అట్టుడుకుతున్న యూపీ.. అతని నాలుక తెస్తే 50 లక్షలు
posted on Jul 21, 2016 @ 3:11PM
యూపీ బిజెపి నేత దయాశంకర్ సింగ్ బీఎస్పీ అధినేత మాయావతిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి నేపథ్యంలో యూపీ అట్టుడుకుతోంది. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాయావతి గురించి మాట్లాడుతూ.. 'డబ్బులు తీసుకున్న వేశ్య కూడా తాను ఒప్పుకున్న పనికి కట్టుబడి ఉంటుంది. మాయవతి ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికి టిక్కెట్లు అమ్మేస్తున్నారు' అని నోటికి వచ్చినట్టు వ్యాఖ్యానించారు. ఇంకేముంది ఈ వ్యాఖ్యలకు బీఎస్పీ నేతలు ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. దయాకర్ సింగ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చేసేది లేక ఆయన కూడా క్షమాపణ చెప్పారు. అయితే అక్కడితో అయిందా అంటే లేదు.. ఆయన పదవికి కూడా వేటు పడింది. తనను పదవి నుండి సస్పెండ్ చేస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. అక్కడితో అయినా ఆగిందా లేదు పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగా మారాయి. దేశవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేసిన బీఎస్పీ కార్యకర్తలు.. దయాశంకర్ సింగ్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఆయన దిష్టి బొమ్మలను దహనం చేస్తూ నిరసన ప్రదర్శిస్తున్నారు.
మరోవైపు బిఎస్పీ నాయకురాలు జన్నత్ జహాన్ దయాశంకర్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించి.. ఆయన నాలుక తీసుకువచ్చినవారికి 50 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. దీంతో ఆమె ప్రకటన దేశవ్యాప్తంగా చర్చాంశనీయమైంది. మరోవైపు పోలీసులు కూడా దయాశంకర్ సింగ్ ను అరెస్ట్ చేసే పనిలో పడ్డారు. ఈ ఘటనతో అయినా నేతలు తమ నోటి దురుసును కాస్త తగ్గించుకుంటారేమో చూద్దాం..