ఈ నిధులు ఏ మూలకి వస్తాయి... పెదవి విరిచిన చంద్రబాబు
posted on Aug 19, 2016 @ 2:28PM
ఏపీకి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే. రూ. 1,976 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నిధులపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతగా సంతృప్తి చెందినట్టు కనిపించడం లేదు. అంతేకాదు ఏపీకి కేంద్రం ప్రకటించిన ఈ నిధులు ఏ మూలకు సరిపోతాయి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెనుకబడిన జిల్లాలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ అని చెప్పి... కేవలం రూ.350 కోట్లు విదిల్చితే ఎలాగంటూ ఆయన ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం కోసం పెద్ద ఎత్తున నిధులు అవసరం ఉండగా, రూ.450 కోట్లు విడుదల చేస్తే... ఆ నిధులు ఏ మూలకు సరిపోతాయంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా ఏపీకి మొత్తం రూ.1,976 కోట్ల నిధులను కేంద్రం కేటాయించింది. అందులో ఆర్ధిక లోటు కింద 1,176 కోట్లు కేటాయించగా.. వెనుక బడిన జిల్లాలకు రూ. 350 కోట్లు.. రాజధాని నిర్మాణానికి రూ.450 కోట్లు కేటాయించింది.