ఒలిపింక్స్‌లో సింధు సంచలనం..

రియో ఒలింపిక్స్‌లో తెలుగు తేజం పీవీ సింధు సంచలనం సృష్టించింది. మహిళల సింగిల్స్‌ బ్యాడ్మింటన్ క్వార్టర్ ఫైనల్లో సింధు విజయం సాధించి సెమీస్‌కు చేరింది. చైనా క్రీడాకారిణి, ప్రపంచ నెంబర్ 2 వాంగ్ ఇహాన్‌ను మట్టికరిపించి సంచలన విజయాన్ని నమోదు చేసింది. క్వార్టర్ ఫైనల్లో 22-20, 21-19లతో వరుస సెట్లలో విజయం సాధించింది. ప్రారంభంలో కాస్త తడబాడినా ఆ తర్వాత వేగంగా పుంజుకుంది. సింధు దాటికి వాంగ్ వరుసగా తనే అవకాశాలిచ్చింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సింధు ఇక మరో అవకాశం ఇవ్వకుండా లీడ్‌లోకి వెళ్లిపోయింది. మ్యాచ్‌ను 21-19తో ముగించింది, రేపు జరిగే సెమీస్‌లో జపాన్‌కు చెందిన క్రీడాకారిణితో తలపడనుంది

769 బంగారు బిందెలు మాయం.. ఎక్కడ..?

  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 769 బంగారు బిందెలు దోచుకున్నారు. వినడానికి ఆశ్యర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ ఘటన కేరళలో శ్రీ పద్మనాభ స్వామి ఆలయంలో చోటుచేసుకుంది. మాజీ కంట్రోలర్‌ అండ్‌ అడిటర్‌ జనరల్‌ వినోద్‌ రాయ్‌ సుప్రీం కోర్టులో ఒక నివేదిక సమర్పించారు. కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో మొత్తం 1988 బిందెలు ఉండాలని.. అందులో ఆలయ అలంకరణ కోసం 822 బంగారు బిందెలను కరిగించామని.. మిగిలిన 1666 బిందెల్లో 397 బిందెలు మాత్రమే ఉన్నాయని, మిగిలిన 769 బిందెలు కనిపించడం లేదన్నారు. వాటి విలువ 186 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అయితే బిందెలను కనిపెట్టడం కష్టమని భావిస్తున్నారు.

రివర్స్ లో జాతీయ జెండా.. ఎమ్మెల్యే గారు సెల్ఫీ

  కొంత మంది నేతలు కనీస పరిజ్ఞానం కూడా లేకుండా ఉంటారు. వారి జనరల్ నాలెడ్జ్ గురించి పరీక్ష పెడితే అసలు విషయాలు బయటపడతాయి వాటి పరిజ్ఞానం ఎంతటిదో. అయితే జనరల్ నాలెడ్జ్ గురించి ఏమో కాని ఇక్కడ ఓ ఎమ్మెల్యే గారికి కనీసం జాతీయ జెండా కూడా ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. వివరాల ప్రకారం.. గోవాలోని సాంగ్యూమ్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుభాష్ పాల్ దేశాయ్‌ స్వాంతంత్ర్య దినోత్సవం సంద‌ర్భంగా ఆయ‌న ఓ జెండాకు సెల్యూట్ చేస్తున్న‌ట్లు పోజిస్తూ ఫోటో దిగారు. అయితే ఇక్కడే అసలు పొరపాటు జరిగింది. ఆ జెండా రివర్స్ లో ఉండటం కూడా సదరు ఎమ్మెల్యే గారికి తెలీలేదు. ఇంకేముంది ఇక ఒకటే విమర్శలు తలెత్తుతున్నాయి. ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్న వ్యక్తికి కనీసం జెండా ఎలా ఉందో అన్న విషయాన్ని కూడా గుర్తించలేకుపోయారు అంటూ సర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ముస్లిం యువతులపై దాడి.. ట్రంప్ వ్యాఖ్యలు పనిచేస్తున్నాయా..

  అమెరికాలో మత విద్వేషం పెరుగుతుందా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ట్రంప్ మాటలు ప్రజలపై ప్రభావం చూపుతున్నట్టే కనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే. ఎందుకంటే ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయండలో దిట్ట అని అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాను ఎప్పుడు ప్రసంగం చేసినా ముస్లింలకు వ్యతిరేకంగా వ్యాఖ్యానిస్తుండేవాడు. తాను కనుక అధ్యక్షునిగా ఎన్నికైతే ముస్లింల ప్రవేశం నిషేదిస్తానని చెప్పేవారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలే ప్రజల్లో నాటుకుపోయినట్టు ఉన్నాయి..దీనికి బురఖా ధరించిన ఇద్దరు ముస్లిం తల్లీకూతుళ్ళపై దాడి జరగడమే దానికి కారణమే దీనికి నిదర్శనం. ఈ దాడిలో గాయపడిన తల్లీ కూతుళ్లు మాట్లాడుతూ.. తామిద్దరమూ బురఖా ధరించి వెళ్తూండగా వెస్ట్ రోగర్స్ పార్క్ నెయిబర్‌హుడ్ పార్క్ వద్ద తమపై ఓ మహిళ దాడి చేసిందని, దూషించిందని చెప్పారు. తమను ఐసిస్ అని తూలనాడిందని, తమపై ఉమ్మేసిందని తెలిపారు. అంతేకాదు డొనాల్డ్ ట్రంప్ వల్ల ఇలాంటివి జరుగుతాయన్నాయని.. డొనాల్డ్ ట్రంప్ మాటలు ముస్లిం వ్యతిరేక భావాలకు బలం చేకూర్చాయన్నారు. ఆయన చెప్పినదాన్ని జనం చేసి చూపిస్తున్నారన్నారు.

పాక్ కు మంటపుట్టించేలా మోడీ వ్యాఖ్యలు..

  ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరిలా తాను ఏదో ఒక పేపర్ మీద రాసుకొని.. దానిని అక్షరం పొల్లు పోకుండా చదివేసి.. ఏదో పని అయిపోయింది కదా అని కూర్చునే వ్యక్తి కాదు మోడీ. తాను ప్రసంగం చేయడానికి మాటలు వెతుక్కోవాల్సిన పనిలేదు. ప్రసంగిస్తున్నంత సేపు మాటల ప్రవాహం అలా వస్తూనే ఉంటుంది. ఈసారి కూడా స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా మోడీ తన ప్రసంగం చేశారు. ఏదో 5 నిమిషాలో.. 10 నిమిషాలో కాదు ఏకంగా రెండు గంటలపాటు ప్రసంగం చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. అంతేకాదు ఈ ప్రసంగంలో ప్రత్యర్ధి దేశమైన పాకిస్థాన్ పై పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూ వారికి మంటపుట్టించారు. మన దేశంలో ఉన్న మానవత్వాన్ని గురించి మాట్లాడుతూ ఓ ఉదాహరణ కూడా చెప్పారు.   ‘‘పాకిస్థాన్లోని పెషావర్ స్కూల్లో ఉగ్రవాదులు దాడులు చేసినప్పుడు.. ఎంతోమంది అమాయకపు చిన్నారులు బలయ్యారు. ఆ చిన్నారుల మృతికి మన దేశమైన భారత్ ఎంతో చలించిపోయింది. అంతేకాదు దేశంలోని పలు స్కూళ్లలోని చిన్నారులు కంటతడి పెట్టారు.. ప్రతి విద్యార్థి బాధపడ్డాడు. అదీ మానవత్వం అంటే. కానీ.. అక్కడ (పాకిస్థాన్ ను ఉద్దేశించి) ఉగ్రవాదులను కీర్తిస్తున్నారు. భారత్ లో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతే.. అక్కడ వేడుకలు చేసుకుంటున్నారు. అలాంటి వారిని.. అక్కడి ప్రభుత్వాన్ని ఏమనాలి?’’ అంటూ సూటిగా ప్రశ్నించారు. అంతేకాదు అక్కడితో ఆగకుండా.. బలోచిస్థాన్.. గిల్గిత్.. బల్తిస్థాన్ వంటి పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ప్రజలు తమపై ఎంతో ప్రేమను ప్రదర్శిస్తున్నారని.. తాను వారి దగ్గర లేకున్నా.. వారిని కలిసే అవకాశం లేకున్నా.. అక్కడి ప్రజలు తన పట్ల ప్రేమ.. అభిమానం.. గౌరవాన్ని చూపిస్తున్నారని.. అన్నారు. దీంతో మోడీ చేసిన వ్యాఖ్యలు పాక్ కు మంటపుట్టించేవిగా ఉన్నాయని..పాక్ కు ఎక్కడ తగలాలో అక్కడ తగిలేలా మోడీ వ్యాఖ్యలు ఉన్నాయని అందరూ అంటున్నారు. మరి మోడీ చేసిన వ్యాఖ్యలు పాక్ విన్నదో లేదో..!

ఇద్దరు సీఎంలపై గవర్నర్ చమత్కారం..

  చాలా రోజుల తరువాత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసిన సందర్భంగా ఇరు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ వీరిపై జోకులు పేల్చారు. నిన్న స్వాతంత్ర్య వేడుకల కార్యక్రమంలో రాజ్‌భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన‌ ఎట్‌ హోం కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ప్రసంగించిన గవర్నర్ ఇద్దరు చంద్రులు ఎట్‌ హోంకు రావడం సంతోషంగా ఉందని.. ఈ రోజు ఫుల్‌ మూన్‌ డే అని చమత్కరించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభివృద్ధిలో పోటీ ప‌డుతున్నార‌ని.. రాజ‌కీయప‌రంగా, ప‌రిపాల‌న‌లో ఎలాంటి విమర్శలకు తావులేకుండా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలాగే కలిసి ఉండాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రు ముఖ్యమంత్రులతో జ‌గ‌న్‌ కరచాలనం చేసి అందరితో కలిసి విందులో పాల్గొన్నారు.

అమ్మాయిని 14 సెకన్లు చూస్తే...!

అమ్మాయిలపై లైగింక వేధింపులు రోజు రోజుకి పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లైంగిక వేధింపులను అరికట్టేందుకు కేరళలోని ఓ ఎక్సైజ్ కమిషనర్ రిషిరాజ్ సింగ్ కొన్ని సూచనలు చేశారు. అయితే ఆయన చేసిన కొన్ని సూచనలు కొంతమంది సమర్ధించినా.. కొంతమంది మాత్రం సెటైర్లు విసురుతున్నారు. స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ఆయన అమ్మాయిలపై జరుగుతన్న లైంగిక వేధింపుల గురించి మాట్లాడుతూ.. ఎవరైనా అసభ్యంగా తాకినా, అభ్యంతరకర భాష వాడినా.. వెనుకాలే ఫాలో అవుతున్నా వెంటనే అమ్మాయిలు స్పందించాలని, వారికి అక్కడే బుద్ధి చెప్పాలని అన్నారు. అంతేకాదు ఎవరైనా ఒక అబ్బాయి పద్నాలుగు సెకన్లపాటు తదేకంగా ఒకమ్మాయి కళ్లలోకి చూస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చని.. బహుశా ఈ విషయం ఎవరికీ తెలియదేమో అన్నారు. అయితే ఆయన చెప్పిన సూచనలు బాగానే ఉన్నా.. ఈ 14 సెకన్ల సూచనపైనే కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. 14 సెకన్లు అంటే అమ్మాయిలు ఇక అలారం పెట్టుకోవాలని అని కొంతమంది అంటే.. మరీ సన్ గ్లాసెస్ పెట్టుకున్నవాళ్లు అమ్మాయిలను చూస్తున్నారని తెలుసుకునేదలా? అని ప్రశ్నించారు.

కొడుకు సర్కార్ పైనే ములాయం సంచలన వ్యాఖ్యలు..

  సాధారణంగా ప్రతిపక్ష పార్టీ నేతలపై విమర్శలు చేయడం కామన్. తమ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా.. ఎన్ని లొసుగులు ఉన్నా పక్క పార్టీలపై దుమ్మెత్తిపోస్తుంటారు రాజకీయ నేతలు. కానీ ఇప్పుడు మరో ఆసక్తికరమైన అంశం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ అధికారపార్టీ అధినేత ములాయం సింగ్ సొంత పార్టీపైన.. తన కొడుకు అఖిలేశ్ యాదవ్ సర్కారుపైన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడిది హాట్ టాపిక్ అయింది. స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ఆయన అధికార పార్టీ ప్రభుత్వ తీరును ప్రస్తావిస్తూ.. పార్టీలో తన మాటను తన సోదరుడు శివపాల్ మాత్రమే వింటాడని అన్నారు. అంతేకాదు అక్కడితో ఆగకుండా.. తాను రంగంలోకి దిగితే ప్రభుత్వానికి అసలు సంగతేంటో అర్థమవుతుందని కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించారు. దీంతో ములాయం వ్యాఖ్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బహిరంగగానే కొడుకు తీరును తప్పుబట్టిన ములాయం సింగ్ ముందు ముందు ఇంకెన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తారో అని అనుకుంటున్నారు.   కాగా త్వరలో యూపీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలసిందే. ఈ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పార్టీలన్నీ తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. దీనిలో భాగంగానే అధికారపార్టీ పైన తీవ్రస్థాయిలో వ్యతిరేకత నడుస్తున్న వేళ ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ ఒక ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకుందామని ప్రతిపాదించారు. దీనికి అఖిలేశ్ యాదవ్ నో చెప్పారు. ములాయం మరో సోదరుడు రామ్ గోపాల్ యాదవ్ అఖిలేశ్ కు అండగా నిలిచారు. దీంతో ఈ వ్యవహారం  చిక్కుముడిగా మారింది. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన వేళ.. ఒంటెద్దు పోకడల్లో పోతున్న విషయాన్ని పార్టీ చీఫ్ ములాయం దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో ములాయం ఇలాంటి వ్యాఖ్యలు చేసుంటారు అన్న వాదన కూడా వినిపిస్తోంది.

కాశ్మీర్లో మళ్లీ చెలరేగిన అల్లర్లు..

  హిజ్బుల్‌ ముజాహిదీన్‌ నేత బుర్హాన్‌వానీ ఎన్‌కౌంటర్‌ అనంతరం గత కొద్ది రోజులుగా కాశ్మీర్లో అల్లర్లు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే కాస్త పరిస్థితి నెమ్మదించింది అనే లోపునే మరోసారి అల్లర్లు చెలరేగాయి. జమ్ముకాశ్మీర్లోని మగమ్ ప్రాంతంలో భద్రత నిర్వహిస్తున్న ఓ సీఆర్పీఎఫ్ వాహనం పైకి కొందరు ఆందోళనకారులు రాళ్లు విసిరారు. దీంతో భద్రతా సిబ్బందికి, ఆందోళనకారులకి మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో నలుగురు యువకులు మృతి చెందగా.. మరో నలుగురు యువకులు గాయపడినట్టు సమాచారం. కాగా గత నెల రోజులుగా కశ్మీర్‌లో మృతిచెందిన పౌరుల సంఖ్య 62కు చేరింది.

ట్రంప్ కు అమెరికా యువత షాక్... మాకు వద్దే వద్దు

  అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ కు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కామన్. అలాగే ఆయనపై విమర్శలు రావడం కూడా కామనే. ఇప్పటికే చాలామంది అమెరికాకు ట్రంప్ కనుక అధ్యక్షుడు అయితే.. దేశం సర్వనాశనం అయినట్టే అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పుడు మరోసారి ట్రంప్ ఆశలపై నీళ్లు పోసినట్టైయింది. ఎందుకంటే యువత ఓట్లపై ట్రంప్ పెట్టుకున్న ఆశలు నిరాశగానే మిగిలేలా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది.   బెర్నీ సాండర్స్ మద్దతుదారుల్లో ఎక్కువ మంది యువతే ఉన్నారు. డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం హిల్లరీ క్లింటన్ తో పోటీపడి బెర్నీ సాండర్స్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే వీరిని తమవైపు తిప్పుకోవాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ ఎత్తులు ఫలించేట్టు కనిపించడంలేదు. తాజాగా జరిపిన పోల్ సర్వేలో ఇదే విషయం స్పష్టమైంది. 35 ఏళ్ల వయస్సులోపు ఉన్న అమెరికా ఓటర్లలో 56శాతం మంది హిల్లరీకే తమ ఓటు అని యూఎస్ఏ టుడే/రాక్ ద ఓటర్ పోల్ లో స్పష్టం చేశారు. కేవలం ప్రతి ఐదుగురిలో ఒకరు మాత్రమే ట్రంప్ కు అండగా నిలబడ్డారు. బెర్నీ మద్దతుదారుల్లో 72శాతం మంది హిల్లరీకి అండగా నిలువగా, కేవలం 11శాతం మందే ట్రంప్ కు మద్దతునిస్తున్నట్టు పోల్ తెలిపింది.

నయీమ్ బాడీగార్డ్స్‌గా యువతులు

మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ నయీమ్ చనిపోకముందు..చనిపోయిన తర్వాత ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నాడు. అతడు బతికున్న రోజుల్లో దౌర్జన్యాలకు బలైపోయిన ఒక్కొక్క బాధితుడు ఇప్పుడు బయటకు వస్తుండటంతో నయీమ్ గురించి వెలుగు చూడని నిజాలు బయటకు వస్తున్నాయి. అలా ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. అదేంటంటే నయీమ్ చుట్టూ 20 ఏళ్ల  వయసున్న యువతులు కాపలాగా ఉంటారట. అతడి డెన్‌లో నాలుగు గంటలపాటు అతనికి నరకం చూపించారట. ఒక్క మాటలో చెప్పాలంటే నయీమ్‌కు వారే సైన్యం. తనకు కాపలాగా యువతులతో మూడంచల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది.   అందుకు నయీమ్ ఉమ్మడి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ముంబైకి చెందిన కొందరు అమ్మాయిలను రప్పించేవాడు. వారికి కొందరు నిపుణులతో ఆయుధాలు వాడటంపై ప్రత్యేక శిక్షణ ఇప్పించాడని సమాచారం. తన భద్రతతో పాటు, కొన్ని హత్యల బాధ్యతలను కూడా వారికే అప్పగించేవాడట నయీమ్. గతంలో ఈ గ్యాంగ్ చేతిలో హత్యకు గురైన కోనవురి రాములు హత్య కేసులోనూ నయీమ్ గ్యాంగ్‌లోని ఒక మహిళ కీలకపాత్ర పోషించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 

నేను వీఐపీని.. షూ తొడిగించుకుంటా.. మంత్రి

  కొంతమంది నేతలు తమ వ్యక్తిగత సిబ్బందితో పనులు చేయించుకుని బుక్కవుతుంటారు. ఇప్పుడు తాజాగా ఓ మంత్రిగారు కూడా బుక్కయ్యారు. ఒడిశాకు చెందిన బిజు జనతాదళ్‌ళ పార్టీకి చెందిన కేబినెట్‌ మంత్రి జోగేంద్ర బెహెరా కియొంజహార్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తరువాత ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది షూ తొడిగారు. ఇది కాస్త అక్కడ ఉన్న కెమెరా కంటికి చిక్కింది. ఇంకేముంది మంత్రిగారిపై విమర్శలు మొదలయ్యాయి. ఒడిశా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్‌ చేశారు. అయితే ఈ వార్తలకు స్పందించిన మంత్రిగారు మాత్రం తన పనిని సమర్ధించుకున్నారు. తానో వీఐపీనని.. అందుకే షూ తొడిగారని చెప్పుకొచ్చారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

గన్‌తో బెదిరించి డ్యాన్సర్‌పై గ్యాంగ్‌రేప్..

దేశ అత్యాచారాల రాజధాని ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై ఆఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా ఓ డ్యాన్సర్‌పై నలుగురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. రాజధాని లక్నోకు 20 కిలోమీటర్ల దూరంలోని బాంథారాలో తమ కార్యాలయానికి సంబంధించి ఓ హోటల్‌లో పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో సత్యవీర్ సింగ్, దేవరాజ్‌ సింగ్, రాష్ట్రీయ భూషణ్ భారతీ, పరేశ్ తోమర్ అనే నలుగురు మేనేజర్ స్థాయి ఉద్యోగులు తమకు పార్టీలో డ్యాన్స్ చేసేందుకు ఓ ట్రూప్ కావాలని కోరడంతో..ఓ బృందం పార్టీ జరిగే ప్రదేశానికి వచ్చి పాటలు, డ్యాన్స్‌లతో హోరెత్తించింది. అయితే ఈ నలుగురు మాత్రం పీకల్లోతు తాగి ఇతర డ్యాన్సర్లతో అసభ్యంగా ప్రవర్తించారు.   అయితే ఆ ట్రూప్‌కు నాయకత్వం వహించే ఓ డ్యాన్సర్‌ వారిని అడ్డుకోబోయింది..అయితే పేమెంట్ గురించి మాట్లాడుకుందామని ఓ గదిలోకి పిలిచాడు. అతడి మాటలు నమ్మి ఆమె గదిలోకి వెళ్లగానే అప్పటికే అందులో మాటువేసి ఉన్న ముగ్గురు వ్యక్తులు తలుపు వేశారు. అనంతరం ఆమె పాయింట్ బ్లాక్‌లో గన్‌పెట్టి చంపుతామని బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి, నలుగురు కామాంధులను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

ఆంధ్రా జాలర్లను కిడ్నాప్ చేసిన తమిళ జాలర్లు...

సరిహద్దు దాటి వచ్చారని అడిగినందుకు ఆంధ్రా జాలర్లపై దాడికి తెగబడటమే కాకుండా మన జాలర్లను కిడ్నాప్ చేశారు తమిళ జాలర్లు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఆంజనేయపురం గ్రామానికి చెందిన జాలర్లు నిన్న తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో చేపల వేటకు సముద్రానికి వెళ్లారు. అయితే అక్కడ తమిళనాడుకు చెందిన మత్స్యకారులు చేపలు వేటాడుతుండటాన్ని గమనించి వారితో గొడవకు దిగారు. అయితే తమిళ జాలర్లు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో వారు తిరగబడి 18 మంది మత్స్యకారులను అపహరించి తమిళనాడుకు తీసుకుపోయారు. విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పుష్కర స్నానం చేస్తుండగా..పాము కాటు

విజయవాడ కృష్ణాపుష్కర ఘాట్ వద్ద మధ్యాహ్నం కలకలం రేగింది. దుర్గా ఘాట్ వద్ద కొందరు భక్తులు స్నానం చేస్తుండగా పాములు కొట్టుకువచ్చాయి. ఆ సమయంలో స్నానం చేస్తున్న ఒక యువకుడిని పాము కాటు వేసింది. అతన్ని ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన గజఈతగాళ్లు పామును పట్టుకున్నారు. దీంతో భక్తులు స్నానం చేయడానికి భయపడుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వస్తుండటంతో ఆ నీటిలో పాములు కొట్టుకువస్తున్నట్టు అధికారులు తెలిపారు. కాగా పాము కాటుకు గురైన బాధితుడిని గుంటూరు కొత్తపేటకు చెందిన సుమంత్‌గా గుర్తించారు.

ఒకే వేదికపై బాబు, జగన్, కేసీఆర్

తెలుగు రాజకీయాల్లో కీలక నేతలుగా కొనసాగుతున్న చంద్రబాబు, జగన్, కేసీఆర్‌లు ఒకే వేదికపై ఉంటే.. అబ్బా వినడానికి ఎంత బాగుందో..కళ్లేదుట కనిపిస్తే ఇది చాలా మంది కోరిక. అలాంటి అరుదైన దృశ్యానికి వేదిక అయ్యింది. గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌భవన్. 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత జగన్ ఒకే వేదిక మీదకు వచ్చారు. ఈ సందర్భంగా జగన్..కేసీఆర్, చంద్రబాబు నాయుడులకు కరచాలనం చేశారు. ఈ దృశ్యం అక్కడున్న వారందరికి కనువిందు చేసింది.