కరుణానిధికి జయలలిత సవాల్...దమ్ముంటే మాట్లాడాలి..

  తమిళనాడు రాజకీయాల్లో చాలా వేడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే అసెంబ్లీ నుండి డీఎంకే నేతలను సస్సెండ్ చేయడంతో ఆందోళనలు, ధర్నాలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఓ సవాల్ విసిరారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన నేతలంతా అసెంబ్లీ నుండి సస్పెండ్ అయితే తాను ఒక్కతినే అసెంబ్లీకి వచ్చి సమావేశాల్లో పాల్గొన్నానని.. ఒక్కదానే మాట్లాడానని.. అలాంటిది.. ఇప్పుడు డీఎంకే పార్టీ నుండి కొంత మంది సస్పెండ్ వేటు నుండి తప్పించుకున్నారు.. అందులో కరుణానిధి కూడా ఉన్నారు.. అలాంటప్పుడు కీలక అంశాలు చర్చకు వచ్చినప్పుడు కరుణానిధి అసెంబ్లీకి రాకపోతే ఎలాగంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని కరుణానిధికి సవాల్ విసిరారు.   కాగా అసెంబ్లీ సమావేశాల్లో డీఎంకే సభ్యులు అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలితపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన 79 మంది డిఎంకే ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేయించారు జయలలిత.

సింధూకి ఏపీ ప్రభుత్వం ఘన స్వాగతం..

  రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన పి.వి సింధూకి ఏపీ ప్రభుత్వం ఘనంగా సన్మానించనుంది. కొద్ది సేపటి క్రితమే ఆమె, ఆమె కోచ్ పుల్లెల గోపిచంద్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. మంత్రులు దేవినేని ఉమ, ఎంపీ మాగంటి బాబు, కొల్లు రవీంద్ర, బొండా ఉమా, వల్లభనేని వంశీ, బుద్దా వెంకన్నలు ఘన స్వాగతం పలికారు. మరోవైపు సింధూకు అభినందనలు తెలుపడానికి వేలాది మంది ఆమె అభిమానులు, ప‌లు స్కూళ్ల‌ విద్యార్థులు అక్కడికి చేరుకున్నారు. అక్కడి నుండి పి.వి సింధూ, పుల్లెల గోపిచంద్ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. గన్నవరం విమానాశ్రయం నుండి.. ఇందిరాగాంధీ స్టేడియం వరకూ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆ తరువాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరిని సన్మానించనున్నారు. సన్మాన కార్యక్రమం అనంతరం సింధూ, గోపిచంద్ దుర్గాఘాట్ లో పుష్కరస్నానమాచరించి..అనంతరం అమ్మవారిని దర్శించనున్నారు.

ఢిల్లీ ఏపీ బీజేపీ నేతలు.. సర్వత్రా ఆసక్తి..

  బీజేపీ అధిష్టానం ఆదేశం మేరకు ఏపీ బీజేపీ నేతలు, తెలంగాణ బీజేపీ నేతలు నిన్ననే ఢిల్లీకి తరలివెళ్లారు. ఈరోజు జరగనున్న కోర్ కమిటీలో ఎట్టి పరిస్థితిలో హాజరుకావాల్సిందే అని అధిష్టానం చెప్పడంతో ఇరు రాష్ట్రాల నేతలు ఢిల్లీకి వెళ్లారు. అయితే ఈ సమావేశంలో ఏపీ ప్రత్యేక హోదా గురించి కూడా చర్చిస్తారన్న వాదన వినిపిస్తుంది. అంతేకాదు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించేలా జాతీయ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏపీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు తెలంగాణలో మరింత బలహీనంగా మారిన పార్టీకి పునరుజ్జీవం కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఆ రాష్ట్రానికి చెందిన నేతలు పార్టీ జాతీయ నాయకత్వం నుంచి దిశానిర్దేశం కోరుతున్నారు.

మాయవతికి షాక్.. పార్టీ నుండి ఇద్దరు జంప్

  బీస్పీ అధినేత్రి, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మాయవతికి భారీ షాక్ ఎదురైంది. ఆపార్టీ నుండి ఇద్దరు నేతలు బీజేపీలో చేరారు. బీఎస్పీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు బ్రజేష్ పాఠక్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. మరో ముఖ్యనేత, సీనియర్ ఎమ్మెల్యే స్వామిప్రసాద్ మౌర్య ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన కూడా బీజేపీలో చేరిపోయారు. అమిత్ షా బీజేపీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.   కాగా వచ్చే ఏడాది యూపీ ఎన్నికలు జరగునున్న సంగతి తెలిసిందే. దీంతో పార్టీ ఫిరాయింపులు చాలా జోరుగా సాగుతున్నాయి. ఇటీవలే ఇతర పార్టీలకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఇటీవల బీఎస్పీలో చేరారు. ఇప్పుడు ఆపార్టీ నుండే నేతలు పక్క పార్టీ దారి పట్టారు. మరి ఎన్నికలు వచ్చే సరికి ఎవరు ఏపార్టీ గూటికి చేరుతారో చూద్దాం..

నాలా ఎవరూ చావొద్దు.. మోడీకి హ్యాండ్ బాల్ ప్లేయర్ లేఖ

  హాస్టల్ ఫీజ్ కట్టలేకపోతున్నానని.. నాలాంటి పరిస్థితి ఎవరికి రాకుండా చూడాలిని ఓ విద్యార్ధి ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. వివరాల ప్రకారం.. పాటియాలలోని ఓ జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ ప్లేయర్ పూజా అనే అమ్మాయి ఖాల్సా కాలేజీలో చదువుతోంది. అయితే తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె మోడీకి ఓ లేఖ కూడా రాసింది. తాను ఉంటున్న హాస్టల్ ఖర్చు భరించలేకపోతున్నానని.. తనలాంటి పేద విద్యార్థినులకు ఉచిత విద్య అందించాలని.. తనలాంటి పరిస్థితి మరెవరికి రాకుండా చూడాలని లేఖలో పేర్కొంది. అంతేకాదు తన చావుకు తనను హాస్టల్ ఉండొద్దని హెచ్చరించిన ఓ ప్రొఫెసర్ కూడా కారణం అని కూడా ఆమె లేఖలో పేర్కొంది. కాగా పూజా కుటుంబం పేదరికంతో బాధపడుతున్న కుటుంబం. తండ్రి తోపుడు బండిపై కూరగాయలు అమ్ముతుంటాడు.

ఫ్రంట్ ఫ్లాష్ తో సరికొత్త మోడల్..

  ఇప్పటి వరకూ బ్యాక్ కెమరాకి మాత్రమే ప్లాష్ ఉండటం చూశాం. అయితే ఇప్పుడు సరికొత్తగా ఫ్రంట్ కెమెరాకి కూడా ఫ్లాష్ సదుపాయం కల్పిస్తూ ప్రముఖ మొబైల్‌ ఉత్పత్తుల సంస్థ జియోనీ ఓ కొత్త మోడల్ ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. జియోనీ ఎస్‌6ఎస్‌ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ప్రస్తుతాని ఆన్ లైన్లో మాత్రమే విక్రయాలు జరనున్నాయని.. ప్రముఖ ఆన్ లైన్ సంస్థ అమెజాన్ లో  ఈ ఫోన్‌ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని.. ఆఫ్ లైన్ అమ్మకాలు కూడా త్వరలోనే జరుగుతాయని అధికారులు తెలిపారు. దీని ధర రూ. 17,999. జియోనీ ఎస్‌6ఎస్‌ ఫీచర్లు * 5.5 అంగుళాల డిస్‌ప్లే * ఆండ్రాయిడ్‌ 6.0 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ * 1.3 గిగాహెడ్జ్‌ ప్రాసెసర్‌ * 3జీబీ రామ్ * ఫ్రంట్‌ ఫ్లాష్‌తో 8 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా * డ్యుయల్‌ సిమ్‌ సదుపాయం * 4జీ సపోర్టింగ్‌ * 32జీబీ ఇంటర్నల్‌ మెమొరీ * 16 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా

బ్రిడ్జ్ పై నుండి కాలువలోకి బస్సు.. 10మంది మృతి

  ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెం బ్రిడ్జ్ వద్ద  బస్సు అదుపుతప్పి ఎన్ఎస్పీ కాలువలో పడిపోయింది. దాదాపు 30 అడుగుల ఎత్తు నుండి పడిన ఈ బస్సులో 30 మందికి పైన ప్రయాణికులు ఉన్నారు. ఈప్రమాదంలో 10మంది దుర్మరణం చెందగా, మరో 17మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలుపుతున్నారు. ప్రస్తుతం డ్రైవర్ పరారీలో ఉన్నాడు.   కాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జరిగిన ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికీ రూ.3 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఇంకా ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశించారు.

టాలీవుడ్ తో నయీంకు లింకులు.. పలువురు బడా నిర్మాతలు

  నయీమ్ ఎన్ కౌంటర్ అనంతరం రోజుకో ఆసక్తికరమైన అంశం బయటపడతూనే ఉంది. ఇప్పటికే నయీం సహరించిన వారిలో పోలీస్ అధికారులు, పలువురు రాజకీయ నేతలు, ఇంకా అనేక మంది పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో ఎప్పుడు ఏ నేత పేరు బయటపడుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో మరో బాంబు పేలింది. అదేంటంటే.. నయీంకు టాలీవుడ్ తో లింకులు ఉన్నట్టు. దీనిపై ప్రముఖ సినీ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలకు నయీమ్ తో సంబంధాలున్నాయని ఆరోపించారు.  సి.కల్యాణ్, అశోక్ కుమార్, బండ్ల గణేశ్, సచిన్ జోషిలకు నయీమ్ తో సంబంధాలున్నాయని ఆయన ఆరోపించారు. విజయవాడ నుండి విశాఖ వరకూ థియేటర్లలో క్యాంటీన్ వ్యాపారం నయీం మనుషులదేనని.. తన థియేటర్ ను కూడా నయీమ్ అనుచరులు లాగేసుకున్నారని.. నయీంను అడ్డంపెట్టుకొని భూదందాలు, సెటిల్మెంట్లు చేసేవారని.. నయీంతో టాలీవుడ్ లింకులపై విచారణ జరిపించాలని కోరారు. అంతేకాదు నయీం మనుషులు నన్ను కిడ్నాప్ చేయాలని చూశారు.. కానీ ఓ ఎమ్మెల్యే సహకారంతో బయటపడ్డాను అని తెలిపారు. మరి దీనిపై ఎంత దుమారం రేగుతుందో చూడాలి.

సింధూకి ఘన సన్మానం.. తనవల్లే ఇక్కడ ఉన్నా..

  రియో స్టార్ పీవీ సింధూకి గచ్చిబౌలి స్టేడియంలో ఘన సన్మానం చేశారు. రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించి దేశానికి పేరు ప్రతిష్టతలు తెచ్చిపెట్టిన సింధూ హైదరాబాద్ చేరుకుంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రాష్ట్ర మంత్రులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అక్కడినుండి గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియానికి చేరుకున్న ఆమెకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, మహేందర్‌రెడ్డి ఘ‌నంగా స‌న్మానించారు. ఆమెతో పాటు ఆమె కోచ్ పుల్లెల గోపిచంద్ ని కూడా సన్మానించారు.  వారిరువురికీ జ్ఞాపిక‌ల‌ను అందించారు.   ఈ సందర్భంగా సింధూ మాట్లాడుతూ.. తన కోచ్ పుల్లెల గోపిచంద్ వల్లే ఈరోజు తానిక్క‌డ ఉన్న‌ానని.. త‌న‌ను త‌న త‌ల్లిదండ్రులు కూడా ఎంత‌గానో ప్రోత్స‌హించారని తెలిపింది. తెలంగాణ ప్ర‌భుత్వానికి సింధు ధ‌న్య‌వాదాలు తెలుపుతూ.. క్రీడలను ప్రోత్సహిస్తున్నందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కి ధ‌న్యవాదాలు అని ఆమె అన్నారు. ఈరోజు స్టేడియంకి ఇంత‌మంది వ‌స్తార‌ని తాను అనుకోలేద‌ని.. బ్యాడ్మింటన్‌లో రాణించి, మ‌రింత ముందుకు వెళ‌తానని చెప్పారు.

తుది అంకానికి చేరుకున్న పుష్కర స్నానాలు..

  తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన కృష్ణ పుష్కరాలు రేపటితో ముగియనున్నాయి. ఈ రోజు పదకొండో రోజు అయినా కూడా భక్తులు ఇంకా పుష్కరస్నానమాచరించడానికి వస్తూనే ఉన్నారు. కృష్ణానదిలో భక్తులు పుణ్యస్నానమాచరించి నదీతీరంలోని ఆయాలను దర్శించుంటున్నారు. విజయవాడలోని పద్మావతిఘాట్‌, కృష్ణవేణిఘాట్‌, దుర్గాఘాట్‌, సీతానగరంఘాట్‌, పున్నమిఘాట్‌లకు భక్తులు భారీగా తరలివచ్చి పుష్కరస్నానమాచరించారు. పవిత్రసంగమం, వేదాద్రి ఘాట్‌లకు కూడా భక్తులకు భారీగా తరలివచ్చారు. అంతేకాదు తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాలోని పుష్కరఘాట్లకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. బీచుపల్లి, గొందిమళ్ల, సోమశిల ఘాట్‌లతో పాటు నల్గొండ జిల్లాలోని వాడపల్లి, నాగార్జునసాగర్‌ ఘాట్లు భక్తులతో రద్దీగా మారాయి.    

నర్సింగ్ యాదవ్ కావాలనే డ్రగ్స్ తీసుకున్నాడు...

  ఇప్పటికే భారత రెజ్లర్‌ నర్సింగ్‌ యాదవ్‌ డోపింగ్ టెస్ట్ లో నిషేదిత పదార్దాలు తీసుకున్నట్టు వెల్లడైంది. నర్సింగ్ యాదవ్ నిషేదిత పదార్ధాలు తీసుకోలేదని భారత డ్రగ్స్ నిరోధక సంస్థ వెల్లడించినా.. ఆ తీర్పును సవాల్ చేస్తూ ప్రపంచ డ్రగ్స్ నిరోధక సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఇక దీనిపై విచారించిన కోర్టు నర్సింగ్ యాదవ్ డ్రగ్స్ తీసుకున్నాడని తేలుస్తూ.. అతనిపై నాలుగేళ్లపాటు నిషేదం విధించింది. అయితే ఇప్పుడు ఈ విషయంలో మరో కొత్త విషయం బయటపడింది. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న నర్సింగ్ యాదవ్ ఇప్పటివరకూ తనను కావాలనే ఈ కుట్రలో ఇరికించారని అంటున్నా.. అది నిజం కాదని అంటున్నారు కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్ (సీఏఎస్‌) అధికారులు. నర్సింగ్‌ కావాలనే నిషేధిత పదార్థాలు తీసుకున్నాడని.. ఒకటి కంటే ఎక్కువ సార్లు వాటిని ట్యాబ్లెట్ల రూపంతో తీసుకున్నాడని.. సాక్ష్యాలు సమర్పించడంలో నర్సింగ్ యాదవ్ విఫలమయ్యాడని సీఏఎస్‌ నివేదికలో పేర్కొంది.

సింధూ సిల్వర్ పతకంపై వర్మ కామెంట్స్... మనిషిగా కూడా చూడరు

  ఆఖరికి రాంగోపాల్ వర్మ ఒలింపిక్స్ ను కూడా వదల్లేదు. రియో ఒలింపిక్స్ లో ఇండియా గెలిచిన పతకాలపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. రియో ఒలింపిక్స్ లో పీవీ సింధూ రజత పతకం సాధించిన వేళ అందరూ తనపై ప్రశంసల జల్లు కురిపిస్తుంటే.. రాంగోపాల్ వర్మ మాత్రం.. "ఒక్క సిల్వర్ పతకానికే మనల్ని మనం ఇన్ క్రెడిబుల్ ఇండియా అని పిలుచుకుంటే.. ఇక 46 బంగారు, 37 వెండి, 49 కాంస్య పతకాలు సాధించిన అమెరికాను ఏమని పిలవాలి? జస్ట్ అడుగుతున్నా" అని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.     ఇక వర్మ చేసిన ట్వీట్ కు అభిమానులు సైలెంట్ గా ఉంటారా.. వారు కూడా చాలా ఘాటుగానే వర్మకు ఆన్సర్స ఇచ్చారు. అవెంటో ఓ లుక్కేద్దాం..   * "ఇండియాలో ప్రజలు మిమ్మల్ని ఓ దర్శకుడిగా భావిస్తున్నారు. అదే మీరు అమెరికా వెళితే, ఓ మనిషిగా కూడా చూడరు. అంతే తేడా" అని  అభిమాని అన్నాడు.   * అడుగడుగునా నీ లాంటి వ్యంగ్యాస్త్రాలు వేసే వారుండబట్టే ఇండియా తక్కువ పతకాలతో ఆగిపోయిందని ఒకరు, ఇక్కడి వసతులతో అమెరికా గెలిచిన పతకాలకన్నా, ఈ రెండు పతకాలే గొప్పవని మరొకరు అన్నారు.   * మన పొరుగు దేశాలకు పతకాలే లేని వేళ, ఉత్త చేతులతో తిరిగిరాని ఇండియాను ఎందుకు అంటున్నారని ఇంకొకరు మండిపడ్డారు.

తెలంగాణ కొత్త జిల్లాల నోటిఫికేషన్.. ఫిర్యాదుల స్వీకరణ

తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏప్పటినుండో కసరత్తు జరుగుతున్న విషయం తెలిసిందే. ఉన్న పది జిల్లాలతో పాటు మరో 17 కొత్త జిల్లాల ఏర్పాటు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. దీనిలో భాగంగానే  కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ తన నివేదికను సీఎం కేసీఆర్ కు సమర్పించగా, ఇప్పటికే దానిపై అఖిలపక్ష భేటీ కూడా పూర్తి అయ్యింది. అయితే ఇప్పుడు ఈ 17 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ ను తెలంగాణ ప్రభుత్వం నేడు జారీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ కొత్త జిల్లాలకు సంబంధిచిన అభ్యంతరాలు కనుక ఏమైనా ఉంటే వాటిని ప్రభుత్వం స్వీకరించనుంది. ఈ ప్రక్రియ దాదాపు నెలరోజులపాటు జరగనుంది. ఈ నెల రోజులపాటు ఫిర్యాదులను స్వీకరించి.. ఆతరువాత వాటిని పరిశీలించి ఆఖరికి కొత్త జిల్లాలకు తుది రూపు ఇస్తారు.

సింధూకి మంత్రుల ఘనస్వాగతం.. కాసేపట్లో సన్మానం

  రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన పీవీ సింధూ నేడు హైదరాబాద్ చేరుకుంది. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న సింధూకు ఇరు రాష్ట్రాల మంత్రులు ఘన స్వాగతం పలికారు. సింధూతో పాటు కోచ్ గోపిచంద్ కు మంత్రులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అంతేకాదు సింధూకు స్వాగతం పలకడానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎయిర్ పోర్టు నుండి గచ్చిబౌలి జీఎంసీ స్టేడియం వరకూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రోడ్డుకు ఇరుప్రక్కల జాతీయ జెండాలతో విద్యార్దులు, అభిమానులు సింధూకు స్వాగతం పలుకుతున్నారు. కాసేపట్లో గచ్చిబౌలి స్టేడియంలో సింధూకు సన్మానం చేయనున్నారు.

ఆపరేషన్ 'థండర్ 14'.. 43 మంది ఉగ్రవాదులు హతం

ఉగ్రవాదులు దాడులు చేయడం ఆ దాడుల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఆఫ్గనిస్తాన్ భద్రతా బలగాలు 'థండర్ 14' పేరుతో ఓ జాయింట్ ఆపరేషన్ నిర్విహించింది. ఈ జాయింట్ ఆపరేషన్‌లో 43 మంది తాలిబాన్ ఉగ్రవాదులు హతమయ్యారు. వివరాల ప్రకారం.. ఈరోజు ఉదయం తాలిబాన్ ఉగ్రవాదులు ఖాన్ అబాద్ జిల్లాను తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. అయితే ముందుగానే భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకొని 43 మంది ఉగ్రవాదులను హతమార్చారు.  మరో 15 మంది ఉగ్రవాదులు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. అంతేకాదు ఈ ఆపరేషన్‌లో తాలిబాన్ డిస్ట్రిక్ట్ గవర్నర్ హుస్సేన్ సైతం మృతి చెందినట్లు వెల్లడించింది.

ఆ బావిలో నీళ్లకు బదులు పెట్రోల్..

  సాధారణంగా బావిలో నీళ్లు ఉంటాయి. కానీ ఆ బావిలో మాత్రం నీళ్లకు బదులు.. పెట్రోల్ లభిస్తుంది. ఇంకేముంది ఇది ఆ నోటా ఈ నోటా పాకడంతో అందరూ బావి మీద పడ్డారు. ఇంతకీ ఆ బావి ఎక్కడ ఉందనేగా డౌట్.. అసలుసంగతేంటంటే.. బిహార్‌లోని గయా నగరంలో ఓ పురాతన బావి ఉంది. ఆ బావిలో నీళ్లు ఉంటాయని భావించి బొక్కెన వేసి తోడారు స్థానికులు. కానీ ఆ బావిలో నీళ్లకు బదులు పెట్రోల్‌ లాంటి చమురు లభించింది. ఇంకేముంది స్థానికులు పెద్ద సంఖ్యలో బకెట్లు, బిందెలు వేసుకొని బావి చుట్టూ మూగారు. ఇక ఈ సమాచారం బీహార్ ప్రభుత్వానికి కూడా చేరడంతో అధికారులు అక్కడికి చేరుకొని బావిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్‌ఐ చంద్రశేఖర్ సింగ్‌ మాట్లాడుతూ ఈ బావిని పరిశీలించడానికి త్వరలోనే ఓ నిపుణుల బృందం రానుందని చెప్పారు.