్రస్తుతం టీమిండియాకు.. వెస్టిండీస్ కు మధ్య సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో కోహ్లీ రెచ్చిపోయి డబుల్ సెంచరీ సాధించాడు. అయితే ఇప్పుడు తాను డ‌బుల్ సెంచ‌రీ చేయ‌డానికి గ‌ల కార‌ణం ఏంటో చెబుతున్నాడు. గతంలో ఇక్కడ మూడు సిరీస్లో పాల్గొన్నప్పుడు కేవలం 76 పరుగులు మాత్రేమే చేశాను.. అప్పుడు ‘వెస్టిండీస్ లో రాణించలేనని నాపై విమర్శలు వచ్చాయి. అప్పుడు నేను నిరాశలోకి వెళ్లాను. నా అభిమానులు కూడా నేనిక్కడ రాణించాలని కోరుకుంటున్నారు.. ఆ ఒత్తిడితోనే తాను అద్భుతమ‌యిన ఇన్నింగ్స్ ఆడాన‌ని.. చివ‌రికి అది సాధ్యమైందని అన్నాడు. ఇప్పుడు ఒకేసారి డబుల్ సెంచరీ చేశాన‌ని, ఈ సిరీస్ తనకెప్పుడూ ప్ర‌త్యేకంగా నిలుస్తుంద‌ని చెప్పాడు.

మాల్యా 8 కార్లు.. 14 లక్షలే..

  బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి ఎంచక్కా విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న విజయ్ మాల్యా ఆస్తులను వేలం వేసైనా సరే బ్యాంకుల తమ బకాయిలు వసూలు చేసుకోవాలనకుంటున్నారు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన విల్లా వంటిని వేలం వేశారు. ఇప్పుడు ఆయనకు చెందిన  కార్లను వేలం వేశారు. ఎనిమిది కార్లను కేవలం 14 లక్షలకు వేలం వేశాయి. వివరాల ప్రకారం.. ఎస్ బీఐ క్యాప్ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ విజయ్ ఎస్ బీఐ క్యాప్ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ విజయ్ మాల్యాకు చెందిన 8 కార్లపై ఆగస్టు 25 న ఈ వేలం నిర్వహించనుంది. అయితే కేవలం 14 లక్షల రూపాయలకు వేలం ప్రారంభించింది. అయితే ప్రస్తుతానికి కింగ్ ఫిషర్ హౌస్ బ్యాక్ యార్డులో ఉన్న ఈ కార్లు వేలంలో పాల్గొనాలంటే...ప్రతి వాహనానికి కోట్ చేసిన ధరలో 10 శాతం మొత్తాన్ని అంటే 2,000 రూపాయలు ఆగస్టు 23లోపు డిపాజిట్ చేయాల్సి ఉంది. అంతేకాదు ఈ కార్ల కండిషన్ పై అనుమానాలు ఉండి తనిఖీ చేయాలనుకుంటే జూలై 29 నుంచి ఆగస్టు 5 వరకు తనిఖీ చేసుకునే అవకాశాన్ని కూడా బ్యాంకు అదికారులు కల్పించారు. మరి 8 కార్లను ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి.

యూపీ ఎన్నికలు.. కాంగ్రెస్ అప్పుడే స్టార్ట్ చేసేసింది..

  యూపీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో గెలుపు సాధించడంకోసం అన్ని పార్టీల నేతలు ఎవరి ప్లానింగ్స్ లో వాళ్లు ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి అధికారం చేపట్టాలని గట్టిగానే ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే ఎన్నికలకు సంబంధించి అప్పుడే ప్రచారానికి శ్రీకారం చుట్టింది. యూపీ సీఎం అభ్యర్దిగా ఎన్నికల బరిలో దిగుతున్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఈరోజు ఢిల్లీ నుండి యూపీకి బయలుదేరారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ జెండా ఊపి లాంఛనంగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారం మూడు రోజుల పాటు జరగనుంది.   కాగా ముందు యూపీ ఎన్నికల బరిలో రాహుల్ గాంధీని దించాలనుకున్నారు. కానీ అందుకు సొంత పార్టీ నేతలే అభ్యంతరం చెప్పడంతో ప్రియాంక గాంధీని రంగంలోకి దించాలనుకున్నారు. ప్రియాంక గాంధీ అయితే యూపీలో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆమె పేరునే దాదాపు ఖరారు చేసింది పార్టీ హైకమాండ్. అయితే ఏమైందో తెలియదు కానీ ఆఖరి నిమిషంలో సోనియా షీలా దీక్షిత్ పేరును తెరపైకి తీసుకొచ్చారు. మొదట దీనికి కూడా అభ్యంతరాలు ఎదురైనా.. యూపీలో గెలవాలంటే షీలా దీక్షిత్ అయితేనే కరెక్ట్ అని.. అందునా ఆమె బ్రాహ్మణ సామాజికి వర్గానికి చెందిన ఆమె కూడా కాబట్టి.. గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుందని ఆమెనే ఎన్నికల బరిలోకి దింపారు.

గల్లంతైన విమానం ఎక్కడ.. చంద్రబాబు పరామర్శ..

తమిళనాడులో ఎయిర్ ఫోర్స్ విమానం నిన్న అదృశ్యమైన సంగతి తెలిసిందే. నిన్న ఉదయం 8.30 గంటలకు తమిళనాడులోని తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్ బయలుదేరిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం కొంతసేపటికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయి గల్లంతైంది. విమానంలో మొత్తం 29 మంది ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకూ విమానం ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇప్పటికే ఎయిర్ ఫోర్స్ నావికాదళాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. విమానం సముద్రంలో కూలిపోయిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సముద్ర ఉపరితలంపైనా సహాయక బృందాలు ఓ కన్నేసి గాలింపును మరింత ముమ్మరం చేశాయి. ఇక సముద్రంలో విమాన శకలాలు కనిపిస్తే సమాచారం ఇవ్వాలంటూ మత్స్యకారులకు సహాయక సిబ్బంది ఆదేశాలు జారీ చేశారు.   మరోవైపు గల్లంతైన వారిలో మన తెలుగు రాష్ట్రానికి చెందిన వారు కూడా ఉన్నారు. విశాఖపట్నానికి చెందిన చిన్నారావు, నాగేందర్‌రావులు గల్లంతైన వారిలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని.. సైనిక కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.

చేతకాకపోతే తప్పుకో..చంద్రబాబు ఫైర్

  పనులు సరిగ్గా చేయకపోయిన.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్మొహమాటంగా వారికి క్లాస్ తీసుకుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఓ కాంట్రాక్టర్ కు కూడా క్లాస్ తీసుకున్నారు చంద్రబాబు. వచ్చే నెలలో కృష్ణ పుష్కరాలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పుష్కర ఏర్పాట్లపై చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారు. గత రెండురోజుల క్రితం విజయవాడలోని సీతానగరం ఘాట్ పనులను ప్రర్యవేక్షించిన ఆయన అక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీలైతే ఆ కాంట్రాక్టర్ ను తీసేసి వేరే వారికి బాధ్యతలు అప్పగించమని కూడా ఆదేశించారు. అయితే ఇప్పుడు కాంట్రాక్టర్ ను ఏకంగా తన క్యాంపు కార్యాలయానికి పిలిపించి క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. ‘‘ఎంతో నమ్మకంతో పనులు అప్పగిస్తే ఇలా చేస్తావా? చేతకాకపోతే తప్పుకో. వేరే వాళ్లు ఆ పనిని చేపడతారు. ఇలా చేసినందుకు నీపై చర్య తీసుకుంటాను’’ అని చంద్రబాబు కోపడ్డారట. దీంతో సదరు కాంట్రాక్టర్ చంద్రబాబు కోపం చూసి వణికిపోయారంట.

కిడ్నాప్ అయిన భారతీయ మహిళ సేఫ్.. సుష్మ ట్వీట్‌

గత కొద్దిరోజుల క్రిందట ఆప్ఘనిస్థాన్ లోని కాబూల్ లో భారతీయ మహిళ కిడ్నాప్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె క్షేమంగా ఉన్నట్టు తెలిపారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆమె ఈ విషయాన్ని తెలియజేశారు. జుడిత్‌ను సురక్షితంగా కాపాడారని.. ఈ విషయం తెలియజేయడం చాలా సంతోసంగా ఉందని సుష్మ ట్వీట్‌ చేశారు. అక్కడి భారతీయ రాయబారి మన్‌ప్రీత్‌ వోహ్రా.. జుడిత్ ను కాపాడటంలో కీలక పాత్ర పోషించారని.. ఆమెను సురక్షితంగా బయటకు తెచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని ట్వీటారు. త్వరలోనే ఆమె ఇంటికి చేరుకుంటారని తెలిపారు.     కాగా జుడిత్‌ డిసౌజా అనే మహిళ కాబూల్‌లోని అఘాఖాన్‌ ఫౌండేషన్‌లో సీనియర్‌ టెక్నికల్‌ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు. అయితే ఆమెను తన కార్యలయం ఎదుటే ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు.

జర్మనీ పై తెగబడ్డ ఉగ్రవాది..

మొన్నటికి మొన్న ఫ్రాన్స్ లోని నీస్ నగరంలో ఉగ్రదాడి జరిపి వందమందికి పైగా పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు.. ఇప్పుడు జర్మనీ మీద తెగబడ్డారు. మరోసారి రెచ్చిపోయి మారణహోమం సృష్టించారు. జర్మనీలోని మ్యూనిచ్‌లో ఓ షాపింగ్ సెంటర్లో ఓ ఉగ్రవాది చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 15 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. పోలీసులు వెంటనే అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకొని ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.   కాగా ఈ దాడికి పాల్పడింది ఒక్కడే అని.. కాల్పులు జరిపిన అనంతరం దుండగుడు తనను తాను కాల్చుకొని చంపుకున్నాడని పోలీసులు తెలుపుతున్నారు. అయితే మొదట ఈ దాడికి పాల్పడింది ముగ్గురు ఉగ్రవాదులు అని అనుకున్నారు.. కానీ.. ఈ దాడికి పాల్పడింది.. 18 ఏళ్ల జర్మన్‌-ఇరానీయన్ అని.. ద్వంద్వ పౌరసత్వం ఉందని, అతనికి ఎలాంటి నేరచరిత్రలేదని స్పష్టం చేశారు.

ఇంట్లో సిగరెట్ తాగినా అక్కడ తాట తీస్తారు..!

వీధిలో ఉన్నా..ఇంట్లో ఉన్నా ఎక్కడ ఉన్నామన్నది కాదు దమ్ము కొట్టామా లేదా అన్నది మన దగ్గర పొగరాయుళ్ల మాట. ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా సిగరెట్ సేల్స్ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. మనదగ్గరైతే చెల్లుతుంది కాని..ఇతర దేశాల్లో పొగరాయుళ్లపై కఠిన చర్యలుంటాయి..పొగ వదిలారో తాట తీస్తారక్కడ. ఇలాంటి చర్యల్లో భాగంగా చైనా మరో కఠిన చట్టాన్ని తీసుకొచ్చింది. రాజధాని బీజింగ్ నగరంలో బహిరంగ స్థలాలతో పాటు ఇంట్లో కూడా ధూమపానం సేవించడం లాంటి ఇండోర్ స్మోకింగ్ కూడా కఠినంగా అమలు చేస్తున్నారు. భారీగా జరిమానాలు విధిస్తుండటంతో ఈ ఏడాది 3,30,000 డాలర్లు వసూలు చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఇండియాలో కూడా ఇలాంటి సిస్టం ఉంటే ఎంత బాగుండు.

10 రూపాయల నాణెం చెల్లుతుందా..?

భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన 10 రూపాయల నాణెంపై ఉత్తరప్రదేశ్‌లోని ఫరీదాబాద్ ప్రజలు కన్ఫ్యూజన్‌లో పడిపోయారు. కొంతమంది దుకాణ యజమానులు రూ.10 నాణెం చెల్లుతుందని తీసుకుంటే..మరికొందరు చెల్లదని ప్రజలను తిప్పి పంపుతున్నారు. దీంతో నాణెన్ని తీసుకోవాలా..? వద్దా..? అనే విషయంపై  జనం ఏటూ తేల్చుకోలేకపోతున్నారు.   చేసేది లేక అక్కడి ప్రజలు బ్యాంకులకు క్యూకట్టి తమ వద్ద ఉన్న రూ.10 నాణెం ఇచ్చి దానికి బదులుగా పది రూపాయల నోటును తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం దాదాపు 2 వేల పది రూపాయల నాణాలు బ్యాంకుకు వచ్చినట్లు చెప్పారు. ఇంతటి గందరగోళానికి కారణం ఆర్బీఐ రూ.10 నాణెం చెల్లదని చెప్పినట్లు సోషల్ మీడియాలో పుకార్లు రావడమే. దీనిపై స్పందించిన నగరంలోని నీలమ్ చౌక్ ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరిగిందని, ఆర్బీఐ అటువంటి ఏ నిర్ణయం తీసుకోలేదని..రూ.10 నాణెంను తిరస్కరించిన వ్యాపారులు చట్టరీత్యా శిక్షార్హులని పేర్కొన్నారు.

మాయావతిపై దయాకర్ సింగ్ భార్య ఫిర్యాదు..

  యూపీ బీజేపీ మాజీ నేత దయాశంకర్ సింగ్ బీఎస్పీ అధినేత మాయావతిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనికి ఆయన ఫలితం అనుభవిస్తున్నాడనుకోండి. తనను ఆరెళ్లపాటు సస్పెండ్ చేశారు. ఇంకా పోలీసులు కూడా ఆయనను అరెస్ట్ చేయడానికి కూడా చూస్తున్నారు. ఇక యూపీలో బీఎస్పీ నేతలు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. దయాకర్ సింగ్ దిష్టిబొమ్మలు తగలబెట్టి ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. అయితే ఇప్పుడు దయాకర్ సింగ్ భార్య  స్వాతి సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బీఎస్పీ నుంచి తమకు వేధింపులు ఎదుర‌వుతున్నాయ‌ని..మాయావతితో పాటు బీఎస్పీ నేతలు త‌మ కుటుంబంపై బెదిరింపులకు దిగుతున్నార‌ని, త‌మ కుటుంబానికి ప్ర‌మాదం ఉంద‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఐపీసీ 120/బి, 153ఏ, 506, 509 సెక్షన్ల కింద మాయావతితో పాటు మరో ముగ్గురు బీఎస్పీ నేతలపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు.

నా కొడుకును కాల్చి చంపేయండి.. పాకిస్థాన్ మోడల్ తండ్రి..

పాకిస్థాన్ మోడల్ ఖండీల్ బలోచ్ ను తన సోదరుడు అత్యంత దారుణంగా చంపేసిన సంగతి తెలిసిందే. తమ కుటుంబ పరువు తీస్తుందని.. ఎన్నోసార్లు చెప్పి చూశాను.. కానీ వినలేదు అందుకే చంపేశానని..దీనికి నేను ఏం మాత్రం బాధపడట్లేదు.. అని పోలీసుల ముందు అసలు ఎలాంటి బిడియం లేకుండా చెప్పేశాడు. అయితే ఇప్పుడు ఖండీల్ బలోచ్ హత్యపై స్పందించిన ఆమె తండ్రి.. తన కుమారుడు కనిపిస్తే కాల్చి చంపేయండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఘటన జరిగిన రోజు తాము ఇంటి పై అంతస్థులో ఉన్నామని, తమకు డ్రగ్స్‌ ఇవ్వడం వల్ల స్పృహ లేకుండా పడుకున్నామని.. బలోచ్‌ ను గొంతు నులిమి చంపాడని.. అతన్ని కాల్చి చంపాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   ఇంకా ఆమె తల్లి మాట్లాడుతూ.. బలోచ్ నాకు అన్ని విషయాలు చెప్పేది.. తాగే పాలలో తన కొడుకు మత్తు మందు కలపడంతో ఉదయం వరకూ లేవలేదని.. ఉదయం బలోచ్ ను లేపడానికి వెళ్లితే తాను లేవలేదని.. తన ముఖం మొత్తం కమిలిపోయింది..  నాలుక, పెదవులు నల్లగా అయిపోయి ఉన్నాయని తెలిపారు. తమ కొడుకును మాత్రం క్షమించేది లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం గల్లంతు..

  తమిళనాడులో ఎయిర్ ఫోర్స్ విమానం అదృశ్యమైంది. ఈ రోజు ఉదయం 8.30 గంటలకు తమిళనాడులోని తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్ బయలుదేరిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం.. ఆ తరువాత 15 నిమిషాలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయి గల్లంతైంది. విమానంలో మొత్తం 29 మంది ఉన్నట్టు తెలుస్తోంది.   మరోవైపు గల్లంతైన విమానం ఆచూకి కనిపెట్టేందుకు ఎయిర్ ఫోర్స్, నావికా దళం సేనలు రంగంలోకి దిగాయి. కోస్ట్ గార్డ్ బృందాలు కూడా దీనికోసం గాలింపు చర్యలు చేపట్టాయి. బంగాళా ఖాతంలోని పలు ప్రాంతాల్లో గాలిస్తున్నారు. ఇప్పుడు ఈ విమానం అదృశ్యం కావడం వెనుక సాంకేతిక కారణాలే ఉన్నాయా, మరేదైనా సమస్య ఉందా అని విచారణ జరపాల్సి ఉంది. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉంది.

బిల్లుపై చర్చ.. అనుకున్నదే జరిగింది..

  మొత్తానికి కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రారావు ప్రత్యేక హోదాపై పెట్టిన ప్రైవేటు బిల్లు చర్చకు రాకుండానే మిగిలింది. ఆప్ ఎంపీ భగవత్ మాన్‌ పార్లమెంట్ భద్రతను షూట్ చేసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. మరోవైపు విపక్షాలు మాత్రం ప్రత్యేక బిల్లుపై చర్చ జరగాలని డిమాండ్ చేశాయి. దీంతో ఉదయం రాజ్యసభను మధ్యాహ్నం వరకూ వాయిదా వేశారు స్పీకర్. ఆ తరువాత రెండున్నర గంటలకు ప్రారంభమైన సభలో మళ్లీ ప్రతిపక్ష, విపక్ష నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకపక్క కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రత్యేక హోదా ప్రయివేటు బిల్లు పైన చర్చ పెట్టాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. మరోవైపు, బీజేపీ సభ్యులు.. పార్లమెంటులో వీడియో తీసిన ఏఏపీ సభ్యుడి పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో రాజ్యసభలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు.   ఇదిలా ఉండగా బీజేపీ నేతలు మాత్రం తాము అనుకున్నది చేశామని అనుకుంటున్నారట. ఎలాగైనా బిల్లును చర్చకు రానివ్వం అని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే కోతికి కొబ్బరి చిప్ప దొరికింది అన్నట్టు ఆప్ ఎంపీ గారి నిర్వాహం బయటపడింది. ఇంకేముంది ఇదే ఛాన్స్ అన్నట్టు ఈ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు బీజేపీ నేతలు. ఇప్పుడు ఆయన మీద చర్యలు తీసుకున్నా.. తీసుకోకపోయినా బీజేపీకి వచ్చేది పెద్దగా ఒరిగేదేం లేదు కానీ ఈ విషయాన్ని అడ్డంపెట్టుకొని మొత్తానికి ఏపీ ప్రత్యేక హోదా బిల్లుపై చర్చ జరగకుండా చేశారు. దీంతో బీజేపీ అనుకున్నది సాధించింది. అందరూ అనుకున్నదే జరిగింది. మరి సోమవారమైనా ఈ బిల్లుపై చర్చ జరుగుతుందో లేదో చూద్దాం.