చనిపోవడానికి అనుమతి ఇవ్వండి...రాష్ట్రపతికి లేఖ

  తాను లంచం ఇచ్చుకోలేనని.. తాను ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతించాలని కోరుతూ ఓ వ్యక్తి ఏకంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశాడు. ఈఘటన నోయిడాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నోయిడాలో డీకే గార్గ్ అనే యాభై నాలుగేళ్ల ఒక వ్యక్తి.. ఒక సంస్థ ఏర్పాటు నిమిత్తం నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ ఓసీ) ఇవ్వమని కోరితే సంబంధిత అధికారులు లంచం కోసం ఏళ్ల తరబడి తిప్పుతున్నారని, ఈ ఒత్తిడిని తాను తట్టుకోలేనని, ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతించాని కోరుతూ లేఖ రాశారు. ఇక ఈ లేఖకు స్పందించిన జీఎన్ఐడీఏ సీఈఓ దీపక్ అగర్వాల్ మాత్రం గార్గ్ ఆరోపణలను ఖండించారు. తాను సరైన పత్రాలు ఇవ్వలేదని అందుకే ఆలస్యమైందని అంటున్నారు.

టీఆర్ఎస్ లోకి పొన్నం.. కండీషన్స్ అప్లయ్..

  తెలంగాణ అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి పలు పార్టీ నేతలు జంప్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్తగా.. తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా టీఆర్ఎస్ లోకి చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి గులాబీ గూటికి చేరనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పొన్నం సోదరుడి కుమారుడు హుజూరాబాద్‌లో నెలకొల్పిన ఐటీ స్టార్టప్‌ కంపెనీని ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి ప‌లువురు టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధుల‌తో క‌లిసి పొన్నం కూడా పాల్గొన్నారు. ఇంకేముంది పొన్నం పార్టీ మార్పుపై గుస‌గుస‌లు జోరందుకున్నాయి. అయితే  వాస్త‌వానికి ఎంపీ సుఖేంద‌ర్‌రెడ్డితో పాటే పొన్నం పార్టీ మార‌తార‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే అయితే ప్ర‌స్తుతం క‌రీంన‌గ‌ర్ ఎంపీగా ఉన్న బి.వినోద్‌కుమార్ అభిప్రాయం తీసుకున్నాకే పొన్నం చేరిక‌కు కేసీఆర్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వాల‌ని భావించ‌డంతో పొన్నం టీఆర్ఎస్ ఎంట్రీ కాస్త లేట్ అయ్యింది.   అంతేకాదు ఇప్పటికే పొన్నం టీఆర్ఎస్ నేతలతో చర్చలు జరిపారట. అయితే తాను పార్టీలోకి చేరడానికి వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాన్ని త‌న‌కు కేటాయించాల‌ని ఆయ‌న కోరుతున్నార‌ట‌. అయితే పొన్నం షరతుకు టీఆర్ఎస్ కూడా ఒప్పుకున్నట్టు సమాచారం. మరోవైపు పొన్నంను టీఆర్ఎస్ లోకి రప్పించడానికి.. కాంగ్రెస్ వీడి ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన వివేక్ చాలా ప్రయత్నిస్తున్నాడట. మరి అన్నీ కుదిరితే పొన్నం ఎంట్రీ ఖాయం అయినట్టే.

రియో ఒలింపిక్స్ నుండి నర్సింగ్ యాదవ్ ఔట్... డోపింగ్ చేశాడు

  భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ను దురదృష్టం అదృష్టం పట్టినట్టు పట్టుకున్నట్టు ఉంది. మొన్నటి వరకూ డోపింగ్ కు పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చాడు. ఇప్పుడు ఏకంగా నాలుగేళ్లపాటు నిషేదం కూడా విధించింది. వివరాల ప్రకారం.. రియో ఒలింపిక్స్ లో భాగంగా నర్సింగ్ యాదవ్ కు డోపింగ్ పరీక్షలు నిర్వహించగా అతను డోపింగ్ కు పాల్పడలేదని క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే భారత డోపింగ్ సంస్థ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ క్రీడల అర్బిట్రేషన్ కోర్టులో సవాల్ చేసింది. ఇప్పుడు దీనిపై విచారణ జరిపిన కోర్టు.. నర్సింగ్ నిషేధిత మత్తు పదార్థాలు తీసుకున్నాడని నిర్ధారించింది. అంతేకాదు శిక్షగా నాలుగేళ్ల పాటూ నిషేధం కూడా విధించింది. దీంతో నర్సింగ్ రియో ఒలింపిక్స్ కు దూరమయ్యాడు. అలా జరగకుండా ఉంటే.. అతను ఈరోజు రియో ఒలింపిక్స్ లో తొలి మ్యాచ్ ఆడేవాడు.

సింధూకి అవమానం...ఆమె బంగారు పతకం సాధించలేదు

భారత బ్యాడ్మింటన్ పీవీ సింధూ ఎట్టకేలకు ఫైనల్స్ కు చేరి పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. నిన్న రాత్రి హోరా హోరీగా సాగిన మ్యాచ్లో జపాన్ క్రీడాకారిణిని చిత్తుగా ఓడించి ఫైనల్ కు చేరిన పీవీ సింధూ ఈ రోజు ఆఖరికి పోరుకు సన్నద్దమవుతోంది. అయితే ఈ మ్యాచ్లో సింధూ ఎలాగైనా సరే గెలిచి గోల్డ్ మెడల్ సాధించాలని ప్రతి ఒక్కరు ఆకాంక్షిస్తున్నారు. యావత్ భారతదేశం మొత్తం సింధూకు ఆల్ ద బెస్ట్ చెబుతూ.. ఫైనల్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రముఖ కాలమిస్ట్ శోభాడే మాత్రం సింధూను అవమానపరుస్తూ ఓ ట్వీట్ చేశారు. సింధూ బంగారు పతకం సాధించలేదు అంటూ... సిల్వర్ ప్రిన్సెస్ గా సింధూను అభివర్ణించింది. దీంతో ఇప్పుడు ఆమె చేసిన ట్వీట్స్ పై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క అందరూ సింధూ గోల్డ్ మెడల్ సాధించాలని కోరుకుంటుంటే.. శోభా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అంటూ మండిపడుతున్నారు.  

ఈ నిధులు ఏ మూలకి వస్తాయి... పెదవి విరిచిన చంద్రబాబు

  ఏపీకి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే. రూ. 1,976 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నిధులపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతగా సంతృప్తి చెందినట్టు కనిపించడం లేదు. అంతేకాదు ఏపీకి కేంద్రం ప్రకటించిన ఈ నిధులు ఏ మూలకు సరిపోతాయి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెనుకబడిన జిల్లాలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ అని చెప్పి... కేవలం రూ.350 కోట్లు విదిల్చితే ఎలాగంటూ ఆయన ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం కోసం పెద్ద ఎత్తున నిధులు అవసరం ఉండగా, రూ.450 కోట్లు విడుదల చేస్తే... ఆ నిధులు ఏ మూలకు సరిపోతాయంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.   కాగా ఏపీకి మొత్తం రూ.1,976 కోట్ల నిధులను కేంద్రం కేటాయించింది. అందులో ఆర్ధిక లోటు కింద 1,176 కోట్లు కేటాయించగా.. వెనుక బడిన జిల్లాలకు రూ. 350 కోట్లు.. రాజధాని నిర్మాణానికి రూ.450 కోట్లు కేటాయించింది.

సిద్దూ చేరికపై నోరు విప్పిన కేజ్రీవాల్...

  మాజీ క్రికెటర్‌ నవ్యజోత్ సింగ్ బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆప్ లోకి చేరడానికి సిద్దంగా ఉన్నారని..అందుకే రాజీనామా చేశారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పటి వరకూ వీటిపై సిద్ధూ.. కానీ కేజ్రీవాల్ కానీ నోరు విప్పలేదు. ఇప్పుడు తాజాగా ఈ వార్తలపై స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సిద్దూ కొన్ని రోజులుగా తమ పార్టీలో చేరుతున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ అంశంపై త‌న‌కు స్పందించాల్సిన బాధ్యత ఉంద‌ని అన్నారు. వారం రోజుల క్రితమే సిద్దూ తనను కలిశాడని.. పార్టీలో చేరే విష‌యంపై ఆలోచించుకోవడానికి సిద్ధూ త‌న‌ను కొంత వ్య‌వ‌ధి కావాలని అడిగారని తెలిపాడు. అటువంటి మంచి వ్యక్తి త‌మ‌ పార్టీలో చేరితే త‌మ‌కెంతో గర్వకారణమ‌ని కేజ్రీవాల్ చెప్పారు. మరి సిద్దూ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మళ్లీ మాట మార్చిన బీజేపీ.. రెండింటిలో ఒక్కటే..

  రాష్ట్రవిభజన జరిగి ఆర్ధిక లోటుతో ఏర్పడిన ఏపీకి.. రెండు ఏళ్లు గడుస్తున్నా ప్రత్యేక హోదా ఇంతవరకూ రాలేదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం..రావడం ప్రస్తుతానికి కలగానే మిగిలిపోయింది. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెప్పకనే చెబుతోంది. ఏదో ఏపీ ప్రజల ఆగ్రహానికి గురి కావడం ఇష్టం లేక.. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై ఆలోచిస్తామని.. చర్చలు జరుపుతున్నామని చెబుతూ తప్పించుకుంటున్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు కాని.. ప్రత్యేక ప్యాకేజీ మాత్రం భారీగానే ఇస్తాం అని చెబుతున్నారు. మరోవైపు తమ డిమాండ్ మేరకు కేంద్రంలోని బీజేపీ సర్కారు ఒప్పుకోని పక్షంలో ఆ పార్టీతో మైత్రి బంధాన్ని తెంచుకునేందుకు కూడా ఏపీలోని అధికార పార్టీ టీడీపీ దాదాపుగా సిద్ధంగా ఉంది కూడా.   అయితే ఇప్పుడు తాజాగా మరో వాదనను బీజేపీ తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకూ ప్రత్యేక హోదా గురించి ఆలోచిస్తాం అని చెప్పిన బీజేపీ ఇప్పుడు మాత్రం.. ఏపీకి ప్రత్యేక హోదా లేదంటే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. బీజేపీ ఏపీ వ్యవహారాలకు సంబంధించి ఢిల్లీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ సీనియర్ నేత స్వయంగా ఈ వ్యాఖ్యలు చేశారు. రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ఇస్తామంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చాంశనీయంగా మారాయి. అసలు బీజేపీ మనసులో ఎముందో అన్న విషయం ఈ వ్యాఖ్యల ద్వారా బయటపడిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై ఇంకెంత రచ్చ జరుగుతుందో చూడాలి.

ట్రంప్ కు నిరసనల వెల్లువ.. నగ్న చిత్రాలతో..

అమెరికా అధ్యక్షబరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ చేసే వివాదాస్పద వ్యాఖ్యలకు ఫలితంగాను ఇప్పుడు ఎక్కడ చూసినా ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు తలెత్తుతున్నాయి. మొదట్లో ఆయన చేసిన వ్యాఖ్యలను అంతలా పట్టించుకోకపోయినా.. రాను రాను నిరసనలు మొదలయ్యాయి. ఇప్పటికే అమెరికా యువత ట్రంప్ కు వ్యతిరేకంగా ఉన్నట్టు ఓ సర్వే ప్రకారం తెలిసింది. ఇప్పుడు తాజాగా మరో నిరసన చెపట్టారు. అది కూడా ట్రంప్ నగ్న విగ్రహం పెట్టి. మన్ హట్టన్ ప్రాంతంలోని యూనియన్ స్క్వేర్ వద్ద ‘ఇండిక్లెయిన్’ పేరిట జట్టు కట్టిన ఆర్టిస్టులు.. ట్రంప్ శరీర వర్ణంతోనే నగ్న విగ్రహం తయారుచేసి అక్కడ ఏర్పాటు చేశారు. ఇక సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి వెళ్లి ఆపాలనుకున్నా.. అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. అందరూ తమ ఫోన్లలో.. కెమెరాల్లో బంధించేశారు. అంతేకాదు ట్రంప్ వైఖరికి నిరసన తెలపడానికే ఇలా చేశామని.. ఇంకా ఇలాంటి తరహా నిరసనలు తెలుపుతామని ‘ఇండిక్లెయిన్’ సభ్యులు చెబుతున్నారు. మరి ట్రంప్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.

రియోలో మెరిసిన తెలుగు తేజం..

ఒలింపిక్స్‌లో భారత్‌కు ఒక్క మెడల్ అయినా దక్కుతుందా..? లేదా అని సగటు భారతీయుడు నిరాశలో మునిగిన క్షణాన సాక్షి మాలిక్ కాంస్య పతకం సాధించి భారత్ పరువు నిలిపింది. సరిగ్గా అదే రోజు మరో పతకం ఇండియాకి కన్ఫార్మ్ అయ్యింది. బ్యాడ్మింటన్‌లో తెలుగుతేజం పీవీ సింధు సంచలనం సృష్టించింది. బ్యాడ్మింటన్ విమెన్స్ సింగిల్స్‌ సెమీఫైనల్‌లో జపాన్ క్రీడాకారిణి, ప్రపంచ ఆరో ర్యాంకర్ నొజొమి ఒకుహరను  21-19, 21-10 తేడాతో మట్టికరిపించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. తద్వారా ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారత క్రీడాకారిణిగా అవతరించింది. ఫైనల్లో సింధు..కరోలినా మారిన్‌తో తలపడనుంది.

శవాల మీద పడి ఏడ్చినట్టు ఏడుస్తున్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు బీజేపీ పై దుమ్మెత్తిపోశారు. ఇప్పటికే ప్రత్యేక హోదాపై నానా రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లు ఎన్నో అడ్డంకులు ఎదురైన చర్చకు నోచుకున్న ఓటింగుకు మాత్రం నోచుకోలేదు. మరి శీతాకాల సమావేశాల్లో ఏం జరుగుతుందో చెప్పలేం. అయితే ఇప్పుడు మాత్రం కేవీపీ బీజేపీపై మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో పెట్టలేదంటూ కాంగ్రెస్ పై నింద మోపాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ, శవాలపై పడి ఏడ్చినట్లుగా తమ పార్టీపై పడి ఏడుస్తోందని ప్రత్యేక హోదా విషయమై ఏపీ ప్రజలను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తప్పుదోవ పట్టిస్తున్నారని.. ప్రత్యేక హోదా అంశాన్ని తమ మేనిఫెస్టోలో చేర్చిన బీజేపీని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు నిలదీయడం లేదని కేవీపీ ప్రశ్నించారు.

స్మృతీ ఇరానీ నయా వివాదం..

  అలా శాఖ మారిందో లేదో అప్పుడే స్మృతీ ఇరానీ అప్పుడే కొత్త వివాదానికి హాయ్ చెప్పారు. ఇటీవలే క్యాబినెట్ మార్పుల్లో స్మతీ ఇరానీ శాఖ మారిన సంగతి తెలిసిందే. చేనేత శాఖ మంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. ఆమె బాధ్యతులు చేపట్టి రెండు నెలలు కూడా కాకముందో మరో వివాదం ఏర్పడింది. అది కూడా సీనియర్ అధికారి.. ఆ శాఖ కార్యదర్శి రష్మీ వర్మతో. కేబినెట్ ఆమోదించిన 6వేల కోట్ల రూపాయల దుస్తులు, వస్త్రాలు ప్యాకేజీ, అక్టోబర్లో జరుగబోయే టెక్స్టైల్ సదస్సు విషయాలకు సంబంధించి స్మృతీ రష్మీతో విభేధించినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఇతర అధికారుల సమక్షంలోనే కార్యదర్శితో తీవ్ర వాగ్వాదానికి దిగినట్టు సమాచారం. ఇక విషయం తెలుసుకున్న పార్టీ పెద్దలు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారట.   మరోవైపు దీనిపై స్పందించిన రష్మీ వర్మ మాత్రం.. స్మృతి ఇరానీతో వివాదాన్ని ఖండించారు.  దీనిపై కామెంట్ చేయదలుచుకోలేదని,  ఇవి మామూలు కమ్యూనికేషన్స్ మాత్రమేనని దాటవేశారు. మొత్తానికి శాఖ ఏదైనా కానీ.. స్మృతీ వివాదాలు మాత్రం కామన్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

కరువు గ్రామాన్ని దత్తత తీసుకున్న సచిన్..

శ్రీమంతుడు సినిమాలో మహేశ్ బాబు ఊరిని దత్తత తీసుకొని వారి ప్రాబ్లమ్స్ తీరుస్తాడు. ఆ సినిమా సంగతేమో కాని.. ఆ సినిమా కాన్సెప్ట్ మాత్రం బాగానే వర్కవుట్ అయింది. అందుకే సినిమా ఇన్ఫిరేషన్ తో మహేశ్ బాబే ఊరిని దత్తత తీసుకున్నాడు. మహేశ్ బాబే కాదు ఇంకా కొంతమంది ఊర్లని దత్తత తీసుకున్నారు. ఇప్పుడు వారి జాబితాలో లెజెండరీ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ కూడా చేరిపోయాడు. గతంలో గతంలో  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా  ఓజిలి మండలంలోని పుట్టంరాజువారి కండ్రిగను దత్తత తీసుకున్న సచిన్ ఈసారి మరో గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన పథకంలో భాగంగా ఆయన మహారాష్ట్ర  ఉస్మానాబాద్ జిల్లాలోని దోంజా గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. కాగా ఈ పథకంలో భాగంగా ప్రతీ పార్లమెంట్ సభ్యుడు రెండు గ్రామాలను దత్తత తీసుకోవాల్సి ఉంది.

మళ్లీ ఆస్పత్రికి సోనియాగాంధీ..

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కొన్ని రోజుల క్రితం భుజానికి ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మూడు రోజుల క్రితం డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఆమె మళ్లీ ఆస్పత్రిలో చేరినట్టు తెలుస్తోంది. అయితే ఎలాంటి విషయం లేదని.. డిశ్చార్జ్‌ అయ్యే సమయానికి చాలా నీరసంగా ఉన్నారని.. ఆరోగ్య పరిస్థితిపై సమీక్షించడం కోసం మళ్లీ ఆస్పత్రికి రావాల్సి వస్తుందని.. అందులో భాగంగానే ఆమె ఆస్పత్రిలో చేరారని వైద్యులు చెప్పారు. మరో రెండు రోజులు ఆస్పత్రిలోనే ఉండే అవకాశం ఉన్నట్లు చెప్పారు. కాగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి రోడ్‌షోలో అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. భుజానికి గాయమవ్వడంతో శస్త్రచికిత్స జరిగింది.

ఏపీకి కేంద్ర ప్రభుత్వ నిధులు.. ఎవరిని ప్రసన్నం చేసుకోవడానికి..!

  రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికి రెండు సంవత్సరాలు దాటి పోయింది. ఇక విడిపోయిన రెండు రాష్ట్రాల్లో తెలంగాణ మిగులు బడ్డెట్ తో ఉండగా  ఏపీకి మాత్రం ఆర్ధికలోటు మిగిలింది. అప్పటి నుండి ఏపీ ప్రభుత్వం కేంద్రానికి నిధులు కేటాయించమని అడుగుతూనే ఉంది. అయితే మొదట్లో కొంత మొత్తంలో నిధులు కేటాయించింది. కానీ అవి కూడా నామమాత్రంగానే కేటాయించింది. కానీ ఈమధ్య ప్రత్యేక హోదా గురించి సభలో పెద్ద రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వ చెప్పకనే చెబుతోంది. ప్రత్యేక ప్యాకేజీ అయితే ఎంత కావాలంటే అంత ఇస్తాం కానీ.. హోదా మాత్రం ఇచ్చేది లేదని చెబుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వ తీరుపై ఏపీ రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అంతేకాదు పార్టీలన్నీ రాజకీయాలకు అతీతంగా ఒకే తాటిపైకి వచ్చి ప్రత్యేకహోదాపై ఆందోళన చేపట్టారు.   అందుకే ప్రస్తుత తరుణంలో ఏ మాత్రం తప్పటడుగు వేసినా పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని గమనించిన కేంద్రం... ఏపీ సర్కారును ప్రసన్నం చేసుకునేందుకు తనదైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఏపీకి వివిధ పద్దుల కింద నిధులను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది.  ఆంధ్రరాష్ట్రానికి ఆర్ధిక సాయం ప్రకటించింది. మొత్తం 1976 కోట్లలో..ఏపీకి ఉన్న ఆర్దిక లోటు కింద రూ 1,176 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. వెనుక బడిన జిల్లాల అభివృద్ధికి రూ. 350 కోట్ల.. రాజధాని నిర్మాణానికి రూ.450 కోట్లు విడుదల చేసింది. మరి కేంద్రం వేసిన ప్లాన్ వర్కవుట్ అవుద్దా.. దీంతో ప్రత్యేక హోదా గురించి అందరూ మరిచిపోతారా... లేకా హోదాపై ఇంకా డిమాండ్ చేస్తారా..? చూద్దాం.

ఏపీ స్పెషల్ ప్యాకేజ్‌పై కవిత హర్షం

ఆంధ్రా అంటే చాలు ఒంటికాలుపై లేచే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె , నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తొలిసారి ఏపీకి మద్ధతుగా మాట్లాడారు. ఇవాళ కృష్ణాజిల్లా నందిగామ సమీపంలోని అనాసాగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌‌కు స్పెషల్ ప్యాకేజ్ భాగంలో రూ.1,976 కోట్లు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఏపీకీ ప్రత్యేకహోదా అనేది పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీ అని అన్నారు..దానిని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందన్నారు. హోదా సాంకేతికంగా సాధ్యం కాకపోతే రాజకీయంగానైనా నిర్ణయం తీసుకోవచ్చని సూచించారు. ఈ అంశంలో తాము ఆంధ్రప్రదేశ్‌కు మద్ధతుగా ఉంటామని స్పష్టం చేశారు.

60మంది తీవ్రవాదులు దేశంలోకి చొరబాటు..

కాశ్మీర్లోని లోయలో గత కొద్దిరోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఉగ్రవాది బుర్హన్ వనీని ఎన్‌కౌంటర్‌ చేసినందుకు గాను కాశ్మీర్లో అల్లర్లు చెలరేగాయి. దీంతో నెల రోజుల నుండి అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేసి..కర్ఫ్యూ కూడా విధించారు. అయితే తాజాగా ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా ప్రకారం.. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి నెలరోజుల్లోనే 60మంది తీవ్రవాదులు దేశంలోకి చొరబడ్డారని తెలుస్తోంది. దక్షిణ, ఉత్తర కాశ్మీర్ లోని కుప్వార, ఉరి సెక్టార్ల గుండా తీవ్రవాదులు దేశంలోకి వచ్చారని వారు నిర్ధారించుకున్నారు. దీంతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేసినా తీవ్రవాదుల చొరబాట్లు పెరుగుతుండటంతో సమస్యాత్మక ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో కూడా కర్ప్యూ విధించారు.   కాగా నిన్న భద్రతా దళాలపై దాడి చేసిన ఉగ్రవాదులు ముగ్గురు జవాన్లను చంపారు. అంతేకాదు ఈ దాడి చేసింది తామే అని హిజ్బుల్ ముజాయిదీన్ తీవ్రవాదులు ప్రకటించారు.

బీజేపీ నేత దారణ హత్య.. దుండగుల కాల్పులు

  బీజేపీ నేత దారణ హత్యకు గురైన ఘటన బీహీర్లో వెలుగు చూసింది. బీహార్ రాజధాని పాట్నాలో బీజేపీ నేత అశోక్‌ జైశ్వాల్‌ను దుండగలు కాల్చి చంపారు. వివరాల ప్రకారం.. పట్నా శివారు ధనాపూర్‌ ప్రాంతంలో కొంతమంది దుండగలు అశోక్ జైశ్వాల్ పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన శరీరంలోకి నాలుగు బుల్లెట్లు దూసుకుపోయాయి. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూనే ఆయన చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.   మరోవైపు జైశ్వాల్‌ హత్యతో భాజపా వర్గాలు ఆందోళన చేపట్టాయి. రద్దీ ఉన్న చోట హత్య జరగడం.. రాష్ట్రంలో నేరగాళ్లు ఎలాంటి భయం లేకుండా అకృత్యాలకు పాల్పడుతున్నారనడానికి జైశ్వాల్‌ హత్యే నిదర్శనమని పార్టీ వర్గాలు తీవ్ర విమర్శలు చేశాయి. పలువురు భాజపా ఎమ్మెల్యేలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. అంతేకాదు స్థానికంగా నేడు బంద్‌కు పిలుపునిచ్చారు.