మళ్లీ మాట మార్చిన బీజేపీ.. రెండింటిలో ఒక్కటే..
posted on Aug 19, 2016 @ 11:58AM
రాష్ట్రవిభజన జరిగి ఆర్ధిక లోటుతో ఏర్పడిన ఏపీకి.. రెండు ఏళ్లు గడుస్తున్నా ప్రత్యేక హోదా ఇంతవరకూ రాలేదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం..రావడం ప్రస్తుతానికి కలగానే మిగిలిపోయింది. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెప్పకనే చెబుతోంది. ఏదో ఏపీ ప్రజల ఆగ్రహానికి గురి కావడం ఇష్టం లేక.. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై ఆలోచిస్తామని.. చర్చలు జరుపుతున్నామని చెబుతూ తప్పించుకుంటున్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు కాని.. ప్రత్యేక ప్యాకేజీ మాత్రం భారీగానే ఇస్తాం అని చెబుతున్నారు. మరోవైపు తమ డిమాండ్ మేరకు కేంద్రంలోని బీజేపీ సర్కారు ఒప్పుకోని పక్షంలో ఆ పార్టీతో మైత్రి బంధాన్ని తెంచుకునేందుకు కూడా ఏపీలోని అధికార పార్టీ టీడీపీ దాదాపుగా సిద్ధంగా ఉంది కూడా.
అయితే ఇప్పుడు తాజాగా మరో వాదనను బీజేపీ తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకూ ప్రత్యేక హోదా గురించి ఆలోచిస్తాం అని చెప్పిన బీజేపీ ఇప్పుడు మాత్రం.. ఏపీకి ప్రత్యేక హోదా లేదంటే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. బీజేపీ ఏపీ వ్యవహారాలకు సంబంధించి ఢిల్లీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ సీనియర్ నేత స్వయంగా ఈ వ్యాఖ్యలు చేశారు. రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ఇస్తామంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చాంశనీయంగా మారాయి. అసలు బీజేపీ మనసులో ఎముందో అన్న విషయం ఈ వ్యాఖ్యల ద్వారా బయటపడిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై ఇంకెంత రచ్చ జరుగుతుందో చూడాలి.